మోడి ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా ఆందోళనలు, ఘర్షణ పంధాలో అరుణాచల్ Gen’Z’

Rally in Pasia Ghat

అరుణాచల్ ప్రదేశ్ లో విద్యార్ధులు, యువకులు ఆందోళన బాట పట్టారు. మోడి ప్రభుత్వం ఆందోళనకారులపై ఉక్కుపాదం మోపడంతో ఆందోళనకారులు రెచ్చిపోయి పోలీసులపై దాడులకు దిగారు. ఎం‌ఎల్‌ఏ ల ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ చర్యలకు మోడి ప్రభుత్వం ‘హింసాత్మక చర్యలు’ అని పేరు పెట్టింది. వారి ఆందోళనకు కారణం మోడి ప్రభుత్వం రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన భారీ బహుళార్ధక సాధక ప్రాజెక్టు. దీని పేరు సియాంగ్ అప్పర్ ముల్టీ పర్పస్ పాజెక్ట్ (SUMP).

శుక్రవారం (అక్టోబర్ 23) రాత్రి తూర్పు సియాంగ్ జిల్లాలో ఆందోళనలు ఉద్రిక్తపూరితంగా మారాయి. ముఖ్యంగా విద్యార్ధులు, యువకులు NHPC కార్యాలయం, ఒక పోలీస్ స్టేషన్ లకు నిప్పు అంటించారు. ఇద్దరు ఎం‌ఎల్‌ఏ లు, బి‌జే‌పి రాష్ట్ర అధ్యక్షుడు లకు చెందిన ఇళ్ల పైన దాడులు చేసి ధ్వంసం చేశారు. కొందరు ఇళ్లలోని వస్తువులను లూటీ చేశారని పోలీసులు చెబుతున్నారు. కొందరు ప్రైవేటు భవనాలకు కూడా నిప్పు పెట్టినట్టు తెలుస్తున్నది.

ఆందోళనకారుల ధ్వంస రచన 9 గంటల పాటు శనివారం ఉదయం వరకు అలలు అలలుగా కొనసాగినట్టు తెలుస్తోంది. ఆందోళనకారులు రాళ్లు విసరడంతో 40 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని ప్రభుత్వం చెబుతోంది. ఒక నిరసనకారుడి కాలుకు టియర్ గ్యాస్ షెల్ బలంగా తాకడంతో తీవ్ర గాయమై ఆసుపత్రి పాలయ్యాడు. తూర్పు సియాంగ్ జిల్లా పాలనా యంత్రాంగం ప్రజల నిరసనల పైనా, గుమి కూడటం పైనా నిబంధనలు విధించింది. ముఖ్యంగా పాసీఘాట్, మెబో, రస్కిన్ ప్రాంతాలలో నిరసనకారులు విధ్వంసానికి పాల్పడతారన్న కారణంతో తీవ్ర స్థాయి నిర్బంధ చర్యలు అమలు చేస్తున్నారు.

నిర్బంధ చర్యలు అక్టోబర్ 24 సాయంత్రం 5 గంటల నుండి అమలులోకి వచ్చాయని డిప్యుటీ కమిషనర్ జయంత్ పెర్టిన్ ప్రకటించాడు. తదుపరి ప్రకటన వరకు అవి అమలులో కొనసాగుతాయని స్పష్టం చేశాడు. మంగళవారం అక్టోబర్ 27 తేదీన కూడా నిరసనకారుల ప్రదర్శనలపై నిర్బంధం కొనసాగుతోంది.

SUMP ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆది బానే కెబాంగ్ యునైటెడ్ సంస్థతో పాటు ఇతర విద్యార్ధి, యువజన సంస్థలు 12 గంటల బంద్ కు పిలుపు ఇచ్చారు. బంద్ పిలుపు అక్టోబర్ 23 సాయంత్రానికి ప్రశాంతంగానే ముగిసింది. అయితే పాసియాఘాట్ ప్రాంతంలో బంద్ జరగలేదన్న వార్తతో నిరసనకారులు అక్కడికి చేరుకోవటంతో ఉద్రిక్తత పరిస్ధితి ఏర్పడి ప్రభుత్వ బలగాలు, నిరసనకారులు పరస్పర దాడులకు దారి తీసినట్టు తెలుస్తోంది. తూర్పు సియాంగ్ జిల్లాలోని పాసియాఘాట్ లో ప్రారంభమయిన ఉద్రిక్తతలు అప్పర్ సియాంగ్, సియాంగ్, తూర్పు సియాంగ్ జిల్లాలకు విస్తరించాయి. దానితో ఈ జిల్లాల్లో నిషేధాజ్ఞలు ప్రకటించారు.

ఇండియా, చైనా దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్, కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నది. ఆందోళన చెలరేగడంతో కేంద్ర హోమ్ శాఖ రెండు కంపెనీల (250 మంది) ర్యాపిడ్ యాక్షన్ బలగాలను దించింది.

ఆది బానే కెబాంగ్ యునైటెడ్ (ఏ‌బి‌కే‌యూ), సియాంగ్ ఇండైజీనస్ ఫార్మర్స్ యూనియన్ (ఎస్‌ఐ‌ఎఫ్‌ఎఫ్) లతో పాటు చాత్ర సంఘర్షణ్ లాంటి విద్యార్ధి, యువజన సంఘాలు డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళనకు పిలుపు ఇచ్చాయి. రాష్ట్రంలో ఇప్పటికే సరిపడా విద్యుత్ ఉత్పత్తి అవుతున్నదని, మిగులు విద్యుత్ కూడా ఉత్పత్తి అవుతుండగా పర్యావరణాన్ని నాశనం చేస్తూ భారీ డ్యామ్ నిర్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు.

డ్యామ్ నిర్మాణం నిమిత్తం తలపెట్టిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ సర్వే ను వెంటనే నిలిపేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన సందర్భంగా అరెస్ట్ చేసిన 10 మంది కార్యకర్తలను విడుదల చేయాలని, గ్రామ అధిపతి సస్పెన్షన్ ఎత్తివేయాలని, కేంద్ర మరియు రాష్ట్ర పారామిలటరీ బలగాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మల్టీ పర్పస్ ప్రాజెక్టును కీలకంగా పరిగణిస్తున్నాయి. నీటి-భద్రత, వరదల నియంత్రణలతో పాటు చైనా ప్రభుత్వం టిబెట్ లో ఎగువ నదిపై నిర్మించాలని తలపెట్టిన 60,000 మెగా వాట్ల యాక్సియా డామ్ కు కౌంటర్ వెయిట్ గా ఈ డ్యామ్ నిర్మాణానికి భారత ప్రభుత్వం తలపెట్టింది.

అయితే రాష్ట్ర ప్రజలు డ్యామ్ వలన అరుణాచల్ రాష్ట్ర రైతులకు, ఇతర ప్రజలకు భారీ నష్టం జరగనుందని ఆందోళన చెందుతున్నారు. ఈ డ్యామ్ వలన పలు గ్రామాలకు ముంపు ప్రమాదం పొంచి ఉన్నది. పెద్ద సంఖ్యలో కనీసం లక్షన్నర కుటుంబాలు స్వస్థలాలు విడిచి వెళ్లిపోవలసి వస్తుంది. గిరిజన ప్రాంతాల్లో ప్రాణప్రదంగా భావించే పూర్వీకుల వారసత్వ సంపద ఇక అందుబాటులో లేకుండా పోవటం అన్నది వారికి సుతరామూ అంగీకరించే విషయం కాదు.

అదీ కాక గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉన్న సారవంతమైన పంట భూములు డ్యామ్ నీటిలో మునిగిపోనున్నాయని ప్రజలు భయపడుతున్నారు. హిమాలయ ప్రాంతంలో ఉన్న డ్యామ్ నిర్మాణ ప్రాంతం భూకంపానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉన్న నేపధ్యంలో డ్యామ్ నిర్మాణం నిరంతర ప్రమాదకారి అవుతుందని నిపుణులు హెచ్చరించారు.

అరుణాచల్ ముఖ్యమంత్రి ప్రేమా ఖండు ఊహించినట్టే ఆందోళనకారుల హింసను ఖండించాడు. హింసను విడనాడి చర్చలకు రావాలని ఆహ్వానించాడు. డ్యామ్ నిర్మాణానికి వ్యతిరేకంగా అనేక రోజులుగా ప్రజల్లో ఆందోళన తీవ్రమై అడపా దడపా ప్రదర్శనలు జరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. వారి భయాలను నివృత్తి చేసే ప్రయత్నం చేయలేదు.

Right before explosion

అక్టోబర్ 9 నుండే పోలీసులు గ్రామాలపై దాడులు చేసి 10 మంది కార్యకర్తలను అరెస్టు చేశారు తప్పితే ప్రజలతో చర్చలు జరిపే ఆలోచన చేయలేదు. ఆ పదిమందిని అరుణాచల్ ప్రదేశ్ చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 2014 (ఏ‌పిఉపా) కింద అరెస్ట్ చేయటంతో వారు సుదీర్ఘకాలం నిర్బంధంలో గడిపే పరిస్ధితి ఏర్పడింది. ప్రజలు విధ్వంసాలకు పాల్పడిన తర్వాత మాత్రమే ముఖ్యమంత్రి ప్రేమా ఖండు చర్చలకు పిలిచాడు. అయితే రాష్ట్ర ఉపా చట్టం కింద తమ కార్యకర్తలను నిర్బంధించి చర్చలకు పిలవటాన్ని ప్రజా సంఘాలు నమ్మటం లేదు.

అక్టోబర్ 24 తేదీ నాటికి మూడు ఎఫ్‌ఐ‌ఆర్ లను నమోదు చేసి మరో 15 మందిని నిబంధం లోకి తీసుకున్నారు. ఆందోళనకారులు తమ కార్యకర్తలు ఎవరూ హింసకు పాల్పడలేదని చెబుతున్నారు. బంద్ అమలు కాని పాసియాఘాట్ లో తమ కార్యకర్తలు హింసకు ఎలా పాల్పడతారని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రశాంతంగా జరిగే నిరసనలలోకి తమ వాళ్లని చొప్పించి వారి చేత హింసాత్మక చర్యలు జరిపించి తద్వారా ఆందోళనను హింసాత్మకంగా మార్చే ఎత్తుగడను పోలీసులు అనాదిగా అమలు చేస్తున్నదే. ఆ విధంగా ఆందోళన హింసాత్మకంగా మారిందన్న సాకుతో లాఠీ చార్జి, టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ లతో ఆందోళనను అణచివేయటం పాలకులకు ఉన్న అలవాటు. దీనినే మరోసారి అరుణాచల్ ప్రదేశ్ లో అమలు చేసినట్టు కనిపిస్తున్నది.

పేలుళ్లు ఎవరు జరిపారు?

సియాంగ్ అప్పర్ మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ కి వ్యతిరేకంగా నిరసన తెలియజేయాలని వివిధ సంఘాలు అక్టోబర్ 18 తేదీన సంప్రదింపుల కోసం పాసియా ఘాట్ లో సమావేశం అయ్యారు. ప్రభుత్వం జరుపుతున్న ప్రీ-ఫీజిబిలిటీ సర్వే గురించి చర్చించారు. అక్టోబర్ 20 తేదీన సంఘాల వాళ్ళు పాసియా ఘాట్ లోని దయింగ్ ఎరింగ్ స్కూల్ గ్రౌండ్ నుండి గాంధీ చౌక్ వరకు మార్చ్ నిర్వహించారు. ప్రాజెక్ట్ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ 10 మంది కార్యకర్తలను నిర్బంధం నుండి విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ ఈ ప్రదర్శన జరిగింది.

అక్టోబర్ 22 తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మిరకిల్ గ్రౌండ్ లో 24 గంటల ధర్నాకు నిరసనకారులు కూర్చున్నారు. మరుసటి రోజు 2 PM వరకు ధర్నా ప్రశాంతంగా జరిగింది. నిరసనకు రైతు సంఘం ఎస్‌ఐ‌ఎఫ్‌ఎఫ్, ఎస్‌యూ‌ఎం‌పి ప్రభావిత యూత్ అసోసియేషన్ (ఎస్‌ఏ‌ఏ‌వై‌ఏ), ఏ‌బి‌కే‌యూ, ఆది గాలో వెల్ఫర్ సొసైటీ సంఘాలు నాయకత్వం వహించాయి. ముందు ఇచ్చిన పిలుపు మేరకు 12 గంటల బంద్ అక్టోబర్ 23 5AM ఆరంభమై సాయంత్రం 5 గంటలకు ప్రశాంతంగా ముగిసింది.

పోలీసుల కధనం ప్రకారం మెబో ఏరియాలో ధర్నా చేసిన యువకులు అక్టోబర్ 23 తేదీన పాసియా ఘాట్ కు వెళ్ళాక అక్కడ హై వే పైన కూర్చున్నారు. 5 PM వరకు అప్పటికే పలువురు నిరసనకారులు వెళ్ళిపోయినా యువకులు అక్కడే కొనసాగారు. ఇంతలో 6:30 PM ప్రాంతంలో యువకులు హఠాత్తుగా రాళ్లు విసరడం ప్రారంభించారు. దానితో ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించక తప్పలేదు.

అయితే ఆందోళనకారులు చెప్పిన కధనం వేరే విధంగా ఉండటం విశేషం. వారి ప్రకారం 12 గంటల బంద్ ముగిసే సమయానికి అక్కడి నుండి వెళ్లిపోవటానికి అందరూ సిద్ధం అవుతున్నారు. ఇంతలో అకస్మాత్తుగా పేలుళ్లు జరిగాయి. పేలుడు శబ్ధాలతో ఏం జరుగుతున్నాదో తెలియక ఆందోళనకారులు చెల్లాచెదురు అయ్యారు. వాళ్ళు తెరుకునే లోపు రెండు వైపుల నుండి రాళ్లు ఎగరడం మొదలయింది. “అకస్మాత్తుగా పేలుళ్లు జరిగాయి. ఆ తర్వాత ఏం జరిగిందో మాకు ఎవరికీ తెలియక అటూ ఇటూ పరిగెత్తాము. ఆ వెంటనే రెండు వైపుల నుండి రాళ్ల వర్షం మొదలైంది. ఇక పరిస్ధితి అదుపు తప్పింది” అని ఒక నిరసనకారుడు చెప్పాడు (డౌన్ టూ ఎర్త్, 25-10-2026).

ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆందోళనలో పాల్గొన్న ఆది బానే కెబాంగ్ సంఘం కార్యాలయాన్ని కూడా విధ్వంసకారులు ధ్వంసం చేశారు. ఆందోళనకారులు తమ కార్యాలయాన్ని తామే తగలబెట్టడం, ధ్వంసం చేయటం ఎలా సాధ్యమో పోలీసులు పరిశోధించి చెప్పాల్సి ఉంటుంది. 9 పోలీసు వాహనాలు ధ్వంసం అయ్యాయని పోలీసులు చెబుతున్నారు. విధ్వంసానికి ఎవరు పాల్పడ్డారో తమకు తెలుసని వారి గురించి తమ వద్ద సమాచారం ఉందని చెబుతున్నారు.

అరుణాచల్ ప్రదేశ్ లో గణనీయ మొత్తంలో భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్నదని ఆ రాష్ట్రంలో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా పలు ఆరోపణలు చేస్తున్నాడు. అయినప్పటికీ ఈ ఆరోపణల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడి నుండి ఎలాంటి సమాధానం లేదు. ఈ పరిస్ధితుల్లో ఆ రాష్ట్రంలో డ్యాం వ్యతిరేక ప్రజా ఆందోళనలపై ఉక్కు పాదం మోపడం, చైనా ఆక్రమణల గురించి నోరు మొదపక పోవటం అంటే దేశ భద్రత పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో అంతుబట్టటం లేదు.

స్పందించండి