
–
ఎస్ఐఆర్ జరిగిన ఇతర రాష్ట్రాల్లో చేసినట్టే బిజెపి కార్యకర్తలు తెలంగాణ రాష్ట్రంలో కూడా చేస్తున్నారు. ఫారం 7 ఫారంలను పెద్ద మొత్తంలో ఎన్నికల కమిషన్ కు సమర్పించటం ద్వారా ముస్లిం వోటర్ల వోట్లు తొలగించటానికి బిజెపి పధక రచన చేసి అమలు చేస్తున్నట్లు బూత్ లెవల్ అధికారుల ద్వారానే వెల్లడి అయింది. దానితో ముస్లిం ప్రజల వోట్లను వోటర్ల జాబితా నుండి తొలగించటానికి బిజెపి దేశవ్యాపితంగా కృషి చేస్తున్నట్టు మరోసారి వెల్లడి అయింది.
వోటర్ల జాబితాలో పొరపాటున గానీ లేదా అక్రమంగా గానీ చోటు సంపాదించిన పేర్లను తొలగించేందుకు ఫారం 7 లను నింపి ఎన్నికల కమిషన్ కు సమర్పించాల్సి ఉంటుంది. ఒక వోటర్ నివసించే చుట్టు పక్కల నివసించే వారు, ఇరుగు పొరుగు వాళ్లు ఎవరైనా ఒక వ్యక్తి పేరు వోటర్ జాబితా లో అక్రమంగా గానీ, పొరబాటున గానీ ఉన్నదని భావిస్తే ఆ సంగతి ఎలక్షన్ కమిషన్ కు ఫారం 7 ద్వారా చెప్పటానికి కమిషన్ ఇతరులకు అవకాశం కల్పిచింది.
ఇలా అక్రమ వోట్లను తొలగించే అవకాశం బూత్ లెవల్ ఏజెంట్ (బిఎల్ఏ) లకు కమిషన్ ఇచ్చింది. అయితే బూత్ లెవల్ ఏజెంట్లు తమ ఇస్టానుసారం వోట్ల తొలగింపుకు పాల్పడకుండా ఫారం 7 సంఖ్య పైన పరిమితి విధించారు. ఒక్కో బిఎల్ఏ రోజుకు 10 కి మించి ఫారం 7 లను కమిషన్ కు సమర్పించటానికి వీలు లేదు. వోట్ల తొలగింపుకు ముఖ్యంగా బిజెపి కి వోటు వేయరు అని భావించిన ముస్లిం మరియు ఇతర వోటర్ల వోట్లను జాబితా నుండి తొలగించేందుకు బిజెపి కి చెందిన బిఎల్ఏ లు పెద్ద మొత్తంలో ఫారం 7 లు నింపి కమిషన్ కు ఇచ్చిన సంగతి గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా వెల్లడి చేశాడు. కర్ణాటకలో ఈ అక్రమాలకు బిజెపి బిఎల్ఏ లు పాల్పడ్డ సంగతి కాంగ్రెస్ బృందం చేసిన పరిశోధనలో వెల్లడి అయిందని రాహుల్ గాంధీ గతంలో వివరించాడు.
ఈ అక్రమ చర్యకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ముస్లింలు ఎక్కువగా నివసించే మూడు హైదారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిజెపి కి చెందిన బిఎల్ఏ లు పాల్పడ్డారని వెల్లడి అయింది. ముషీరాబాద్, గోషా మహల్, బహదూర్ పురా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బిజెపి బిఎల్ఏ లు పెద్ద మొత్తంలో ఫారం 7 పత్రాలను కమిషన్ ఎన్నికల కమిషన్ నియమించిన బూత్ లెవల్ ఆఫీసర్ లకు సమర్పించారు. ఒకే రోజు 31 ఫారం 7 పత్రాలను ఒక బిజెపి బిఎల్ఏ ఇచ్చిన ఘటన వీడియో ద్వారా కొన్ని రోజుల క్రితం వెల్లడి అయింది. ఒకే రోజు 31 పత్రాలను ఏక మొత్తంగా సమర్పిస్తే వాటిని స్వీకరించవద్దని తమకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయంటూ వాటిని తీసుకోవటానికి బిఎల్ఓ నిరాకరించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడింది.
సదరు వోటర్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన వోటర్లుగా ఆ పార్టీ గుర్తించింది. వీడియో పోస్ట్ అయ్యే వరకు బిజెపి బిఎల్ఏ ల అక్రమ చర్యల గురించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కూడా తెలియక పోవటం గమనార్హం. వెబ్ పత్రిక ద వైర్ డాట్ ఇన్, ఇలా కమిషన్ దృష్టికి వచ్చిన 31 ఫారం 7 పత్రాల ఫోటోలను ప్రచురించింది. ఫారం 7 పత్రాలను సమర్పించే గడువు ప్రారంభం అయ్యాక సెప్టెంబర్ 29 తేదీన బిజెపి కి చెందిన బిఎల్ఏ అయిన బాల చందర్ ఈ పత్రాలను ముషీరాబాద్ నియోజకవర్గం ఎన్నికల అధికారులకు సమర్పించాడు.
బిఎల్ఏ శివేగి బాల చందర్, 31 ఫారం 7 పత్రాలను తమకు సమర్పించిన విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి (డిఈఓ), మరియు గ్రేటర్ హైదారాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ కూడా అయిన ఆర్ అవి కర్ణన్ ధృవీకరించాడని ద వైర్ పత్రిక తెలిపింది. సదరు బిఎల్ఏ పైన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశాడు.
బాల చందర్ ఇతర వోటర్లతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్ అయిన షర్ఫుద్దీన్ కుటుంబం లోని 7 గురు వోట్లను తొలగించాలని కోరుతూ సెప్టెంబర్ 29 తేదీన ఏడు ఫారం 7 పత్రాలను సమర్పించాడని ఎన్నికల అధికారి చెప్పాడు. షర్ఫుద్దీన్ కుటుంబం తమ నివాసాన్ని ఖాళీ చేసి వేరే చోటికి తరలి పోయిందని కారణం చెబుతూ వారి వోట్లను ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తొలగించాలని బాలచందర్ ఫారం 7 పత్రాల ద్వారా కోరాడు.
ఇదే తరహాలో గుండు గుత్తగా ఫారం 7 పత్రాలను బహదూర్ పురా అసెంబ్లీ నియోజకవర్గంలో అక్టోబర్ 1 తేదీన సమర్పించబడ్డాయి. రెండు రోజుల తర్వాత గోషా మహల్ నియోజకవర్గంలో వోటు తొలగింపు పత్రాలు ఇవ్వబడ్డాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఫారం 7 పత్రాలు నింపిన బాలచందర్ తన వివరాలు కూడా ఇచ్చి సంతకం చేశాడు. కానీ బహదూర్ పురా, గోషామహల్ నియోజకవర్గాల్లో ఫారం 7 దరఖాస్తుదారులు సంతకం చేయకుండా పేరు ఇవ్వకుండా పత్రాలు సమర్పించారు.
ఎలా బైట పడింది?
షర్ఫుద్దీన్ కుటుంబంలోని 7 వోట్లను తొలగించాలని ఫారం 7 పత్రాలు అందుకున్నాక అక్కడి బూత్ లెవల్ అధికారి (బిఎల్ఓ) విచారణ చేయటానికి షర్ఫుద్దీన్ కుటుంబం నివశిస్తున్న ఇంటికి (ముషీరాబాద్ లోని హనుమాన్ టెంపుల్ ఎదురు ఇల్లు) వెళ్ళాడు. తీరా చూస్తే షర్ఫుద్దీన్ కుటుంబం నిక్షేపంగా అక్కడే నివసిస్తున్నట్టు తేలిపోయింది. దానితో వోటర్ల తొలగింపుకు కుట్ర జరిగిందని బిఎల్ఓ కి అర్ధమయింది. వెంటనే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మరియు కమిషనర్ అయిన కర్ణన్ కు సమాచారం అందించాడు. ఆయన నియోజకవర్గ ఇఆర్ఓ (ఎలక్తోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) ను అప్రమత్తం చేశాడు. ప్రాధమిక విచారణ జరపాలని ఆదేశించాడు.
ప్రాధమిక విచారణ జరిగాక, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టార్స్ రూల్స్ 1960, రూల్ 20 కింద రెగ్యులర్ ఎంక్వైరీకి జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించాడు. ఆ తర్వాత దశలో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1980, సెక్షన్ 31 ప్రకారం అక్రమానికి పాల్పడిన బాల చందర్ ను ప్రాసిక్యూట్ చేస్తారు. ఉద్దేశపూర్వకంగా లిఖిత ప్రకటన ద్వారా ఎన్నికల జాబితా విషయంలో తప్పుడు ప్రకటన ఇచ్చినందుకు గాను ఆయనను శిక్షిస్తారు.
నిజానికి వోటర్లను వోటర్ జాబితా నుండి తొలగించాలని కోరుతూ తమ వద్దకు వచ్చిన ప్రతి ఒక్క ఫారం 7 పత్రం పైనా వోటర్ రిజిస్ట్రేషన్ అధికారులు, వోటర్ నమోదు చట్టం 20 వ నిబంధన ప్రకారం పూర్తి స్థాయి విచారణ జరపాలి.
పశ్చిమ బెంగాల్ లో 90 లక్షల మంది వోటర్ల పేర్లను జాబితా నుండి తొలగించగా అందులో సుప్రీం కోర్టు నియమించిన ట్రిబ్యునల్స్ కు తమ వోటు హక్కు తొలగించినందుకు వ్యతిరేకంగా లేదా వోటర్ల జాబితాలో పేరు చేర్చినందుకు వ్యతిరేకంగా 38 లక్షల మంది పిటిషన్లు సమర్పించారు. వారిలో 22 లక్షల మంది వోటర్లు స్వయంగా ఓటు హక్కు పునరుద్ధరించాలని పిటిషన్లు దాఖలు చేయగా వోటర్ జాబితాలో ఉన్న పేర్లను తొలగించాలని కోరుతూ స్వయంగా ఎన్నికల కమిషన్ 16 లక్షల పిటిషన్లు దాఖలు చేసింది. అర్హత కలిగిన ప్రతి వోటర్ కు వోటు హక్కు కల్పించే బాధ్యత కలిగిన కేంద్ర ఎన్నికల కమిషన్ తనకు అప్పగించిన మ్యాండేట్ కు బదులు 16 లక్షల వోటర్లను జాబితా నుండి తొలగించాలని పిటిషన్ వేయటం విశేషం. వోటర్ల తరపున లేదా ప్రజల తరపున ఇలా 16 లక్షల పిటిషన్లను ఎన్నికల కమిషన్ దాఖలు చేయటానికి ఎన్నికల కమిషన్ లో ఏ అధికారి ఆదేశాలు ఇచ్చాడని కేంద్ర ఎన్నికల కమిషన్ లోని ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ప్రశ్నిస్తూ అభ్యంతరం నమోదు చేశారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక సెప్టెంబర్ 23 తేదీన వెల్లడి చేసిన సంగతి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.
కాంగ్రెస్ ఫిర్యాదు
ఏకంగా తమ పార్టీ బిఎల్ఏ కుటుంబం వోట్లనే తొలగించాలని ఫారం 7 పత్రాలు ఇచ్చిన బిజెపి కార్యకర్తలకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల సెల్, హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ వి సి సజ్జన్నార్ కు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై సమగ్ర విచారణకు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం (ఎస్ఐటి) నియమించాలని ఆ పార్టీ కోరింది. కాంగ్రెస్ సానుభూతిపరుల వోటర్లను తొలగించేందుకు బిజెపి కుట్ర పన్నిందని, కమిషన్ వద్ద ఖాళీ ఫారం 7 లను తీసుకుని నింప వలసి ఉండగా, ముందుగానే నింపబడి ప్రింట్ చేసిన ఫారం 7 పత్రాలను గుండు గుత్తగా వాళ్ళు ఇచ్చారని ఫిర్యాదు చేసింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రావు ని అక్రమ చర్యలకు గాను విచారించాలని కోరింది. బిజెపి అధ్యక్షుడు మాత్రం తమ కార్యకర్తలు ఎవరూ ఫారం 7 పత్రాలు ఇవ్వలేదని, దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపణలను తిరస్కరించాడు.

కాగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (చీఫ్ ఎలక్టోరియల్ ఆఫీసర్ -సి.ఇ.ఓ) సి సుదర్శన్ రెడ్డి కమిషనర్ కర్ణన్ కు, ఇతర డిఇఓ లకు మెమో జారీ చేశాడు. ఇఆర్ఓ లు అందరికీ తప్పుడు ఫారం 6, 6A, 7, లేదా 8 పత్రాలు ఇచ్చిన వారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలని మెమో లో కోరాడు. ఫారం 7 పత్రాలు ఇచ్చినంత మాత్రాన వారి వోట్లను కమిషన్ తొలగించబోదని విలేఖరుల సమావేశం పెట్టి సిఇఓ సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చాడు. చట్టం అందుకు అనుమతించదని తెలిపాడు.


