
–
బెంగాల్ లో ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పూర్తి అయిందని చెప్పారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. అప్పటిదాకా బెంగాల్ లో ముక్కుతూ మూలుగుతున్న బిజెపి ఒక్క సారిగా బంపర్ మెజారిటీ తో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేసింది కానీ ఈ ఎన్నికల్లో 38 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారు. కారణం వాళ్ల ఓట్లను ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ పేరుతొ తొలగించటమే.
ఎస్ఐఆర్ వలన ఓట్లు కోల్పోయిన వాళ్లు అప్పీలు చేసుకోవటానికి అనుమతి ఇచ్చారు. అందుకోసం సుప్రీం కోర్టు ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేసింది. కానీ ఈ ట్రిబ్యునల్స్ 38 లక్షల మంది అప్పీళ్లను విచారించాలంటే 12 ఏళ్లు పడుతుందని ఇప్పుడు విచారణ జరుగుతున్న వేగం బట్టి అంచనా వేశారు. కనుక ఈ 38 లక్షల మంది తమ ఓటు హక్కు ఉపయోగించాలంటే మరో 12 ఏళ్ళు ఆగాలి. ప్రపంచ ప్రజాస్వామ్యానికి తల్లి లాంటి (మదర్ ఆఫ్ ఆల్ డెమొక్రసీస్) డెమోక్రసీ కలిగిన ఇండియా లో ప్రజాస్వామ్యం ఇలా తగలడింది.
అప్పీళ్ళలో 22 లక్షలు వోటు హక్కు పునరుద్ధరణకు దాఖలు కాగా, విచిత్రంగా 16 లక్షల అప్పీళ్ళు ఓటు హక్కు రద్దుకు దాఖలయ్యాయి. అప్పీళ్లలో 7 లక్షల చిల్లర వోటర్లు స్వయంగా అప్పీలు చేసుకున్నట్టు తెలుస్తున్నది. మిగిలిన అప్పీళ్లను ఎలక్షన్ కమిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.
ఎందుకని 12 యేళ్లు?
జాబితా నుండి వోటర్లను తొలగించాక ట్రిబ్యునల్స్ విచారణ చేపట్టాయి. శని వారం సుప్రీం కోర్టులో ఎలక్షన్ కమిషన్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం సెప్టెంబర్ 16 నాటికీ 1,26,194 అప్పీళ్లను ట్రిబ్యునల్స్ పరిష్కారం చేశాయి. అంటే గత 5 నెలల్లో 1.26 లక్షల అప్పీళ్లు పరిష్కారం అయ్యాయి. అంటే నెలకు 25,238 అప్పీళ్లను పరిష్కారం చేశాయి. ఇంకా 37,05,235 అప్పీళ్లు విచారణ కోసం పెండింగ్ లో ఉన్నాయి. ఈ లెక్కన మొత్తం అప్పీళ్ల పరిష్కారం కావాలంటే మరొక 146 నెలలు పడుతుంది. అనగా 12 సంవత్సరాల 2 నెలలు పడుతుంది అప్పటి వరకు వీళ్లకు ఓటు హక్కు ఉండదు. వాళ్లు చేసిన నేరం ఏమిటంటే ఓట్ల జాబితా తయారు చేసిన వాళ్లు ఓటర్ల పేర్లు తప్పుగా రాయటం, ఓటర్లు పని కోసం ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళటం, ఇంకా అలాంటివి.
స్వతంత్రం కోసం పోరాడని సంస్థ వారసులు, క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొనవద్దని తమ కేడర్ ని ఆదేశించిన సంస్థ వారసులు, తమని విమర్శించే వాళ్లు అందరు యాంటీ నేషనల్ గా ముద్ర వేసే పార్టీ, సో-కాల్డ్ స్వతంత్రం సిద్ధించిన 60 వరకు అధికారం చేపట్టలేని రాజకీయ పార్టీ, అధికారం చేపట్టిన తర్వాత కోట్ల మంది ఓటర్లను తాము భారతీయులమే అని నిరూపించుకోమని, లేదంటే ఓటు హక్కు రద్దు చేస్తామని డిమాండ్ చేస్తోంది! అది కూడా తాము సృష్టించిన వెర్రి మొర్రి అనుమానాలతో ఓటు హక్కు రద్దు చేసి మరీ ప్రజలను ఓటు హక్కు నుండి దూరం చేసింది.
93% నిజమైన ఓటర్లే
గమనార్హమైన సంగతి ఏమిటంటే ట్రిబ్యునళ్లు సెప్టెంబర్ 10 తేదీ వరకు విచారణ చేసి పరిష్కరించిన 1,26,194 వోటర్లలో 93 శాతం వోటర్ల అప్పీళ్లను, అనగా 1.1 లక్షల మంది వోటర్ల అప్పీళ్లను న్యాయబద్ధమైనవే తేల్చి వోటర్లకు అనుకూలంగా అప్పీళ్లను పరిష్కరించాయి. ఈ న్యాయబద్ధమైన వోట్లు కలిగి ఉన్న వోటర్లు అనేక మంది ఈ సంవత్సరం జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ వోటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఇప్పుడు బెంగాల్ ని పాలిస్తున్న బిజెపి ప్రభుత్వానికి 22 లక్షల వోటర్ల ఆమోదం లేకుండా, వారికి ఓటు హక్కు రద్దు చేయటం ద్వారా, రాష్ట్రాన్ని పాలిస్తున్నది.
గతంలో కేవలం 22 లక్షల మంది మాత్రమే వోటు హక్కు రద్దుకు వ్యతిరేకంగా అప్పీలు చేసుకున్నారని చెప్పిన ఎలక్షన్ కమిషన్, సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో మరో 16 లక్షల అప్పీళ్లు జాబితా నుండి తొలగించటానికి చేసిన అప్పీళ్ళు అని తెలిపింది. అందులో 1.26 లక్షల అప్పీళ్లలో వోటు హక్కు పునరుద్ధరించామని కమిషన్ కోర్టుకు తెలియజేసింది. ముందు చెప్పినట్లు ఇంకా 37,05,235 వోటర్ల అప్పీళ్లను అప్పీలేట్ ట్రిబ్యునల్స్ విచారించవలసి ఉన్నది.
ఘోరం ఏమిటంటే ఇదంతా సుప్రీం కోర్టు ఆమోదం మేరకే జరుగుతోంది. కనుక తమ వోటు హక్కును వినియోగించుకోకుండా నిరోధించబడిన 22 లక్షల మంది వోటర్లలో న్యాయబద్ధమైన వోట్లు కలిగిన వోటర్ల అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి సుప్రీం కోర్టు ఆమోదం తెలిపింది. న్యాయం చేయాల్సిన అత్యున్నత న్యాయ స్థానం, ఎలాంటి న్యాయబద్ధమైన కారణం లేకుండా వోటర్ల హక్కును రద్దు చేసేందుకు ఆమోదం తెలపటం ఏ ప్రజాస్వామిక సూత్రం కిందకు వస్తుందో తెలియాల్సి ఉన్నది. ఈ లెక్కన ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత విలువైనదిగా పేర్కొనే ఓటు హక్కుకు వాస్తవంలో ఎలాంటి విలువ లేదని అనుకోవాల్సి వస్తోంది.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాపితంగా బిజెపి పార్టీ సంపాదించిన మెజారిటీ వోట్లు 32,11,420 అని ఎన్నికల కమిషన్, ఎన్నికల అనంతరం తెలియజేసింది. కానీ ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో జాబితా నుండి 22 లక్షల వోట్లను తొలగించింది. కమిషన్ తొలగించిన వోట్ల కంటే బిజెపి సాధించిన మెజారిటీ వోట్లు దాదాపు 10 లక్షలు మాత్రమే ఎక్కువ ఉన్నట్లు అర్ధం అవుతోంది. రద్దు చేసిన 22.231 లక్షల వోట్లు ఏ పార్టీకి చెందిన వోట్లు అయి ఉంటాయి అన్న ప్రశ్న వేసుకుంటే వచ్చే సమాధానం “బిజెపి పార్టీకైతే పడి ఉండేవి కాదు” అని ఎవరైనా ఇట్టే సమాధానం చెబుతారు. ఎందుకంటే అత్యధికంగా బెంగాల్ ముస్లింల వోట్లనే కమిషన్ తొలగించిందని.
ఎందుకంటే బెంగాల్ వోటర్ జాబితా నుండి ఎస్ఐఆర్ ద్వారా 90 లక్షల వోట్లను తొలగించామని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఇందులో 63 శాతం హిందువుల వోట్లు కాగా 34 శాతం ముస్లింల వోట్లు అని కమిషన్ చెప్పింది. అంటే 56.7 లక్షలు హిందువులు ఓట్లు కాగా ముస్లింల వోట్లు 30 లక్షలు. మిగిలిన వోటర్లు ఇతర మతాలకు చెందినవి. అంతే కాకుండా తమ ఓటు హక్కును పునరుద్ధరించాలని అప్పీలేట్ ట్రిబ్యునళ్లకు అప్పీలు చేసుకున్న వోటర్లలో అత్యధిక వోటర్లు ముస్లిం మతానికి చెందినవారని ఎలక్షన్ కమిషన్, సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికల ద్వారా తెలియజేసింది. అప్పీల్ చేసుకున్న వోటర్లలో కనీసం 70 శాతం మంది ముస్లిం వోటర్లే అని కమిషన్ తెలిపింది.
కాబట్టి ఎస్ఐఆర్ వేటుకు గురైన వోటర్లలో 70 శాతం మంది ముస్లిం వోటర్లు. వోటు హక్కు పునరుద్ధరణకై అప్పీలు చేసుకున్న వారిలో ఇప్పటి వరకు పరిష్కరించిన అప్పీళ్లలో 93 శాతం న్యాయబద్ధమైన వోటు హక్కు కలిగి ఉన్నారని, వారి వోటు హక్కు రద్దు చేయటం చెల్లదని ట్రిబ్యునల్స్ తేల్చేశాయి. కనుక ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా బిజెపి పార్టీ ప్రధానంగా లబ్ది పొందిందని, ఎంతగా లబ్ది పొందిందంటే, ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగేటంతగా లబ్ది పొందిందని అర్ధం అవుతోంది.
మెజారిటీ సీట్లు పొందలేని రాష్ట్రాలలో ప్రత్యర్ధి పార్టీల ఎంఎల్ఏ లను కొనుగోలు చేయటం ద్వారా, ఈడి-సిబిఐ-ఐటి లాంటి సంస్థల చేత కేసులు పెట్టించి బెదిరించటం ద్వారా మెజారిటీ సంపాదించి ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది బిజెపి. ప్రత్యర్ధి పార్టీ అధిక మెజారిటీతో ప్రభుత్వాలు ఏర్పరిచినా కూడా ఫిరాయింపులను ప్రోత్సహించి, ప్రభుత్వాలను పడగొట్టి ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది బిజెపి. తాజాగా ఎస్ఐఆర్ ద్వారా తమకు ఓటు వేయరు అనుకున్నవారి వోటు హక్కును రద్దు చేయటం ద్వారా కూడా మెజారిటీ సీట్లు పొందుతున్నదన్న ప్రతిపక్షాల ఆరోపణలు నిజమేనన్న అనుమానాలను బెంగాల్ ఎస్ఐఆర్ ప్రక్రియ లో జరిగిన పరిణామాలు కలిగిస్తున్నాయి.
ఇలాంటి ఎన్నికలతో కూడిన ప్రజాస్వామిక భారతదేశం ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ ఎలా అవుతుందో పాలకులు సెలవిస్తే ప్రజలు తెలుసుకుంటారు.


