జంతర్ మంతర్ డీనోటిఫికేషన్! సిజెపి నేతల అరెస్ట్!

ఢిల్లీ పోలీసులు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులను పోలీసు నిర్బంధం లోకి తీసుకుంది. అరెస్టుకు కారణం ఏమిటో ఇదమిద్ధంగా ఏమీ చెప్పలేదు. కానీ జంతర్ మంతర్ ను ప్రజలు ఆందోళన చేసే స్థలంగా ఇంతవరకు ఉపయోగించారు. కాగా ఇప్పుడు జంతర్ మంతర్ ను ప్రజాందోళన కోసం ఉపయోగించే స్థలాల జాబితా నుండి మోడి ప్రభుత్వం / ఢిల్లీ పోలీసులు తప్పించారు కొత్తగా మూడు గ్రౌండ్ లను ఆందోళనకు ఉపయోగించాలంటూ ఢిల్లీ పోలీసులు హుకుం జారీ చేశారు.

ఢిల్లీ పోలీసుల నిర్ణయాన్ని కాక్రోచ్ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు తిరస్కరించారు. జంతర్ మంతర్, భారత ప్రజలు ఆందోళన కోసం, తమ కోర్కెలను అసమ్మతిని ప్రభుత్వానికి తెలియజేసేందు కోసం ఎప్పటి నుండో ఉపయోగిస్తున్నారని, ప్రభుత్వం కొలువు దీరిన పార్లమెంటుకు అతి దగ్గరగా ఉన్న జంతర్ మంతర్ ను వదిలి ఎక్కడో పదుల కి.మీ దూరంలో ఉన్న గ్రౌండ్ లను ఎంపిక చేశామని చెప్పటం అంటే ప్రజలు శాంతియుతంగా ఆందోళన చేసే హక్కును కాలరాయటమే అని వారు విమర్శించారు.

ఈ నేపధ్యంలో “జంతర్ మంతర్ ను పునరాక్రమిద్దాం” అని సిజెపి తో పాటు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా పిలుపు ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీల కూటమి INDIA నాయకులు అందరూ ఈ పిలుపుకు మద్దతు ప్రకటించారు.

అక్టోబర్ 13 తేదీ, మనగళవారం నాడు కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా, అజింక్య షిండే లతో పాటు ఇతర కార్యకర్తలు రహస్యంగా పోలీసుల కన్ను గప్పి జంతర్ మంతర్ ని చేరుకున్నారు. అక్కడ జాతీయ జెండా ఎగరవేసి నినాదాలు ఇచ్చారు. ఆ వెంటనే పోలీసులు వారిని అరెస్టు చేశారు. ముందస్తు నిర్బంధం లోకి తీసుకున్నట్టు ప్రకటించారు.

ఈ రోజు (బుధవారం) వారిని మందిర్ మార్గ్ లోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరు పరచగా వారికి 5 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అరెస్టు అయిన ముగ్గురు నాయకులను తీహార్ జైలులో నిర్బంధించినట్టు పత్రికలు తెలిపాయి. సిజెపి నాయకుల అరెస్ట్ ను ప్రతిపక్ష పార్టీలు, విద్యార్ధి, యువజన సంఘాలు అన్నీ ముక్త కంఠంతో ఖండించాయి.

CJP leaders after release on October 11

ఢిల్లీ పోలీసు చట్టాల ప్రకారం ఏ వ్యక్తి అయినా కాగ్నిజబుల్ నేరానికి పాల్పడతాడని గానీ, శాంతికి భంగం కలిగించే చర్యకు పాల్పడతాడని గానీ పోలీసులు భావిస్తే, వారిని వారెంట్ అవసరం లేకుండా ప్రివెంటివ్ అరెస్ట్ (ముందస్తు నిర్బంధం) చేయవచ్చు. అరెస్టు అనంతరం అజింక్య షిండే విలేఖరులతో మాట్లాడాడు:

“అశుతోష్, సౌరవ్ దాస్, నేను ఇంకా అనేక మంది సిజెపి కార్యకర్తలు జంతర్ మంతర్ కు వెళ్లాము. జాతీయ జెండాను ఎత్తి పట్టి ఊపుతూ భారత్ మాతా కి జై అని నినాదాలిచ్చాము. ఈ మాత్రానికే నియంతృత్వ మోడి-షా ప్రభుత్వం సౌరవ్, అశుతోష్ లను 5 రోజుల జైలు నిర్బంధానికి పంపింది. ఈ రోజు అశుతోష్ పుట్టిన రోజు. ఆయన పుట్టిన రోజు నాడు, జాతీయ జెండా ఊపుతూ భారత్ మాతా కి జై అని నినాదం ఇచ్చినందుకు ఆయనను జైలుకు పంపారు” అని అజింక్య ఆరోపించాడు.

అజింక్య షిండే ను కూడా అరెస్టు చేసినప్పటికీ రు 5,000 ల బెయిల్ బాండు తీసుకుని వదిలి పెట్టారు. శాంతికి భంగం కలిగించే ఎలాంటి కార్యక్రమంలో ఏడాది పాటు పాల్గొనబోనన్న హామీ అతని నుండి తీసుకున్నారు. అక్టోబర్ 10 తేదీ ఉదయం విమానం నుండి దిగకముందే దిప్కే, అశుతోష్, సౌరవ్ లను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 24 గంటల తర్వాత వారిని విడుదల చేస్తూ కూడా ఏడాది పాటు శాంతికి భంగం కలిగించే చర్యలకు దిగబోనని హామీ తీసుకున్నారు. జంతర్ మంతర్ కు వెళ్ళటం ద్వారా అశుతోష్, సౌరవ్ లు తమ హామీని ఉల్లంఘించారని పోలీసుల ఆరోపణ కావచ్చు.

హింసకు ప్రేరేపకులు పాలకులే!

పాలకులు తమ ఇష్టానుసారం తమకు, తమను పెంచి పోషించే సూపర్ ధనికవర్గాలకు మాత్రమే ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలు అసమ్మతితో, ఆందోళనకు దిగడం సహజం. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆందోళన చేసే హక్కు రాజ్యాంగంలో కల్పించబడింది. దానికి ‘శాంతియుత’ అంటూ ఒక పదాన్ని చేర్చి “శాంతియుత ఆందోళన చేసే హక్కు అందరికీ ఉంది. కానీ హింసకు పాల్పడరాదు” అని ప్రభుత్వాలు సన్నాయి నొక్కు నొక్కుతూ ఉంటాయి.

ఆచరణలో చూస్తే శాంతికి పోలీసులే భంగం కలిగించటం పరిపాటి. ఊరేగింపు, ప్రదర్శనలను అడ్డుకోవటం, నిరసనకారులపై లాఠీ చార్జి, టియర్ ప్రయోగిస్తూ వారిని రెచ్చగొట్టటం, కొందరు సాధారణ ప్రదర్శకులు అక్కడక్కడా కోపంతో రెచ్చిపోయి రాళ్లు విసరటం, పోలీసులను నెట్టివేయటం చేస్తారు. దీనిని సాకుగా చూపిస్తూ పోలీసులు మరింత రెచ్చిపోయి నిరసనకారులను అరెస్టు చేసి హింసకు పాల్పడ్డారని ఆరోపిస్తారు.

తరచి చూస్తే పోలీసులు, వారి వెనక ఉండే రాజకీయ పార్టీల కార్యకర్తలు ప్రదర్శకులలో చొరబడి ఆందోళనలో భాగంగా మారిపోయి తామే రాళ్లు విసరడం ప్రారంభించటం అనేకానేకసార్లు జరిగింది. ఆందోళన పైన హింస ప్రయోగించటానికి ప్రభుత్వాలు దీనిని ఒక సాధారణ ఎత్తుగడగా అమలు చేస్తూ తామే హింసను ప్రయోగించి చివరికి అరెస్టులతో, శిక్షలతో ప్రజల ఆందోళనను విఫలం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తారు. ఇది నిజానికి ప్రజలకు వ్యతిరేకంగా జరిగే కుట్ర. ప్రజల న్యాయమైన కోర్కెలను, డిమాండ్లను పరిష్కరించవలసిన బాధ్యత నుండి తప్పించుకునేందుకు పాలకులు పధకం ప్రకారం సాగించే కుట్ర.

ప్రజల అసమ్మతి చిహ్నం జంతర్ మంతర్!

ఎన్నికల ద్వారా అధికారం చేపట్టిన తర్వాత పాలకులు ఇక జనం మొఖం చూడరు. పార్లమెంటులో కూర్చొని కేబినెట్ చేసిన నిర్ణయాలను చట్టాలుగా చేయటంలో అందరూ సహకరిస్తారు. అడపా దడపా ప్రతిపక్షాలు చర్చలు చేయటం, వాకౌట్ లు చేయటం చేసినా అంతిమంగా ప్రజలకు కీడు చేసే చట్టాలు, ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమైన చట్టాలు, కేవలం ధనిక పాలకవర్గాలకు సంపదలు సమకూర్చే చట్టాలు మూజువాణి ఓటుతో ఆమోదం అయిపోతూ ఉంటాయి.

ఈ పరిస్ధితుల్లో తాము ఎన్నుకున్న నేతలు తమకు చెప్పినట్టు, హామీ ఇచ్చినట్టు ప్రజా చట్టాలతో పాలన చేయకపోతే వారిని రీకాల్ చేసే (అధికారం నుండి తొలగించే) అవకాశం ప్రజలకు లేదు. రాజ్యాంగం కూడా ఆ సౌలభ్యం ప్రజలకు కల్పించలేదు. ఇక ప్రజలకు మిగిలింది ఆందోళన మాత్రమే. ప్రజల ఆందోళనలను, అసమ్మతిని వివిధ రూపాల్లో అణచివేసేందుకు కూడా పాలకులు చట్టాలు చేసుకున్నాయి.

ఈ నేపధ్యంలో ప్రజలు తమ అసమ్మతిని తెలియజేసేందుకు జంతర్ మంతర్ లాంటి ప్రదేశాలను ఏళ్ల తరబడిన ఆచరణలో తయారు చేసుకున్నారు. జంతర్ మంతర్ అంటే ఒక స్థలం పేరు మాత్రమే కావచ్చు గానీ ఆ పదం ఉచ్చరించగానే ప్రజలు తమ కోర్కెలను డిమాండ్లను వినిపించుకోని ప్రభుత్వాలకు గట్టిగా అరిచి చెప్పుకునేందుకు ఉపయోగిస్తున్న స్థలంగా అందరికీ స్ఫురణలోకి వస్తుంది. జంతర్ మంతర్ వద్ద విద్యార్ధులు గుమి గూడారు అనో లేదా రైతులు నినాదాలు ఇస్తున్నారు అనో లేదా వాంగ్ చుక్ నిరాహార దీక్షలో ఉన్నారు అనో చెప్పగానే అప్పటి వరకు తెలియని వారు కూడా ఏ కారణంతో అక్కడ ఒక ఈవెంట్ జరుగుతోందన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తెలుసుకుంటారు కూడా.

ఆ విధంగా ప్రజలకు న్యాయంగా నెరవేరవలసిన ఒక కోర్కె, ఒక డిమాండ్ నెరవేరకుండా ప్రభుత్వం అడ్డం పడుతోందన్న సందేశం ఆ వ్యక్తికి చేరుతుంది. ఈ సందేశం కొద్ది గంటల్లో ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. ఆ తర్వాత పత్రికలు తమ పేజీలు నింపటానికైనా అక్కడికి వస్తారు, ఫోటోలు తీస్తారు. మరునాడు అది పత్రికల్లో వస్తుంది, మరింత మంది ప్రజల కోర్కెల గురించి, ప్రభుత్వ స్పందనా రాహిత్యం గురించి తెలుసుకుంటారు. ప్రజలు తమ అసమ్మతిని, ఆందోళనను ప్రభుత్వాలకు చేరవేసే ప్రక్రియ ఇది. ఈ ప్రక్రియను ప్రజాస్వామ్య ప్రక్రియ అని పాలకవర్గాలు కూడా నోటి మాటగా అంగీకరిస్తాయి.

ఇలాంటి ప్రక్రియకు జంతర్ మంతర్ ఒక సింబల్ గా అవతరించింది. సింబల్ గా మారాక అక్కడికి యవ్వనోద్రేకంతో ఉరకలు వేసే విద్యార్ధి, యువజనం వేలాదిగా గుమి కూడితే అది అనివార్యంగా ప్రభుత్వానికి/పాలకులకు ఒక సమస్య అవుతుంది. లేదా పాలకులు ఆ ప్రక్రియను సమస్యగా భావిస్తారు. ఇది ప్రజాస్వామిక ప్రక్రియలో భాగం అన్న అంశాన్ని నిజాయితీగా పాలకులు భావిస్తే ఆ సమస్య పరిష్కారానికి పూనుకుంటారు. కానీ వాస్తవంలో పాలకులు దానిని తొలగించవలసిన, నిర్మూలించవలసిన సమస్యగా చూస్తారు. ఎందుకంటే ప్రజల సమస్యను పరిష్కరించే ఆలోచన వారికి ఉండదు. ప్రజల ప్రయోజనాలు పాలకవర్గాల (అదాని, అంబానీ, టాటా వగైరా సూపర్ ధనిక వర్గాలు) ప్రయోజనాలకు సరిగ్గా విరుద్ధంగా ఉన్నపుడు సహజంగానే ప్రజల ఆందోళన వారికి సమస్య అవుతుంది.

అందుకే ప్రధాని నరేంద్ర మోడీకి జంతర్ మంతర్, విద్యార్ధులు యువకులతో నిండగానే గుండెల్లో గుబులు పుట్టింది. అప్పటికే జులైలో నీట్ ఆందోళన ద్వారా దేశవ్యాపితంగా యువతను ఉరుకులు పెట్టించిన సిజెపి, వోటింగ్ ఫలితాలను సైతం బిజెపి నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం చోరీ చేసిన అంశాన్ని ఆందోలనాంశంగా చేపట్టిన తర్వాత అనివార్యంగా మోడి ప్రభుత్వం ఆందోళన రెట్టింపు అయింది. సిజెపి ఆందోళనను ఎలా అణచివేయాలా అన్న ఆలోచన నుండి బహుశా జంతర్ మంతర్ ను అధికారిక ఆందోళన జాబితా నుండి తొలగించి పార్లమెంటుకు ఎంతో దూరంలో ఉన్న గ్రౌండ్ లను సెలెక్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. చెప్పటానికి ఒక కమిటీ ఈ నిర్ణయం చేసిందని చెబుతున్నప్పటికీ మార్పు ఎందుకు జరిగింది అన్నది స్పష్టమే.

పార్లమెంటుకు 23 కిలో మీటర్ల దూరంలో ఉన్న బురారి గ్రౌండ్, 6 కిలో మీటర్ల దూరంలో ఉన్న రామ్ లీలా మైదాన్, 14 కిలో మీటర్ల దూరంలో (ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రకారం 40 కి.మీ) ఉన్న సిబిడి గ్రౌండ్ లను ఢిల్లీ పోలీసులు ఎంపిక చేశారు. ఈ మూడు గ్రౌండ్ లు ప్రజల/పౌరుల కదలికకు దూరంగా ఉంటాయి. ఆ గ్రౌండ్ లలో ఆందోళన జరుగుతున్న సంగతి పార్లమెంటుకు తర్వాత సంగతి రోడ్డున పోయే వారికి కూడా తెలిసే అవకాశం లేదని పత్రికల ద్వారా తెలుస్తోంది. జంతర్ మంతర్ అయితే ప్రజలకు విషయం తెలుస్తుంది, పత్రికలకు అందుబాటులో ఉంటుంది, ఒక సెక్షన్ ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించని సంగతి ఇతర ప్రజానీకానికి తెలుస్తుంది. అనగా ప్రభుత్వం స్పందనా రాహిత్యంగా ఉన్న సంగతి తెలుస్తుంది. జంతర్ మంతర్ ను డీ నోటిఫై చేయటంలో పరమార్ధం ఇదే.

నిరసన ప్రదర్శనకు పోలీసుల అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఏ విధంగా ఆచరణలోకి వచ్చిందో ఎవరికీ తెలియదు. ఈ నిబంధనను తెలియజేసే చట్టం లేదు, ఆదేశం లేదు… ఏమీ లేకుండానే పోలీసులు దీనిని అమలు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన చేయాలంటే ఆ ప్రభుత్వం నుండే అనుమతి తీసుకోవాలని చెప్పటం ఒక అర్ధం కాని నిబంధన. నిరసన గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరితే అందులో అర్ధం ఉంది, ఎందుకంటే అందుకు తగినట్టుగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలి కనుక! ఓ పక్క ప్రజాస్వామ్యయుత నిరసన, ఆందోళన చేయటం ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమే అని చెబుతూనే చట్టబద్ధమైన చర్యకు అనుమతి తీసుకోవాలని చెప్పటం పొసగని విషయం.

అందుకే జంతర్ మంతర్ ను పునః స్వాధీనం చేసుకుంటామని కాక్రోచ్ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు పిలుపు ఇచ్చాయి. ఈ అంశంలో త్వరలో ఆందోళన చేస్తామని అవి ప్రకటించాయి కూడా.

స్పందించండి