ఢిల్లీ నరేంద్ర మోడి సొత్తా? -అభిజిత్ దిప్కే

–

అక్టోబర్ 10 తేదీన ‘ఛలో ఢిల్లీ’ కి కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు ఇచ్చిన నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం రాజధాని ఢిల్లీని అష్ట దిగ్బంధనం కావించింది. ఢిల్లీ పోలీసులు ఢిల్లీ వీధుల్లో మోహరించి అహర్నిశలు కాపలా కాస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుండి బయలుదేరి 10 వ తేదీకల్లా ఢిల్లీ చేరుకునే రైళ్లను అవి బయలుదేరే నగరాల్లోనే రైల్వే శాఖ నిలిపివేసింది. దాదాపు 15 కు పైగా ఎక్స్ ప్రెస్ రైళ్లను రైల్వే శాఖ నిలిపివేయటంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో ట్రైన్ లను కూడా ఢిల్లీ పోలీసులు బంద్ చేశారు. విద్యార్ధులు, యువకులు ఢిల్లీ చేరే మార్గాలన్నింటినీ మూసివేసేందుకు ఢిల్లీ పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీనితో సిజెపి నాయకుడు అభిజిత్ దిప్కే కేంద్ర ప్రభుత్వం పైన విరుచుకు పడ్డాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పైన విమర్శలు గుప్పించాడు.

ఢిల్లీ నగరాన్ని పోలీసులతో నింపివేయటాన్ని దిప్కే తీవ్ర స్వరంతో ప్రశ్నించాడు. రోడ్ల పైకి రాకుండా అనేక నిబంధనలను అడ్డంకులను తొలగించాలని డిమాండ్ చేశాడు. “దేశ రాజధాని నగరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి, హోమ్ మంత్రి అమిత్ షా ల సొంత ఆస్తా?” అని దిప్కే ప్రశ్నించాడు. ఢిల్లీ పోలీసులు తమ నిరసన ప్రదర్శనకు అనుమతి ఇవ్వనప్పటికీ ప్రదర్శన జరిగి తీరుతుందని స్పష్టం చేశాడు. పోలీసుల అనుమతితో తమకు పని లేదని, భారత రాజ్యాంగం ఆర్టికల్ 19(1) పౌరులకు నిరసన తెలిపే హక్కు ఇచ్చిందని, ఎవరి అనుమతి అవసరం లేదని దిప్కే స్పష్టం చేశాడు.

విద్యార్ధి, యువకుల నిరసన ప్రదర్శన జరగకుండా ఉండేందుకు కేంద్రం తీసుకున్న చర్యలను ప్రశ్నిస్తూ “ఏమిటి ఈ భయం? మీరు ఎందుకు ఇంతగా భయపడుతున్నారు? దేశం లోని యువకులకు మీరు భయపడుతున్నారు. ట్రైన్ లను ఆపేశారు. మెట్రో నిలిపేశారు. ఎవరైనా ఏం చేయాలి?” అని దిప్కే ఘాటుగా ప్రశ్నించాడు. రైలు ప్రయాణీకులకు అసౌకర్యం కలగజేయటాన్ని నిరసించాడు. ప్రజా రవాణా వ్యవస్థ పైన విచించిన నిబంధనలు, రోడ్ల పైన ఏర్పాటు చేసిన ఆటంకాలు అవే సాధారణ ప్రజలకు కష్టాలు కలిగిస్తాయి తప్ప తమ నిరసన వల్ల కాదని గుర్తు చేశాడు.

“ఢిల్లీ ఏమన్నా నరేంద్ర మోడి లేదా అమిత్ షా ల సొంత ప్రాపర్టీయా? వారి పూర్వీకుల సొంతమా ఈ నగరం? లేక వారి తల్లి దండ్రుల స్వార్జితమా? నిరసన వల్ల ప్రజలు అసౌకర్యం ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు, మరో పక్క మొత్తం మెట్రో ని బంద్ చేస్తారు, మొత్తం రైలు ప్రయాణాల్ని రద్దు చేసేస్తారు. రోడ్లన్నీ మూసేశారు. ఇప్పుడు ఇవన్నీ ప్రజలకు అసౌకర్యం కాదా?” అని దిప్కే మోడి ప్రభుత్వం తీసుకున్న చర్యలను దునుమాడాడు.

సిజెపి కార్యకర్తలు అరెస్ట్ కావటానికి కానీ నిర్బంధించబడటానికి కానీ సిద్ధంగా ఉన్నారని దిప్కే స్పష్టం చేశాడు. తాము జరిపే ప్రదర్శన చట్ట విరుద్ధం అయితే అరెస్ట్ కు సిద్ధం అని ప్రకటించాడు. ఢిల్లీ నగరాన్ని నలు వైపులా నిర్బంధించిన నేపధ్యంలో సుప్రీం కోర్టును ఏంపి కపిల్ సిబాల్ ఆశ్రయించాడు. ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ చీఫ్ జస్టిస్, “నిరసన నిర్వాహకులు కోర్టుకు ఎందుకు రాలేదు? వారికి పోలీసులు అనుమతి నిరాకరిస్తే కోర్టును ఆశ్రయించాలి గదా?” అని ప్రశ్నించాడు. “పోలీసులు అనుమతి ఇవ్వకపోతే వారి ప్రదర్శన చట్ట విరుద్ధం అవుతుంది. అప్పుడు వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుంది” అని కూడా సిజెఐ సూచించాడు. పౌరుల ప్రజాస్వామిక నిరసన ప్రదర్శనకు హక్కు ఉందన్న సంగతి పక్కన పెట్టి ప్రదర్శనకారులను ప్రాసిక్యూట్ చేయొచ్చని సిజెఐ ఢిల్లీ పోలీసులకు పరోక్షంగా సూచిస్తున్నారా? అన్న ప్రశ్న ఉదయిస్తోంది.

ఢిల్లీ పోలీసులు కూడా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మాటలను తమ నిర్బంధ చర్యలకు మద్దతుగా అరువు తెచ్చుకోవటం గమనార్హం. “చీఫ్ జస్టిస్ కూడా ప్రదర్శనకారులను ప్రాసిక్యూట్ చేయవచ్చని చెప్పారు. పౌరులకు నిరసన హక్కు ఉండటం నిజమే. కానీ ప్రయాణీకులు, ప్రజలకు కూడా అసౌకర్యం కలగకుండా చూడాలి. నగరం మొత్తాన్ని తమ చర్యలతో అదుపులోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. ప్రజల సౌకర్యాలను, నిరసన హక్కులను బ్యాలన్స్ చేయాల్సి ఉంటుంది” అని పోలీసులు వాదించారు. అయితే ఆ రెండింటినీ ఎల్లా బ్యాలన్స్ చేయనున్నారో మాత్రం చెప్పలేదు. నిరసన జరగకుండా పూర్తిగా బంద్ చేసి, ప్రజల ప్రయాణాలను కూడా రద్దు చేసి ఎలా బ్యాలన్స్ చేయగలరో వారు చెప్పలేదు.

పోలీసుల అనుమతి తీసుకోవాలన్న వాదనను అబిజిత్ దిప్కే గట్టిగా ప్రశ్నించాడు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 19 పౌరులకు నిరసన హక్కు కల్పించిందని, అలాగే జంతర్ మంతర్ ను ప్రభుత్వాలే నిరసన తెలియజేసేందుకు కేటాయించారని ఇక అనుమతి తీసుకునే ప్రసక్తి ఎలా వస్తుందని ప్రశ్నించాడు.

“గ్యానేష్ కుమార్ పర్మిషన్ తీసుకున్నాడా/ 13 కోట్ల మంది వోట్లను తొలగించే ముందు గ్యానేష్ కుమార్ పర్మిషన్ తీసుకున్నాడా? ఫారం 6 లో సవరణలో చేసేందుకు సుప్రీం కోర్టు కూడా ఆమోదం ఇవ్వలేదు. కాబట్టి ఎవరికీ చెప్పకుండా, ఎవరినీ పర్మిషన్ అడగకుండా, 13 కోట్ల మంది వోట్లను గ్యానేష్ కుమార్ తొలగించినపుడు ఆయన చర్యలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేసేందుకు ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగ బద్ధ హక్కు మాకు ఉన్నప్పుడు మాకు ఇంకొకరి అనుమతి తీసుకోవలసిన అవసరం ఏమిటి?” అని అభిజిత్ దిప్కే ప్రశ్నించాడు.

జంతర్ మంతర్ వద్ద ప్రదర్శన నిర్వహించాలంటే కనీసం 10 రోజుల ముందు అనుమతి తీసుకోవాలన్న ఢిల్లీ పోలీసుల వాదనను కూడా దిప్కే తిరస్కరించాడు. “ప్రభుత్వం చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నట్టు కనిపిస్తోంది. మోడి, అమిత్ షా లు వారి బ్లడ్ ప్రెసర్ ని పదే పదే చెక్ చేసుకోవాలి. అలాంటి భయాన్ని ప్రభుత్వం చూపిస్తోంది” అని దిప్కే సూచించాడు.

రాష్ట్రాలకు ఆదేశాలు

కాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుండి ప్రదర్శనకు ఎవరూ రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అన్నీ రాష్ట్రాల పోలీస్ బాస్ లకు కేంద్ర హోమ్ సెక్రటరీ ఆదేశాలు ఇస్తూ వారంతా ఢిల్లీ పోలీసులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని ఆదేశించాడు. గ్యానేష్ కుమార్ రాజీనామా కోసం సిజెపి ఆందోళన తలపెట్టిన నేపధ్యంలో, వారి ఆందోళనను ఢిల్లీ పోలీసులు నిషేధించిన నేపధ్యంలో విద్యార్ధులు, యువకులు ఢిల్లీకి చేరకుండా నిరోధించాలని కోరుతూ రాష్ట్రాల్ పోలీస్ బాస్ లకు వర్తమానం పంపాడు.

పోలీసుల ఆదేశాలు పాటించని చరిత్ర సిజిపి కార్యకర్తలకు ఉన్నదని, కాబట్టి అనుమతి లేని ఢిల్లీ ప్రదర్శనకు రాష్ట్రాల నుండి ఎవరూ తరలి రాకుండా నిర్బంధ చర్యలు తీసుకోవాలని హోమ్ కార్యదర్శి, రాష్ట్రాల పోలీసులకు ఆదేశాలు జారీ చేశాడు.

స్పందించండి