
మహారాష్ట్ర పోలీసులు ఢిల్లీ పోలీసుల కంటే ఎంతో బెటర్ అని కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడి నిండి ప్రశంసలు పొందిన నాలుగు రోజులకే వారు సిజెపి కార్యకర్తలకు బెదిరింపు తాఖీదులు జారీ చేయటం మొదలు పెట్టారు. అక్టోబర్ 10 తేదీన ఢిల్లీ నిరసనలకు వెళ్ల వద్దని అక్కడ హింస చెలరేగే అవకాశం ఉన్నదని బెదిరిస్తూ నోటీసులు పంపుతున్నారు. అసలు ఢిల్లీ వెళ్ళటానికి మీకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయని కూడా ప్రశ్నిస్తున్నారు.
ఈ మేరకు సిజెపి నాయకుడు అభిజిత్ దిప్కే మంగళవారం మహారాష్ట్ర పోలీసులపై ఆరోపణలు చేశాడు. రాష్ట్రం లోని చంద్రాపూర్ పోలీసులు తమ కార్యకర్తలకు పోలీసులు ఢిల్లీ వెళ్లవద్దని హెచ్చరిస్తూ నోటీసులు పంపారని ఆయన వెల్లడించాడు. ఇది నియంతృత్వం తప్ప మరొకటి కాదని దిప్కే మహారాష్ట్ర పోలీసులను విమర్శించారు.
బిజెపి కేంద్ర ప్రభుత్వం చెబుతున్న “ఒక దేశం, ఒక ఎన్నిక” కేవలం నినాదమేనా లేక “ఒక దేశం ఒకే రాజకీయ పార్టీ” అని ఆ నినాదం అర్ధమా అని ప్రశ్నించాడు. అక్టోబర్ 10 తేదీన దేశ రాజధాని న్యూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ప్రదర్శనకు సిజెపి పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. చీఫ్ ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్, ఎస్ఐఆర్ ప్రాసెస్ లో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినందుకు గాను ఆయన వెంటనే రాజీనామా చేయాలని సిజెపి డిమాండ్ చేస్తోంది.
చంద్రాపూర్ పోలీసులు సిజెపి కార్యకర్తలకు నోటీసులు జారీ చేశారని దిప్కే వెల్లడించాడు. న్యూఢిల్లీలో అక్టోబర్ 10 తేదీన జరగనున్న ప్రదర్శనకు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారని ఆరోపించాడు. “దేశంలో మహారాష్ట్ర పోలీసులు మెరుగైన బలగాలని నేను అనేకసార్లు చెప్పాను. కానీ వాళ్లు నా హృదయాన్ని బద్దలు చేస్తూ సిజెపి కార్యకర్తలకు నోటీసులు పంపారు. జంతర్ మంతర్ లో జరిగే ఆందోళనలో పాల్గోవద్దని నోటీసుల్లో కోరారు. జంతర్ మంతర్ కు ప్రయాణించేందుకు మీకు డబ్బు ఎక్కడిదని కూడా పోలీసులు ప్రశ్నించారు” అని దిప్కే ఆరోపించాడు.
“ఆందోళన హింసాత్మకంగా మారనుందని పోలీసులు నోటీసులో ప్రస్తావించారు. పదో తేదీన జరగనున్న ఆందోళన హింసాత్మకం అవుతుందని పోలీసులకు ముందే ఎలా తెలుసు? వాళ్ళేమన్నా ఆ వైపుగా పధకం పన్నారా?” అని అభిజిత్ ప్రశ్నించాడు. “మేము మహాత్మా గాంధీ, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ల గురించి మాట్లాడుకుంటాము. వాళ్లు హింసావాదులని పోలీసులు చెప్పడలిచారా?” అని దిప్కే ప్రశ్నించాడు.
“మహారాష్ట్ర పోలీసులు ఢిల్లీ పోలీసుల్లాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? చంద్రాపూర్ నుండి ఒక వ్యక్తి ఢిల్లీకి వెళితే వారికి సంబంధం ఏమిటి? యువకులు వెయ్యి రూపాయలు, రు 1500 రైలు టికెట్ లు కొనుక్కోగూడదా? ఇవేమీ ప్రశ్నలు? ఇది స్పష్టంగా నియంతృత్వమే” అని దిప్కే ఆరోపించాడు.
అక్టోబర్ 2, గాంధీ జయంతి నాడు ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించిన తర్వాత సిజెపి అక్టోబర్ 10 తేదీ లోపల ప్రధాన ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ రాజీనామా చేయకపోతే మరో నిరసన ప్రదర్శనకు దిగాలని పిలుపు ఇచ్చింది.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ పరిశోదనలో సిఈసి గ్యానేష్ కుమార్ కమిషన్ లోని ఇతర ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ లకు చెప్పకుండా, వారికి సమాచారం ఇవ్వకుండా గత 10 నెలల కాలంలో కనీసం 14 సార్లు ఏక పక్షంగా ఎస్ఐఆర్ సంబంధిత నిర్ణయాలు తీసుకుని అమలు చేశాడని తేలిన దరిమిలా దేశంలో ఆందోళనలు మిన్నంటాయి. గ్యానేష్ రాజీనామా డిమాండ్ చేస్తూ విద్యార్ధి, యువజన సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, సిజెపి లాంటి ప్రెజర్ గ్రూపులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి.
ఈ నేపధ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన అనేక నెలల తర్వాత ఎస్ఐఆర్ ద్వారా వోటర్ల జాబితా నుండి తొలగించబడిన వోటర్ల కోసం మళ్ళీ ప్రత్యేకంగా వోటర్ల నమోదు కార్యక్రమం చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్టు అక్టోబర్ 1 తేదీన ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పత్రిక కధనంలో ఎస్ఐఆర్ కోసం చట్ట విరుద్ధ చర్యలకు సిఈసి పాల్పడినట్టు తేలడం, సుప్రీం కోర్టులో గ్యానేష్ సస్పెన్షన్, డిస్మిసల్ డిమాండ్ చేస్తూ పిటిషన్ లు నమోదు కావటం, విచారణ కూడా ప్రారంభమైన నేపధ్యంలో చీఫ్ ఎన్నికల కమిషనర్ దిద్దుబాటు చర్యలకు దిగాడని అందరూ భావిస్తున్నారు.
అయితే ఎస్ఐఆర్ ప్రక్రియ దరిమిలా ఎన్నికల కమిషన్ ఇప్పటికే 13 కోట్ల మంది వోటర్ల వోటు హక్కు తొలగించబడింది. ఏ విధంగా చూసినా కూడా ఇన్ని కోట్ల మంది వోటర్లు వోటు హక్కు కోల్పోవటానికి చట్టబద్ధమైన కారణాలు ఉండే అవకాశం లేదు; చట్ట విరుద్ధంగా తొలగింపుకు గురైతే తప్ప. కానీ అక్టోబర్ 5 తేదీన సుప్రీం కోర్టులో జరిగిన విచారణలో చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యానాలను బట్టి గ్యానేష్ ను కాపాడేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలను పలువురు విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
“సిఈసి పైన ఆరోపణలకు ఉన్న సాక్షం ఇప్పటి వరకు కేవలం పత్రికల రిపోర్టులే కదా?” అని ఆయన ఆరోపణలను తేలికగా తీసిపారేసేందుకు ప్రయత్నించారు. ఓ పక్క “ఫారం 6 లో మార్పులకు లేదా సవరణలకు సుప్రీం కోర్టు అనుమతి లేదు” అని స్పష్టం చేస్తూనే, “అసలు ఫారం 6 లో మార్పు చేర్పులకు ఎవరు ఆదేశాలు జారీ చేశారో తెలుసుకోవాలి” అని చెబుతూనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పై వచ్చిన ఆరోపణలకు పత్రికల రిపోర్టులు తప్ప వేరే ఆధారం లేదని తేలికగా కొట్టివేసే ప్రయత్నం చేయటం వెనుక సిజెఐ ఉద్దేశాల పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


