
భారత దేశ ప్రధాన మంత్రి మిత్రుడు గౌతమ్ అదాని మరొకసారి దేశంలో అత్యధిక సంపన్నుడుగా గౌతమ్ అదాని అవతరించాడు. గత సంవత్సరం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ స్థానంలో ఉండగా గౌతమ్ అదాని ఆయన్ని వెనక్కి నెట్టి అగ్ర స్థానం అధిస్టించాడు.
గత సంవత్సరం కంటే 13 శాతం అధికంగా సంపదలు ఆర్జించిన గౌతమ్ అదాని 9.23 లక్షల కోట్ల రూపాయలతో ధనికులలో కెల్లా ధనికుడుగా స్థానం సంపాదించాడు. ఇది అమెరికన్ డాలర్లలో 96 బిలియన్ డాలర్లకు సమానం. (ఒక బిలియన్ 100 కోట్లకు సమానం).
పదిహేనేళ్ల క్రితమే యాపిల్ కంపెనీ అధినేత స్టీవ్ జాబ్స్ వద్ద కేవలం డబ్బు (క్యాష్) వరకే 90 బిలియన్ డాలర్లు ఉన్న సంగతి గుర్తు చేసుకుంటే ప్రపంచ ధనికుల్లో భారత దేశ అత్యధిక ధనికుడి సంపద ఎంత చిన్న మొత్తమో అర్ధం చేసుకోవచ్చు. ఈ 90 బిలియన్ డాలర్లు కేవలం క్యాష్ మాత్రమే. అది స్టీవ్ జాబ్స్ సంపద మొత్తం విలువ కాదు.
ముఖేష్ అంబానీ సంపద గత యేడు కంటే 10 శాతం తగ్గిపోయి 8.63 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. ఇది దాదాపు 90 బిలియన్ డాలర్లకు సమానం. అంటే అదాని ఇప్పుడు అంబానీ కంటే రు 54,000 కోట్ల రూపాయలు అధిక సంపద కలిగి ఉన్నాడు. ఐతే అదాని కేవలం ఒక రాజకీయ ప్రముఖుడికి కేవలం బినామీ మాత్రమే అన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అందులో నిజానిజాలు మనకు తెలిసే అవకాశం లేదు.
M3M హురున్ ఇండియా విడుదల చేసిన ఇండియా సంపన్నుల జాబితా ఈ వివరాలు వెల్లడించింది. హురున్ సంస్థ ఒక పరిశోధన, సర్వే సంస్థ కాగా M3M, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. ఈ రెండు కలిసి ప్రతి యేటా భారత సంపన్నుల జాబితాను వెలువరిస్తాయి.
ఇండియాలో కనీసం రు 1,000 కోట్ల కు మించి సంపద కలిగిన భారతీయుల జాబితాను M3M హురున్ తయారు చేస్తుంది. ఈ సంవత్సరం ఇండియాలో 1,810 మంది వ్యక్తులు వెయ్యి కోట్లకు మించి ఆస్తులు కలిగి ఉన్నారని జాబితా వెల్లడి చేసింది. ఈ 1,810 సంపన్నుల మొత్తం సంపద రు 187.5 లక్షల కోట్లుగా తేలింది. వీరి సంపద గత యేడు కంటే 12.8 శాతం పెరిగిందట. అమెరికన్ డాలర్లలో వీరి సంపద 1.96 ట్రిలియన్ డాలర్లకు సమానం. అంటే ఇండియా జిడిపిలో సగం మొత్తాన్ని సొంత ఆస్తిగా వీళ్లు కలిగి ఉన్నారు.
2026లో భారతదేశ జనాభా 148 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే భారత జనాభాలో 0.00012 శాతం మాత్రమే ఉన్న వ్యక్తుల చేతుల్లో ప్రస్తుత ఇండియా జిడిపిలో సగానికి సమానమైన 187.5 లక్షల కోట్ల రూపాయల సంపద కేంద్రీకృతం అయి ఉందన్నమాట! పోలిక కోసం చూస్తే ఇండియా జనాభాలో కింద భాగాన ఉన్న 50 శాతం జనాభా, ఇండియా సంపదలో కేవలం 6.4 శాతం మాత్రమే సొంతం చేసుకుని ఉండగా అగ్ర భాగాన ఉన్న 1 శాతం ధనికుల్లో ఇండియా సంపదలో ఏకంగా 40 శాతం భాగాన్ని సొంతం చేసుకుని ఉన్నారు.
బిజెపి పాలనలో, మన్మోహన్-పి.వి.నరసింహారావు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన ఆర్ధిక విధానాలను అనేక రెట్లు వేగంతో అమలు చేస్తున్న ఫలితంగా దేశ సంపద, ఆదాయం అతి కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కావటం అత్యంత వేగంగా పెరిగిపోయింది అనటానికి ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.
ఇండియా జిడిపి ప్రపంచంలోకెల్లా వేగంగా వృద్ధి చెందుతోందని ప్రధాన మంత్రి, ఇతర మంత్రులతో పాటు బిజెపి పార్టీ తరచుగా చెప్పుకుంటారు. వాళ్ళు చెప్పని విషయం ఏమిటంటే దేశంలో ఆదాయ అంతరాలు గతం కంటే తీవ్రంగా పెరిగాయని. అంటే పేదలు మరింత పేదలుగా నిష్ట దరిద్రులుగా మారుతుంటే ధనికులు మరింత సంపన్నులుగా మారుతున్నారు.
ఆర్సిలర్ మిట్టల్ కంపెనీ అధినేత ఎల్ ఎన్ మిట్టల్ రు 3.39 లక్షల కోట్లతో 3వ స్థానం, వేదాంత రిసోర్సెస్ కంపెనీ అధినేత అనిల్ అగర్వాల్ రు 2.08 లక్షల కోట్లతో 9వ స్థానం ఆక్రమించారని M3M హురున్ జాబితా ప్రకటించింది. కానీ వీరిద్దరు వాస్తవంగా బ్రిటన్ పౌరులు. బహుశా వీళ్ళకు ఇండియా పౌరసత్వం కూడా ఉండి ఉంటుంది.
వెయ్యి కోట్లు పై బడిన సంపద కలిగి ఉన్న భారతీయులలో మహిళా సంపన్నులు 131 మంది ఉన్నారట. వీరి సంఖ్య గత యేడు 100 ఉంటే ఈ యేడు 131 కు పెరిగింది. రోష్ని నాడార్ మల్హోత్రా రు 2.79 కోట్లతో అత్యధిక మహిళా సంపన్నురాలు. మొత్తం జాబితాలో ఈమెది 5వ స్థానం.


