–
ఈ టపా ఈ బ్లాగ్ లో మొదటి పోడ్ కాస్ట్. దీనిని వర్డ్ ప్రెస్ ప్లాట్ ఫారం వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తనకు తానే తయారు చేసి అందించింది. గత వారం రోజుల్లో బ్లాగ్ లో పోస్ట్ అయిన తపాలను పోడ్ కాస్ట్ గా మార్చి ఇస్తామని ఆఫర్ వర్డ్ ప్రెస్ వాళ్లు ఇవ్వగా దానికి ఓ.కె చెప్పాను. ఒక అరగంట టైమ్ తీసుకుని మూడు టపాల లోని ముఖ్యమైన అంశాలను తానే గుర్తించి ఆడియో రికార్డ్ రూపంలో అందించింది వర్డ్ ప్రెస్ వాళ్ళ ఏఐ.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తోంది. దీని వలన ప్రపంచ వ్యాపితంగా ఎన్ని కోట్ల మంది ఉపాధి అవకాశాలు కోల్పోతారో తెలియదు గానీ అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ తమ సొంత ఏఐ లను సృష్టించే పనిలో ఉంటే ఇతర కంపెనీలు ఏఐ లను ఉపయోగించి లాభాలు పెంచుకునే పనిలో పడిపోయాయి. ఇప్పటికే మెటా, మైక్రో సాఫ్ట్, గూగుల్, ఐబిఎం, అమెజాన్ లాంటి కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. త్వరలో ఇండియాలో కూడా ఏఐ టెక్నాలజీ నిరుద్యోగం ఉపద్రవాన్ని అనేక రెట్లు పెంచే అవకాశం కనిపిస్తోంది.
మరో పక్క ఫైనాన్షియల్ మార్కెట్ లో ఏఐ టెక్నాలజీ బబుల్ తయారవుతోంది. అంటే ఏఐ టెక్నాలజీలో వందల బిలియన్ల మేర పెట్టుబడులు పెడుతున్నారు గానీ దానికి తగిన లాభాలు భవిష్యత్ లో వస్తాయా లేదా అన్న అనుమానాలు దండిగా ఉన్నాయి. ప్రస్తుతానికి పెట్టుబడులు విపరీతంగా పెడుతుంటే ఆదాయం చాలా తక్కువగా ఉంటోంది.
ట్రిలియన్ల డాలర్లలో పెట్టుబడులు పెరిగిపోయి చివరికి ఏఐ టెక్నాలజీ ను అడాప్ట్ చేసుకోవటం లాభసాటి కాదని గ్రహించి ఇతర రంగాల కంపెనీలు వెనకడుగు వేస్తే ఏఐ రంగంలో పెడుతున్న పెట్టుబడులన్నీ అప్పులుగా పేరుకుంటే ఆ అప్పులు తీరే మార్గం కనిపించకపోతే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ స్తంభించిపోయి 2008 తరహాలో తీవ్ర స్థాయి సంక్షోభం రావచ్చు. 2008లో ద్రవ్య సంక్షోభం వచ్చింది. ఏఐ బబుల్ బద్దలైతే గనక 1930 లలో వచ్చినట్టు ద గ్రేట్ డిప్రెషన్ లాంటి సంక్షోభాన్ని ప్రపంచం ఎదుర్కోవలసి రావచ్చు.


