
–
చీఫ్ ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ చెప్పిన పచ్చి అబద్ధాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, జస్టిస్ సూర్య కాంత్, ఈ రోజు కోర్టులో వెల్లడి చేశాడు. ఫారం 6 లో తాము చేసిన మార్పులను సుప్రీం కోర్టు ఆమోదించిందని చీఫ్ ఎన్నికల కమిషనర్ చెప్పటంలో నిజం లేదని జస్టిస్ సూర్యకాంత్ ఈ రోజు కేసు విచారణ సణ్దర్భంగా స్పష్టం చేశాడు. ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ లోని తతిమా ఇద్దరు సభ్యులకు చెప్పకుండా ఫారం 6 లో మార్పులు చేయటంతో పాటు అనేక నిర్ణయాలను సొంతంగా తీసుకుని రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన చీఫ్ ఎన్నికల కమిషనర్ ను పదవి నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన కేసును ఈ రోజు చీఫ్ జస్టిస్ నేతృత్వం లోని ధర్మాసనం విచారిస్తూ ఈ సంగతి వెల్లడి చేసింది.
ఫారం 6 అన్నది కొత్తగా వోటు హక్కు పొందే వయసు వచ్చిన యువకులు వోటు హక్కు కోరుతూ దాఖలు చేసే దరఖాస్తు ఫారం. బీహార్, అనంతరం ఢిల్లీ రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ (ఎస్ఐఆర్) జరుపుతున్న సందర్భంగా కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో ఉంచిన ఫారం 6 లో మార్పులు చేశారు. 2002 లో జరిగిన ఎస్.ఐ.ఆర్ అనంతరం విడుదల అయిన జాబితాలో దరఖాస్తుదారు తల్లి/తండ్రి పేర్లు ఉన్నాయా లేదా అన్న ప్రశ్నను ఫారం 6 లో అదనంగా చేర్చారు.
ఫారం 6 లో ఇలా చిత్తం వచ్చిన రీతిలో మార్పులు చేయటానికి చట్టం అనుమతించదని, కేవలం కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేస్తే తప్ప ఈ మార్పు చేయటానికి వీలు లేదని కమిషన్ లోని ఇతర ఇద్దరు సభ్యులు తమ అభ్యంతరం నమోదు చేశారు. ఈ మార్పు “చట్ట విరుద్ధం, అనధికారికం” అని వారు తమ అభ్యంతరంగా నమోదు చేసిన సంగతిని సెప్టెంబర్ 23 తేదీన ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక ప్రచురించిన పరిశోధనాత్మక కధనంలో వెల్లడి చేసింది.
2002 నాటి ఎస్ఐఆర్ అనంతర జాబితాలో తల్లి/తండ్రి పేరు ఉన్నట్టయితే ఆ మేరకు ధృవీకరణ పత్రం జత చేయాలన్న మార్పుని కూడా ఎన్నికల కమిషన్ చేసింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ పరిశోధన ప్రచురించ బడ్డాక, ఎస్ఐఆర్ ముగిసిన రాష్ట్రాలలో కొత్త దరఖాస్తుదారులు ఈ ధృవీకరణ పత్రం జత చేయాల్సిన అవసరం లేదని ఎన్నికల కమిషన్ తాజాగా ప్రకటన చేసింది. ఈ ప్రకటన ద్వారా తాము చేసిన చట్ట విరుద్ధమైన మార్పుల నేరం ఏ విధంగా కప్పి పుచ్చబడుతుందని చీఫ్ ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ భావించాడో తెలియదు. అసలు ఫారం 6 లో ప్రభుత్వ అనుమతి లేకుండా మార్పులు చేయటమే చట్ట వ్యతిరేక నేరం అని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు చెబుతుంటే, ఎస్ఐఆర్ ఇంకా పూర్తి కాని, జరపని రాష్ట్రాలకు ఆ మార్పుని కొనసాగించటం అంటే తన నేరాన్ని ఆయన కొనసాగించటమే!
“ఫారం 6 లో చేసిన ఏ విధమైన మార్పులను/సవరణలను కూడా సుప్రీం కోర్టు ఆమోదించింది అనటంలో నిజం లేదు” అని చీఫ్ జస్టిస్, జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. ఫారం 6 లో మార్పులను ఎవరు చేశారో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం ఎన్నికల కమిషన్ ను కోరుతూ నోటీసు జారీ చేసింది.
సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లలో ఒకటి “చీఫ్ ఎన్నికల కమిషనర్ ఉద్దేశ్యపూర్వకంగా ఎన్నికల జాబితాలో మార్పులు చేశారని, ఆయన తెచ్చిన మార్పులకు ఎలాంటి చట్టబద్ధమైన ఆమోదం గాని ఆయన విధులలో సంబంధం గానీ లేదని ఆరోపించింది. ఆయన చేపట్టిన చర్య పూర్తిగా చట్టబద్ధంగా ఆయనకు సంక్రమించవలసిన ఇమ్యూనిటీ (నేర విచారణ నుండి మినహాయింపు) వర్తించదని, ఈ చర్య ద్వారా నేర విచారణను ఆయన ఎదుర్కోవాలని పిటిషన్ కోరింది. మరో పిటిషన్, చీఫ్ కమిషనర్ పాల్పడిన నేరానికి గాను ఆయనను విధుల నుండి వెంటనే సస్పెండ్ చేయాలని కోరింది. అయితే సస్పెన్షన్ డిమాండ్ ను సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది. విచారణ జరపకుండా పత్రికల వార్తలపై ఆధారపడి సస్పెండ్ చేయలేమని చెప్పింది.
ఏమిటి ఈ ఫారం 6?
ఫారం 6 అనేది భారత ప్రభుత్వం 1960లో చేసిన ఎన్నికల చట్టం ద్వారా రూపొందించబడిన వోటు దరఖాస్తు పత్రం. కొత్తగా 18 సం.లు నిండిన (1960లో 21 సం.లు) వోటర్లు గానీ లేదా కొత్తగా భారత పౌరసత్వం పొందిన వోటర్లు గానీ లేదా వోటర్ల జాబితా నుండి తొలగించబడి మళ్ళీ కొత్తగా వోటు హక్కు కోరుతున్న వారు గానీ ఫారం 6 పత్రాన్ని నింపి ఎన్నికల కమిషన్ కు సమర్పించాలి. తాము ఏ కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నామో వారి EPIC (ఎలక్తార్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ – వోటు హక్కు గుర్తింపు కార్డు) నెంబర్ ను ఇవ్వాలని ఈ పత్రం దరఖాస్తు దారులను కోరుతుంది.

–
కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ECINET వెబ్ సైట్ లో ఉంచిన ఈ ఫారం 6 లో పైన చెప్పిన ప్రశ్న వద్ద కొత్త డిక్లరేషన్ ను ఇరికించారని జులై 12 తేదీన ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక వెల్లడి చేసింది. గత ఎస్ఐఆర్ కు సంబంధించిన ప్రశ్నలను ఈ మార్పుల ద్వారా ఫారం 6 లో జత చేర్చారు. ఈ మార్పు ద్వారా 3 వాక్యాలను దరఖాస్తు దారుల ముందు ఉంచి వాటిలో ఒకటి ఎంచుకోవాలని కోరారు.
- 2000 ఆరంభంలో జరిపిన ఎస్ఐఆర్ ఎన్నికల జాబితాలో మీ పేరు ఉన్నది?
- మీ తల్లిదండ్రుల పేర్లు లేదా తాత/నాయనమ్మ పేర్లు ఆ జాబితాలో ఉన్నాయి?
- తల్లి/తండ్రి పేర్లు గానీ తాతయ్య/నాయనమ్మ పేర్లు… వీరిలో ఎవరి పేరూ అప్పటి జాబితాలో లేవు?
ఒక వేళ 2000ల నాటి ఎస్ఐఆర్ లో వారి పేరు ఉంటే గనక అసెంబ్లీ నియోజకవర్గం నంబరు, పోలింగ్ బూత్ నంబరు (దీనిని పార్ట్ నంబర్ అని కూడా అంటారు) తల్లి లేదా తండ్రి ఎస్ఐఆర్ జాబితా లోని ఏ సీరియల్ నంబర్ లో నమోదై ఉన్నారో వెల్లడి చేయాలని కోరే ప్రశ్నను ఫారం 6 పత్రంలో కొత్తగా చేర్చారు. ఆన్ లైన్ లో ఈ ఫారం నింపేటప్పుడు కొత్తగా చేర్చిన ఎస్ఐఆర్ ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోతే కర్సర్ ముందుకు కదల లేదని గోవా లోని ERO (నియోజకవర్గ ఎన్నికల అధికారి) రాష్ట్ర ఎన్నికల అధికారికి కనీసం 7 సార్లు ఫిర్యాదు చేసినా రాష్ట్ర కమిషన్ నుండి గానీ, కేంద్ర కమిషన్ నుండి గానీ ఎలాంటి బదులు రాలేదని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక సెప్టెంబర్ 23 తేదీన వెల్లడి చేయటం గమనార్హం.
మార్పులు/సవరణలు ఎందుకు చట్ట విరుద్ధం?
కేంద్ర ఎన్నికల కమిషన్ లోని ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖబీర్ సింగ్ సంధు, వివేక్ జోషి లు ఈ సవరణలను వ్యతిరేకిస్తూ, తమ అభ్యంతరాలను అధికారికంగా నమోదు చేశారు. అలాగే తమతో సంప్రదించకుండా, ఎలాంటి చర్చలు జరపకుండా, తమకు తెలియజేయకుండా చీఫ్ ఎన్నికల కమిషనర్ 10 నెలల వ్యవధిలో 14 సార్లు చేసిన నిర్ణయాలను ఎన్నికల కమిషనర్లు సంధు, జోషి లు వ్యతిరేకిస్తూ అధికారికంగా అభ్యంతరాలను నమోదు చేశారు. ఈ మార్పులన్నీ జాతీయ స్థాయిలో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించినవే కావటం గమనించ వలసిన విషయం.
ECINET వెబ్ సైట్ లో ఫారం 6 లో చేసిన మార్పుల పైన స్పందిస్తూ, ఆగస్టు 13 తేదీన ఎన్నికల కమిషనర్ సుఖబీర్ సింగ్ సంధు “ఈ సవరణలు చట్ట విరుద్ధం, అనధికారికం. కనుక వెంటనే ఆ సవరణలను తొలగించాలి. ఈ సవరణ ద్వారా యువ ఫస్ట్ టైమ్ వోటర్లను ఇబ్బంది పెట్టడం సరైనది కాదు” అని తన అభ్యంతరాన్ని చీఫ్ ఎన్నికల కమిషనర్ కు చెబుతూ నమోదు చేశాడు. అయినా కూడా చీఫ్ ఎన్నికల కమిషనర్ తన తప్పును యధావిధిగా కొనసాగించాడు.
నిజానికి ఫారం 6 లో చేర్చిన డిక్లరేషన్ ను “రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్తార్స్ రూల్స్ 1960” చట్టాన్ని సవరించకుండా చేర్చటానికి వీలు లేదని ఇద్దరు కమిషనర్లు సంధు, జోషి లు మే 15 తేదీనే అభ్యంతరాలను నమోదు చేశారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పరిశోధనలో వెల్లడి అయింది. కేంద్ర ప్రభుత్వం 1960 చట్టాన్ని సవరించి, ఎన్నికల కమిషన్ తో సంప్రదించి అనంతరం నోటిఫై చేయాలని అప్పటి వరకు సవరణలు చేయకూడదని వారిద్దరు అభ్యంతరం చెప్పినప్పటికి సిఈసి వినలేదు.
ప్రజా ప్రతినిధ్య చట్టం 1950 ప్రకారం కేంద్ర ప్రభుత్వం మాత్రమే వోటర్ల నమోదు, వోటర్ల తొలగింపు, ఫారం లలో సవరణలు చేయగలదు. ఇంకెవరికీ ఆ అధికారం లేదు. ఎస్ఐఆర్ పూర్తయిన రాష్ట్రాలకు ఎస్ఐఆర్ డిక్లరేషన్ తొలగించామని సెప్టెంబర్ 26 తేదీన ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎస్ఐఆర్ జరుగుతున్న, మరియు ఇంకా జరగని రాష్ట్రాలకు డిక్లరేషన్ కొనసాగుతున్నది. అలాగే పాత ఎస్ఐఆర్ కు సంబంధించిన ప్రశ్న కూడా కొనసాగుతున్నది.
సెప్టెంబర్ 26 తేదీన ఎన్నికల కమిషన్ చేసిన ప్రకటనలో “సుప్రీం కోర్టు ఎస్ఐఆర్ డిక్లరేషన్ పత్రం చేర్పును ఆమోదించింది” అని పేర్కొన్నది. ఎస్ఐఆర్ పై నమోదైన కేసులను విచారిస్తూ సుప్రీం కోర్టు ధర్మాసనం మే 27 తేదీన తన ఆదేశాలను విడుదల చేసింది. కానీ అందులో ఎస్ఐఆర్ డిక్లరేషన్ కు సంబంధించి ఎలాంటి ఆదేశాలు చోటు చేసుకోలేదు. సదరు ఎస్ఐఆర్ ప్రశ్నలను, డిక్లరేషన్ ను ఫారం 6 లో ఎవరు చేర్చారో కూడా కమిషన్ ప్రకటన చెప్పలేదు. కమిషనర్ సంధు దానిని ‘చట్ట విరుద్ధం. అనధికారికం’ అని ప్రకటించాక కూడా ఆ ప్రశ్న ఎందుకు కొనసాగించారో వివరణ ఇవ్వలేదు.
చట్టం చెప్పేదేమిటి?
దేశంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో అయినా సరే సాధారణ నివాసులు అయి ఉన్న వయోజనులు అందరూ, మరే ఇతర కారణాల వల్లనైనా అనర్హులు అయితే తప్ప, వోటర్ గా నమోదు అయే హక్కు కలిగి ఉంటారని రాజ్యాంగం లోని ఆర్టికల్ 326 గ్యారంటీ ఇచ్చింది. ‘ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950’ చట్టం, ఎన్నికల నిర్వహణకు మరియు వోటర్లను రిజిస్టర్ చేయటానికి సంబంధించిన నిబంధనలు రూపొందించటానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు కల్పించింది.
ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 లోని సెక్షన్ 28 “నిబంధనలను రూపొందించే అధికారం” గురించి ఇలా చెబుతుంది: ఈ చట్టం అమలు చేయటానికి వీలుగా అధికారిక గజెట్ లో నోటివీకేషన్ ద్వారా ఎన్నికల కమిషన్ తో సంప్రదింపులు జరిపిన తర్వాత, తగిన నిబంధనలు కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుంది”. అలాగే “ఈ చట్టం కింద చేసే ప్రతి నిబంధన రోపొందించ బడిన వెంటనే (వీలైనంత త్వరలో) దానిని పార్లమెంటు లోని ఉభయ సభ్యుల ముందు ఉంచాలి” అని చట్టం పేర్కొన్నది.
కనుక ఫారం 6 అన్నది ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్తార్స్ రూల్స్, 1960’ చట్టం లో ఒక భాగం. ఫారంలో ఎలాంటి మార్పు, సవరణను తలపెట్టినా కూడా పార్లమెంటులో చట్ట సవరణ జరగాలి, లా అండ్ జస్టిస్ మంత్రిత్వ శాఖ, సదరు సవరణను గజెట్ నోటిఫికేషన్ లో పెట్టాలి. ఆ తర్వాతే సవరణ అమలు చేయటానికి వీలవుతుంది. కానీ ఫారం 6 లో చేసిన సవరణలను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గజెట్ లో నోటిఫై చేయలేదు. ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి ఎన్నికల కమిషన్ ఈ-గజెట్ వెబ్ సైట్ లో ప్రకటించిన జూన్ 24, 2025 తేదీ నుండి ఇప్పటి వరకు అలాంటి నోటిఫికేషన్ ఏదీ వెలువడ లేదు.
కనుక ఫారం 6 లో చీఫ్ ఎన్నికల కమిషన్, పాత ఎస్ఐఆర్ గురించి ప్రవేశ పెట్టిన సవరణ గానీ, డిక్లరేషన్ గానీ భారత దేశ ఎన్నికల చట్టాల పరిధిలో లేదు. దరిమిలా సదరు సవరణ, డిక్లరేషన్ చట్ట విరుద్ధం. ఈ నేపధ్యంలో ఫారం 6 లో సవరణ ఎవరు చేశారో తెలియజేస్తూ అఫిడవిట్ ఇవ్వాలని సుప్రీం కోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, హోమ్ మంత్రి అమిత్ షా, న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ల అనుమతి లేకుండా, వారికి తెలియకుండా చీఫ్ ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ సొంతగా నిర్ణయం తీసుకుని ఫారం 6 లో సవరణలు ప్రవేశ పెట్టారని భావించటం సాధ్యం కాదు. ఆ ధైర్యం ఈ బ్యూరోక్రటిక్ అధికారి చేయలేడు. చట్ట బద్ధ అధికారాలను కూడా మంత్రులు, ఏంపిలు, ఏంఎల్ఏ ల అనుమతి లేకుండా అమలు చేయలేని దుస్థితిలో ఉండే బ్యూరోక్రాట్ అధికారులు చట్ట విరుద్ధ అధికారాలను ఎలా చెలాయించగలరు? కనుక ఏకంగా 13 కోట్ల మండి వోటు హక్కును కూరలో కరివేపాకు తీసి పారేసినంత తేలికగా తొలగించేసిన ఎస్ఐఆర్ అనే మహా నేరంలో దోషులో ఎవరో ఊహించటం అంత కష్టం కాదు.

