చర్చలు జరపండి, ప్లీజ్! -సౌదీ అరేబియా


అమెరికాలో యుద్ధ వ్యతిరేక నిరసనలు

అమెరికా, తాను ప్రకటించిన దిగ్బంధనం ఎత్తివేసి ఇరాన్ తో చర్చలు జరపాలని లేకుంటే ఇరాన్ దేశం మరిన్ని ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉన్నదని సౌదీ అరేబియా, అమెరికాకు విజ్ఞప్తి చేసింది. కాగా, వచ్చే శుక్ర, శని వారాల్లో అమెరికా, ఇరాన్ ల మధ్య రెండో విడత చర్చలకు అవకాశం ఉన్నట్లు పత్రికలు ఊహాగానాలు చేస్తున్నాయి.

హోర్ముజ్ జలసంధి పైన అమెరికా ప్రకటించిన బ్లాకేడ్ కొనసాగితే ఇరాన్ అందుకు ప్రతీకారంగా ఎర్ర సముద్రానికి దారి తీసే బాబ్ ఆల్-మందాబ్ జలసంధిని మూసివేసే ప్రమాదం ఉన్నదని ఇరాన్ హెచ్చరించింది. ఒక వైపు ఎర్ర సముద్రాన్ని, మరో వైపు యేడెన్ అఖాతాన్ని కలిపేదే బాబ్ ఆల్-మందాబ్ జలసంధి. ఎర్ర సముద్రాన్ని, మాధ్యధరా సముద్రాన్ని ఈజిప్టు కి చెందిన సూయజ్ కాలువ కలుపుతుంది.

ఇండియాతో పాటు ఆసియా దేశాల నుండి సరుకులు తీసుకెళ్లే నౌకలు బాబ్ ఆల్-మందాబ్ అఖాతాన్ని దాటి ఎర్ర సముద్రం లోకి ప్రవేశించి అక్కడ నుండి సూయజ్ కాలువ ద్వారా మధ్యధరా సముద్రంలోకి ప్రవేశిస్తాయి. అక్కడి నుండి సరుకులు ఐరోపా దేశాలకు ఎగుమతి అవుతాయి. ఆసియా నుండి ఉత్తర అమెరికా ఖండం లోని దేశాలకు వెళ్ళేందుకు కూడా ఇదే దగ్గర దారి. అనగా సూయజ్ కాలువ గుండా జరిగే సరుకు రవాణా, బాబ్ ఆల్-మందాబ్ అఖాతం పైన ఆధారపడి ఉన్నది.

బాబ్ ఆల్-మందాబ్ అఖాతాన్ని కంట్రోల్ చేయగల సత్తా యెమెన్ దేశానికి ఉన్నది. యెమెన్ లో ఇప్పుడు హుతీ లేదా అన్సర్ అల్లా సంస్థదే పై చేయిగా ఉన్నది. అన్సర్ అల్లా ను తుద ముట్టించటానికి సౌదీ అరేబియా విశ్వ ప్రయత్నాలు చేసి విఫలం అయింది. చివరికి వారితో సంధి చేసుకుని గమ్మున ఉండిపోయింది. ఆ తర్వాత అమెరికా కూడా అన్సర్ అల్లా నేతృత్వం లోని యెమెన్ పైన ఏడాది పాటు యుద్ధం చేసి తన వల్ల కాక చివరికి సంధి చేసుకుంది. సంధి చేసుకున్న సంగతి చెప్పకుండా ‘మా లక్ష్యం నెరవేరింది’ అని చెప్పి అమెరికా కూడా గమ్మున ఉండిపోయింది.

యెమెన్ లోని అన్సర్ అల్లా, ఇరాన్ తో అత్యంత దగ్గరి స్నేహ సంబంధాలు ఉన్నాయి. గాజాపై ఇజ్రాయెల్ హంతక దాడులు చేసినంత కాలం యెమెన్ నుండి అన్సర్ అల్లా కూడా ఇజ్రాయెల్ పైకి మిసైల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడులను నిలువరించాలని డిమాండ్ చేస్తూ యేడెన్ అఖాతంలో నౌకలు తిరగకుండా కొంత కాలం బ్లాకేడ్ ని కూడా అమలు చేసింది. కనుక ఇరాన్ కోరితే బాబ్ ఆల్-మందాబ్ అఖాతాన్ని మూసివేసేందుకు అన్సర్ అల్లా సిద్ధంగా ఉంటుంది.

ఈ సంగతినే సౌదీ అరేబియా ప్రస్తావిస్తూ అమెరికాను మళ్లీ చర్చలు కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నది. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధనం చేసిన నేపధ్యంలో సౌదీ అరేబియా ఉత్తరాన పర్షియా అఖాతం తీరాన ఉన్న రేవు పట్టణాల నుండి చమురును దక్షిణాన ఎర్ర సముద్రం తీరాన ఉన్న పట్టణాలకు పంపింగ్ చేసి అక్కడి నుండి చమురు ఎగుమతులు చేయటం ద్వారా తన చమురు వాణిజ్యాన్ని కాపాడుకుంది.

బాబ్ ఆల్-మందాబ్ అఖాతాన్ని కూడా యెమెన్ దిగ్బంధించటానికి యెమెన్, ఇరాన్ లు నిర్ణయిస్తే సౌదీ అరేబియా వాణిజ్యం తీవ్రంగా దెబ్బ తింటుంది. సౌదీ అరేబియాతో పాటు ఐరోపా, ఆసియా దేశాల వాణిజ్యం కూడా అటకెక్కుతుంది. ఇండియా నుండి ఐరోపా, అమెరికాలకు జరిగే ఎగుమతులు బాబ్ ఆల్-మందాబ్, సూయజ్ కాలువ, మధ్యధరా సముద్రం ద్వారానే రవాణా అవుతాయి. కనుక ఇండియా వాణిజ్యం కూడా దెబ్బ తింటుంది. మరోసారి ఇండియా, ఇరాన్ దయా దాక్షిణ్యాల పై ఆధారపడ వలసి వస్తుంది.

కనుక సౌదీ అరేబియా ఆందోళన ఎంత సరైనదో ఈ అంశాలను పరిశీలిస్తే అర్ధం అవుతుంది.

బాబ్ ఆల్-మందాబ్ జలసంధి

సౌదీ అరేబియా – ఇరాన్ వైరం

పర్షియన్ గల్ఫ్ (పర్షియా అఖాతం) లో ఇరాన్, సౌదీ అరేబియా దేశాల మధ్య వైరుధ్యం నెలకొని ఉన్నది. ఇరాన్ షియా ధియాలజీ ను అనుసరించే దేశం కాగా, సౌదీ అరేబియా సున్నీ ధియాలజీ అనుసరిస్తుంది.

ప్రపంచం లోని ముస్లిం టెర్రరిస్టు సంస్థలన్నీ సున్నీ ధియాలజీ ని అనుసరించేవే. అమెరికా మద్దతుతో ఆఫ్ఘనిస్తాన్ లో టెర్రరిస్టు చర్యలు చేపట్టటం దగ్గర్నుండి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ రెండు టవర్లను కూల్చటం, ఐసిస్ పేరుతో లిబియా మరియు సిరియాలలో దారుణమైన రక్తపాతం సృష్టించటం లోనూ సున్నీ టెర్రరిస్టు సంస్థలే పేరు మోసాయి, కాగా ఈ సంస్థలకు ప్రధాన ఫైనాన్షియర్ సౌదీ అరేబియా.

వహాబీ తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేయటంలో సౌదీ అరేబియా నిండా మునిగి ఉంటుంది. ఇండియా లోనూ సౌదీ అరేబియా మద్దతు కలిగిన వహాబీ తీవ్రవాద భావజాలం వ్యాప్తి చెందుతున్నదని పలువురు రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కూడా. వహాబీ భావజాల వ్యాప్తి పైన ఈ బ్లాగ్ లోనే ఒక విశ్లేషణాత్మక వ్యాసం ప్రచురించబడింది.

1979 లో ఇరాన్ లో పహ్లవి రాచరికానికి వ్యతిరేకంగా అయితోల్లా ఖమీనీ నాయకత్వంలో ప్రజలు తిరుగుబాటు చేసి రాచరికానికి చరమ గీతం పలికారు. సౌదీ అరేబియా ఇప్పటికీ రాచరికం పాలనలోనే ఉన్నది. ఇరాన్ తిరుగుబాటు జరిగిన నాటి నుండి ఇరాన్ నుండి తన అధికారానికి ప్రమాదం పొంచి ఉన్నదని సౌదీ రాజు అంచనా వేశాడు. దరిమిలా ఇరాన్ ప్రభావం పెరగకుండా ఉండేందుకు అమెరికా, ఐరోపా దేశాలకు ఊడిగం చేస్తూ గల్ఫ్ ప్రాంతం లో పై చేయి సాధించటానికి ప్రయత్నాలు చేస్తున్నది సౌదీ అరేబియా. ఆ విధంగా సౌదీ అరేబియా, యుఏఇ, కతార్, బహ్రెయిన్, కువైట్ లాంటి సున్నీ పాలక దేశాలు ఇరాన్ పైన పగబట్టి ఉన్నాయి.

ఈ నేపధ్యంలో ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ మొదలు పెట్టిన యుద్ధానికి సౌదీ అరేబియా తదితర సున్నీ పాలక దేశాలు బహిరంగంగా కాకపోయినా అంతర్గతంగా మద్దతు ఇచ్చాయి. ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు యుద్ధం కొనసాగించాలని అమెరికాని కోరుతూ వచ్చాయి. కానీ ఇరాన్ అనుసరించిన గెరిల్లా తరహా యుద్ధ తంత్రం వలన అత్యంత బలమైన శక్తి యుక్తులు కలిగి ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సైతం యుద్ధం కొనసాగించలేని పరిస్ధితికి నెట్టబడ్డాయి.

మెజారిటీ భాగం కొండలు, గుహలతో నిండి ఉన్న ఇరాన్ పైన భూతల యుద్ధానికి దిగటం ఆతహత్యాసదృశమే అవుతుంది. పర్షియన్ అఖాతంలో ఇరాన్ తీరం కూడా బీచ్ లతో కాకుండా ఎత్తైన కొండలతో, నిటారుగా ఉండే ఎత్తైన క్లిఫ్ లతో, లోతైన గుహలతో ప్రమాదకరంగా ఉంటుంది. ఇలాంటి తీరాన్ని దాటి ఇరాన్ పై గ్రౌండ్ ఇన్వేషన్ చేయటం ఎవరికీ సాధ్యం కాదు.

రెండో దఫా చర్చలు?

బాంబు దాడులు, మిసైల్ దాడుల ద్వారా ఇరాన్ ని వారం లోపల లొంగ దీయవచ్చని భావించిన అమెరికాకు అది సాధ్యం కాలేదు. తమ వద్ద నిలువ చేసిన అత్యంత ఖరీదైన మిసైళ్లు, డ్రోన్ విమానాల నిల్వలు తరిగిపోతున్నాయి. వాటిని వేగంగా పునరుత్పత్తి చేయగల ఉత్పాదక సామర్ధ్యం అమెరికాకు లేదు. ఇరాన్, రష్యా, చైనాలు తయారు చేసే డ్రోన్ లు చౌక రకానికి చెందినవి. అత్యంత వేగంగా వాటిని ఉత్పత్తి చేయవచ్చు. చౌక అయినప్పటికీ వాటి పనితనం ఏమీ చౌక కాదు. పది మిలియన్ డాలర్ల అమెరికన్ డ్రోన్, పది వేల డాలర్ల ఇరాన్/రష్యన్/చైనీస్ డ్రోన్ దాదాపు ఒకే నష్టాన్ని కలగజేస్తాయి. పైగా కుప్పలు తెప్పలు ఉత్పత్తి చేయవచ్చు.

ఈ అంశంలో అమెరికా వద్ద ఇప్పటికీ సమాధానం లేదు. అమెరికా తయారు చేసే ఆయుధాలు -ట్యాంక్ లు, మిసైళ్లు, డిఫెన్స్ మిసైళ్లు, రాడార్లు, డ్రోన్ లు, ఫైటర్ జెట్ లు ఇలా ఏవి చూసినా అవన్నీ ప్రధానంగా వాణిజ్యం, లాభం లక్ష్యంతో తయారు చేసినవి. అవి ఎంత ఖరీదైనవి, సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ తో కూడినవి అయితే అంత లాభాన్ని సంపాదించి పెడతాయి.

ఇతర దేశాల ఆయుధాల లక్ష్యం ప్రధానంగా రక్షణ కోసం ఉద్దేశించినవి. కోల్డ్ వార్ అంతమైన తర్వాత రష్యా, చైనా, ఇరాన్ లాంటి ఇతర దేశాలు స్వయంగా ఏ దేశం మీద కూడా దాడి చేయలేదు. అమెరికా, ఐరోపా దేశాలు మాత్రమే ఇతర చిన్న దేశాలపై అన్యాయమైన దాడులు చేశాయి. అమెరికా షాక్ & ఆ (Shock & Awe) తరహాలో ఒక్కుమ్మడిగా దాడి చేసి శత్రువు కోలుకునే లోపు విజయం సాధించాలన్న ఆదుర్దా తో ఉంటుంది.

అమెరికా, పశ్చిమ ఐరోపాల నుండి దాడిని ఎదుర్కొనే దేశాలు ప్రధానంగా ప్రజలపైనే ఆధార పడి ఉంటాయి. ఎసిమెట్రికల్ వార్ (asymmetrical war) తరహా లో యుద్ధాన్ని అధికకాలం పాటు కొనసాగించి అమెరికా అలసిపోయేలా చేయటం ద్వారా విజయం సాధిస్తాయి. 1960 లాంటి వియత్నాం యుద్ధం, 2001 నుండి 2025 వరకు సాగిన ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం, 2003 నుండి 2008 వరకు సాగిన ఇరాక్ యుద్ధం… ఇలా అన్నింటి లోనూ అమెరికా ఓటమి చెంది తోక ముడిచి వెళ్లిన యుద్ధాలే. కానీ యుద్ధం ద్వారా కూడా అమెరికా కంపెనీలు లాభాలు ఆర్జించెందుకు అలవాటు పడ్డాయి.

ఇలాంటి అనుభవాలతో ఉన్న అమెరికా గతంలో వలే యుద్ధాలను కొనసాగించే పరిస్ధితిలో లేదు. ఈ సంగతిని అమెరికన్ మిలటరీ నేతలు యుద్ధానికి ముందు కూడా ట్రంప్ కు వివరించారు. ఐనా ట్రంప్ వినకుండా అలా చెప్పిన వారిని పదవుల నుండి తొలగించి మరీ యుద్ధానికి దిగాడు.

ఇంకో పక్క ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ కూడా యుద్ధం కొనసాగించే పరిస్ధితిలో లేదు. లెబనాన్ లోని హిజ్బొల్లా పైన ఇప్పటికీ బాంబు దాడులు సాగిస్తున్నప్పటికీ ప్రధాన మంత్రి నెతన్యాహు ఆశిస్తున్నట్లు గ్రౌండ్ దాడులకు ఐడిఎఫ్ సిద్ధంగా లేదు. రెండేళ్ల నుండి గాజా, యెమెన్, హిజ్బొల్లా, ఇరాన్ ల పైన యుద్ధం చేస్తున్న ఐడిఎఫ్ పూర్తిగా శక్తులు ఉడిగి పోయి ఉన్నదని, అలసిపోయిందని, ఏ క్షణంలో ఐనా కూలిపోవచ్చని ఐడిఎఫ్ నేత ఇజ్రాయెల్ మంత్రివర్గానికి స్పష్టం చేశాడని హీబ్రూ పత్రికలు రాసినట్లు విశ్లేషకులు వివరించారు.

ఈ నేపధ్యంలో ఇరాన్ తో ఏదో విధంగా మళ్లీ సంధి చర్చలకు అమెరికా దిగవచ్చని అమెరికన్ పత్రికల ద్వారా తెలుస్తున్నది. మధ్యవర్తుల ద్వారా అమెరికా, ఇరాన్ లు ఇప్పటికీ సంబంధంలో ఉన్నారని కూడా తెలుస్తున్నది. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే శుక్ర, శని వారాల్లో (ఏప్రిల్ 17, 18 తేదీల్లో) రెండో దఫా చర్చలు జరగవచ్చని తెలుస్తున్నది.

మొదటి దఫా చర్చలలోనే 5 యేళ్ళ పాటు యురేనియం శుద్ధి చేయకుండా ఉండేందుకు ఇరాన్ ప్రతినిధులు అంగీకరించి నట్లు తెలుస్తున్నది. యురేనియం శుద్ధి నిలిపివేయటానికి ఇరాన్ సిద్ధపడింది అంటే ఆ దేశం ఎన్నో మెట్లు దిగి కిందకి వచ్చిందని అర్ధం. అయినప్పటికీ మొదటి దఫా చర్చలు విఫలం అయినాయి.

ఇందుకు ప్రధాన కారణం ఇజ్రాయెల్ అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇస్లామాబాద్ లో చర్చలు అత్యంత సుహృద్భావ పూర్వక వాతావరణంలో జరుగుతున్న సమయంలో అమెరికా బృందం సారధి జె డి వాన్స్ కు ఫోన్ కాల్ వచ్చిందని, అప్పటి నుండి జె డి వాన్స్ ధోరణి పూర్తిగా మారిపోయిందని, విచిత్రంగా మొండిగా మాట్లాడ్డం మొదలు పెట్టాడని ఇరాన్ బృందం ప్రతినిధులు చెప్పారు. ఈ ఫోన్ కాల్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ నుండే వచ్చి ఉంటుందని అంతా ఊహిస్తున్నారు.

అమెరికాలో యూదు ఎన్.జి.ఓ AIPAC (అమెరికా ఇజ్రాయెల్ పబ్లిక్ ఎఫైర్స్ కమిటీ) అత్యంత శక్తివంతమైన సంస్థ. అమెరికా సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ సభ్యులు ఈ సంస్థ నుండి ఎన్నికల కోసం భారీగా నిధులు స్వీకరిస్తారు. అమెరికాలోని అత్యంత సంపన్నవంతమైన బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, హెడ్జ్ ఫండ్ కంపెనీలు, టెక్నాలజీ కంపెనీలు మొన వాటిలో అత్యధికం యూదుల సొంతం కావటంతో వారికి ఉన్న ఆర్ధిక శక్తి అపారం. వారి డబ్బుతో ఎన్నికల్లో నెగ్గిన సెనేట్, హౌస్ ల సభ్యులు అనివార్యంగా యూదు లాబీ చెప్పినట్లు నడుచుకుంటారు. ఇజ్రాయెల్ ఎంత చిన్న దేశం అయినప్పటికీ అమెరికా విధానాలను తీవ్రంగా ప్రభావితం చేసే స్థాయిలో ఉండటానికి అదే కారణం.

అందువలన ఇజ్రాయెల్ నుండి ఒత్తిడి రావటం వలనే చర్చలు ముందుకు సాగకుండా ఆగిపోయాయని చెప్పటం ఈ నేపధ్యం లోనే. అయితే ఎంత ఒత్తిడి చేసినా వాస్తవ పరిస్ధితి అమెరికాకు అనుకూలంగా లేనప్పుడు, వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏ శక్తి ఐనా చివరికి నేల మీదికి దిగవలసిందే. అందుకే ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన డొనాల్డ్ ట్రంప్ చివరికి చర్చల కోసం తెర వెనుక ఇరాన్ ని బతిమాలుకున్నాడు.

పత్రికలు ఊహిస్తున్నట్లుగా అమెరికా, ఇజ్రాయెల్ లు వాస్తవాలు అర్ధం చేసుకుని రెండో దఫా చర్చలకు సిద్ధపడితే మరో సంక్షోభం ముందు నిలబడి ఉన్న ప్రపంచం ఊపిరి పీల్చుకోవచ్చు. ప్రపంచం ఊపిరి అమెరికా, ఇజ్రాయెల్ లాంటి రోగ్ దేశాల పైన ఆధారపడి ఉండటమే నేటి యుగం ఎదుర్కొంటున్న దీన పరిస్ధితి!

వ్యాఖ్యానించండి