యుద్ధం ఊబినుండి బైటపడాలంటే..! -ఇరాన్ 7 షరతులు

అమెరికా తనకు తానే సృష్టించుకున్న యుద్ధం ఊబి నుండి బైటపడటానికి ఇరాన్ మరొక అవకాశం ఇచ్చింది. మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ ద్వారా మొదటి అవకాశం ఇచ్చిన ఇరాన్ ఇప్పుడు ఏడు షరతులతో కూడిన మరొక అవకాశాన్ని అమెరికాకు కల్పించింది. అయితే మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ లోని అంశాలకు ఇప్పుడు ప్రతిపాదించిన ఏడు షరతులకు పెద్ద తేడా లేనట్టు కనిపిస్తున్నది.

ఇరాన్ కు చెందిన సుప్రీం నేషనల్ కౌన్సిల్ అధిపతి మోహసేన్ రెజాయ్ శనివారం ఈ మేరకు తన షరతుల జాబితాను మధ్యవర్తిత్వం వహిస్తున్న కతార్ కు తెలియజేసింది. ఏడవ నెలలోకి అడుగు పెట్టిన అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ఆధిపత్య పూరిత దురాక్రమణ యుద్ధంలో ఇప్పటికీ ఇరాన్ దే పై చేయిగా కొనసాగుతుండగా, మరో పక్క అమెరికా మిత్ర దేశంగా చెప్పుకునే అనుచర దేశం సౌదీ అరేబియా, యెమెన్ లోని అన్సర్ అల్లా లేదా హుతీ మిలిటెంట్ సైన్యం నుండి దాడుల పరంపరను ఎదుర్కొంటున్నది.

హుతిల పైన మిసైల్ దాడులు చేయాలని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఆల్ సాద్, అమెరికాకు గత గురువారం విజ్ఞప్తి చేసినప్పటికీ అమెరికా అందుకు నిరాకరించింది. అమెరికా నిరాకరణ వెనుక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ హస్తం ఉన్నదని తెలుస్తోంది. (యెమెన్ లోని ఉత్తర భాగాన్ని స్వాధీనంలో ఉంచుకున్న సౌదీ-అనుకూల పాలకులతో యుఏఈ అనుకూల ఫ్యాక్షన్ ఒకటి తనదైన యుద్ధం చేస్తున్నది) ఎర్ర సముద్రం ముఖ ద్వారం లో ఉన్న ద్వీపాలను హుతీలు ఆక్రమించుకోవటంతో ఎర్ర సముద్రం మీదుగా సూయజ్ కెనాల్ ద్వారా జరుగుతున్న సౌదీ చమురు ఎగుమతులు బంద్ అయ్యాయి. ఫలితంగా సౌదీ అరేబియా ఎగుమతుల ఆదాయం జీరో కు చేరింది.

ఈ నేపధ్యంలో యుద్ధ విరమణ కోసం ఇరాన్ షరతులతో కూడిన ప్రతిపాదనను అమెరికా ముందు ఉంచింది. అమెరికా అధ్యక్షుడి నుండి స్పందన కోసం ఎదురు చూస్తున్నట్టు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధిపతి మోహసేన్ రెజాయ్ ట్విట్టర్ లో ప్రకటించాడు.

“చర్చలు ప్రారంభం కావటానికి వీలుగా 7 షరతులను ఇరాన్, అమెరికా ప్రభుత్వానికి అందజేసింది. టెహ్రాన్ సందేశం ఎలాంటి సందిగ్ధానికి తావు లేకుండా స్పష్టంగా ఉంది. వాషింగ్టన్ తనకు తానే సృష్టించుకున్న యుద్ధం ఊబి నుండి బైట పడాలంటే ఇరాన్ విధించిన షరతులను ఆమోదించటం తప్ప మరో దారి లేదు” అని మెహసిన్ రెజాయ్, ఆదివారం నాడు ట్విట్టర్ లో ప్రకటించాడు.

ఇరాన్ షరతుల గురించి వివరిస్తూ రెజాయ్ కతార్ కి చెందిన ఆల్-జజీరా న్యూస్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. “మా షరతులను అంగీకరించటం అమెరికా ప్రయోజనాలకు ఉపయోగం. ట్రంప్ చేసే బెదిరింపుల వలన ఎలాంటి ఫలితాలు ఉండవు. నిర్ణయాత్మక యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాము” అని రెజాయ్ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ప్రస్తుత యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగించటానికి ఒక వ్యూహం ప్రకారం ఇరాన్ కృషి చేస్తున్నదని ఆయన చెప్పాడు.

ఇరాన్ 7 షరతులు

అన్ని ఫ్రంట్ లలో యుద్ధాన్ని విరమించాలి: పశ్చిమాసియాలో అమెరికా తరపున సాగుతున్న యుద్ధాలన్నీ ముగించాలి. లెబనాన్ మరియు గాజా (పాలస్తీనా) లపై ఇజ్రాయెల్ చేస్తున్న నరహంతక దురాక్రమణ దాడులు, ఇరాన్ లోని పాపులర్ మొబిలైజేషన్ ఫ్రంట్ మిలిటెంట్ల పైన అమెరికా చేస్తున్న దాడులు అన్నీ ఆగిపోవాలని ఇరాన్ కోరింది. అమెరికాతో ఒప్పందం కుదిరాక కూడా ఒప్పందంతో మాకు సంబంధం లేదంటూ ఇజ్రాయెల్, లెబనాన్, గాజా లపై జీనోసైడ్ ని కొనసాగిస్తున్నది. దీన్ని ప్రధానంగా ఇరాన్ దృష్టిలో ఉంచుకున్నట్లు కనిపిస్తోంది.

స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలి: ఒబామా అధ్యక్షరికంలో అమెరికా-ఇరాన్ ల మధ్య కుదిరిన ఒప్పందం దరిమిలా ఇరాన్ పరిమిత స్థాయిలో చేసిన చమురు ఎగుమతుల తాలూకు ఆదాయం దుబాయ్, కతార్ బ్యాంకుల్లో జమ చేసింది. ట్రంప్, పదవి చేపట్టాక ఒబామా ఒప్పందాన్ని రద్దు చేసి ఇరాన్ సొమ్మును స్తంభింపజేశాడు. ఈ ఆస్తులను విడుదల చేయాలన్నది ఇరాన్ డిమాండ్.

నావల్ బ్లాకేడ్ ను ఎత్తివేయాలి: అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించాక హోర్ముజ్ జలసంధి గుండా జరిగే చమురు, ఇతర రవాణాను ఇరాన్ నియంత్రించటం ప్రారంభించింది. తమ సార్వభౌమాధికారం కింద ఉన్న హోర్ముజ్ జలాల రవాణా పైన రుసుము వసూలు చేయటం ప్రారంభించింది. ఇరాన్ నియంత్రణను వ్యతిరేకిస్తూ అమెరికా హోర్ముజ్ కు బైట అంతర్జాతీయ సముద్ర జలాలలో ఇరాన్ నౌకా రవాణాపైన తన సొంత బ్లాకేడ్ విధించింది.

ప్రాంతీయ యుద్ధాలను ఆపాలి: యెమెన్, సౌదీ అరేబియాల మధ్య యుద్ధాన్ని ఆపాలని ఇరాన్ కోరింది. అమెరికా ఆదేశిస్తే సౌదీ అరేబియా వెంటనే యెమెన్ పై చేస్తున్న ఆధిపత్య యుద్ధాన్ని విరమిస్తుంది. ఒక్క ఇరాన్, లేబనీస్ హిజ్బొల్లా, యెమెనీ హుతీలు తప్ప పశ్చిమాసియా లోని ఇతర అన్ని అరబ్ దేశాలు అమెరికా ఆదేశాలను పాటిస్తాయి.

అమెరికా ప్రవర్తన, బెదిరింపులు సవరించుకోవాలి: బుద్ధి పుట్టినప్పుడల్లా అమెరికా అధ్యక్షుడు ఇరాన్ పైన బెదిరింపులు చేస్తుండటం తెలిసిన విషయమే. ఈ బెదిరింపులు ట్రంప్ పిచ్చితనంగా ప్రపంచం భావించినప్పటికీ ఆ బెదిరింపుల వెనుక షేర్ మార్కెట్ లాభాపేక్ష లక్ష్యాన్ని ట్రంప్ కలిగి ఉన్నాడు. వారం చివరిలో ఇరాన్ పైన తీవ్ర బెదిరింపులు చేయగానే షేర్ మార్కెట్లు పడిపోతాయి. తిరిగి సోమవారమో లేదా ఆదివారం సాయంత్రమో ‘అబ్బే అదేం లేదు, చర్చల కోసం ఇరాన్ బ్రతిమిలాడుతోంది. రేపో మాపో ఒప్పందం తధ్యం’ అని ప్రకటిస్తాడు. షేర్ మార్కెట్లు అమాంతం పెరిగిపోతాయి. ఈ హెచ్చు తగ్గుదల ద్వారా షేర్ మార్కెట్ లలో లాభాలు ఆర్జించటం ట్రంప్ లక్ష్యం.

యుద్ధ పరిహారం చెల్లించాలి: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ లో ప్రజా పాలనా నిర్మాణాలు గరిష్టంగా దెబ్బ తిన్నాయి. రోడ్లు, వంతెనలు, ప్రభుత్వ కార్యాలయాలు, మిలటరీ నిర్మాణాలు, విమానాశ్రయాలు అనేకం దెబ్బ తిన్నాయి. యుద్ధాన్ని అమెరికాయే ప్రారంభించింది కనుక ఈ నష్టాలకు పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తున్నది.

ఇరాన్ అనుకూల రాయబార చర్యలు చేపట్టాలి: ఇరాన్ దేశానికి ఉన్న అంతర్జాతీయ హక్కులను గుర్తించటం, ఇతర దేశాలు ఇరాన్ తో అంతర్జాతీయ రాయబార సంబంధాలు నెలకొనేందుకు ఆటంకాలు కలిగించక పోవటం, ఇరాన్ లో వివిధ దేశాల రాయబార కార్యాలయాలు నెలకొల్పటం.. తదితర హక్కులను గుర్తించాలని ఇరాన్ డిమాండ్ చేసింది.

ఈ యేడు షరతులు గతంలో కుదిరిన మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ లోని అంశాలతో దాదాపు సమానంగా ఉన్నాయి. పశ్చిమాసియా నుండి అమెరికా తన సైన్యాలను, యుద్ధ స్థావరాలను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ ఒక్కటే ఈ ఏడు షరతులలో లేదు. ఇరాన్ దాడుల దెబ్బకు అమెరికా తన స్థావరాలను వదిలి పెట్టి ఐరోపా దేశాలకు ముఖ్యంగా జర్మనీ, ఇజ్రాయెల్ లకు తరలిపోయింది. అక్కడి నుండే యుద్ధం నడుపుతోంది. అందుకే ఏడు షరతులలో ఈ డిమాండ్ లేకపోయి ఉండొచ్చు.

ఇరాన్ షరతులను అంగీకరించటం అంటే ఇరాన్ చేతుల్లో తాము ఘోరంగా ఓడిపోయామని అమెరికా అంగీకరించినట్టే లెక్క. కనుక ఈ షరతులను అమెరికా అంగీకరించే అవకాశం కనిపించటం లేదు. వయా మీడియాగా కొన్ని షరతులకు ఒప్పుకుని మిగిలిన వాటిని వాయిదా వేద్దామని అమెరికా ప్రతిపాదిస్తే యుద్ధ విరమణ సాధ్యం అవుతుందేమో. కానీ అమెరికా గురించి తెలిసిన వాళ్ళకు దానికి కూడా అవకాశాలు లేవని చెబుతారు.

Leave a Reply