
సిజెపి అగ్ర నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా లను అరెస్టు చేసి 5 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కు పంపిన నేపధ్యంలో వారి అరెస్టుకు నిరసనగా శుక్రవారం, అక్టోబర్ 16 తేదీన నిరసనకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు ఇచ్చింది. తీరంగా మార్చ్ పేరుతో ఇచ్చిన ఈ పిలుపు మేరకు కన్నాట్ ప్లేస్ లోని సెంట్రల్ పార్క్ కు ప్రజలు వేలాదిగా కదిలి రావాలని, ఉమ్మడిగా జాతీయ జెండాలు ఎగురవేద్దామని సిజెపి నేత అభిజిత్ దిప్కే పిలుపు ఇచ్చాడు.
ఈ నేపధ్యంలో పోలీసులు కఠిన భద్రతా చర్యలు చేపట్టారు. సెంట్రల్ ఢిల్లీ రోడ్ల వెంబడి 25,000 మంది పోలీసు బలగాలను ఢిల్లీ పోలీసులు మోహరించారు. “లెహ్రా దో తీరంగా” మార్చ్ కోసం మరో 5,000 మంది పోలీసులను స్టాండ్ బై లో ఉంచారు. సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు విధించారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల అక్రమాలకు బాధ్యత వహిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయాలని కోరుతూ సిజెపి ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆందోళనను అణచివేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కింద పని చేసే ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ ను నిరసన చేయగల స్థలాల జాబితా నుండి డీనోటిఫికేషన్ ద్వారా తొలగించింది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ రంకా, సౌరవ్ లు, ఇతర కార్యకర్తలతో రహస్యంగా జంతర్ మంతర్ ఏరియాకు చేరుకుని జాతీయ జెండా ఎగురవేయటంతో పోలీసులు అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఆయన 5 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.
తీరంగా యాత్రకు నేహా బోరా నాయకత్వం లోని ఏఐఎస్ఏ విద్యార్ధి సంఘం కూడా పిలుపు ఇచ్చింది. అక్టోబర్ 16 నిరసన పిలుపు ఇచ్చిన నేపధ్యంలో పోలీసులు సెంట్రల్ పార్క్ ను మూసేవేశామని, ఎవరూ రావద్దని ప్రకటించారు. న్యూ ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ కూడా పార్క్ మూసేసినందున ఎవరూ పార్క్ కు రావద్దని ప్రకటించింది. ఈ సారి మెట్రో స్టేషన్లను మూసివేయటం లేదని కానీ అవసరం ఐతే చివరి నిమిషంలో ఐనా సరే మెట్రో స్టేషన్లను మూసేందుకు వెనకాడబోమని చెప్పారు.
ఐతే నిరసనకారుల నుండి ఎంపిక చేసిన కొద్దిమంది సభ్యులను సెంట్రల్ పార్క్ లో జెండా ఎగురవేసేందుకు అనుమతి ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. సెంట్రల్ పార్క్ లో ఇప్పటి వరకు సిసిటివి లను పార్క్ నిర్వాహకులు నెలకొల్పలేదు. కానీ సిజెపి తిరంగా మార్చి ప్రకటించిన తర్వాత పోలీసులు హడావుడిగా పార్క్ లో సరికొత్త సిసిటివి లను అమర్చినట్టు తెలుస్తున్నది.
ప్రస్తుతం న్యూ ఢిల్లీ లోని కన్నాట్ ప్లేస్ పస్తుతం చూస్తే దుర్భేద్యమైన కోట వలె కనిపిస్తోంది.


