
–
యుద్ధ పరికరాల విడిభాగాలను తయారు చేసే భారత ప్రభుత్వ సంస్థ (పబ్లిక్ సెక్టార్ కంపెనీ) భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్) లో ఆశ్రిత పక్షపాతం చోటు చేసుకున్న కధ ఇది! ఎంతో ముఖ్యమైన ఒక టెండర్ విషయంలో కాంపిటీటివ్ బిడ్డింగ్ (టెండర్ల పోటీ) కు వెళ్ళడం మానేసి కంపెనీ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ కు చెందిన కంపెనీకి టెండర్ ను కట్టబెట్టిన చోద్యాన్ని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక బయట పెట్టింది.
సెప్టెంబర్ 23 తేదీన ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ చేయవలసిన ఎస్ఐఆర్ నిర్ణయాలను చీఫ్ ఎన్నికల కమిషనర్ తానే ఏకపక్షంగా చేసేసి 13 కోట్ల మంది మారిజనల్ కమ్యూనిటీల (మైనారిటీ మతస్థులు, దళితులు, పేదలు మొ. వారు) ప్రజల వోటు హక్కును వోటర్ల జాబితా నుండి తొలగించిన బాగోతాన్ని బైట పెట్టి సంచలనం రేపిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక ఇప్పుడు మోడి ప్రభుత్వంలో చోటు చేసుకున్న మరో అవినీతి బాగోతాన్ని వెల్లడి చేసింది.
దేశ ప్రయోజనాలు కాదు స్వార్ధ ప్రయోజనాలు
ఇండియన్ ఎక్స్ ప్రెస్ పరిశోధనలో భారత ప్రభుత్వరంగ సంస్థ ‘స్వప్రయోజనాల సంఘర్షణ’ (Conflict of Interest) కు తావిచ్చే విధంగా ప్రైవేటు కంపెనీ నుండి కొనుగోలు నిర్ణయం చేసిన సంగతి వెలుగులోకి వచ్చింది. కంపెనీకి ఛైర్మన్ & ఎండి గా పని చేసి రిటైర్ అయిన వ్యక్తి స్థాపించిన కంపెనీకి సింగిల్ టెండర్ అప్పగించటం అంటే అత్యంత నగ్నంగా ఆశ్రిత పక్షపాతానికి పాల్పడటమే.
హైదరాబాద్ లోని రక్షణ పరికరాల తయారీ కంపెనీ బిడిఎల్, ‘అత్యవసరం’ (Urgency) సాకు చూపిస్తూ యాంటీ-ట్యాంక్ మిసైళ్లలో ఉపయోగించే “ఆప్టికల్ సైట్స్” అనే విడిభాగం తయారీ కోసం పోటీ లేకుండా ఒకే ఒక టెండర్ ను ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించింది. టెండర్ విలువ రు 56.8 కోట్లు. బిడిఎల్ కంపెనీ మాజీ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ్ మిశ్రా రిటైర్ అయ్యాక తన భార్య శాంభవితో కలిసి సదరు ప్రైవేటు కంపెనీని స్థాపించటం విశేషం. ఆ ప్రైవేటు కంపెనీలో మిశ్రాకు 95 శాతం వాటా ఉండగా, భార్యకు 5 శాతం వాటా ఉన్నది.
సదరు ప్రైవేటు కంపెనీ పేరు ఐండ్రీ డిఫెన్స్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్. కాగా మిసైళ్లలో లక్ష్య ఛేదన కోసం ఉపయోగించే 300 ‘ఆప్టికల్ సైట్స్’ ను 7 నెలల్లో తయారు చేసి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఏకైక టెండర్ ను ఈ కంపెనీకి 2026 మే నెలలో బిడిఎల్ అప్పగించింది. కంపెనీ ఇప్పటికే 5 శాంపిళ్లను సరఫరా చేయగా వాటిని పరీక్షించి విలువ మదింపు చేసే కార్యక్రమం కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. సాంకేతిక విలువ మదింపు దశను ఐండ్రీ డిఫెన్స్ అడ్వైజరీ పూర్తి చేసుకుందని ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా తెలుస్తున్నది.
బిడిఎల్ కంపెనీ కొనుగోలు ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఈ ఐదు ఆప్టికల్ సైట్స్ ను సరఫరా చేయబోతోంది. ఈ ఆప్టికల్ సైట్స్ అన్నవి యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిసైళ్లు (ATGM) లక్ష్యానికి గురి సరిగ్గా పెట్టటంలో కీలకంగా పని చేస్తాయి. భూమి మీద ఉండే లక్ష్యం యొక్క జిపిఎస్ కో-ఆర్డినేట్స్ వైపుకు దూసుకెళ్లేందుకు ఆప్టికల్ సైట్స్ దోహదం చేస్తాయి. ఇటువంటి కీలకమైన మిసైల్ విడిభాగాన్ని తయారు చేయటానికి తప్పనిసరిగా అనుభవం, తగిన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న డిఫెన్స్ కంపెనీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
కానీ ఐండ్రీ డిఫెన్స్ అడ్వైజరీ కంపెనీ అనుభవం ఉన్న కంపెనీ కాదని పత్రిక పరిశోధనలో తేలింది. ఈ కంపెనీని సిద్ధార్థ్, ఆయన భార్య శాంభవిలు మే 2024 లో మాత్రమే స్థాపించారు. కంపెనీని స్థాపించినప్పుడు భార్యాభర్తలు ఇరువురు చెరో 50 శాతం వాటా కలిగి ఉన్నట్టు తెలుస్తోంది.
బిడిఎల్ కంపెనీకి నాలుగేళ్లు ఛైర్మన్ మరియు ఎండిగా పని చేసిన మిశ్రా మార్చి 2023 లో రిటైర్ అయ్యాడు. ప్రైవేటు కంపెనీని స్థాపించినప్పటి నుండి జనవరి 2025 వరకు కంపెనీకి డైరెక్టర్ మరియు షేర్ హోల్డర్ గా ఉన్న మిశ్రా జనవరి 2025 వరకు ఆ బాధ్యతల్లో కొనసాగాడు. అనంతరం కోల్ కతా లోని నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ సభ్యుడుగా నియమించబడడంతో కంపెనీ నుండి తప్పుకున్నాడు. దరిమిలా ఆయన భార్య 95 శాతం వాటాతో డైరెక్టర్ గా ఉండగా మిగిలిన 5 శాతం వాటాను కౌశిక్ నందన్ వాత్స్యాయన సొంతం చేసుకున్నాడు.
ఎలాంటి కాంపిటీటివ్ బిడ్డింగ్ లేకుండా సింగిల్ టెండర్ సొంతం చేసుకోవటం గురించి, అనుభవ రాహిత్యం గురించి సమాచారం కోసం డైరెక్టర్ శాంభవి, ఆమె భర్త మిశ్రా లను ఇండియన్ ఎక్స్ ప్రెస్ సంప్రదించగా వారి నుండి స్పందన రాలేదని పత్రిక తెలిపింది.
టెండర్ ప్రక్రియలో భారీ మార్పులు
అదే తరహా ఆప్టికల్ సైట్స్ ను బిడిఎల్ కంపెనీ 2024, 2025 సం.లలో కూడా కొనుగోలు చేసింది. కానీ కాంపిటీటివ్ బిడ్డింగ్ ద్వారా మాత్రమే అది కూడా పబ్లిక్ సెక్టార్ కంపెనీల వరకే పరిమితం చేస్తూ టెండర్ లను పిలిచారు. ఈ రెండు 2024, 2025 సం.లలో జరిగిన రెండు కొనుగోళ్ల మధ్య కూడా కొన్ని మార్పులు జరిగాయి. 2024 లో టెండర్ల జారీకి కేవలం కేంద్ర పబ్లిక్ సెక్టార్ కంపెనీలకు (సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్) మాత్రమే అనుమతి ఇచ్చారు. 2025 సం.లో స్వల్ప మార్పు చేసి కేంద్ర పబ్లిక్ సెక్టార్ కంపెనీలతో పాటు రక్షణ రంగ పబ్లిక్ సెక్టార్ కంపెనీలకు (డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్) కూడా అనుమతిని విస్తరించారు. GeM (గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్) పోర్టల్ ప్రకారం ఈ రెండు సార్లూ టెండర్లను ఇండియా ఆప్టెల్ లిమిటెడ్ కంపెనీయే సొంతం చేసుకుంది. ఈ కంపెనీ రక్షణ మంత్రిత్వ శాఖ కింద పని చేస్తుంది. కాగా దీనిని మినీ రత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

–
2026 సం. కి వచ్చేసరికి టెండర్ ప్రక్రియ నుండి కాంపిటీటివ్ టెండర్ విధానాన్ని రద్దు చేయటమే కాకుండా పబ్లిక్ సెక్టార్ కు మాత్రమే పరిమితం చేసే విధానాన్ని కూడా రద్దు చేశారు. రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించాలన్న కేంద్ర ప్రభుత్వ విధానంలో భాగంగానే ఈ మార్పు జరిగిందన్నది నిర్వివాదాంశం. కానీ ప్రైవేటు కంపెనీలకు కూడా కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానాన్ని తొలగించటం అంటే అస్మదీయులకు టెండర్లను కట్ట బెట్టే ఉద్దేశం ముందే ఉన్నట్టు అనుమానించాల్సి వస్తోంది.
సింగిల్ టెండర్ కు అనుమతి ఇవ్వటం, అది కూడా కంపెనీ పేరు కూడా ఆర్డర్ లో సూచించటానికి “అత్యవసర పరిస్ధితి” అని ప్రభుత్వం/బిడిఎల్ కంపెనీ కారణంగా చూపించింది. టెండర్ ఇలా పేర్కొంది: “మంత్రిత్వ శాఖ లేదా కాంపిటెంట్ అథారిటీ “అత్యవసర డిమాండ్” తలెత్తిందన్న అంశాన్ని ధృవీకరించింది. ప్రకటనల ద్వారా టెండర్ జారీ ప్రక్రియను పాటించకపోవటం వలన సంభవించే అదనపు ఖర్చు ఏమన్నా ఉన్నట్లయితే అది “అత్యవసర డిమాండ్” వలన ఏర్పడ్డ పరిస్ధితిగా క్రమబద్ధీకరించబడింది. అత్యవసర పరిస్ధితి స్వభావం మరియు కారణాల గురించి మంత్రిత్వ శాఖ లేదా డిపార్ట్మెంట్ తగిన వివరణను రికార్డు చేసింది.”
తగిన కారణాలను మంత్రిత్వ శాఖ రికార్డు చేసిందని చెప్పారు గాని ఆ కారణాలు ఏమిటో చెప్పలేదు. మైక్రో మరియు స్మాల్ ఎంటర్ ప్రైజెస్ ను టెండర్లు ఏ విధంగా పరిగణిస్తాయో కూడా ఈ టెండర్ ప్రక్రియ ఒక ఉదాహరణగా నిలిచింది. ఎలాగంటే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ ప్రైజెస్ కంపెనీలను 2024, 2025 లలో టెండర్ల నుండి అధికారికంగానే తప్పించారు.
ఓ పక్క మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నామని, అందుకోసం యువ, మహిళా పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని, స్టార్టప్ కంపెనీలు స్థాపించి క్రమంగా ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించే భారతీయ బడా కంపెనీలుగా ఎదగాలని, భారతదేశాన్ని గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ హబ్ గా మార్చాలని అవకాశం వచ్చినప్పుడల్లా ప్రధాన మంత్రి, ఇతర మంత్రులు ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఆచరణయుత విధానంకు వచ్చేసరికి వారు వల్లించిన ఆశయాలు అదృశ్యం అయిపోతాయి. ఇంతకీ ఈ ఐండ్రీ డిఫెన్స్ అడ్వైజరీ కంపెనీకి మాన్యుఫాక్చరింగ్ యూనిట్ అన్నదే లేదు. రెగ్యులర్ గా నడిచే ఆఫీస్ ఉన్నా కూడా అది ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. ఈ వివరాలు మరోసారి.
