ఫారం 6 పై సి‌ఈ‌సి యూ-టర్న్ సంపూర్ణం! బుకాయింపులే ఆయన డిఫెన్స్!

–

ఎస్‌ఐ‌ఆర్ విషయంలో ఎలక్షన్ కమిషన్ చేసిన నిర్ణయాలన్నీ ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయాలేనని సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో కింది అధికారి సంతకంతో బుకాయించిన సి‌ఈ‌సి గ్యానేష్ కుమార్, మెల్ల మెల్లగా ఆ నిర్ణయాలన్నీ, అనగా 10 నెలల్లో 14 సార్లు తతిమా ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వ్యతిరేకించిన నిర్ణయాలన్నిటినీ క్రమంగా ఉపసంహరించుకుంటున్నాడు. తద్వారా తదుపరి సుప్రీం కోర్టు హియరింగ్ నాటికి తానేమీ తప్పు చేయలేదని, అన్నీ యధాతధంగా కొనసాగుతున్నాయని చూపేందుకు సి‌ఈ‌సి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.

ఎన్నికల చట్టాలకు వ్యతిరేకంగా తాను ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలను ఉపసంహరించుకోవటం ద్వారా సుప్రీం కోర్టు, తాను చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడ్డట్టు అంతిమ తీర్పు ఇవ్వకుండా గ్యానేష్ కుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో గ్యానేష్ కుమార్ అక్రమంగా వోటర్ల వోటు హక్కు రద్దు చేస్తున్నాడని రాహుల్ గాంధీ, కాక్రోచ్ జనతా పార్టీ, ప్రతిపక్ష పార్టీలు చేసిన ఆరోపణలు నిజమేనని గ్యానేష్ కుమార్ పరోక్షంగా అంగీకరిస్తున్నట్టు దీని ద్వారా అర్ధం అవుతున్నది.

ముఖ్యంగా ఫారం 6 లో సవరణ ద్వారా ప్రవేశపెట్టిన డిక్లరేషన్ ను ఈ‌సి‌ఐ పేరుతోనే సి‌ఈ‌సి గ్యానేష్ కుమార్ ఉపసంహరించుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లో డిజిటల్ ఫారం 6 కు సవరణ ద్వారా జత చేసిన 2002 నాటి ఎస్‌ఐ‌ఆర్ తాలూకు డిక్లరేషన్ ఇప్పుడు కనిపించటం లేదు. ఫారం 6 తో భాగంగా ఉంచటానికి బదులు డిక్లరేషన్ ను పూర్తిగా తొలగించి విడిగా ఉంచారు. ఎస్‌ఐ‌ఆర్ ప్రక్రియ కొనసాగుతున్న రాష్ట్రాల ఎస్‌ఐ‌ఆర్ లో ఇప్పుడు ఈ డిక్లరేషన్ లేదు.

సెప్టెంబర్ నెలలో ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక పరిశోధనాత్మక కధనం వెలువడిన తర్వాత “ఫారం 6 సవరణను సుప్రీం కోర్టు ఆమోదించింది” అని హడావుడిగా ఒక తప్పుడు ప్రకటనను సి‌ఈ‌సి గ్యానేష్ జారీ చేశాడు. అనంతరం జరిగిన సుప్రీం కోర్టు హియరింగ్ లో చీఫ్ జస్టిస్, “ఒక విషయం స్పష్టం చేస్తున్నాం. ఫారం 6 లో చేసిన సవరణలకు మా ఆమోదం ఉందనటంలో నిజం లేదు” అని స్పష్టం చేయటంతో గ్యానేష్ గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. ఇక అప్పటి నుండి ఫారం 6 సవరణల గురించి రకరకాల ప్రకటనలు గుప్పించిన గ్యానేష్ చివరికి ఎస్‌ఐ‌ఆర్ సవరణను గుట్టు చప్పుడు కాకుండా పూర్తిగా ఎత్తివేశాడు.

ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖబీర్ సింగ్ సంధు, వివేక్ జోషి లు 10 నెలల్లో 14 సార్లు గ్యానేష్ చేసిన నిర్ణయాలపై తమ అసమ్మతి నోట్ లను రికార్డ్ చేశారు. వాటిలో వేటికీ గ్యానేష్ నుండి స్పందన గానీ వివరణ గానీ అందలేదు. ఎస్‌ఐ‌ఆర్ పైన సుప్రీం కోర్టు జరుపుతున్న విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ తో పాటు బెంచి లోని ఇతర ఇద్దరు న్యాయమూర్తులు ఇండియన్ ఎక్స్ ప్రెస్ వెల్లడి చేసిన అంశాలపైన గుచ్చి గుచ్చి ప్రశ్నించటమే కాకుండా ఎస్‌ఐ‌ఆర్ లోపాలను ఎత్తి చూపిస్తూ ఎస్‌ఐ‌ఆర్ నిర్ణయాలు చట్టం పరిధిని దాటాయన్న అంశాన్ని పరోక్షంగా ఎత్తి చూపించారు.

బీహార్ ఎస్‌ఐ‌ఆర్ లో లేని నిబంధనలను బెంగాల్ ఎస్‌ఐ‌ఆర్ లో ప్రవేశ పెట్టటాన్ని ఎత్తి చూపిస్తూ అవేవీ తమ ఎస్‌ఐ‌ఆర్ తీర్పు పరిధిలో లేవని స్పష్టం చేశారు. ముఖ్యంగా ‘లాజికల్ డిస్క్రప్రెన్సీస్’ పేరుతో కోట్లాది వోట్లు తొలగించటం పైన భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. “అసలు ‘లాజికల్ డిస్క్రప్రెన్సీస్’ అంటూ ఒక కేటగిరీ సృష్టించటం చట్టబద్ధమా కాదా అన్న అంశాన్ని మేము ఇంకా నిర్ణయించలేదు” అంటూ పరోక్షంగా దానిని తప్పు పట్టింది.

అయితే బెంగాల్ ఎస్‌ఐ‌ఆర్ విచారణ సందర్భంగా ‘లాజికల్ డిస్క్రప్రెన్సీస్’ కేటగిరీ కింద కోట్ల వోటర్ల పేర్లను సస్పెన్షన్ లో ఉంచినా కూడా సుప్రీం కోర్టు ఎలాంటి అభ్యంతరము చెప్పలేదు. బెంగాల్ ఎస్‌ఐ‌ఆర్ విచారణ సందర్భంగా ఈ కేటగిరీ అన్యాయంగా ఉన్నదని, వోటర్ల పేర్లను జాబితా నుండి ఎలాంటి చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఈ కేటగిరీని సృష్టించి తొలగించటం రాజ్యాంగ విరుద్ధమని కపిల్ సిబాల్ తో పాటు కనీసం అరడజను మంది పేరు మోసిన సీనియర్ లాయర్లు మొత్తుక్కున్నప్పటికీ చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని బెంచి ఆ అంశం పైన ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. బెంగాల్ ఎన్నికల్లో పదుల లక్షల మంది వోటు హక్కు కోల్పోతున్నారని కనీసం మధ్యంతరంగా అయినా వోటు వేసే అవకాశం వారికి ఇవ్వాలని కోరినా కూడా “ఈ ఎన్నికల్లో కాకుంటే వచ్చే ఎన్నికల్లో వోటు వేస్తారు లెండి” అని స్వయానా చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించటంతో అవాక్కవటం లాయర్ల వంతయింది.

ఫారం 6 – యూ టర్న్

2002 లో జరిగిన ఎస్‌ఐ‌ఆర్ అనంతర వోటర్ల జాబితాకు ఫారం 6 ద్వారా కొత్తగా వోటు హక్కు కోరే వారికి లంకె పెడుతూ సరికొత్త సవరణను సి‌ఈ‌సి ప్రవేశ పెట్టాడు. ఇది మిగతా ఇద్దరు కమిషనర్లతో చర్చించకుండా చేశాడు. ఆన్ లైన్ లోని ఫారం 6 లో జె సెక్షన్ మరియు కే సెక్షన్ ల మధ్య డిక్లరేషన్ ను సి‌ఈ‌సి చొప్పించాడు. ఇందులో మూడు స్టేట్మెంట్లు ఇచ్చి ఒకటి టిక్ చేయాలని కోరారు. అవి: 1. గత (2002) ఎస్‌ఐ‌ఆర్ జాబితాలో మీ పేరు ఉన్నది; 2. గత ఎస్‌ఐ‌ఆర్ లో మీ తండ్రి లేదా తాత గారి పేరు ఉన్నది; 3. గత ఎస్‌ఐ‌ఆర్ లో మీ పేరు లేదు, మీ తండ్రి/తాత పేర్లు కూడా లేవు. ఈ మూడింటిలో ఒకటి ఎంచుకోవాలి. ఎంచుకోకపోతే కర్సర్ ఇక ముందుకు కదలదు. వోటు నమోదు సాధ్యం కాలేదు. మూడో ఛాయిస్ ఎంచుకుంటే కూడా కర్సర్ ముందుకు సాగలేదు. అర్ధాంతరంగా నమోదు ప్రక్రియ ముగిసిపోయేది.

మే 16 తేదీన ఈ‌సి వివేక్ జోషి, ఫారం 6 లో పార్లమెంటులో చట్ట సవరణ చేయకుండా సవరణలు ప్రవేశ పెట్టకూడదని సి‌ఈ‌సి కి లేఖ రాస్తే సమాధానం లేదు. ఆగస్టు 13 తేదీన మరో ఈ‌సి సంధు, జోషి తో ఏకీభవిస్తూ సవరణను “అనధికారికం/చట్టవిరుద్ధం” గా అభివర్ణిస్తూ సి‌ఈ‌సి కి నోట్ పెట్టినా స్పందన లేదు.

ఇప్పుడేమో సదరు ఎస్‌ఐ‌ఆర్ డిక్లరేషన్ తాలూకు సవరణను ఫారం 6 నుండి పూర్తిగా తప్పించారు. అక్టోబర్ 26 తేదీన సుప్రీం కోర్టుకు అఫిడవిట్ సమర్పిస్తూ “తప్పు జరిగింది, సవరణ తీసేశాం” అని చెప్పటానికి బదులు “ఈ‌సి‌ఐ లోని ఎలక్తోరల్ రోల్ (ఈ‌ఆర్) డివిజన్, ఫారం 6 మరియు ఎస్‌ఐ‌ఆర్ డిక్లరేషన్ లు రెంటినీ వేరు చేయాలని అక్టోబర్ 21 తేదీన నిర్ణయించింది. ఫారం 6 లోపల ఎస్‌ఐ‌ఆర్ డిక్లరేషన్ ని ఉంచటం ద్వారా వోటర్ రెండు సార్లు ఓ‌టి‌పి ని జనరేట్ చేయాల్సిన అవసరాన్ని తప్పించింది” అని తనను తాను సమర్ధించుకుంది. తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడ మేత కోసం అని బొంకినట్టన్నమాట!

అఫిడవిట్ లో ఈ‌సి‌ఐ పేరుతో సి‌ఈ‌సి ఇంకా ఇలా పేర్కొన్నాడు, “నిజాయితీతో కూడిన లక్ష్యం అనేక చర్చలకు సూచనలకు దారి తీసింది. ఫారం 6 భౌతిక ఫార్మాట్ ద్వారా సమర్పించినట్టు గానే, నిబంధనలు మరియు ఎస్‌ఐ‌ఆర్ డిక్లరేషన్ లో పొందుపరిచినట్టుగా ఆన్ లైన్ అప్లికేషన్ కూడా రెండు భాగాలుగా చేసేందుకు మా ఈ‌ఆర్ డివిజన్ అక్టోబర్ 21, 2026 తేదీన నిర్ణయం చేసింది” అని అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఆ విధంగా ఎస్‌ఐ‌ఆర్ సవరణను ఫారం 6 లో చొప్పించే అంశంలో ఎలక్షన్ కమిషన్ గత 6 వారాల్లో మూడు మార్లు వెనక్కి అడుగులు వేస్తూ వచ్చింది. మూడో వెనకడుగు ద్వారా సవరణ ఉపసంహరణ సంపూర్ణం కావించింది. కానీ ఫారం 6 నుండి దూరం చేసిన ఎస్‌ఐ‌ఆర్ డిక్లరేషన్ కి ఇప్పుడు లక్ష్యం లేకుండా పోయింది. లేదా కొత్త లక్ష్యం ఏమన్నా ఉంటే అది ఎన్నికల కమిషన్ చెప్పాల్సి ఉంటుంది.

తప్పు మీద తప్పు

ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎక్స్ఫోజ్ తర్వాత కమిషన్ ఇచ్చిన పత్రికా సమాధానంలో ఫారం 6 గురించి ప్రస్తావనే చేయలేదు. “కమిషన్ యొక్క చట్టాలు, సూచనల ప్రకారం ఈ‌సి‌ఐ చేసిన అన్ని నిర్ణయాలు తీసుకోబడ్డాయి” అని ప్రకటించింది. ఇద్దరు కమిషన్ల అసమ్మతి నోట్ లను ఆకుకు అందని పోకకు పొందని విధంగా ఒక విచిత్రమైన వివరణ ఇచ్చింది. “(ఇద్దరు) కమిషనర్లు రాసిన నోట్ లు కమిషన్ పాలనా ప్రక్రియ లో భాగంగా లేవనెత్తిన ప్రశ్నలే. వివిధ నిర్ణయాలు ముసాయిదా దశలో ఉన్నప్పుడు కమిషనర్లు లేవనెత్తిన సూచనలే (inputs) వారు రాసిన నోట్ లు. గత ఏడాది కాలంలో చేసిన ప్రతి నిర్ణయము పూర్తి కమిషన్ ఏకాభిప్రాయంతో చేసినదే” అని అడ్డంగా బొంకింది.

నిర్ణయాలు చేసే క్రమంలో ఒక ప్రతిపాదన ముసాయిదా దశలో ఉండగా కమిషనర్లు నోట్ లు రాసినట్టయితే ఆ నోట్ లు రాసిన తేదీలు అసలు నిర్ణయం జరిగిన తేదీకి ముందే ఉండాలి. కానీ ఇద్దరు కమిషనర్ల 14 నోట్ లు కూడా ఆయా నిర్ణయాలు జరిగిన తేదీకి అనేక రోజులు నెలల తర్వాత తేదీలే ఉన్నాయి తప్ప ముందు తేదీలు లేవు. సి‌ఈ‌సి తన తప్పును కవర్ చేసుకోవటానికి వృధా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతోంది.

సెప్టెంబర్ 23 తేదీన ఇండియన్ ఎక్స్ ప్రెస్, లోపలి వ్యవహారాలను వెల్లడి చేసింది. మూడు రోజుల తర్వాత మరో ప్రకటన నోట్ విడుదల చేస్తూ “ఎస్‌ఐ‌ఆర్ కోసం జత చేసిన డిక్లరేషన్ ను గౌరవ సుప్రీం కోర్టు ఆమోదించింది. ఎస్‌ఐ‌ఆర్ జరుగుతున్నపుడు కాకుండా ఇతర కాలాల్లో, ‘వోటర్ల రిజిస్ట్రేషన్ నిబంధనలు – 1960‘ నాటి ఫారం లే వర్తిస్తాయి” అని ప్రకటించింది. దీని ప్రకారం ఆన్ లైన్ ఫారం 6 లో చేసిన సవరణ ఎస్‌ఐ‌ఆర్ జరిగే కాలంలోనే వర్తిస్తుంది, ఎస్‌ఐ‌ఆర్ జరుగుతున్న రాష్ట్రాల్లో సవరణ కొనసాగుతుంది.

ఈ నిర్ణయం ప్రకారం ఎస్‌ఐ‌ఆర్ పూర్తయిన రాష్ట్రాల్లో ఫారం 6 నుండి ఎస్‌ఐ‌ఆర్ సవరణను తొలగించారు. ఎస్‌ఐ‌ఆర్ కొనసాగుతున్న చోట్ల సెక్షన్ J & సెక్షన్ K ల మధ్య సవరణను అలాగే ఉంచారు. అయితే అక్టోబర్ 12 తేదీన సుప్రీం కోర్టు “మేము ఫారం 6 సవరణను మేము ఆమోదించలేదు, తిరస్కరించలేదు.” అని స్పష్టం చేసింది. సవరణ సంగతి కోర్టు దృష్టిలోనే లేదని దీని అర్ధం. దరిమిలా, ఎస్‌ఐ‌ఆర్ తో సంబంధం లేకుండా అన్ని చోట్లా ఫారం 6 పేజీ నుండి ఎస్‌ఐ‌ఆర్ డిక్లరేషన్ ను తొలగించి వేరుగా ఉంచాలని అక్టోబర్ 21 తేదీన ఈ‌సి‌ఐ కి చెందిన ఈ‌ఆర్ డివిజన్ నిర్ణయించినట్టు ప్రకటించారు. ఇంతటితో ఫారం 6 సవరణ విషయంలో ఎన్నికల కమిషన్ యూ-టర్న్ సంపూర్ణం కావించబడింది.

బీహార్ ఎస్‌ఐ‌ఆర్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ నాయకత్వం లోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం, ఎస్‌ఐ‌ఆర్ ప్రక్రియ పైన ఈగను కూడా వాలనివ్వలేదు. ఎస్‌ఐ‌ఆర్ ప్రక్రియ కొనసాగాల్సిందే అని తెగేసి చెప్పింది. ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయో, వోటర్ల వోటు హక్కు ఎలా రద్దవుతున్నదో పిటిషనర్ లాయర్లు మొత్తుకున్నా కూడా చెవిన వేసుకోలేదు. సుప్రీం కోర్టు ప్రదర్శించిన ఈ వైఖరితో ఎన్నికల కమిషన్, తమకు దేశ అత్యున్నత న్యాయస్థానమే మద్దతుగా ఉన్నట్టు భావించిఉండవచ్చు.

ఆ భావనతో కన్ను మిన్నూ కానకుండా చట్టాలకు పాతరేస్తూ కొత్త వోటర్ల నమోదు ప్రక్రియను స్థానిక జిల్లా/రాష్ట్ర ఎన్నికల అధికారులకు అందుబాటులో లేకుండా చేయటం, విచ్చలవిడిగా బి‌జే‌పి శ్రేణులు బల్క్ గా ఇస్తున్న ఫారం 7 (తొలగింపు పత్రాలు) లను స్వీకరించటం, ఎలాంటి తనిఖీలు లేకుండా వోటర్ల పేర్లు తొలగించటం, చట్టబద్ధంగా జరగవలసిన ప్రక్రియలను సాఫ్ట్ వేర్ ప్రోగ్రామ్ లకు అప్పజెప్పి కోట్లలో వోట్లు రద్దవుతున్నా లోపాలు సరిదిద్దే ప్రయత్నాలు చేయకపోవటం… మొ.న అక్రమాలు కొనసాగుతూ పోయాయి.

తొలగించిన (ASDD) పేర్ల పునరుద్ధరణ!

13 కోట్ల మంది వోటర్ల పేర్లను వోటర్ల జాబితా నుండి తొలగించటానికి ఈ‌సి‌ఐ నాలుగు కారణాలు చెప్పింది. ఆ కారణాలను ASDD గా కమిషన్ పిలుస్తోంది. A అంటే Absent (గైరు హాజరు); S అంటే Shifted (ఇల్లు మారటం); D అంటే Dead (చనిపోవటం); D అంటే Duplicate (నకిలీ లేదా రెండు చోట్ల వోటు ఉండటం). ఇవి కాకుండా O అంటే Others (ఇతరములు) అని మరో కారణం కూడా ఉన్నట్టు మొదట చెప్పారు. ప్రస్తుతం ఎందుకనో ఈ కారణం గురించి ఎన్నికల కమిషన్ చెప్పటం లేదు.

అక్టోబర్ 6 తేదీన ఎన్నికల కమిషన్ ఇంకో సవరణ/వివరణ/పరోక్ష ఒప్పుకోలు ప్రకటించింది. ప్రస్తుతం ఎస్‌ఐ‌ఆర్ ప్రక్రియ కొనసాగుతున్న 7 రాష్ట్రాలలో ASDD కింద మార్క్ చేయబడిన వోటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపటం ద్వారా తిరిగి వోటర్ల జాబితాలో తమ పేరు చేర్చుకోవచ్చని ప్రకటించింది.

ASDD నాలుగు అక్షరాల కింద మార్క్ చేయబడ్డ వోటర్లు గతంలో వోటర్ జాబితాలో ఉన్నప్పటికీ (ఎస్‌ఐ‌ఆర్ అనంతరం వారిని జాబితా నుండి తొలగించారు), కొత్త వోటర్లు నింపే ఫారం 6 ను నింపాలని ఇన్ని రోజులూ కమిషన్ చెబుతూ వచ్చింది. కొత్తగా వోటు హక్కు నమోదు చేసుకునే వారు నింపే ఈ ఫారం 6 లో “మేము గతంలో ఎక్కడా వోటర్ గా నమోదు కాలేదు” అని డిక్లరేషన్ ఇవ్వవలసి ఉంటుంది. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చిన వాళ్లకి శిక్ష ఎదుర్కొంటారని కూడా ఈ ఫారం6 లో ఉంటుంది. కనుక ఫారం 6 ద్వారా మళ్ళీ జాబితాలో చేరేందుకు దరఖాస్తు చేసుకుంటే శిక్ష ఎదుర్కోవలసి ఉంటుందన్న భయంతో ఆ ఫారం ని ఉపయోగించలేదు.

ఈ భయంతోనే ఫారం 6 ని ఉపయోగించేందుకు తిరస్కరిస్తూ గోవా లోని ఒక కుటుంబం కోర్టుకు ఎక్కింది. ఎన్నికల చట్టం ప్రకారం ASDD కేటగిరీలోని వోటర్లు ఫారం 8 ని ఉపయోగించాలి. కానీ ఫారం 8 ని తీసుకోవద్దని కమిషన్ తన సిబ్బందికి ఆదేశాలిచ్చింది. గోవా హై కోర్టు కూడా ఫారం 6 ఇవ్వండి ఏమీ కాదులే అన్నది కానీ ఎన్నికల కమిషన్ ని ప్రశ్నించలేదు.

గత హియరింగ్ లో సుప్రీం కోర్టు ఏ‌ఎస్‌డి‌డి వోటర్లు ఫారం 6 ని ఉపయోగించాలా లేదా అన్నది తాము పరిశీలిస్తామని చెప్పింది. ఆ తర్వాత కూడా ఎన్నికల కమిషన్ ఫారం 6 ఇవ్వాల్సిందేనని ఏ‌ఎస్‌డి‌డి వోటర్లకు సూచనలు ఇచ్చింది. ఈ అంశాన్ని అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్టు బెంచికి ఫిర్యాదు చేశాడు. చీఫ్ జస్టిస్ ఫిర్యాదుకు స్పందిస్తూ “మేము పరిశీలిస్తున్నామని చెప్పినా వారు అలా ఎలా అంటారు?” అని వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో ఈ‌సి‌ఐ అక్టోబర్ 6 తేదీన తాజా ఆదేశాలు ఇచ్చింది.

దాని ప్రకారం ASDD కింద మార్క్ చేయబడి జాబితాలో చోటు చేసుకోని వోటర్లు (ఎస్‌ఐ‌ఆర్ జరుగుతున్న 7 రాష్ట్రాల్లో) మరొకసారి ఎన్యూమరేషన్ ఫారం ఉపయోగించి వోటర్ల జాబితాలో చేరవచ్చని ప్రకటించింది. ఇప్పటి వరకు చెప్పినట్టు ఫారం 6 ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఎస్‌ఐ‌ఆర్ ప్రక్రియ ఆరంభంలో అందరికీ ఎన్యూమరేషన్ ఫారం ఇచ్చినా కూడా ASDD వోటర్లు వివిధ కారణాల వలన వాటిని తిరిగి బి‌ఎల్‌ఓ లకు ఇవ్వలేదని కమిషన్ చెప్పింది. అలా ఇవ్వని వారిని ASDD కేటగిరీల కింద చేర్చి తొలగింపుకు సిద్ధం చేసింది.

కానీ అసలు సంగతి ఏమిటంటే ASDD గా మార్క్ చేయబడ్డ వోటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారం లు పూర్తిగా నింపి బి‌ఎల్‌ఓ లకు తిరిగి ఇచ్చినప్పటికీ ఏ‌ఎస్‌డి‌డి జాబితాలోకి నెట్టివేయబడ్డారు. వారిలో అత్యధికులు ముస్లింలు. బి‌ఎల్‌ఓ లు అనేకచోట్ల ఆ పని తాము చేయలేదని చెప్పారు. వారిని ASDD జాబితాలోకి ఎవరు నెట్టివేశారో ఇంతవరకు కమిషన్ చెప్పలేదు. పాత అడ్రస్ లోనే ఉన్నా కూడా ఆబ్సెంట్ (A) అనీ లేదా షిఫ్టెడ్ (S) అనీ, బ్రతికి ఉన్నా కూడా డెడ్ (D) అనీ, ఒకే సారి ఉన్నా కూడా డూప్లికేట్ (D) మార్క్ చేసేశారు. అలా ఎందుకు జరిగిందో కమిషన్ చెప్పకపోగా వాళ్ళు తిరిగి జాబితాలో చేరేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. సుప్రీం కోర్టు అక్షింతలతో అంతిమ తీర్పు రాకుండానే గత ఆదేశాలను సవరించుకుంటూ కొత్త ఆదేశాలు ఇస్తూ వస్తోంది.

ఎస్‌ఐ‌ఆర్ కొనసాగుతున్న 7 రాష్ట్రాలు ఇవి: ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్ర ప్రదేశ్, జార్ఖండ్, తెలంగాణ, నాగాలాండ్. ASDD కింద మార్క్ చేసిన వోటర్ల పేర్లను వారి వారి పోలింగ్ స్టేషన్ లలో నోటీస్ బోర్డ్ లో పెడతామని, వారు మళ్ళీ ఎన్యూమరేషన్ ఫారం లు ఇవ్వాలని కమిషన్ ఇప్పుడు కోరింది.

–

బుకాయింపులు, దిద్దుబాట్లు

ఫారం 6 సవరణ విషయంలో మూడు దశలుగా వెనక్కి తగ్గి పూర్తిగా యూ-టర్న్ తీసుకున్నా కూడా సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ లో మాత్రం “ఫారం 6 ను ఎన్నడూ సవరించలేదు” అని బొంకటం కొనసాగుతోంది. “ఎస్‌ఐ‌ఆర్ ఆర్డర్ల ద్వారా ఫారం 6 లో సవరణలు చేశారన్న వాదనలో వాస్తవం లేదు” అని పేర్కొంది.

తాము ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎందుకు ఎలా భావిస్తున్నాడో తెలియదు కానీ తన బుకాయింపును విస్తరిస్తూ పోయాడు. “ఐటి ప్లాట్ ఫారం పైన (వెబ్ సైట్ లో) ఫారం 6 మరియు డిక్లరేషన్ ప్రదర్శన (డిస్ ప్లే) గురించి సమీక్ష జరిపాము. ఆన్ లైన సిస్టమ్ లో డిక్లరేషన్ ను ప్రదర్శించిన పద్ధతి కారణంగా ఫారం 6 లో సవరణలు చేశారేమో అన్న అనుమానాలు తలెత్తే అవకాశం ఉండడంతో ఆ విషయంలో కొన్ని ఆందోళనలు తలెత్తాయి. ముందు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం ద్వారా మాత్రమే ఫారం 6 లో సవరణలు చేయగలం” అని అఫిడవిట్ లో పేర్కొన్నారు. పత్రిక వెల్లడి తర్వాత “ఫారం 6 సవరణలను సుప్రీం కోర్టు సమర్ధించింది” అని చక్కగా తడబాటు లేకుండా చెప్పిన ఈ‌సి‌ఐ అఫిడవిట్ లోనేమో అసలు సవరణలే చేయలేదు పొమ్మంది.

ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక పరిశోధనాత్మక కధనం ప్రచురణ తర్వాత గడిచిన 7 వారాల్లో చీఫ్ ఎన్నికల కమిషనర్, ఇద్దరు ఇతర కమిషనర్లు తప్పు పట్టిన అన్ని అంశాల్లో వెనక్కి తగ్గాడు. అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ లోని ఇతర ఇద్దరు కమిషనర్లు ఎత్తి చూపినవన్నీ తప్పిదాలేనని పరోక్షంగా అంగీకరించాడు. పత్రిక కధనం దరిమిలా చీఫ్ కమిషనర్ తీసుకున్న చర్యలు, నిర్ణయాలు ఏమిటో చూడటం ఉపయోగంగా ఉంటుంది.

సమావేశాలు: అంతకు ముందు ముగ్గురు సభ్యుల కమిషన్ సమావేశాల ఎజెండా ఇతర ఇద్దరు కమిషనర్లకు అందేది కాదు. సమావేశం అనంతరం మినిట్స్ రికార్డ్ ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు. చట్టం ప్రకారం అన్ని నిబంధనలు పాటిస్తామని సి‌ఈ‌సి తాజాగా ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేశాడు.

విదేశీ ప్రయాణం: ఎన్నికల కమిషన్ లో పని చేసే అధికారులు విధేశీ టూర్ లకు వెళ్ళే ముందు ముగ్గురు కమిషనర్ల అనుమతి తీసుకోవాలి. కానీ టూర్స్ వెళ్తున్న అధికారులు ఇద్దరు కమిషనర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదని రికార్డు అయింది. ఈ పరిస్ధితి నివారిస్తామని సి‌ఈ‌సి ప్రకటించాడు.

కొత్త ఐటి సిస్టమ్స్: కొత్త ఐటి సిస్టమ్ ల సాఫ్ట్ వేర్ లో కేంద్ర ఎన్నికల కమిషన్ కు తప్ప ఎవరికీ యాక్సెస్ లేకుండా చేశారు. ఐ‌టి విభాగం డి‌జి సీమా ఖన్నా కు, సి‌ఈ‌సి కి మాత్రమే యాక్సెస్ ఉన్నదని, కొత్త వోటర్ల నమోదు (ఫారం 6), షిఫ్ట్ అయిన వోటర్ల రికార్డుల సవరణకు నియోజకవర్గ ఈ‌ఆర్‌ఓ లకు చట్టం ప్రకారం యాక్సెస్ ఉండగా దానిని తొలగించారు. ఈ‌ఆర్‌ఓ లు, ఇద్దరు కేంద్ర కమిషనర్లు ఫిర్యాదు చేసినా సమస్యను పరిష్కరించలేదు. (ది హిందూ పత్రిక కొద్ది రోజుల క్రితం ఇచ్చిన వార్త ప్రకారం వెబ్ సైట్ లో ఈ‌ఆర్‌ఓ లతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ల యాక్సెస్ లను కూడా ఒక్క బటన్ తో రద్దు చేసే అవకాశం ఏర్పాటు చేసుకున్నారు.) గత 7 వారాల్లో సి‌జే‌పి, ప్రతిపక్షాల ఆందోళనలు, సుప్రీం కోర్టు విచారణల దరిమిలా ఈ తప్పులను సి‌ఈ‌సి సవరిస్తున్నాడు. కొత్త సిస్టమ్ లు, పోర్టల్ లను ఆఫీసర్ల కమిటీ పరీక్షించి అనంతరం ఆమోదం కోసం ముగ్గురు కమిషనర్ల వద్దకు వెళుతుందని తాజాగా నిర్ణయం జరిగింది.

ECINet ఆడిట్: ఎన్నికల చట్టాలకు అనుగుణంగా కొత్త సాఫ్ట్ వేర్ తో కూడిన ECINet వెబ్ సైట్ పని చేస్తున్నదీ లేనిదీ తనిఖీ చేసేందుకు కమిటీని ఎన్నికల కమిషన్ నియమించినట్టు అక్టోబర్ 14 తేదీన సర్క్యులర్ జారీ అయింది. కమిటీకి సీనియర్ డిప్యుటీ ఎన్నికల కమిషనర్ (DEC) నాయకత్వం వహిస్తాడు. కమిటీలో రెండో సీనియర్ DEC, ఒక DEC, ఒక డైరెక్టర్, నలుగురు చీఫ్ ఎలక్తోరల్ ఆఫీసర్లు (రాష్ట్ర సి‌ఈ‌ఓ లు), ఐ‌ఐ‌టి బొంబే, IISc బెంగుళూరు ల నుండి ఇద్దరు స్వతంత్ర నిపుణులు సభ్యులుగా ఉంటారు. (ఆడిట్ జరపాలని మే 29 తేదీన వివేక్ జోషి [EC], జులై 13 తేదీన సుఖబీర్ సింగ్ సంధు [EC] కోరినా సి‌ఈ‌సి గ్యానేష్ స్పందించలేదు / పట్టించుకోలేదు. వెబ్ సైట్ ని ఎవరికీ అందకుండా సెంట్రలైజ్ చేశారని కూడా జోషి తప్పు పట్టినా స్పందన లేదు.)

ECINet లో ఫీల్డ్ ఆఫీసర్ల అధికారాల కత్తిరింపు: గత 7 వారాల్లో ECINet లో ఫీల్డ్ ఆఫీసర్లకు, రాష్ట్రాల సి‌ఈ‌ఓ లకు చట్టం ప్రకారం విస్తృత విచక్షణాధికారాలు కల్పిస్తూ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేశారు. ఉదాహరణకి మహారాష్ట్ర CEO చొక్కలింగం సెప్టెంబర్ లో ECINet లో 4 మార్పులు కోరగా అవి చేసేశారు. లాజికల్ డిస్క్రపెన్సీస్ పేరుతో వోటర్లను జాబితాలో చేర్చని వారికి ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమం కింద బి‌ఎల్‌ఓ లు వారి ఇళ్లకు వెళ్లి అవసరమైన పత్రాలు స్వీకరించాలని, వాటి పైన ఈ‌ఆర్‌ఓ లే నిర్ణయం తీసుకుని ఆమోదానికి జిల్లా ఎన్నికల అధికారికి పంపవచ్చని సరికొత్తగా ఆదేశాలు ఇచ్చారు. అనగా, కేవలం DG (IT) వద్దనే అట్టిపెట్టుకున్న వెబ్ సైట్ యాక్సెస్ ని చట్టం ప్రకారం ERO (నియోజకవర్గ అధికారి), DEO (జిల్లా అధికారి), CEO (రాష్ట్ర అధికారి) లకు పునరుద్ధరించారు. సుఖబీర్ సింగ్ సంధు ఫిర్యాదు, ప్రజలు, ప్రతిపక్షాల ఆందోళనల ఫలితంగా పరిష్కారానికి నోచుకుంది.

గోవా లోని 97 వోటర్లు: గోవాలో 97 మంది వోటర్లు అన్ని పత్రాలు ఇచ్చినా తొలగించారు. స్థానిక ERO లు వారి పత్రాలు ఆమోదించి వారి వోట్లను పునరుద్ధరించాలని ప్రయత్నించినా వెబ్ సైట్ అనుమతించలేదు. తొలగింపు రద్దు చేసేందుకు ERO కు అధికారం ఉన్నా రద్దయిందని వారు గ్రహించారు. ఆ సంగతి గోవా రాష్ట్ర CEO 7 రోజుల్లో 8 సార్లు డిల్లీకి రాశాడు. ప్రతిసారీ DG (IT) కి కాపీ పెట్టాడు. ఐనా ఫైనల్ జాబితాలో 97 మంది పేర్లు లేవు. ఈ సంగతి ఇండియన్ ఎక్స్ ప్రెస్ కధనంలో వెల్లడించారు. దరిమిలా 97 మందిలో 88 మంది వోటర్లు ఫారం 6 ఇవ్వగా వాటిని ఆమోదించారు. 6 గురు దేశంలో లేరు, ముగ్గురు పోర్చుగీస్ పాస్ పోర్ట్ ఉన్నందున వోటు ఇవ్వలేదు.

రెండు తాజా వోటర్ల నమోదు కార్యక్రమాలు: ఇవన్నీ కాకుండా పత్రిక కధనం తర్వాత ఎన్నికల కమిషన్ తాజాగా రెండు వోటర్ల నమోదు కార్యక్రమాలను ప్రకటించింది. SIR పూర్తయిన రాష్ట్రాల్లో “వదిలి పెట్టబడ్డ” (left out) వోటర్ల కోసం “స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సెప్టెంబర్ 29 తేదీన కమిషన్ ఆదేశం ఇచ్చింది. 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కొత్తగా వోటు హక్కు పొందిన (18 సం. వయసు దాటిన) వోటర్ల నమోదు కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR) ను కమిషన్ ప్రకటించింది. ఇది 2017 జనవరి 18 నాటికి పూర్తి అవుతుందని చెప్పింది. (ఇది ప్రతి యేటా జనవరిలో పూర్తయ్యే ప్రక్రియ. ఇందులో చనిపోయినవారో వోట్లు తొలగించి, కొత్తవారి పేర్లు జాబితాలో చేర్చాలి. 2025 జనవరిలో SSR జరపకుండా చట్టంలో లేని SIR మొదలు పెట్టారు. పత్రిక వెల్లడి చేయకపోతే ఇది జరిగేది కాదు.)

పశ్చిమ బెంగాల్: ఇది ఇప్పటికీ అంతు (తేలని) తెలియని కధ. రాష్ట్రంలో జ్యుడీషియల్ అధికారులు ఆమోదించిన 17 లక్షల మంది వోట్లను తొలగించాలని కోరుతూ సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ ట్రిబ్యునల్స్ లో ఎన్నికల కమిషన్ పిటిషన్లు వేసింది. వీటిని గురించి EC సుఖబీర్ సింగ్ సంధు వివరణ కోరాడు. ఆయన వేసిన ప్రశ్నలు: మొత్తం ఎన్ని పిటిషన్లు కమిషన్ వేసింది? ఏయే కారణాలతో పిటిషన్లు వేశారు? ECI స్వయంగా ఈ పిటిషన్లు వేసిందా? ఈ పిటిషన్లు వేయాలని కమిషన్లు ఏ అధికారి ఆదేశించాడు? నిజంగా ఎవరు పిటిషన్లు వేశారు? పశ్చిమ బెంగాల్ CEO (చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్) ని ప్రశ్నించగా ఆమె “ఈ అంశాలకు సమబంధించిన సమాచారం నా వద్ద లేదు” అని సమాధానం ఇచ్చిందని సంధు ఒక నోట్ లో రికార్డ్ చేశాడు.

సుప్రీం కోర్టుకు కమిషన్ లోని జూనియర్ అధికారి సంతకంతో ఇచ్చిన అఫిడవిట్ లో ECI, ఈ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం: ట్రిబ్యునల్స్ లో అప్పీళ్లను ఫైల్ చేయటానికి కమిషన్ లో ఎవరి ధృవీకరణ (ఆధరైజ్) / ఆమోదం అవసరం లేదు. ఎందుకంటే ECI అధికారులు వాటిని ఫైల్ చేయొచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. జ్యుడీషియల్ అధికారి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు అప్పీలు చేయవచ్చో కోర్టు రెండు ఆర్డర్ లలో చెప్పింది. తమ పేర్లు కొట్టివేయబడిన వోటర్లు, జాబితాలో చేర్చిన పేరుకు అభ్యంతరం చెప్పిన ఎన్నికల కమిషన్ అధికారులు ఎవరైనా సరే అప్పీలు చెయ్యొచ్చని కోర్టు చెప్పింది. (దీని ద్వారా తప్పుకు కారకునిగా తనను కాకుండా, సుప్రీం కోర్టునే కమిషన్ ఎంచి చూపించింది. నేరాన్ని సుప్రీం కోర్టు మీదికి నెట్టేసింది).

కమిషన్ ఇంకా ఇలా చెప్పింది: “రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద పొందిన అధికారంతో రాష్ట్ర CEO కార్యలయం లోని అధికారులే అప్పీళ్లను ఫైల్ చేశారని బెంగాల్ CEO కార్యాలయం మాకు సమాచారం ఇచ్చింది. ఈ విషయాన్ని వాళ్ళు కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురాలేదు” అని చెప్పింది. ఈ సంగతి బెంగాల్ CEO సుఖబీర్ సింగ్ సంధుకు ఎందుకు చెప్పలేదన్నది ట్రిలియన్ డాలర్ల ప్రశ్న. ఐతే ఇలా ఎంతమంది వోటర్లకు వ్యతిరేకంగా, ఎన్ని అప్పీళ్లు పశ్చిమ బెంగాల్ CEO అధికారులు ఫైల్ చేశారో అఫిడవిట్ లో లెక్క ఇవ్వలేదు.

వెస్ట్ బెంగాల్ లో SIR ప్రక్రియ అనంతరం జ్యుడీషియల్ అధికారులు విచారించి జాబితాలో చేర్చిన వోటర్లలో 16.2 లక్షల వోటర్ల పేర్లు తొలగించాలని ఎన్నికల కమిషన్ అప్పీలు చేసిందని అఫిడవిట్ లో కమిషన్ తెలిపింది. (ఎన్ని అప్పీళ్లతో ఇంతమంది వోటర్ల తొలగింపుకు పిటిషన్ లు వేసిందో అది చెప్పలేదు.) ఈ సమాధానం EC సుఖబీర్ సింగ్ సంధు ప్రశ్నించిన 10 వారాల తర్వాత, అదీ అఫిడవిట్ ద్వారా వెలువడింది. ఈ అప్పీళ్లను ఇంకా కమిషన్ వెనక్కి తీసుకోలేదు. ఈ వోటర్లు 2025 బెంగాల్ ఎన్నికల్లో వోట్లు వేశారు కూడా.

అంతిమంగా ఎన్నికల కమిషన్ (లేదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్) ఎస్‌ఐ‌ఆర్ లో జరిగిన చట్ట విరుద్ధ చర్యల గురించి అఫిడవిట్ లో చెప్పింది ఏమిటంటే: “SIR ప్రక్రియలో ఎలాంటి తప్పుడు నిర్ణయము జరగలేదు. ముగ్గురు కమిషనర్లు ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకున్నారు. ఇద్దరు కమిషనర్లు వ్యక్తం చేసిన అసమ్మతి నోట్ లు రాయటం నిర్ణయ ప్రక్రియలో భాగంగానే జరిగింది తప్ప అతీతంగా జరగలేదు. ఒక కమిషనర్ యొక్క అసమ్మతి నోట్ సెక్షన్ 18 ప్రకామ్ కమిషన్ నిర్ణయం కిందికి రాదు. బాధ్యతలు అప్పగించబడిన కొందరు అధికారులు కొన్ని చర్యలు తీసుకున్నారు. వాటిని సవరించవలసి ఉన్నది”

ఒక రాజకీయ పార్టీకి ప్రయోజనం చేకూర్చటం కోసం ఒక భారీ రాజ్యాంగ కుట్రకు పాల్పడిన చీఫ్ ఎన్నికల కమిషనర్, పత్రికల అప్రమత్తత వలన మధ్యలోనే దొరికిపోయి చేసిన పెద్ద తప్పును ఒక మైనర్ మిస్టేక్ గా మార్చి చూపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సందర్భం ఇప్పుడు మన కళ్ల ముందు నిలబడి ఉన్నది.

సుప్రీం కోర్టు విచారణ ఇంకా కొనసాగనున్నందున, మును ముందు జరిగే విచారణలో చీఫ్ ఎన్నికల కమిషన్ నిర్ణయాలను కోర్టు చట్ట విరుద్ధ చర్యలుగా తీర్మానిస్తుందో లేక కమిషన్ తనను తాను సర్టిఫికేట్ ఇచ్చుకున్నట్టు ‘పాలనా పరంగా ఏవో చిన్న తప్పులు జరిగాయని, తప్పులను ఇప్పటికే సవరించుకున్నందున ఇలాంటివి మునుముందు జరగకుండా చూడండి’ అంటూ ముంజేయి పైన చిన్నగా తట్టి హెచ్చరిక చేయటంతో సరిపెడుతుందో చూడ వలసి ఉన్నది.

–

మరో పక్క అమిత్ షా దూకుడు కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీకి విదేశాల నుండి మద్దతు వస్తున్నదా లేక బి‌జే‌పి పార్టీకి ప్రభుత్వానికీ విదేశాల నుండి మద్దతు అందుతున్నదా అన్న అంశాన్ని తెల్చేందుకు బహిరంగ చర్చకు రావాలని రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి సవాలు విసురుతున్నాడు. తొలగించిన 13.2 కోట్లలో 4.25 కోట్ల వోటర్లు రెండు చోట్ల వోట్లు (డూప్లికేట్) కలిగి ఉన్నారని 3 కోట్ల మండి వోటర్లు చనిపోయారని (డెడ్), మరో కోటి వోటర్లు (ఒకే చోట) రెండు ఎంట్రీలు కలిగి ఉన్నారని, హైద్రాబాద్ లో నవంబర్ 2 తేదీన జరిగిన “సేవ్ డెమోక్రసీ-రిమూవ్ అనార్కీ” ర్యాలీలో ప్రసంగిస్తూ చెప్పాడు.

ఇక్కడ రెండు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఒకటి: 9.5 కోట్ల మందికి లెక్క చెప్పిన అమిత్ షా మిగిలిన 4.95 కోట్లమంది తొలగించిన వోటర్ల ఎవరో ఎందుకు చెప్పలేదు, ఇతరములు (Others) కింద వారిని ఈ‌సి‌ఐ చేర్చిందా? రెండు: ECI ఈ లెక్కను బూత్ వారీగా, జిల్లా వారీగా ఇచ్చింది గానీ దేశం మొత్తానికి కన్సాలిడేటెడ్ లెక్క ఇవ్వలేదు. అలాంటి కన్సాలిడేటెడ్ అంకెలు అమిత్ షా కు ఎలా చేరాయి?

అమిత్ షా, రాహుల్ ఆరోపణలోని ‘విదేశీ హస్తం’ సంగతి వదిలి పెట్టి “అక్రమ చొరబాటుదారులకు వోటు హక్కు ఇవ్వటం కోసమే రాహుల్, కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేస్తున్నారని, ఎస్‌ఐ‌ఆర్ ద్వారా అక్రమ వోటర్లను తొలగించటం ఖాయమని” బి‌జే‌పి బహిరంగ సభల్లో చెబుతున్నాడు. ఎస్‌ఐ‌ఆర్ పైన పార్లమెంటులో చర్చకు రావాలని రాహుల్ గాంధీకి ప్రతి సవాలు విసిరాడు కూడాను. అక్రమ వోటర్లకు రాహుల్ మద్దతు అన్న ఆరోపణ, బి‌జే‌పి వోటర్లను ఉద్దేశించినది. కనుక ఈ కధ ముగిసి పోలేదు. ఇంకా ఉంది!

స్పందించండి