
–
ఇన్నాళ్లూ అమెరికా, యూరోపియన్ యూనియన్ రాజ్యాలు గానీ ప్రపంచానికి ఏమి చెప్పాయి? ఇరాన్ ప్రభుత్వం మతతత్వ ప్రభుత్వం అనీ, తన ప్రజలను తీవ్రంగా అణచివేస్తున్నదనీ, అమెరికా ప్రవచించే ప్రజాస్వామ్యం కోసం వారు అర్రులు చాస్తూ అందుకు ఆటంకంగా ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అందుకే యేటా అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తూ ఖమెనీ ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారని చెప్పాయి. తాము ఇరాన్ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు మద్దతు ఇస్తున్నామని, వారి ఆకాంక్షలు నెరవేరేందుకు సహకరిస్తున్నామని అందుకే అక్కడ ఆందోళనలకు వివిధ రూపాల్లో మద్దతు ఇస్తున్నామని చెప్పాయి.
అమెరికా, ఈ.యు లు చెప్పినదంతా ఒట్టి అబద్ధపు కూతలే అని, అమెరికా గూఢచార సంస్థ సిఐఏ, ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ లు విసిరే ఎంగిలి కూటికి ఆశపడి కొద్ది మంది దేశ ద్రోహులు మాత్రమే అల్లర్లు రెచ్చగొడుతూ, మారణాయుధాలతో ఇరాన్ ప్రజల పైనా, పోలీసుల పైనా కాల్పులు, బాంబు దాడులు చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక కుట్రలకు పాల్పడుతూ వచ్చారని నిజం తెలిసిన అనేక మంది స్వతంత్ర విలేఖరులు పలుమార్లు పలువిధాలుగా వెల్లడి చేశారు.
తాజాగా ఇరాన్ లో జరుగుతున్న నిరసన ప్రదర్శనలు ఆ విషయాన్ని నిర్ద్వంద్వంగా నిరూపిస్తున్నాయి. ఇప్పుడు జరుగుతున్న నిరసన ప్రదర్శనలు ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నవే. కానీ అందుకు ప్రజలు చెబుతున్న కారణాలు వింటే ఆశ్చర్యం కలగక మానదు. వాస్తవాలు తెలిసిన వారికి ఆశ్చర్యం కలగక పోవచ్చు గానీ పశ్చిమ కార్పొరేట్ పత్రికల వార్తలను గుడ్డిగా నమ్మే వాళ్ళు మాత్రం తప్పకుండా ఆశ్చర్య పోతారు.
నిన్న ఆదివారం (14-06-2026) వరకు జరిగిన పరోక్ష శాంతి చర్చల పర్యవసానంగా సోమవారం జూన్ 15 తేదీన ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఒక అవగాహన (మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ -ఎం.ఓ.యు) కుదిరిందని పాకిస్తాన్, ఇరాన్, అమెరికా దేశాల ప్రతినిధులు ప్రకటించారు. అవగాహన కుదిరిందన్న ప్రకటన తెలిసిన తర్వాత స్టాక్ మార్కెట్ లు బుస్సు మని పైకి పొంగగా, అంతర్జాతీయ చమురు ధరలు కనీసం 5 శాతం పైగా తగ్గిపోయాయి. అంటే ఇరాన్-అమెరికా దేశాల సో-కాల్డ్ శాంతి ఒప్పందాన్ని మార్కెట్లు ఆనందంతో స్వాగతించాయి.
కానీ ఇరాన్ ప్రజలు ఈ అవగాహనా ఒప్పందాన్ని స్వాగతించటం లేదు. పైగా వ్యతిరేకిస్తున్నారు. 47 యేళ్ళ పాటు ఇరాన్ ప్రజలను, ఇరాన్ ఆర్ధిక వ్యవస్థను, వాణిజ్యాన్ని సమస్తాన్ని విషమ ఆంక్షలతో నష్టపరిచిన అమెరికాతో శాంతి ఒప్పందం ఎలా కుదుర్చుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ ప్రతినిధులుగా శాంతి ఒప్పందం చర్చల ప్రతిపాదనా పత్రాలను రూపొందించతంలో పాత్ర వహించిన విదేశీ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఆరాఘ్చి, పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బఘర్ ఘాలీబాఫ్ లకు వ్యతిరేకంగా వారు తమ నినాదాలను ఎక్కు పెట్టారు.
ఇరాన్ ప్రజలు తమకు ప్రజాస్వామ్యం రుచి చూపిస్తామని ఇన్నాళ్లూ ఆతృత పడిన అమెరికాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్ని నష్టాలు ఎదుర్కొన్నా సరే అమెరికా, ఇజ్రాయెల్ దేశాల పొగరు దిగిపోయి, పశ్చిమాసియా నుండి, గల్ఫ్ నుండి పంచె ఎగ బట్టుకొని పలాయనం చిత్తగించే వరకు వారిపై యుద్ధం కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 28 తేదీన ఓ పక్క శాంతి చర్చలు జరుగుతుండగానే ఇరాన్ ను నిలువునా మోసం చేస్తూ ఒక్కుమ్మడిగా ఇరాన్ పైన మిసైళ్ల వర్షం కురిపించి సమావేశంలో ఉన్న దేశ సుప్రీం నేత అయితుల్లా ఖమెనీ తో పాటు 35 మందికి పైగా మంత్రులను, మిలట్రీ నాయకులను హత్య చేసిన అమెరికాతో శాంతి సంధి ఎలా కుదుర్చుకుంటారని వారు ఆగ్రహంగా ప్రశ్నిస్తున్నారు.
అనేక ఇరాన్ నగరాల్లో ఇరాన్-అమెరికా అవగాహనకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఈ అవగాహన ద్వారా ఇరాన్ జాతీయ ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ అవగాహన అమలు కావటానికి వీలు లేదని పట్టుబడుతున్నారు. ఇరాన్ విదేశీ మంత్రి అబ్బాస్ ఆరాగ్చి, పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ ఘాలీబాఫ్ లకు వ్యతిరేకంగా వారు నినాదాలు ఇస్తున్నారు. ఒప్పందం కుదరబోతున్నదని ఆదివారం నాడు పాకిస్తాన్ ప్రతినిధి ప్రకటించినప్పటి నుండి ఈ ఆందోళనలు జరుగుతున్నాయి.
- ఇరాన్ ప్రజల ఆందోళనల గురించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి:
- టెహ్రాన్ లోని ఇబ్న్ సినా స్క్వేర్ లో ప్రజలు ఆదివారం ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
- మషాద్ నగరంలో డజన్ల మంది పౌరులు విదేశాంగ మంత్రి ఆరాఘ్చి కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.
- అవగాహన ఒప్పందం వలన వ్యూహాత్మకంగా అత్యంత సున్నిత ప్రాంతమైన హోర్ముజ్ జలసంధి పైన ఇరాన్ తన ప్రభావాన్ని కోల్పోతుందని నిరసనకారులు భావిస్తున్నారు.
- మషాద్ లో ఆందోళనకారులు ఇరాన్ జాతీయ జెండాలు ఊపుతూ, “నిజాయితీ లేని చొరబాటుదారు ఆరాఘ్చి నశించాలి!”, “అరాఘ్చి డౌన్ డౌన్” అని నినాదాలు చేశారు.
- అరాఘ్చి తయారు చేసిన ఒప్పంద పత్రం ఇరాన్ ను అవమానానికి గురి చేస్తుందని, బలహీనం చేస్తుందని ఆందోళనకారులు చెబుతున్నారు.
- ఒప్పందంలో అమెరికాకు అనవసరమైన రాయితీలను అమెరికాకు ఇచ్చాడని ఆందోళనకారులు ఆరోపించారు.
- ఈ నేపధ్యంలో విదేశీ మంత్రి అరాఘ్చి, స్పీకర్ ఘాలీబాఫ్ లు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అవగాహన పత్రం ఇంకా కుదరక మునుపే విదేశీ మంత్రి ఆరాగ్చి ఒక పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం ఇరానియన్ పోర్టుల పైన అమెరికా విధించిన నావల్ బ్లాకేడ్ ను తొలగిస్తారని చెప్పాడు. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవటం కోసం ఒక సాధనంగా అవగాహన పత్రం ఉంటుందని ఆయన చెప్పాడు.
అయితే నిరసనకారులు మాత్రం ఆరాగ్చి మాటలకు పెద్దగా విలువ ఇస్తున్నట్లు కనిపించటం లేదు. ఈ ఒప్పందం ఇరాన్ ప్రయోజనాలను ఏ మాత్రం కాపాడబోదు అని వారు గట్టిగా చెబుతున్నారు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి పైన ఇరాన్ కి ఉన్న పట్టు సడలుతుందని వారు భయపడుతున్నారు.
ఫిబ్రవరి 28 తేదీ నుండి ఏప్రిల్ 8 వరకు నిరంతరాయంగా ఇరాన్ పైన కురిసిన బాంబులు, మిసైళ్లు, డ్రోన్ ల వర్షం ను గానీ, హోర్ముజ్ జలసంధిలో ఉన్న ఇరానియన్ పోర్టుల పైన అమెరికా విధించిన బ్లాకేడ్ ను గానీ, 47 సం.ల పాటు పచ్చి ద్వేషంతో, ఇరాన్ లొంగదీయాలన్న లక్ష్యంతో ఇరాన్ చమురు వనరులను కొల్లగొట్టేందుకు ఆటంకంగా ఉన్న ఇస్లామిక్ రివల్యూషనరీ ప్రభుత్వాన్ని కూల్చి వేసి కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్న లక్ష్యంతో అత్యంత అమానవీయమైన వాణిజ్య, ఆర్ధిక, రాజకీయ, రాయబార ఆంక్షలను అన్నింటిని తట్టుకుని ఇరాన్ నిలబడినదంటే కారణం ఇరాన్ ప్రభుతానికి ఇరాన్ ప్రజలు ఇచ్చిన సంపూర్ణమైన, షరతులు లేని మద్దతు మాత్రమే కారణం. ప్రజల మద్దతు లేనిదే జాతి విద్వేష మత్త గజమైన అమెరికాను, యూదు జాత్యహంకార ఇజ్రాయెల్ ను 47 యేళ్ళ పాటు నిలువరించటం సాధ్యం అయ్యే పని కాదు.
ఒప్పందం ఏం చెబుతోంది?
ఇరాన్ కు చెందిన మెహర్ న్యూస్ ప్రకారం ఇరాన్, అమెరికా దేశాలు 14 అంశాల ‘మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్’ ను ఆమోదించాయి. ఇది ఒప్పందం కాదు; కేవలం అవగాహన మాత్రమే. ఈ అవగాహన వెలుగులో ఇరు దేశాల మధ్య రానున్న 60 రోజుల పాటు చర్చలు జరుగుతాయి. చర్చలు జరుగుతుండగా కొన్ని విడతలుగా ఇరాన్ డిమాండ్ చేసిన అంశాలలో కొన్ని అమలు అవుతూ ఉంటాయి. అవగాహన లోని అంశాలు అమలు చేయటంలో సఫలం అయితేనే అంతిమ ఒప్పందానికి ఇరాన్ అంగీకరిస్తుంది.
14 అంశాల ఒప్పందాన్ని ఇరాన్ పత్రికలు, వార్తా సంస్థలు మాత్రమే వెల్లడి చేశాయి. పశ్చిమ కార్పొరేట్ పత్రికలు ఒప్పందం లోని ఒకటి రెండు అంశాలను మాత్రమే చెబుతున్నాయి. కొన్ని వార్తా సంస్థలు ఒప్పందం లోని అంశాలకు ఇరాన్ భావిస్తున్న అర్ధం కాకుండా తమ సొంత అర్ధాన్ని ఇస్తున్నాయి.
14 అంశాలలో ముఖ్యమైనవి హోర్ముజ్ జలసంధి పైన ఇరాన్ బ్లాకేడ్ ఎత్తివేస్తుంది; ఇరాన్ పోర్టుల పైన అమెరికా తన బ్లాకేడ్ ని ఎత్తివేస్తుంది. హోర్ముజ్ గుండా వాణిజ్యానికి ద్వారాలు తెరుచుకుంటాయి. ఐతే వెనువెంటనే హోర్ముజ్ లో నౌకలు, చమురు ఓడలు ప్రయాణించటం సాధ్యం కాకపోవచ్చు. జలసంధి లో ఇరాన్ విడిచిన పేలుడు మైన్ లను తొలగించాలి. తర్వాత నౌకాల రాకపోకల విషయంలో ఇరాన్, ఒమన్ దేశాలు నిర్దిష్ట ఫీజు వసూలు గురించిన నియమ నిబంధనలను రూపొందించాలి. ఆ తర్వాతే పూర్తి స్థాయిలో వాణిజ్యం సాధ్యపడుతుంది.
హోర్ముజ్ వాణిజ్య నౌకల పైన ఇరాన్ దేశం టోల్ ఫీజు వసూలు ఇక ఉండదు అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో ఆర్భాటంగా ప్రకటించాడు. టోల్ ఫీజు ఉండదు గానీ ఏదో ఒక ఫీజు మాత్రం వసూలు చేస్తారని ఇరాన్ అధికారుల మాటలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. మధ్యధరా సముద్రంలో బాస్ఫోరస్ కాలవల గుండా జరిగే వాణిజ్యం పైన టర్కీ ఎన్విరాన్మెంట్ ఫీజు వసూలు చేస్తుంది. అదే తరహాలో హోర్ముజ్ జలసంధిలోనూ ఎన్విరాన్ మెంటల్ ఫీజు, నిర్వహణ ఫీజు, రక్షణ ఫీజు ఇలాంటివి వసూలు చేస్తామని, ఈ ఫీజు ఇరాన్, ఒమన్ లు పంచుకుంటాయని తెలుస్తున్నది.
ఫ్రీజ్ చేసిన ఇరాన్ విదేశీ మారక ద్రవ్య నిధులలో సగం మొత్తాన్ని అమెరికా గ్రూపు విడుదల చేయకుండా, ఇరాన్ చమురు వాణిజ్యం పైన విధించిన ఆంక్షలను ఎత్తివేయకుండా, అమెరికా విధించిన నావల్ బ్లాకేడ్ ను తొలగించకుండా అంతిమ చర్చలు ప్రారంభం కాబోవని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది (మెహర్ న్యూస్).
ఇరు దేశాల మధ్య చర్చలు ముగిసి అంతిమ ఒప్పందం కుదిరాక సదరు అంతిమ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో తీర్మానంగా ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. అనగా ఇరాన్-అమెరికా ల మధ్య కుదిరే ఒప్పందానికి అంతర్జాతీయ చట్టంగా మారుతుంది.

మెమో డ్రాఫ్ట్ ప్రకారం సకల ఫ్రంట్ లలోనూ శాశ్వత కాల్పుల విరమణ అమలు జరగాలి. అనగా ఇరాన్-అమెరికా, ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య కాల్పుల విరమణ అమలు జరిగితే సరిపోదు. ముఖ్యంగా ఇజ్రాయెల్-లెబనాన్, ఇజ్రాయెల్ – గాజా ల మధ్య కూడా కాల్పుల విరమణ అమలు జరిగితీరాలి.
లెబనాన్ లోని హిజ్బొల్లా మిలీషియా ఇక నుండి ఇరాన్ కు ప్రాక్సీగా ఉండబోదని ఇరాన్ అధికారుల మాటలు తెలియజేస్తున్నాయి. ఇక నుండి లెబనాన్ లోని ప్రతిఘటనా మిలీషియా (రెసిస్టెన్స్ మిలీషియా) ఐన హిజ్బొల్లా ఇరాన్ తో పాటు కలిసి ఉన్న ఉనికి కలిగిన చట్టబద్ధ సంస్థ అవుతుంది. ఇరాన్ పైన కాల్పుల విరమణ అంటే అర్ధం అది లెబనాన్ (హిజ్బొల్లా) పైన కూడా కాల్పుల విరమణగా అమెరికా, ఇజ్రాయెల్ లు అమలు చేయాలి.
అవగాహన పైన సంతకాలు స్విట్జర్లాండ్ లోని జెనీవా నగరంలో వచ్చే శుక్రవారం (జూన్ 19) జరుగుతాయి. అవగాహన పత్రం లోని అంశాల ప్రకారం సంతకాలు అయ్యాక 30 రోజుల లోపల నావల్ బ్లాకేడ్ ను అమెరికా ఎత్తివేసి హోర్ముజ్ జలసంధి తెరవటానికి ఏర్పాట్లు చేయాలి. అనంతరం హోర్ముజ్ రవాణా గురించి ఏర్పాట్లను ఇరాన్ చూసుకుంటుంది. ఇరాన్ చుట్టూ పక్కల దేశాల నుండి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించాలని కూడా పత్రం పేర్కొన్నది. ప్రస్తుత సైన్యానికి మించి సైనికులను అమెరికా ఈ ప్రాంతంలో ఉంచకూడదని, ఇరాన్ చమురు ఎగుమతులు మరియు ఇంధన ఎగుమతుల పైన సరికొత్త ఆంశాలు ప్రకటించకూడదని అవగాహన పత్రం కోరుతున్నది.
విలన్ ఇజ్రాయెల్!
ఇల్లు అలుకగానే పండుగ కాదు కదా! ఇరాన్, అమెరికా ల ఒప్పందం లోని అంశాలు చూస్తే ఇరాన్ పరమాద్భుతమైన విజయాని సాధించిందని చెప్పటంలో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. ఇరాన్ లో చొరబడి, ఇరాన్ అణు కర్మాగారంలో ఉంచిన 450 గ్రాముల శుద్ధి చేసిన యురేనియం ను దొంగిలించటమే కాకుండా ఇరాన్ ప్రభుత్వాన్ని కూలగొట్టి తాము చెప్పినట్టు వినే కీలుబొమ్మ ప్రభుత్వాన్ని నిలబెట్టాలన్న లక్ష్యంతో అమెరికా, ఇజ్రాయెల్ లు యుద్ధాన్ని ప్రారంభించాయి.
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ దౌష్ట్యాన్ని, అమెరికా తరపున ఇజాయెల్ సాగిస్తున్న జాత్యహంకార పాలనను, పాలస్తీనాలో అక్రమ యూదు సెటిల్మెంట్ల నిర్మాణాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న ఏకైక దేశం ఇరాన్. మిగిలిన ఇతర గల్ఫ్ దేశాలన్నీ అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు సేవలు చేసేవే. అవి అమెరికా, ఇజ్రాయెల్ ఏమి చెబితే అది అమలు చేస్తాయి. ఆ విధానాలు సొంత ప్రజలకు ఎంత ఘోరమైన నష్టాన్ని కలుగుజేసినా కూడా గల్ఫ్ దేశాలు మారు మాట్లాడకుండా అమలు చేస్తూ వచ్చాయి. ఇరాన్ సరిగ్గా అందుకు విరుద్ధంగా పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ ల పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని ఎదుర్కొంటూ వచ్చింది. తాను ఎదుర్కోవటమే కాకుండా ఇరాక్, లెబనాన్, గాజా, యెమెన్, సిరియా దేశాల ప్రభుత్వాలకు మద్దతు అందజేస్తూ శక్తివంతమైన ‘యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్’ ను ఇరాన్ నిర్మించింది.
ఇరాన్ రాజ్యం కేవలం మతతత్వ రాజ్యంగా కొట్టిపారవేయటానికి వీలు లేదు. ఎందుకంటే అక్కడ పాలకులు ఎలాంటి నిషేధం లేకుండా అన్ని రకాల భావజాలాలను, సిద్ధాంతాలను నేర్చుకుని అవగాహన పెంచుకునేందుకు అవకాశాలను విద్యార్ధులకు కల్పించారు. పాఠ్య పుస్తకాలలో ఇస్లామిక్ మత భావాజాలాన్ని నింపి ప్రజలను గుడ్డి భక్తులుగా మార్చేందుకు ఇరాన్ రాజ్యం ప్రయత్నం చేయలేదు.
ఇరాన్ విద్యారంగం ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నదంటే STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేధమెటిక్స్) రంగాలలో అద్భుతమైన ప్రగతిని సాధించింది. ఎంతటి ప్రగతి అంటే ఇరాన్ మంత్రులు, ప్రభుత్వాధికారులలలో మెజారిటీ ఉన్నత విద్యావంతులే ఉంటారు. అనేక మంది వివిధ ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ విభాగాల్లో పి.హెచ్.డి చేసిన వాళ్ళే అయి ఉంటారు. మనకు రెగ్యులర్ గా ఇరాన్ తరపున టి.వి లలో కనిపించే మంత్రులు, డిప్లొమేట్స్ అందరూ ఏదో ఒక రంగంలో విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినవారే.
STEM రంగంలో శక్తివంతమైన విద్యా, పరిశోధక రంగాలను అభివృద్ధి చేసిన ఇరాన్ వాటి సహాయంతో ఓ పక్క ప్రజల సౌకర్యాలను అభివృద్ధి చేస్తూనే మరో పక్క అధునాతనమైన మిసైల్ ఆయుధాలను అభివృద్ధి చేసింది. ఇరాన్ నిర్మించిన హైపర్ సోనిక్, సూపర్ సోనిక్ వేగాలతో ప్రయాణించగల మిసైళ్లను ప్రస్తుతం కేవలం చైనా, రష్యా దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి. ఇండియాలో ప్రయోగాలు జరుగుతున్నాయి, కొంత ప్రగతి సాధించాబడింది గానీ ఇరాన్ స్థాయికి ఇంకా చేరలేదు. 40 రోజుల యుద్ధంలో ఇరాన్ ప్రయోగించిన ఆయుధాలు వైఫల్యం అనేది లేకుండా సరిగ్గా గురిచూసి లక్ష్యాన్ని ఛేదించటంలో సఫలం అయ్యాయి. అందుకే అమెరికా మిలటరీ స్థావరాలు, ఇజ్రాయెల్ స్థావరాలు కోలుకోలేని నష్టాన్ని ఎదుర్కొన్నాయి.
ఇరాన్ సాధించిన అభివృద్ధి ఇజ్రాయెల్, అమెరికాల కు మరింత కంటగింపు అయింది. ఇప్పుడిక ఇరాన్ అభివృద్ధిని, ఆయుధ శక్తిని నష్టం కలిగించి వెనక్కి తిప్పగల సామర్ధ్యం అమెరికా వద్ద లేదు. అందుకే ఒప్పందంలో దాదాపు అన్ని అంశాలు ఇరాన్ డిమాండ్లను నెరవేర్చేవిగా ఉన్నాయి తప్ప అమెరికా, ఇజ్రాయెల్ లకు ఎర్ర ఏగాని కూడా దక్కలేదు.
సరిగ్గా ఇదే ఒప్పందం అమలు పట్ల అనేక సందేహాలను కలిగిస్తున్నాయి. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఏనాడూ అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయటం అటుంచి కనీసం గౌరవించను కూడా లేదు. అణ్వస్త్ర నిరోధక ఒప్పందం, మధ్యంతర అణ్వస్త్ర నిషేధ ఒప్పందం, స్టార్ట్ I మరియు స్టార్ట్ II లాంటి అణ్వస్త్ర వ్యాప్తి నిషేధ ఒప్పందాల నుండి అమెరికా వైదొలగింది. ఉక్రెయిన్ విషయంలో మిన్స్క్ I, మిన్స్క్ II ఒప్పందాలను అమలు చేయనివ్వకుండా ఉక్రెయిన్-రష్యా మధ్య ఆరని చిచ్చు రగిలించింది అమెరికాయే.
కాగా 1967 నాటి అరబ్-యూదు ఒప్పందం నుండి ఇటీవల 2026 జూన్ రెండో వారంలో కుదిరిన సీజ్ ఫైర్ ఒప్పందం వరకు అన్ని ఒప్పందాలను ఇజ్రాయెల్ ఉల్లంఘించింది. ఏ ఒప్పందాన్ని ఐనా ఇజ్రాయెల్ అంగీకరించింది అంటే అప్పటికి అలసిపోయి తిరిగి శక్తులు కూడదీసుకునే లక్ష్యం తోనే అంగీకరిస్తుంది. కానీ ఒప్పందం జరిగిన కొద్ది రోజుల్లోనే దాన్ని అడ్డంగా ఉల్లంఘిస్తుంది.
ఇజ్రాయెల్, గ్రేటర్ ఇజ్రాయెల్ స్థాపించటం కోసం దక్షిణ లెబనాన్, గాజా, లెబనాన్, సిరియా భూభాగాలను ఆక్రమించుకునే లక్ష్యాన్ని కలిగి ఉన్నది. ఈ లక్ష్యానికి అమెరికా సంపూర్ణ మద్దతు ఉన్నది కూడా. కనుక ట్రంప్, ఇరాన్ లు ప్రకటించిన అవగాహన పత్రం, తదనంతరం జరిగే శాంతి చర్చలు సఫలం కావటానికి ఇప్పుడున్న ఏకైక ప్రమాదం ఇజ్రాయెల్ నుండే వస్తుంది. ఇజ్రాయెల్, దాని వెన్నంటే ఉండే అమెరికాలే శాంతి ఒప్పందానికి ప్రధాన విలన్లు!
ఈ ఒప్పందం అమెరికా, ఇజ్రాయెల్ ల లక్ష్యాలను నెరవేర్చటం అటుంచి శత్రువుగా భావిస్తున్న ఇరాన్ లక్ష్యాలను నెరవేర్చుతాయి. నవంబర్ లో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి సెనేట్, హౌస్ లలో మెజారిటీ దక్కించటానికి మాత్రమే ట్రంప్ ఈ ఒప్పందానికి అంగీకరించాడు. నవంబర్ ఎన్నికల వరకు ఎలాగో ఒప్పందం కోసం చర్చల పేరుతో కాలయాపన చేసి ఆ తర్వాత మరోసారి ఇరాన్ పై యుద్ధానికి అమెరికా, ఇజ్రాయెల్ లు సిద్ధం అవుతాయి.
ఒప్పందాన్ని ఎలా ఉల్లంఘిస్తాయి? ఏదో ఒక వంకతో ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్ పైన దాడి చేస్తుంది. ఈ దాడి గురించి ప్రపంచానికి తెలియకుండా పశ్చిమ పత్రికలు మౌనంగా ఉంటాయి. దాడి జరిగినా హిజ్బొల్లా గాని, ఇరాన్ గాని కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటాయి. ఈ కొన్ని రోజుల్లో కూడా లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఇక తప్పనిసరి పరిస్ధితుల్లో హిజ్బొల్లా ఉత్తర ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది. అంటే ఆకాశం బద్దలై భూమి పైన జారిపడిపోయినట్లుగా పశ్చిమ పత్రికలు నానా యాగీ చేస్తాయి. ఎలాంటి ప్రోద్బలం లేకుండా హిజ్బొల్లా, శాంతియుతంగా ఉన్న ఇజ్రాయెల్ పైన మిసైల్ దాడి చేసిందని పశ్చిమ పత్రికలు ఊదరగొడతాయి. వారి ఎత్తుగడలు తెలియని వాళ్ళు హిజ్బొల్లా యే మొదటి దాడి చేసి తప్పు చేసిందని నమ్ముతారు. దీనిని అమెరికా, ఐరోపా ప్రజలు బీరు పోకుండా నమ్ముతాయి. ఇజ్రాయెల్ వెంటే అమెరికా కూడా సొంత దాడి ప్రారంభిస్తుంది. ఆ విధంగా ఉద్రిక్తతలు మరింత ముదిరి పాకాన పడతాయి.
ఇలా కాకుండా వేరే విధంగా పరిణామాలు చోటు చేసుకుకుంటే అది ఆశ్చర్యకారకం అవుతుంది.