
హోర్ముజ్ జలసంధి సముద్ర జలాల్లో తచ్చాడుతున్న మరొక అమెరికా సబ్ మెరైన్ డ్రోన్ ను పట్టుకున్నామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. సముద్రం అడుగునుండి ఇరాన్ నేవీ యుద్ధ కదలికలపై నిఘా పెడుతున్న అమెరికన్ డ్రోన్ లను ఇరాన్ నేవీ పట్టుకుని వశం చేసుకోవడం ఇది రెండవ సారి.
ఒకటి రెండు సబ్ మెరైన్ డ్రోన్ లను ఇరాన్ వశం చేసుకోవటం వలన అమెరికాకు యుద్ధం పరంగా వచ్చే నష్టం లేదు. కానీ సబ్ మెరైన్ డ్రోన్ నిర్మాణంలో ఉపయోగించిన ఆధునిక టెక్నాలజీ ఇరాన్ స్వాధీనం లోకి వెల్లటమే అమెరికాకు జరిగే అసలు నష్టం. రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా సబ్ మెరైన్ డ్రోన్ టెక్నాలజీని ఇరాన్ కనిపెట్టి దానిని సొంత సముద్ర డ్రోన్ లను నిర్మించేందుకు ఇరాన్ ఉపయోగిస్తుంది.
ఇప్పటికే ఇరాన్ వద్ద సొంత టెక్నాలజీతో నిర్మించిన చిన్న సముద్ర జల డ్రోన్ లు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. ఇరాన్ నేవీ వద్ద భారీ యుద్ధ నౌకలు లేనప్పటికీ, అత్యంత వేగంగా గుంపులు గుంపులుగా ప్రయాణించే చిన్న వార్ బోట్లు, సబ్ మెరైన్ డ్రోన్ లు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. పర్షియన్ అఖాతంలో, హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ కు ఇవే కొండంత బలం.
“ఐ.ఆర్.జి.సి నేవీ సైనికులు సమన్వయంతో సమగ్రమైన వ్యూహం పన్ని ఇంటలిజెన్స్ రంగంలో, ఎలక్ట్రానిక్ యుద్ధరంగంలో ఆరి తేరిన అమెరికన్ సంబ్ మెరైన్ యుఏవి ని స్వాధీనం చేసుకున్నారు. అమెరికా టెర్రరిస్టు ఆర్మీకి చెందిన ఈ డ్రోన్, హోర్ముజ్ జలసంధిలో గూఢచార కార్యకలాపాలు నిర్వహిస్తుండగా పట్టుకున్నాం” అని ఐ.ఆర్.జి.సి విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
తాము పట్టుకున్న సబ్ మెరైన్ డ్రోన్ పేరు రెముస్ 600 అని ఇరాన్ మిలటరీ తెలిపింది. “ఇది ప్రస్తుతం ఐ.ఆర్.జి.సి నేవీకి చెందిన మిలటరీ టెక్నీషియన్ల ఆధీనంలో ఉన్నది. భద్రతా బలగాల స్పెషలిస్టులు ప్రస్తుతం దీనిని పరీక్షిస్తున్నారు. అది రికార్డు చేసిన సమాచారాన్ని వెలికి తీసే పనిలో వారున్నారు” అని ఐ.ఆర్.జి.సి తెలిపింది.

హోర్ముజ్ జలసంధి తమ ఆధీనంలో ఉన్నదని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది. తమ అనుమతి లేకుండా ఇక్కడ తిరిగే ఎలాంటి జల వాహనాన్నైనా మేము స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించింది. చట్ట విరుద్ధంగా ప్రవేశించే నౌకల పైన తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఆసియా దేశాల నుండి ఐరోపా, అమెరికా దేశాలకు సరుకులు రవాణా అయ్యేందుకు రెండు ప్రధాన జల మార్గాలు ఉన్నాయి. అవి ఒకటి హోర్ముజ్ జలసంధి కాగా, రెండవది ఈజిప్టు గుండా వెళ్ళే సూయజ్ కాలువ. అయితే సూయజ్ కాలువ వెళ్లాలంటే మొదట ఆఫ్రికా మరియు యెమెన్ ల మధ్య ఉన్న బాబ్ ఆల్-మందాబ్ జలసంధిని దాటాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితం బాబ్ ఆల్-మందాబ్ జలసంధిలోని ద్వీపాలని యెమెన్ లోని హుతీ మిలిటెంట్లు స్వాధీనం చేసుకోవటంతో సూయజ్ కాలువ రవాణా కూడా బంద్ అయింది. దరిమిలా ఐరోపా దేశాలకు చమురు, సరుకుల రవాణా, దాదాపు పూర్తిగా పడిపోయింది. సౌత్ ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్ళే అవకాశం ఒక్కటే ఇపుడు మిగిలి ఉంది. కానీ చమురు రవాణా హోర్ముజ్ జలసంధి వద్దనే ఆగిపోయింది.
ఇరాన్ సంధి ప్రతిపాదనకు ట్రంప్ తిరస్కరణ
ఐరాస జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశాలు ప్రస్తుతం న్యూయార్క్ లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, విదేశీ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చి పాల్గొని ప్రసంగించారు. సమావేశాల్లో ప్రసంగిస్తూ ఇరాన్ అధ్యక్షుడు అమెరికా, ఇజ్రాయెల్ కు లోంగేది లేదని స్పష్టం చేశాడు. ఐతే విదేశీ మంత్రి ఏడు రోజుల యుద్ధ విరమణకు ఒక ఒప్పందాన్ని ప్రతిపాదించాడు.
ఈ ప్రతిపాదన ప్రకారం అమెరికా ఇరానియన్ పోర్టుల పైన విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి. ఇరాన్ చమురు అమ్మకాలపై షరతులు ఉపసంహరించాలి. గల్ఫ్ బ్యాంకుల్లో ఉన్న ఇరానియన్ వాణిజ్య ఆదాయం 12 బిలియన్ డాలర్లను విడుదల చేయాలి. లెబనాన్, యెమెన్ లతో సహా పశ్చిమాసియా ప్రాంతంలో కాల్పుల విరమణ పాటించాలి. అందుకు బదులుగా ఇరాన్ హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తుంది. ఇరాన్ అణు విధానం పైన చర్చలకు ఇరాన్ అనుమతిస్తుంది. అమెరికా తన షరతులు అమలు చేసిన ఆరవ రోజు హోర్ముజ్ జలసంధిని తెరుస్తుంది. ఏడవ రోజు నుండి ఇరాన్ అణు విధానం పైన చర్చలు మొదలు పెట్టవచ్చు.
ఇరాన్ ప్రతిపాదించిన ఒప్పందాన్ని డొనాల్డ్ ట్రంప్ అడ్డంగా తిరస్కరించాడు. ఇరాన్ దేశాన్ని పూర్తిగా నాశనం చేయటమా లేక ఇరాన్ లొంగిపోయి దారికి రావటమా… ఈ రెండు మార్గాలే తన ముందు ఉన్నాయని ట్రంప్ ప్రకటించాడు. ఆ విధంగా చమురు రవాణా పునరుద్ధరణకు వచ్చిన అవకాశాన్ని అమెరికా కాలదన్నింది.
ఇరాన్ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ జనరల్ అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో స్పష్టం చేశాడు. “మేమిక్కడ మా సకల శక్తులతో నిలబడి ఉన్నాము. మా ప్రజల సేవకు కట్టుబడి ఉన్నాము. మా చివరి ఊపిరి వరకు, మా శరీరాల్లో ప్రాణం నిలిచి ఉన్నంతవరకు మా ప్రజలకు నిజాయితీతో సేవలు చేస్తాము” అని పెజెష్కియాన్ ప్రతిజ్ఞ చేశాడు.
కొద్ది వారాల క్రితం ఇరాన్ లో అధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశీ మంత్రి ఆరాగ్చిలకు వ్యతిరేకంగా దేశ వ్యాపితంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఆరాగ్చిని ఇరాన్ ప్రభుత్వంలో దాగి ఉన్న ద్రోహి అని నిందించారు. అమెరికాతో ఒప్పందానికి వారిద్దరు సిద్ధంగా ఉన్నారని, 40 యేళ్ళ నుండి దేశంపై ఆంక్షలు అమలు చేస్తున్న శత్రు దేశం అమెరికాతో ఒప్పందానికి సిద్ధం కావటం అంటే ఇరాన్ ప్రయోజనాల పట్ల ఆసక్తి లేకపోవటమే అని ఆరోపించారు. ఈ నేపధ్యంలో నుండి ఇరాన్ అధ్యక్షుడి ప్రతిజ్ఞను చూడాలి.


