ఇండియాకు చమురు సప్లై చేయలేం -సౌదీ అరేబియా

Bab al-Mandab Strait

ఇండియా రిఫైనరీలకు ఇక క్రూడ్ ఆయిల్ సరఫరా చేయలేమని సౌదీ అరేబియా చెప్పేసింది. యెమెన్ లోని ఇరాన్ మద్దతు కలిగిన హుతీ గ్రూప్ సైన్యం ఎర్ర సముద్రం ముఖ ద్వారంలో నెలకొన్న రెండు కీలక ద్వీపాలను రెండు రోజుల క్రితం జరిపిన మెరుపు దాడిలో స్వాధీనం చేసుకోవటంతో సౌదీ అరేబియా చమురు ఎగుమతులు పూర్తిగా నిలిచి పోయాయి. దానితో ఇండియాకు ఇతర దేశాలకు క్రూడ్ ఆయిల్ సప్లై చేయటం సౌదీ అరేబియా కు సాధ్యం కావటం లేదు.

హుతి సైన్యం ప్రత్యేకంగా సౌదీ అరేబియా లక్ష్యం చేసుకుని దాడులు చేస్తోంది. హోర్ముజ్ జలసంధి నుండి ఆయిల్ రవాణా ఇప్పటికే నిలిచిపోయింది. దరిమిలా సౌదీ అరేబియా భూ మార్గంలో ఉత్తర తీరం నుండి దక్షిణ దిశలో ఎర్ర సముద్రం తీరం లోని రేవు పట్టణం వరకు నిర్మించిన పైప్ లైన్ ద్వారా చమురు పంపి అక్కడి నుండి సూయజ్ కెనాల్ ద్వారా ఐరోపా, ఇండియా తదితర దేశాలకు చమురు ఎగుమతి చేస్తున్నది. మూడు రోజుల క్రితం ఇరాక్ లోని షియా మిలిటెంట్లు చేసిన దాడిలో ఈ పైప్ లైన్ పూర్తిగా తెగి పోయింది. చమురు ఎగుమతికి మిగిలిన ఒక్క మార్గం కూడా రద్దయింది.

ఈ నేపధ్యంలో సౌదీ అరేబియాకు చెందిన అతిపెద్ద చమురు కంపెనీ ఆరామ్ కో, ఇండియన్ రిఫైనరీ కంపెనీలకు తాము చమురు సరఫరా చేయలేమని వర్తమానం పంపింది. ఇరాకీ షియా మిలిటెంట్ల (పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్) దాడుల్లో తెగిపోయిన పైపు లైన్ ని పునరుద్ధరించే వరకు చమురు సరఫరా చేయటం వీలు కాదని చెప్పింది. పైప్ లైన్ బాగు చేయటం రోజుల్లో నెలల్లో అయ్యే పని కాదని తెలుస్తోంది.

సౌదీ అరేబియా చమురుకు బదులు ఇతర దేశాల నుండి చమురు లభించటం సులభమే అయినప్పటికీ ప్రస్తుత పరిస్ధితుల్లో భారీ ధరలను (బ్యారెల్ కు 108 డాలర్లు) ఇండియా చెల్లించాల్సి ఉంటుంది. సరసమైన ధరకు చమురు సరఫరా చేయటం రష్యా ఇప్పటికే నిలిపివేసింది. ఇతర గల్ఫ్ దేశాల చమురు కూడా హోర్ముజ్ నుండే రవాణా కావాలి. యుద్ధం ముగిస్తే తప్ప హోర్ముజ్ రవాణా పునరుద్ధరణ కాదు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ ప్రతిపాదించిన ఎం.ఓ.యు ను ఒప్పందంగా మార్చితే తప్ప ఇరాన్, తన దిగ్బంధనాన్ని ఎత్తివేయదు. ఇరాన్ కు లొంగి ఒప్పందం చేసుకోవటం అంటే గల్ఫ్ దేశాల నుండి అమెరికా పూర్తిగా ఉపసంహరించుకోవటమే. ఈ పరిస్ధితి అమెరికాకు పీడకలతో సమానం.

చారిత్రక నేపధ్యం

1920 ల నుండి 1930 ల కాలం వరకు యెమెన్ కు చెందిన మూడు రాష్ట్రాలను (అసిన్, నజ్రాన్, జిజాన్ రాష్ట్రాలు) సౌదీ అరేబియా బలవంతంగా కలుపుకుంది. ఈ దురాక్రమణకు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా లు మద్దతుగా నిలిచాయి. సౌదీ అరేబియా ఆక్రమించుకున్న మూడు రాష్ట్రాల విస్తీర్ణం ఇప్పటి యెమెన్ కి దాదాపు సమానంగా ఉంటుంది. అనగా వాస్తవ యెమెన్ లో సగం భాగాన్ని సౌదీ అరేబియా కలుపుకుంది.

యెమెన్ ప్రజల జాతీయ విముక్తి పోరాటానికి ఇరాన్ లోని ఇస్లామిక్ షియా ప్రభుత్వం ఆది నుండి సైద్ధాంతిక మరియు భౌతిక మద్దతు అందిస్తూ వచ్చింది. తాజాగా హుతిల నాయకత్వంలో గత పదేళ్ళకు పైగా యెమెన్ ప్రజలు అటు సౌదీ అరేబియా ఆక్రమణకు వ్యతిరేకంగానూ, ఇటు అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు, యూదు దురహంకార ఇజ్రాయెల్ దేశాల పైన బహుళ పక్ష పోరాటం చేస్తున్నారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి తర్వాత యెమెన్ కూడా జత కలిసి సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ పైన మిసైల్ దాడులు చేస్తున్నది.

ఇరానియన్ ప్రజలు అత్యధికంగా ఇస్లాం లోని షియా శాఖకు చెందిన వారు కాగా యెమెన్ ప్రజలు అత్యధికంగా షియా ఇస్లాం లోని జేడిజం శాఖకు చెందిన వారు.

బాబ్ ఆల్-మందాబ్ కైవశం

తమ పోరాటంలో భాగంగా హుతి మిలిటెంట్లు ఎర్ర సముద్రం (సౌదీ అరేబియాకు ఈశాన్య ఆఫ్రికా దేశాలకు మధ్య ఉన్న సముద్రం) ముఖద్వారం అయిన బాబ్-ఆల్-మందాబ్ జల సంధి లోని ద్వీపాలను (గ్రేటర్ హనీష్, లెస్సర్ హనీష్, మయూన్, జుకర్, పెరిం ద్వీపాలు) సౌదీ అరేబియా / యెమెన్ సున్నీల నుండి స్వాధీనం చేసుకుంది. యెమెన్ లో ప్రస్తుతం సౌదీ అరేబియా నియంత్రణ లోని సున్నీ ప్రభుత్వం, హుతీ నియంత్రణ లోని జేడిస్టు ప్రభుత్వం.. ఈ రెండింటి మధ్య విభజించబడి ఉన్నది. హుతి పాలన కింద ఉన్న భూభాగంలో జన సమ్మర్దంతో కూడిన ప్రాంతాలు ఉండగా, సున్నీల కింద జనం పలుచగా నివసించే ఎడారి ప్రాంతాలు ఉన్నాయి. బాబ్-ఆల్-మందాబ్ లోని ద్వీపాలు కొద్ది రోజుల క్రితం వరకు సున్నీల/సౌదీ అరేబియా ఆధీనంలో ఉండగా ఇప్పుడవి హుతిల ఆధీనం లోకి వచ్చాయి.

Houthis are on Victory Path

దరిమిలా ఎర్ర సముద్రం లోని సౌదీ అరేబియా రేవుల నుండి బయలుదేరే చమురు ట్యాంకర్ల పైకి హుతీలు యధేచ్ఛగా దాడులు చేసే పరిస్ధితి వచ్చింది. హోర్ముజ్ జలసంధి ని ఇరాన్ దిగ్బంధనం చేయటం, ఇప్పుడు బాబ్ ఆల్-మందాబ్ జల సంధి హుతిల ఆధీనం లోకి రావటంతో సౌదీ అరేబియాకు చమురు ఎగుమతి చేసే అవకాశాలు పూర్తిగా రద్దయ్యాయి. ఒక్క స్పాట్ అమ్మకాలు (అప్పటికే సముద్ర జలాల మీద ఉన్న చమురు ట్యాంకర్ల లోని చమురును అప్పటికప్పుడు బేరమాడి అమ్ముకోవటం) తప్ప మరే ఇతర అవకాశము సౌదీ అరేబియాకు లేదు.

యుద్ధం ముందు బ్యారెల్ కు 60 డాలర్ల నుండి 80 డాలర్ల వరకు పలికిన (బ్రెంట్) చమురు సెప్టెంబర్ 16 తేదీ నాటికి 108 డాలర్లకు చేరింది. సెప్టెంబర్ 17 తేదీన కాస్త తగ్గి 105 డాలర్లకు బ్యారెల్ చమురు ధర చేరింది. మార్కెట్ కదలికలను అమెరికా నియంత్రించకపోయినట్లయితే క్రూడాయిల్ ధర ఈ పాటికి కనీసం బ్యారెల్ కు 150 డాలర్లను దాటి ఉండేదని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. 300 డాలర్ల వరకు చమురు ధరను అంచనా వేసినవారు కూడా లేకపోలేదు. జూన్ 2025 లో ఇరాన్ మరియు అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరిగిన 12 రోజుల యుద్ధం సమయంలో చమురు ధర బ్యారెల్ కు 500 డాలర్లకు చేరొచ్చని బ్రిటన్ కు చెందిన సంస్థలు అంచనా వేయటం గమనార్హం.

A map showing the Houthis capturing territory near the Bab el-Mandeb Strait. (AP Digital Embed)

ముందుగా కుదుర్చుకున్న కాంట్రాక్టు ప్రకారం చమురు సరఫరా చేసే పరిస్ధితిలో సౌదీ అరేబియా లేదు. స్పాట్ అమ్మకాలు చేస్తున్నప్పటికీ అధిక ధరల వలన వాటిని కొనేందుకు ఇండియా సుముఖం గా లేకపోవచ్చు. ఐతే ఇతర దేశాల నుండి చమురు దిగుమతి చేసుకోగలమని భారత రిఫైనరీలు విశ్వాసంతో ఉన్నాయి. సౌదీ అరేబియా, హుతీల మధ్య యుద్ధం తీవ్రం ఐతే పరిస్ధితి మరింత దిగజారనుంది.

యెమెన్ నుండి తీవ్ర దాడులను ఎదుర్కొంటున్న సౌదీ అరేబియా, రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహాయాన్ని అర్ధించింది. యెమెన్ లోని హుతీల పైన దాడులు చేయాలని సౌదీ రాజు ట్రంప్ కి రెండు సార్లు ఫోన్ చేసి అభ్యర్ధించాడు. కానీ అమెరికా అంగీకరించలేదు. మీ చావు మీరు చావండి అని చెప్పేసింది. సౌదీ అరేబియాకు సహాయం చేసే బదులు హుతీలతో చర్చలు జరిపింది. అమెరికా ప్రతినిధులు ఒమన్ వెళ్లి అక్కడికి హుతీ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించారు. అమెరికా కు చెందిన చమురు నౌకల పైన దాడులు చేయబోమని హుతీల నుండి హామీ తీసుకుంది. తద్వారా సౌదీ అరేబియాకు భద్రత కల్పిస్తామన్న దశాబ్దాల నాటి ఒప్పందాన్ని అమెరికా గడ్డి పోచ కింద లెక్క గట్టింది. అమెరికా ఇచ్చే హామీలు నీటి మూటతో సమానం అని తేల్చేసింది.

Leave a Reply