నేపాల్ మెరుపు వరదలకు కారణం ఏమిటి? -ఫోటోలు


HOW NEPAL FLASH FLOODS HAPPENED -REUTERS

ఏం జరిగిందో, ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలియదు. వారికి తెలిసిందల్లా ఒక పెద్ద మహా వరద బురద తమను ముంచెయ్య బోతోందని మాత్రమే. ఆ సంగతి వారి బుర్రకు తట్టిన మరుక్షణంలోనే హిమాలయాల పై నుండి మహా ప్రవాహంలా కొట్టుకు వచ్చిన బురద లాంటి వరదలో మునిగిపోయి కొట్టుకుపోయారు.

నేపాల్, టిబెట్ లలో ఆగస్టు 26 తేదీన నేపాల్, టిబెట్ ప్రజలు, ముఖ్యంగా నేపాల్ ప్రజలు ఎదుర్కొన్న ఉపద్రవం ఇది. లిటరల్ గా కళ్లు మూసి తెరిచే లోపే వందల మంది ప్రజలు కొట్టుకుపోయారు. నదులు పదుల కిలో మీటర్ల మేరకు దారి మార్చుకుని కొత్త దారులు వేసుకున్నాయి. దారిలో ఉన్న భవనాలు, రోడ్లు, రైళ్లు, వాహనాలు అన్నిటినీ వరద ప్రవాహం తనతో పాటు కిలో మీటర్ల మేరకు లాక్కు వెళ్లింది.

తాజా అంచనాల ప్రకారం కనీసం 600 మందికి పైగా చనిపోగా, 3000 మంది జాడ తెలియడం లేదు. జాడ తెలియని వారి సంఖ్య, మరణించిన వారి సంఖ్య ఇంకా పెరగవచ్చు. ఎందుకంటే హిమాలయ పర్వత శ్రేణుల పై నుండి కొట్టుకువచ్చిన నీటి వరద, బురద, భారీ బండ రాళ్ల కింద ఎంతమంది కప్పబడి పోయారో తెలియాల్సి ఉన్నది.

ఇప్పటి వరకు వేసిన తాత్కాలిక అంచనా ప్రకారం ఒక్క నేపాల్ లోనే జరిగిన నష్టాన్ని కనీసంగా పూడ్చేందుకు, పునర్నిర్మాణానికి, వైద్య సహాయానికి 5 బిలియన్ డాలర్లు లేదా 50,000 కోట్ల భారత రూపాయల సహాయం కావాలని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది కూడా కేవలం ప్రాధమిక అంచనా అని తెలుస్తోంది. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ వేగంగా జరగకుండా భారీ ఎత్తు బురద, బండ రాళ్లు ఆటంకంగా ఉన్నాయి.

వరదకు కారణం ఏమిటో ఇంకా ఖచ్చితంగా తెలియలేదు. టిబెట్ ప్రాంతంలో వచ్చిన భూకంపం వల్ల హిమాలయ పర్వత శ్రేణుల పైన ఉన్న ఒక భారీ గ్లేసియర్ (హిమనీ నదం / మంచు నది) నుండి ఒక ముక్క ఊడి పడటంతో వరద సంభవించిందని మొదట భావించారు. కానీ భూమి కంపించింది భూకంపం వలన కాదని, భారీ హిమనదం చీలి ఒక ముక్క కిందకు పడిపోవడం వల్లనే భూమి కంపించిందని ఇప్పుడు చెబుతున్నారు.

ఐతే హిమనదం (గ్లెసియర్) బద్దలై కూలిపోవటానికి కూడా ఒక కారణం ఉండాలి కదా! ఆ కారణం ఏమిటో ఇంకా తెలియలేదు లేదా అర్ధం కాలేదు. వాతావరణ వేత్తలు అప్పుడే ముందుకు దుమికి, వాతావరణ మార్పుల వలనే గ్లెసియర్ విరిగి పడిందని చెబుతున్నారు. భూ తాపం పెరిగిపోవటంతో హిమాలయ పర్వతాల పైన బిర్ర బిగుసుకుపోయి ఉన్న మంచు నదులు మెల్ల మెల్లగా పట్టు సడలుతున్నాయని అందుకే గ్లేసియర్ నుండి దక్షిణ దిశలో ఒక ముక్క విరిగి పడిందని చెబుతున్నారు.

ఏ కారణంతో గ్లెసియర్ విరిగి పడినప్పటికీ భారీ మంచు గడ్డలు దాదాపు 5,200 మీటర్ల ఎత్తు నుండి బలంగా కిందకు దూకడంతో అవి తన మార్గంలో ఉన్న పెద్ద పెద్ద బండ రాళ్ళను, బురద మట్టిని అత్యంత వేగంగా కిందకు నెట్టుకుంటూ లెండే ఖోలా నదిలోకి వచ్చి పడ్డాయి. ఆ ధాటికి నదీ ప్రవాహం భారీగా బండలు, మట్టితో సహా ఉప్పొంగి పర్వత సానువుల వెంట వేగంగా దొర్లి పడింది. 7,200 మీటర్ల ఎత్తులో గ్లేసియర్ విరిగి పడిందని ఎకనమిక్ టైమ్స్ పత్రిక రిపోర్ట్ చేసింది.

చైనా ప్రభుత్వ జియాలజిస్టు గువో ఝావో చెంగ్ ప్రకారం మంచు-హిమపాతం ధాటికి కొండల పై నుండి నీరు, మట్టి, బండలు ఉమ్మడిగా వరద రూపం సంతరించుకుని నేపాల్ లోని భవనాల పైకి సెకనుకు 50 మీటర్ల వేగంతో లేదా గంటకు 180 కిలో మీటర్ల వేగంతో దూసుకు వచ్చింది. ఇంతటి భారీ వేగం వలన జనానికి జరుగుతున్నది అర్ధమై కోలుకునే లోపల వరదలో పడి కొట్టుకుపోయారు. కాస్త గట్టిగా ఉన్న భవనాల పైన అది కూడా రెండో అంతస్తులో ఉన్న వారు మాత్రమే ప్రాణాలతో ఉండగలిగారు.

టిబెట్ లో కూడా వరద వచ్చినప్పటికీ అత్యధిక నష్టం నేపాల్ లో జరిగింది. లెండే ఖోలా నది ఎగువన చైనా (టిబెట్) లో కొంత దూరం ప్రయాణించి, చైనా- నేపాల్ దేశాల సరిహద్దు వెంబడి ప్రయాణిస్తుంది. అనంతరం నేపాల్ భూభాగంలోకి ప్రవేశిస్తుంది. ఎత్తైన పర్వత శ్రేణుల మధ్య ఉండే లోయ ప్రాంతంలో ఉన్న గ్రామాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. నేపాల్ భూభాగంలో వరద ప్రవాహం 20 కి.మీ మేరకు ప్రయాణించినట్టు తెలుస్తోంది (రాయిటర్స్ న్యూస్, 27/08/2026).

శాటిలైట్ ఫోటోలలో లాంగ్ టాంగ్ లిరుంగ్ పర్వత శిఖరాగ్ర భాగంలో గట్టి పడి ఉన్న భారీ హిమనదంలో దక్షిణం పక్క ఉన్న ముక్క భాగం విరిగి ఉన్నట్లు కనిపిస్తున్నది. ఈ ఫోటోలను రాయిటర్స్ వార్తా సంస్థ ప్రచురించింది. వరద ముందు రోజుల నాటి ఫోటోలను, వరద అనంతరం నాటి ఫోటోలతో పోల్చి చూడటం ద్వారా ఈ సంగతిని కనుగొన్నారు.

బురద, బండరాళ్లతో నిండిన వరద ప్రవాహం గైయిరాంగ్ పోర్టు లోకి విరుచుకు పడింది. దరిమిలా మెరుపు వరద ఏర్పడి మొత్తం రోడ్లను, విద్యుత్ ప్రాజెక్టులను, గ్రామాలను ముంచి వేస్తూ సమస్తాన్ని కూల్చివేస్తూ ప్రయాణించింది. డజన్ల మంది వరదలో కొట్టుకు పోతున్న దృశ్యాలను వివిధ టి.వి చానెళ్లు, యూ ట్యూబ్ వీడియో లలో ఇప్పటికే ప్రచురించారు.

గైయిరాంగ్ పోర్టు వద్ద నెల కొల్పిన సీసీటీవీ లో నిపాల్ ఇమిగ్రేషన్ విభాగానికి చెందిన భారీ భవనాలు పోర్టు నిర్మాణాలు కొట్టుకుపోయిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పోర్టు ఏరియాలోని సమస్త నిర్మాణాలు, ప్రజలు వరదలో వేగంగా కొట్టుకుపోయినట్లు ఈ ఫుటేజీలో రికార్డ్ అయింది. లెండే ఖోలా నది మరియు భోటే కోషి నది రెండు కలుసుకునే చోట నేపాల్ ఇమిగ్రేషన్ భవనాలు, కస్టమ్స్ విభాగం భవనాలు నెలకొని ఉన్నాయి. ఈ నిర్మాణాలన్నీ వరదలో కొట్టుకుపోయాయి.

వరద ప్రవాహం నేపాల్ లో 4,500 మీటర్ల ఎత్తునుండి విరుచుకుపడగా అది నదీ మార్గాన్ని దిగువ భాగంలో దిశను, మార్గాన్ని పక్కకు తప్పించింది. నేపాల్, ఇండియా సరిహద్దులో నదీ మార్గం 100 కిలో మీటర్ల మేరకు పక్కకు జరిపిందని తెలుస్తున్నది. బ్రిడ్జిలతో సహా గ్రామాలు కొట్టుకుపోగా రోడ్లు పనికి రాకుండా పోయాయని రెడ్ క్రాస్ తెలియజేసింది. వినాశనం విస్తృతి పూర్తిగా అంచనా వేయలేదని కూడా తెలిపింది.

కొందరు వాతావరణ శాస్త్ర నిపుణులు, భూ తాపాన్ని గ్లేసియర్ విచ్ఛిన్నానికి కారణంగా చెబుతున్నప్పటికీ సదరు అంశాన్ని ఇప్పుడే నిర్ధారించటం తొందరపాటుతనం అవుతుందని ఇతర వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

హిమాలయ పర్వతాల పైన తాజా వరద ఫలితంగా సరిహద్దుకు ఇరు వైపులా రెండు సరికొత్త సరస్సులు ఏర్పడ్డాయని జియాలజిస్టులు తెలిపారు. వరద ఇంకా ముగిసిపోలేదని, ఈ రెండు సరస్సులు ఏ క్షణంలో నైనా బద్దలై మరో సారి వరద ముంపు ఎదురు కావచ్చని వారు హెచ్చరించారు.

2 thoughts on “నేపాల్ మెరుపు వరదలకు కారణం ఏమిటి? -ఫోటోలు

వ్యాఖ్యానించండి