
అమెరికాలో భారతీయులు మరియు ఇతర దక్షిణాసియా వాసులకు వ్యతిరేకంగా విద్వేషం పెచ్చరిల్లుతోంది. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఆయన విధానాల వలన ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక సెంటిమెంట్లు పెట్రేగి పోవటంతో భారతీయుల పైనా, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన వారి పైనా భౌతిక దాడులు సైతం పెరిగాయి. జూన్ 2024 నుండి జూన్ 2026 వరకు దక్షిణాసియా నుండి వలస వచ్చినవారిపై ముఖ్యంగా భారతీయులపై అమెరికన్లలో విద్వేషం, X వేదికగా 240 శాతం పెరిగిందని సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్ అనే అధ్యయన సంస్థ వెల్లడి చేసిన నివేదిక తెలిపింది.
సోషల్ మీడియా వెబ్ సైట్ ఎక్స్ వేదిక పైన దక్షిణాసియా వ్యతిరేక విద్వేష పోస్టులు జూన్ 2024లో 12,904 పోస్టులు ప్రచురించబడగా జూన్ 2026 నెలలో ఆ సంఖ్య ఏకంగా 43,843 పోస్టులకు పెరిగిపోయింది. ట్రంప్ హయాంలో ఇమిగ్రేషన్ వ్యతిరేక రాజకీయాలకు ప్రోత్సాహం లభించటం, అమెరికన్లలో ఆర్ధిక వ్యవస్థ తాలూకు ఆందోళన తీవ్రం కావటం, వీధుల్లో ఇతర పబ్లిక్ స్థలాలలో భారతీయులు, పాక్ మరియు బంగ్లాదేశీయులు కనిపించటం ఎక్కువ కావటం… ఇత్యాది కారణాల వలన దక్షిణాసియా వాసులకు వ్యతిరేకంగా ద్వేషం పెరుగుతున్నదని అధ్యయనం అంచనా వేసింది.
గత ఆదివారం (సెప్టెంబర్ 27) తేదీన వెలువడిన నివేదిక, జాతి విద్వేషం గురించి ఐక్యరాజ్య సమితి రూపొందించిన నిర్వచనం ప్రాతిపదికన ఎక్స్ లో పోస్ట్ అవుతున్న విద్వేష పూరిత పోస్టులను అధ్యయనం చేసింది. జనవరి 2025 నుండి జూన్ 2026 వరకు ఎక్స్ వేదిక పైన సౌత్ ఆసియన్లకు వ్యతిరేకంగా, వారిపైన ద్వేషం వ్యక్తం చేస్తూ 542,000 పోస్టులు ప్రచురితం అయినట్లు నివేదిక వెల్లడించింది. విద్వేషపూరిత పోస్టుల సంఖ్య నెల నెలా పెరుగుతూ వచ్చాయని తెలిపింది. జనవరి 20, 2025 తేదీన డొనాల్డ్ ట్రంప్ రెండవ సారి అధ్యక్ష పదవి చేపట్టిన సంగతి ఈ సందర్భంగా గమనించాలి.
భారతీయులే ప్రధాన టార్గెట్!
అమెరికాలోని H-1B వీసా కలిగిఉన్న వాళ్ళలో 70 శాతం మంది భారతీయులే. ఇమ్మిగ్రేషన్ గురించిన చర్చలలో భారతీయులు ప్రధాన కేంద్రంగా ఉండటం ఒక అంశం. ఎక్స్ వేదిక లో పోస్ట్ అయిన విద్వేషపూరిత పోస్టులలో సగం పోస్టులు దక్షిణాసియా ప్రజలు అమెరికా పైన దండెత్తారని, అమెరికన్ల ఉద్యోగాలను దొంగిలిస్తున్నారని, అమెరికాలో దక్షిణాసియా ప్రజల వలసలు ఎక్కువ కావటం వలన తెల్లజాతి ప్రజల కంటే కలర్ ప్రజల సంఖ్య పెరిగి పోతున్నదని దరిమిలా అమెరికా నివాసులలో జాతి పొందిక తెల్లవారికి వ్యతిరేకంగా తయారవుతున్నదని ఆందోళన వ్యక్తం అవుతోంది.
అమెరికాలో సౌత్ ఆసియన్లను ముఖ్యంగా భారతీయులను మురికివారిగా, శుభ్రత లేని సంస్కార హీనులుగా అభివర్ణించటం తరచుగా జరుగుతుంది. భారతీయులను డర్టీ గా అభివర్ణిస్తూ పోస్టులు రాయటం 171 శాతం పెరిగిందని నివేదిక ప్రకటించింది. ఈ తరహా ఆరోపణ అత్యంత వేగంగా పెరుగుతున్నట్లు అధ్యయనం తెలిపింది. ఇండియన్లు, పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు ఈ మూడు ప్రాంతాల వారిని ఒకే గాటన అనగా భారతీయులుగా భావించటం తరచుగా జరుగుతుంది. అలాగే హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిష్టియన్లు వీరందరినీ ఒకే గ్రూపుగా అమెరికన్లు భావించటం కద్దు.
H-1B వీసా వివాదం ప్రధాన ఫ్లాష్ పాయింట్ గా అవతరించటం ఈ కధనంలోని ముఖ్యాంశం. ట్రంప్ ప్రభుత్వం H-1B వీసా జారీ పైన తీవ్ర స్థాయిలో ప్రతిబంధకాలు విధించాక భారతీయులపై విద్వేషం మరింత పెరిగింది. సెప్టెంబర్ 2025 నెలలో కొత్త H-1B వీసాలు జారీ చేయాలంటే ఒక్కొక్కరు లక్ష డాలర్లు చెల్లించాలని నియమం విధించారు. ప్రస్తుత డాలర్ ధర ప్రకారం ఇది 95 లక్షల రూపాయలకు సమానం. ఇంత భారీ మొత్తాన్ని చెల్లించగల వారు చాలా తక్కువ. ఈ ఫీజు భారతీయుల డాలర్ కలలపై నీళ్లు జల్లింది.

ఇండియన్లు అమెరికా వెళ్ళే అవకాశాలు బలహీన పడటం ఒక అంశం అయితే ఈ ఫీజు పెంపు తర్వాత ఇండియన్లపై ద్వేషం పెరిగిపోవటం మరో అంశం. భారతీయులపై వ్యతిరేకత పెరిగేందుకు వీసా ఫీజు పెంపుదల దోహద పడింది. ట్రంప్ అనుసరిస్తున్న ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక విధానాలు ప్రజల్లో ఇమిగ్రేషన్ వ్యతిరేక సెంటిమెంట్లు బలపడేందుకు దోహదం చేస్తున్నాయి.
జులై 2025 లో జరిగిన ఏఐ సమ్మిట్ లో ఇమ్మిగ్రేషన్ కు వ్యతిరేకంగా ముఖ్యంగా భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వటానికి వ్యతిరేకంగా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానాలు చేయటం వలన భారత ఐటి ఉద్యోగార్ధులపై ద్వేషం మరింత పెరిగింది. అమెరికా టెక్నాలజీ అభివృద్ధి ద్వారా తయారవుతున్న ఉద్యోగాలను అమెరికా కంపెనీలు ఇండియా కు ఔట్ సోర్సింగ్ చేస్తున్నాయని దీని వలన అమెరికన్లు టెక్నాలజీ ఉద్యోగాలు నష్టపోతున్నారని, ఈ పద్ధతిని విరమించుకోవాలని ఆయన అమెరికన్ టెక్నాలజీ కంపెనీల పైన విమర్శలు గుప్పించాడు.
ఇండియాలో అత్యంత తక్కువ వేతనాలకు భారతీయ టెక్నాలజీ నిపుణులు అందుబాటులోకి వస్తున్నందునే అమెరికా ఐ.టి కంపెనీలు భారతీయులను రిక్రూట్ చేసుకోవటానికి ఇండియన్ ఐ.టి కంపెనీలకు కాంట్రాక్టులను ఔట్ సోర్స్ చేయటానికి కారణం అన్న సంగతిని ట్రంప్ సౌకర్యవంతంగా విస్మరించాడు. లాభాల పెంపుదల కోసం మాత్రమే అమెరికా కంపెనీలు ఔట్ సోర్సింగ్ కు పాల్పడుతుండగా దానిని విస్మరించి భారతీయులపై విద్వేషం రెచ్చగొట్టటం ట్రంప్ ఒక విధానంగా అమలు చేస్తున్నాడు.
కొన్ని దశాబ్దాల నిడివిలో భారతీయుల పట్ల అమెరికా ప్రజల్లో ఉన్న అభిప్రాయాలలో తీవ్ర స్థాయి విభేదాలు తలెత్తాయి. గతంలో భారతీయులు “మోడల్ మైనారిటీ ప్రజలు” గా ప్రశంసలు పొందారు. ముఖ్యంగా ఆన్ లైన్ లో ఈ ప్రశంసలు కురిసేవి. ఇప్పుడు ఆ అభిప్రాయం పూర్తిగా తల్లకిందు లయింది. భారతీయులు “అవకాశవాదులు” అనీ “మోసగాళ్లు” అనీ అభివర్ణించటం ఎక్కువయింది.
అమెరికా ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయి ఉద్యోగాలు లభించటం తక్కువ అయ్యేకొద్దీ సదరు అసంతృప్తి ఇమ్మిగ్రేషన్ వ్యతిరేకతగా రూపాంతరం చెందుతోందని నివేదిక గుర్తించింది. ఆర్ధిక వ్యవస్థ సంక్షోభం అనివార్యంగా ఉద్యోగాల పైన వ్యతిరేక ప్రభావం పడవేస్తుంది. కంపెనీలు ఇన్వెస్ట్ మెంట్లు తగ్గించుకుని ఉద్యోగుల సంఖ్యలో కోత విధిస్తాయి. ఉన్న ఉద్యోగులను తగ్గిస్తాయి. పింక్ స్లీప్ ల జారీ ఎక్కువ అవుతుంది. వేతనాలు పడిపోతాయి. దరిమిలా అమెరికన్ల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి.
సంక్షోభం నేరుగా వారి కొనుగోలు శక్తి పైనా, జీవన ప్రమాణాల పైన పడిపోవటంతో అమెరికన్లు సహజంగా అందుకు కారణం ఎవరా అని వెతకటం ప్రారంభిస్తారు. సహజంగానే వారి దృష్టి తమ ఎదుట రోడ్ల పైన, రెస్టారెంట్లలో, పబ్ లలో కనిపిస్తున్న భారతీయుల పైన పడిపోతుంది. దానికి తోడు ట్రంప్ రోజువారీ చేస్తున్న ఇమ్మిగ్రేషన్ వ్యతిరేక ప్రకటనలు, చట్ట విరుద్ధ నివాసులపై ఐ.సి.ఇ జరుపుతున్న దాడులు జత కలుస్తాయి. ఫలితంగా సౌత్ ఆసియన్లు, ముఖ్యంగా భారతీయులు తమ ఉద్యోగాలు కొట్టేస్తున్నారన్న భ్రమలకు లోనవుతారు. మరింత లోతుగా ఆలోచించి అసలు ఆర్ధిక వ్యవస్థ బలహీన పడేందుకు ప్రధాన కారణంగా పని చేస్తున్న కంపెనీల లాభాపేక్ష ను చూసే విశ్లేషణా శక్తి సామాన్యులకు ఉండదు. కళ్లెదుట కనిపించే విదేశీ ముఖాలు వారికి టార్గెట్ అవుతున్నారు.
రాజకీయాల్లో భారతీయులు
అదీ కాక ఈ మధ్య కాలంలో రాజకీయ రంగంలో కూడా సౌత్ ఆసియా నుండి ముఖ్యంగా ఇండియా నుండి వలస వచ్చిన ప్రముఖులు కనిపించటం ఎక్కువయింది. అమెరికా ఉపాధ్యక్షుడు జె డి వాన్స్ భార్య భారతీయ కుటుంబం నుండే వచ్చింది. మరో ప్రముఖ రిపబ్లికన్ రాజకీయవేత్త వివేక్ రామస్వామి తరచుగా వార్తల్లో కనిపిస్తున్నాడు. న్యూయార్క్ నగర మేయర్ గా భారతీయ నేపధ్యం కలిగిన జోహ్రాన్ మందాని ఎన్నిక అయ్యాక ఆయనకు వ్యతిరేకంగా ఎన్నికలకు ముందు తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్ విద్వేష పూరిత ప్రకటనలు జారీ చేసి ఆయనపై ద్వేషాన్ని రెచ్చగొట్టి పెట్టాడు. ఇది మొత్తంగా భారతీయులపై వ్యతిరేకత, ద్వేషం పెరిగాటానికి దోహదం చేసింది.
జోహ్రాన్ మందాని న్యూయార్క్ మేయర్ గా ఎన్నికయ్యాక అమెరికాలో సోషల్ వెబ్ సైట్లలో సౌత్ ఆసియా వ్యతిరేక పోస్టులు వేగంగా పెరిగాయని నివేదిక వెల్లడించింది. దానితో పాటు ఇస్లామోఫోబియా కూడా పెచ్చరిల్లిందని నివేదిక తెలిపింది. ఆన్ లైన్ లో వ్యక్తం అవుతున్న ద్వేషం ఎవరు నిజమైన అమెరికన్లు అన్న ప్రశ్న చుట్టూ తిరుగుతోంది. భారతీయులు, ఇతర దక్షిణాసియా ఇమిగ్రెంట్లు అమెరికా సమాజానికి బైటివారని, వారు అమెరికా నేటివిటీకి చెందిన వారు కాదని అమెరికన్లు భావిస్తూ ఆన్ లైన్ లో అభిప్రాయాలు, కామెంట్లు, విద్వేష ప్రకటనలు పోస్ట్ చేస్తున్నారు.
ట్రంప్ ప్రభుత్వ మద్దతు
ట్రంప్ ఆధ్వర్యం లోని అమెరికా ప్రభుత్వం కూడా ఈ అభిప్రాయాలకు, ద్వేషానికి మద్దతుగా ప్రకటనలు విడుదల చేయటంతో పరిస్ధితి మరింత దిగజారుతోంది. ఇటీవల అమెరికా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం (సెప్టెంబర్ 2026లో) ఒక వీడియో క్యాంపెయిన్ విడుదల చేసింది. “ట్రాన్స్ఫార్మర్స్: ఏజ్ ఆఫ్ డిపోర్టేషన్స్” ఈ క్యాంపెయిన్ కు టైటిల్ గా పెట్టారు. అందులో తలపాగా ధరించిన ఓ భారతీయుడు రోడ్డు పైన నడుస్తుంటే “మిస్టర్ సిఙ్గ్క్ మా రోడ్ల పై నుండి తప్పుకోండి” అని డిపార్ట్మెంట్ ఉద్యోగి ఆజ్ఞాపిస్తాడు. హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం టెర్రరిస్టులను పట్టుకునే పనిలో ఉంటారని తెలిస్తే భారతీయులను ఏ విధంగా సదరు వీడియోలో చూపించారో అర్ధం చేసుకోవచ్చు.
కొన్ని రోజుల తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఈ తరహా పోస్టు ఆన్ లైన్ లో ఉంచింది. టెక్సాస్ కు చెందిన రిపబ్లికన్ పార్టీ వ్యక్తి బో ఫ్రెంచ్, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో జరుగుతున్న ఫుట్ బాల్ స్టేడియంలో సౌత్ ఆసియన్లు ఉన్నారని ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును నేరుగా ఉద్దేశిస్తూ అమెరికా ఎడ్యుకేషన్ డిపార్టుమెంట్ “మేక్ కాలేజ్ ఫుట్ బాల్ గేమ్ గ్రేట్ అగయిన్” అని ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. ట్రంప్ నినాదం “మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్” (మాగా) ను గుర్తుకు తెస్తూ చేసిన ఈ పోస్ట్ ద్వారా సౌత్ ఆసియన్లు మాగా నినాదం సాకారం చేసుకునేందుకు ఆటంకంగా ఉన్నారని పరోక్షంగా గుర్తు చేసింది.

ఆన్ లైన్ లో జరుగుతున్న ప్రచారం ఆచరణలో భౌతిక దాడులు జరగటానికి దారి తీస్తున్నాయి. ఆన్ లైన్ లో ఎక్స్ వేదిక పైన ఇమ్మిగ్రెంట్ల వ్యక్తిగత సమాచారాన్ని పోస్ట్ చేసి సౌత్ ఆసియన్లు వీసా ఫ్రాడ్ కు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. దరిమిలా వారి ఇండ్ల పైన దాడులు జరుగుతున్నాయి. ఇన్ఫ్లూయెన్సర్లు కొందరు నేరుగా సౌత్ ఆసియా ఇమిగ్రెంట్ల ఇండ్లకు వెళ్లి వారితో ఘర్షణ పడుతున్న వీడియోలను ఎక్స్ లో పోస్ట్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ని ఉపయోగించి సౌత్ ఆసియన్లు శుభ్రత లేని మురికివారుగా, లైంగిక దాడులు చేసే రాక్షసులుగా, సాంస్కృతికంగా వెనకబడ్డ వారుగా చిత్రీకరిస్తూ ఏఐ ఇమేజ్ లు తయారు చేసి పోస్ట్ చేస్తున్నారు.
ఈ తరహా పోస్ట్ లు భౌతిక దాడులుగా మారుతున్నాయి. జులై నెలలో ఉతా రాష్ట్రంలోని ఒక మాల్ లో పని చేస్తున్న ఇండియన్ ముస్లిం పైన జరిగిన దాడిలో ఓ వ్యక్తి అనేకసార్లు కత్తితో పొడిచాడు. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఈ ఘటనను హేట్ క్రైమ్ గా నిర్ధారించారు. సెప్టెంబర్ నెలలో ఒక సిక్కు డ్రైవర్ పైన వయోమింగ్ లో జరిగిన దాడిలో ఆయన 17 కత్తి పోట్లకు గురయ్యాడు. “ఆన్ లైన్ దాడులు, ఆఫ్ లైన్ దాడులు ఒకదానికొకటి ప్రోత్సాహకంగా పని చేస్తాయి” అని నివేదిక విశ్లేషించటం గమనార్హం. దాడులు సోషల్ మీడియా నుండి రోడ్లు, హోటళ్లు లాంటి భౌతిక ప్రదేశాలకు ప్రయాణిస్తున్నాయి. భౌతిక ప్రదేశాల్లో జరిగే దాడులు ఆన్ లైన్ లో ప్రచారం పొంది మరింత ద్వేషం పెరగడానికి దోహదం చేస్తున్నాయి.
ఇండియన్ అమెరికన్లకు ఇమిగ్రేషన్, ఉపాధి, జాతి (విద్వేషం), మరియు జనాభా పొందికలో మార్పులు ఈ అంశాలన్నీ ఒకదానినొకటి ప్రభావితం చేస్తూ ఒకదానిపై ఒకటి విస్తరిస్తూ సమస్యలను మరింత క్లిష్టం చేస్తున్నాయి. అమెరికా పని స్థలాలు, రాజకీయాలు, ప్రజా జీవనం మొదలైనవన్నీ భారతీయులు మరింత ప్రస్ఫుటంగా కనిపించేందుకు దోహదం చేస్తున్నాయి. దరిమిలా అమెరికా అన్నది ఇండియన్ అమెరికన్లకు డాలర్ డ్రీమ్ లు నెరవేర్చే స్వప్న తీరంగా కాకుండా జీవితాలను కంటక ప్రాయం చేస్తూ ప్రాణాలను సైతం హరించివేసే పీడ కలగా మారిపోయింది.
లొంగుబాటు విధానాలు
ఇండియాతో సహా ఇతర దక్షిణాసియా దేశాలు అనుసరిస్తున్న ఉపాధి విధానాలు, వాణిజ్య విధానాలు భారత ప్రజలకు ఇతర దేశాల ప్రజలకు వారి జీవితాలు తలకిందులు కావటానికి ప్రధాన చోదక శక్తిగా పని చేస్తుండటం ఒక వాస్తవం. చదువులు, ఉద్యోగాల కోసం వలస వెళ్లే వారు తరచుగా “ఇండియాలు అవకాశాలు అందుబాటులో ఉంటే సముద్రాలు దాటి అమెరికా, ఐరోపా దేశాలకు వెళ్లవలసిన అవసరం ఎందుకు ఉంటుంది?” అని ప్రశ్నిస్తారు. అది వాస్తవం కూడా.
భారత ఉపఖండంలో వనరులకు కొదవ లేదు. ప్రజా జీవనానికి, అనేకానేక ఖనిజ, జల, భూ వనరులకు నిలయం కనుకనే అనేక వేల యేళ్లుగా భారత ఉపఖండానికి తెరలు తెరలుగా వలసలు జరిగాయి. వలసలు లేని పక్షంలో భారత దేశం ప్రపంచంలో కెల్లా అత్యధిక సంఖ్యలో మానవులు నివసించే దేశంగా అవతరించేదా అన్నది అనుమానమే. మధ్య ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాల నుండి అలలు అలలుగా చరిత్ర పూర్వకాలం నుండి భారత ఉపఖండానికి ప్రజలు వలస రావటం ఒక చారిత్రక వాస్తవం.
మానవ వనరులు, ఖనిజ వనరులు, ఇతర సహజ వనరులు సమృద్ధిగా లభిస్తాయి కనుకనే మహమ్మదీయ రాజులు భారత ఉపఖండం పైకి దండెత్తి వచ్చారు. వారి తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ తో పాటు డచ్, పోర్చుగీసు, స్పానిష్ వర్తకులు తమ తమ వ్యాపార సంపదలను వృద్ధి చేసుకునే లక్ష్యంతో భారత ఉపఖండానికి వచ్చి ఇక్కడి రాజులతో వ్యాపారాలు నిర్వహించారు. ఆదిలో వ్యాపార వృద్ధి లక్ష్యంతో వచ్చినప్పటికీ క్రమంగా ఇక్కడ రాజుల అంతర్గత ఘర్షణలను ఉపయోగించుకుని క్రమంగా దేశాన్ని బ్రిటిష్ రాణి పాలన కిందకు తేవడంలో సఫలం అయ్యారు. ఆనాడు ఉన్నది వివిధ రాచరిక సంస్థానాలే తప్ప ఇండియా అన్న ఉమ్మడి భావన స్థానికులకు లేదు. కానీ ఈ ఫ్యూడల్ ప్రభువులు తమ అంతర్గత ఘర్షణల పరిష్కారానికి యూరోపియన్ల పై ఆధారపడి చివరికి ఉపఖండాన్ని బ్రిటిష్ పరం చేయటం వరకు లొంగుబాటు విధానాలను అనుసరించారు. భారత ఉపఖండాన్ని వివిధ సంస్థానాలుగా నియంత్రణలో ఉంచుకున్న ఫ్యూడల్ ప్రభువులు తమ లొంగుబాటు విధానాల ద్వారా చివరికి బ్రిటిష్ రాణికి దాస్యం చేసే పరిస్ధితికి ఉపఖండాన్ని దిగజార్చారు. రాచరిక ప్రభువులు బ్రిటిష్ వలస ప్రభువులకు జో హుకుం చెప్పి తమ సంపదలను కాపాడుకోగా, వారి పెత్తనాన్ని ప్రత్యక్షంగా మోస్తూ వచ్చిన రైతులు, శ్రామికులు, సామాన్యులు మాత్రం తిరుగుబాట్లకు పాల్పడి స్వతంత్ర పోరాటాలు నిర్మించారు.
అధికార మార్పిడి తర్వాత కూడా భారత ఉపఖండం లేదా సౌత్ ఆసియా దేశాల పాలకులు తమ లొంగుబాటు విధానాలను వదిలిపెట్టలేదు. కాంగ్రెస్ తో సహా వివిధ పార్టీల కింద ఆర్గనైజ్ అయిన గత కాలపు భూస్వామ్య పాలకవర్గాలు తాము కూడబెట్టిన సంపదలను బ్రిటిష్ ప్రాపకంలో పెట్టుబడులుగా మార్చి పరిశ్రమలు స్థాపించి నిర్వహించారు. ప్రభుత్వరంగ పరిశ్రమల ద్వారా భారతదేశ సహజ వనరులను తగిన మొత్తంలో ద్రవ్య వనరులుగా మార్చుకున్న తర్వాత, సదరు ద్రవ్య వనరులు పునాదిగా చేసుకుని, 1990 ల నాటి చమురు సంక్షోభం సాకుతో భారతదేశాన్ని విదేశీ పెట్టుబడులకు ఆట స్థలంగా మార్చివేశారు. మన్మోహన్ సింగ్, పి వి నరసింహారావు లు మంత్రసాని పని నిర్వహించిన “వ్యవస్థాగత సర్దుబాటు కార్యక్రమం” అనే యజ్ఞంలో భారతదేశ మానవ, ఖనిజ, సముద్ర, భూ వనరులను బలిగా అర్పించారు. తద్వారా తెల్లజాతి దేవతలను సంతృప్తి పరిచే కార్యక్రమంను కాంగ్రెస్ / యుపిఏ ప్రభుత్వం విజయవంతంగా ప్రారంభించగా మోడి, అమిత్ షా నేతృత్వం లోని ఎన్.డి.ఏ ప్రభుత్వం రెట్టించిన వేగంతో కొనసాగిస్తున్నది.
వ్యవస్థాగత సర్దుబాటు కార్యక్రమం ప్రధాన లక్ష్యం ఆర్ధిక సంక్షోభం ఊబిలో కూరుకుపోతున్న అమెరికా, పశ్చిమ సామ్రాజ్యవాద ఆర్ధిక వ్యవస్థను బైట పడవేయటమే. అయితే సాధారణ సామ్రాజ్యవాద ఆర్ధిక సంక్షోభం అన్నది పరిష్కారం అయ్యే సమస్య కాదు. భూమండలం లోని సమస్త వనరులను ద్రవ్య వనరులుగా మార్చినా సరే అమెరికా నాయకత్వం లోని పశ్చిమ సామ్రాజ్యవాద సంక్షోభం ఒక తీరానికి చేరే అవకాశం లేదు. ఎందుకంటే ఇది వాస్తవంగా పెట్టుబడిదారీ వ్యవస్థకు చెందిన స్వాభావిక సంక్షోభం. ఈ స్వాభావిక సంక్షోభానికి పరిష్కారం పెట్టుబడిదారీ వ్యవస్థ మనుగడను ప్రాపర్ గా ముగింపు పలకడం లోనే ఉంది. సంక్షోభాలకు నెలవు అయిన పెట్టుబడిదారీ వ్యవస్థను నిర్మూలించి సంక్షోభ రహిత దశ వైపుగా ప్రయాణం కట్టడమే ఇప్పటి సంక్షోభ సమస్యకు పరిష్కారం.
నిరంతరాయమైన ఆర్ధిక వృద్ధిని పెట్టుబడిదారీ వ్యవస్థ డిమాండ్ చేస్తుంది. నిరంతరాయమైన ముడిసరుకుల సరఫరా, అత్యంత చౌక ధరలకు మానవ శ్రమశక్తి సరఫరా, సంపదల కేంద్రీకరణ, ద్రవ్య వనరుల క్రానిక్ కేంద్రీకరణను పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద వ్యవస్థ డిమాండ్ చేస్తుంది. ఓ పక్క మానవ జీవనాన్ని సుఖమయం చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూనే దానిని అనుభవించవలసిన మానవ సామాన్యాన్ని వేతన బానిసత్వం లోకి నెట్టివేస్తుంది. ఈ క్రమంలో వ్యవస్థలను సర్వనాశనం చేస్తుంది.
మానవ జీవనాలను నాశనం చేసే యజ్ఞంలో స్థానిక కర్తలుగా భారత ఉపఖండం లోని పాలకవర్గాలు వ్యవహరిస్తున్నాయి. అందులో భాగంగానే భారత దేశ హిందూత్వ పాలకులు భారతదేశ సంపదలను అమెరికా సామ్రాజ్యవాదానికి ధారాదత్తం చేసే కృషిలో నిమగ్నమై ఉన్నారు. భారత దేశంలోని భారతీయుల ఉపాధిని బలహీన పరిచి, వేతనాలను అంతకంతకూ బలహీనం కావించి ఆర్ధిక వ్యవస్థను అమెరికా సామ్రాజ్యవాద వ్యవస్థకు బందీగా మార్చుతున్నారు హిందూత్వ పాలకులు. మూడు వ్యవసాయ చట్టాలు, నాలుగు లేబర్ కోడ్ లు మొదలైనవి భారత దేశ ఉపాధి వ్యవస్థను, ఉత్పత్తి వ్యవస్థను, ఉత్పాదక శక్తిని అమెరికా, పశ్చిమ సామ్రాజ్యవాద బహుళజాతి కంపెనీలకు ముడి వనరులుగా అప్పగిస్తున్నారు. బ్రిటిష్ రాణికి దేశాన్ని ముక్కలు ముక్కలుగా రిటైల్ అప్పగించిన ఫ్యూడల్ పాలకుల వారసులు ఇప్పుడు హిందూత్వ సెంటిమెంట్లను రెచ్చగొట్టే బూటకపు జాతీయ వాదులుగా అవతారం ఎత్తి దేశాన్ని హోల్ సెల్ గా అమెరికా, పశ్చిమ సామ్రాజ్యవాదులకు అప్పగించే పనిలో నిమగ్నం అయ్యారు.
ఈ లొంగుబాటు విధానాలలో భాగమైన నాలుగు లేబర్ కోడ్ ల ద్వారా భారత కార్మికుల హక్కులను కాలరాశారు. సంఘం పెట్టుకునే హక్కు, ఉమ్మడి బేరసారాల హక్కులు, ఆందోళన/సమ్మె చేసే హక్కు మొదలైన హక్కులు ఇప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్, క్యాప్ జెమిని, గూగుల్, ఇన్ఫోసిస్, టిసిఎస్ ఇత్యాది దేశీయ, విదేశీ ఐ.టి కంపెనీలలో లేవు. 8 గంటల పనిదినం ఆచరణ నుండి అదృశ్యం అయింది. ప్రతిఘటన ఏ మాత్రం లేని వాతావరణంలో పాలకులు విజయవంతంగా 12 గంటల పనిదినం, ఏడు రోజుల పనిదినం రావాలని బోధిస్తున్నారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి లాంటి వారు సిగ్గు ఎగ్గు లేకుండా 24 గంటల పనిదినాన్ని ప్రమోట్ చేస్తూ తాను విదేశీ బహుళజాతి కంపెనీల లాభాలకు విధేయుడిని తప్ప భారతీయుల సంక్షేమానికి విధేయుడిని కాదని చాటుతున్నాడు. ఆయన భార్య ఆయనకు మద్దతు ప్రకటిస్తూ అచ్చమైన భారతీయ గృహిణిగా తన ఉనికిని చాటుకుంటున్నారు.
దేశ ఉపాధి వ్యవస్థను ఉనికిలో నుండి రద్దు చేశాక భారతీయులు ఉపాధి కోసం ఎక్కడికి వెళ్ళాలి? వారికి రెండే రెండు మార్గాలు మిగిలి ఉన్నాయి. ఒకటి భారత పాలకులు ఏ విదేశీ బహుళజాతి కంపెనీలకైతే దేశ ఉపాధి వ్యవస్థను లేదా ఆర్ధిక వ్యవస్థను అప్పగించారో అక్కడికే వెళ్లి ఉపాధి వెతుక్కోవాలి. అనగా అమెరికన్ల ఛీత్కారాలను, యూరోపియన్ల నేరారోపణలను ఎదుర్కొంటూ, భరిస్తూ కుక్కిన పేనుల్లాగా అక్కడే ఏదో ఒక ఉపాధి వెతుక్కుని కలో గంజో తాగి బతుకుతూ జీవితాల్ని నెట్టుకు రావాలి.
రెండవది దేశంలోని ఉపాధి వ్యవస్థను పునరుద్ధరించుకోవటం. అనగా భారత ఆర్ధిక వ్యవస్థ తన సొంత కాళ్లపై నిలబెట్టే పనిని ప్రజలే స్వయంగా నిర్వహించాలి. దేశ వనరులు విదేశీ కంపెనీల పరం కాకుండా కాపాడుకోవాలి. దేశంలోపలి ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా పరిశోధన మరియు అభివృద్ధి (రీసర్చ్ అండ్ డవలప్మెంట్) రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దేశీయ ఉత్పాదక రంగాన్ని నిలబెట్టాలి. ప్రభుత్వ పరిశ్రమలతో పాటు వాటికి అనుబంధంగా లక్షలాది మధ్య, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలి. ఈ పనులు సాధించాలంటే మొదట భారత పాలకవర్గాలే మొదటి ఆటంకంగా ఎదురు నిలుస్తారు. వారికి మద్దతుగా విదేశీ బహుళజాతి కంపెనీలు తమ అశేష ద్రవ్య వనరులతో భారతీయుల ప్రతిఘటనను కొనివేయటానికి ముందుకొస్తారు. ఈ ఆటంకాలను అధిగమించి భారతదేశ స్వతంత్రాన్ని, స్వావలంబనను పునఃస్థాపించే బృహత్తర కర్తవ్యం భారతదేశ ప్రజలపైనే ఉన్నది.

