
–
సలిమా టేటే పేరు ఇప్పుడు ఇండియాలో ఎంతమందికి తెలుసో గానీ స్పొర్ట్స్ మరియు గేమ్స్ వర్గాల్లో మాత్రం ఆమె పేరు మారుమోగి పోతోంది. ఆసియాడ్ ఆటల పోటీల్లో 44 యేళ్ల తర్వాత హాకీ ఆటలో భారత దేశానికి గోల్డ్ మెడల్ సాధించిన టీం కి ఆమె కెప్టెన్ మరి! ఆసియాడ్ లో గోల్డ్ మెడల్ సాధించటమే కాకుండా ఈ విజయంతో ఒలింపిక్ పోటీల్లో పాల్గొనే అర్హత కూడా సాధించి పెట్టారామె! ఈ రెండు విజయాలతో సలిమా టేటే గురించి ఇంటర్నెట్ లో వెతకటం ఎక్కువయిందిట!
గోల్డ్ మెడల్ సాధించిన సంబరాలు ముగిసిన తర్వాత సలీమా, జార్ఘండ్ రాష్ట్రం, సిండేగా జిల్లాలోని తన స్వగ్రామానికి బయలుదేరింది. వెళ్తూ వెళ్తూ ఆమె తన టీంమేట్స్ అందరితో పాటు, ఇంకా అక్కడ తెలిసిన వారికి ఒక సందేశం పంపింది. తన గ్రామానికి వెళ్ళాక తానిక మొబైల్ ఫోన్ ద్వారా అందుబాటులో ఉండలేను అని.
సలీమాకు ఇది మామూలే. తనకు ఊహ తెలిసినప్పటి నుండీ తన గ్రామానికి వెళ్లే ముందు తన ఫ్రెండ్స్ కి అదే మాట, ఇంటికి వెళ్ళాక మొబైల్ ఫోన్ కి దొరకను అన్న మాట, చెప్పటం ఆమెకు అలవాటే. ఎందుకంటే ఆమె స్వగ్రామం బర్కి ఛాపర్ లో మొబైల్ కనెక్టివిటీ ఇప్పటికీ లేదు.
గ్రామ గ్రామానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేశామని, అందుకే రేషన్ సరుకులు, రైతు సబ్సిడీలు, మనీ ట్రాన్సఫర్ లు ఇలా అన్నీ ఆన్ లైన్ లో జరిగిపోయేలా వ్యవస్థలను తీర్చిదిద్దామని, ఇక అవినీతికి తావు లేదని, మధ్యవర్తుల అవసరం లేదని ప్రధాన మంత్రి మోడి గారు అనేక సార్లు వల్లె వేసిన మాటల్లో నిజం ఇదన్నమాట!
దేశ ప్రధాన మంత్రి, రాష్ట్ర ముఖ్య మంత్రి ఈ విధంగా అది చేసేశామ్, ఇది చేసేశామ్ అని చెబుతూ ఉండటం అందరికీ తెలిసిన విషయమే. ‘ఇదిగో నిన్న బటన్ నొక్కాను, అందరి ఖాతాల్లో డబ్బు పడిపోయింది అని మన ముఖ్యమంత్రులు చెప్పటం మనమూ చూశాం. కానీ నిజంగా ప్రధాన మంత్రి చెప్పినట్టు 100 శాతం విద్యుత్ కనెక్షన్లు పూర్తయ్యాయా, ముఖ్యమంత్రి చెప్పినట్టు అర్హులు అందరికీ డబ్బులు జమ అయ్యాయా అన్న సంగతి ఎవరికీ తెలియదు. వాటిని చెక్ చేసే అవకాశం ఎవరికీ ఉండదు, ఒక్క పత్రికలకు తప్ప! ప్రధాన మంత్రి చెబితే మనం నమ్మేయ్యాలంతే!
పిత్రా గ్రామ పంచాయితీకి చెందిన తమ గ్రామంలో మొబైల్ కనెక్టివిటీ లేకపోవటం వలన ప్రభుత్వ అధికారులతో, స్పొర్ట్స్ శాఖ అధికారులు, కోచ్ లు, తోటి ఆటగాళ్లు.. అందరితో సంబంధంలో ఉండటం చాలా కష్టం అవుతుందని సలీమా ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికతో మాట్లాడుతూ వాపోయింది. “చాలా తరచుగా నా ఫోన్ ఇంక అందుబాటులో ఉండదని చెప్పాల్సి వస్తుంది” అని ఆమె తెలిపింది.
ఒక మొబైల్ కనెక్టివిటీ మాత్రమే కాదు, ఆమె గ్రామానికి ఇప్పటికీ తాగునీటి సౌకర్యం కూడా లేదు. మొబైల్ కనెక్టివిటీ కల్పించాలని, తాగునీరు గ్రామానికి అందేలా చూడాలని కోరుతూ ఆమె ఇటీవల సిండేగా పంచాయితీ డిప్యూటీ కమిషనర్ కాంచన్ సింగ్ కి ఒక అర్జీ సమర్పించింది. హాకీ గోల్డ్ మెడల్ గెలిచాక తన గ్రామం పేరు ప్రముఖంగా పత్రికల్లో వచ్చిందని ఐనా తమ గ్రామానికి మౌలిక సౌకర్యాలు లేని సంగతి ఎవరికీ తెలియదని చెప్పారామె.
“ఇప్పుడు నాకు ఒక గుర్తింపు వచ్చింది. దాంతో గ్రామ ప్రజలు గ్రామ అవసరాలు చేసి పెట్టాలని నన్ను అడుగుతూ ఉంటారు. ఎమర్జెన్సీ అవసరం ఏర్పడితే అధికారులతో మాట్లాడమని నేను చెప్పాల్సి వస్తోంది. నా మాట విని ఎవరు వస్తారు గనక!” అని సలిమా టేటే వ్యాఖ్యానించింది.
“ఇది నాకు చాలా తీవ్రమైన బాధ కలిగించే విషయం. ఎమోషనల్ సమస్య కూడా. నువ్వు అంత పెద్ద వేదికలో ఆడుతూ ఉంటావు, మొత్తం ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నావు, గ్రామానికి కనీసం మొబైల్ కనెక్షన్ తేలేవా అని అడుగుతారు. చాలా విచారకరమైన విషయం” అని టేటే తన బాధ వ్యక్తం చేసింది. కనెక్టివిటీ లేకపోవటం వలన ముఖ్యమైన ఈ-మెయిల్స్ మిస్ అవాల్సి వస్తుందని చెప్పారమె.
పిత్రా గ్రామ పంచాయితీ ముఖియా అనీల్ ఒరోన్ కూడా అదే చెప్పాడు. “టేటే మా పంచాయితీలోని గ్రామంలో నివసిస్తుంది. మా గ్రామానికి, బ్లాక్ కీ, జిల్లా కి అలాగే మా జార్ఘండ్ రాష్ట్రానికి కూడా దేశం అంతా పేరు తెచ్చి పెట్టింది. కానీ ఆమె సొంత గ్రామానికి మౌలిక సౌకర్యాలు లేకపోవటం బాధాకరమైన విషయం” అని ఆయన కూడా టేటే తో గొంతు కలిపాడు.

బర్కి ఛాపర్ పంచాయితీలో ఒక మొబైల్ టవర్ ఉన్నా కూడా దాని పరిధిలో టేటే నివసించే గ్రామం లేదట. అందువల్ల ఇంటర్నెట్ సంగతి అటుంచి మామూలు ఫోన్ కాల్ చేసుకోవటం కూడా కుదరదు. ఇంకో విషయం ఏంటంటే టేటే తండ్రి సులక్షన్ మొబైల్ టవర్ కోసం కొంత భూమి ఇవ్వటానికి కూడా సిద్ధం అయ్యాడు. అయినా ఫలితం లేకుండా పోయింది.
టేటే ఉంటున్న గ్రామానికి రోడ్డు సౌకర్యం కూడా లేదు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేస్తే మరింత మంది పిల్లలు స్పొర్ట్స్ లో ఆసక్తి చూపుతారని ఊరి ప్రజలు చెబుతున్నారు. “ఆమె 2024 లో హాకీ ఇండియా టీం కెప్టెన్ అయిందగ్గర్నుండి టేటే పాలనా యంత్రాంగం అధికారులతో ఈ సమస్యల గురించి పదే పదే చెబుతూ వచ్చింది. ఈ రోజు రాత్రి మేము మెసేజ్ పంపితే రేపు పొద్దున మాత్రమే, కాస్త సిగ్నల్ దొరికే ఏరియాకి వెళ్ళాక, దాన్ని ఆమె చూడగలదు” అని ట్రైబల్ హక్కుల కార్యకర్త ఆగస్టినా సోరెంగ్ చెప్పాడు.
2024 లో కెప్టెన్ గా సలీమా టేటే ను నియమించారు. ఆమె స్థిరంగా ప్రతిభ కనపరచటంతో జపాన్ ఆసియాడ్ కు కూడా ఆమెనే కెప్టెన్ గా కొనసాగించారు. ఆసియాడ్ ఫైనల్ లో ఇండియా చైనాను 1-0 తేడాతో ఓడించింది. 1982లో ఇండియాలో జరిగిన ఆసియాడ్ తర్వాత మళ్లీ ఇప్పుడే ఇండియా మహిళల టీం గోల్డ్ మెడల్ గెలవటం! ఈ గెలుపుతో ఇండియా 2028 ఒలింపిక్స్ లో అర్హత సాధించింది.
అధికారులను కదిలిస్తే ఊహించినట్టే వాళ్లు టేటే ఊరి సమస్య తమకు తెలియదని బుకాయించారు. “ఆ ప్రాంతం కొండలతో నిండి ఉంటుంది. అందువల్ల కనెక్టివిటీ సమస్య కొన్ని గ్రామాలకు ఉన్నది. డిప్యుటీ కమిషనర్ ఛైర్మన్ గా ఉన్న కమిటీ ఈ సమస్యలను చూస్తుంది. ఈ విషయంలో ఏం చేయాలో చూడాలి” అని జిల్లా స్పొర్ట్స్ అధికారి మనోజ్ కుమార్ చెప్పాడు. మళ్లీ అదే ఉదాసీనత! అంతలోనే “మేము మా ప్లేయర్స్ కు సాధ్యమైనంత మెరుగైన సౌకర్యాలు ఉండాలని చూస్తాం” అని అంటూ “పై అధికారులకు విషయం తెలియజేస్తాను” అని ఇంకో సారి హామీ ఇచ్చేశాడు.
టేటే గ్రామ సమస్యల సంగతి ఒక్క సారి కూడా జిల్లా స్పొర్ట్స్ అధికారికి చెప్పకుండా ఉంటుందా? ఆమె అనేకసార్లు అధికారులకు అర్జీ పెట్టుకుంది కూడాను. తాగు నీటి గురించి అడిగితే ఆ సంగతి పరిగణనలోకి తీసుకున్నాం, తొందరలో పనులు ప్రారంభిస్తాం అని మరొక వాయిదా వేశాడు.
చిత్రం ఏమిటంటే అక్కడి స్థానిక ఎంఎల్‌ఏ కి కూడా సమస్యల సంగతి తెలియదట! గోల్డ్ మెడల్ కొట్టిన వెంటనే ఈ అమ్మాయి మా అమ్మాయి, మా నియోజకవర్గపు అమ్మాయి అని సగర్వంగా చాటుకున్నా ఎంఎల్‌ఏ భూషణ్ బారా తన నియోజకవర్గంలోని గ్రామాల్లోని తాగు నీటి సమస్య గురించి తెలియదంటే ఎలా నమ్మటం? నిజానికి తెలియదు అన్నందుకే ఆయన్ని ప్రజలు నిలదీయాలి.
ఇండియాలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి 70 సార్లు బడ్జెట్ ని ప్రవేశ పెట్టింది. లక్షల కోట్ల రూపాయలు ప్రజల సౌకర్యాల కోసం ఖర్చు పెట్టామని ప్రభుత్వాలు చెబుతూ వచ్చాయి. ఐనా కూడా 70 సం.ల తర్వాత కూడా ఇప్పటికీ తాగునీరు లేని గ్రామాలు ఇండియాలో ఇంకా ఎందుకున్నాయి? ఈ ప్రశ్నకు మన ప్రధాని సమాధానం ఇవ్వగలరా?
