ఇక చైనా కంట్రోల్ లో WHO!

–

ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) క్రమంగా చైనా నియంత్రణ లోకి వెళుతోంది. ఈ సంవత్సరం జనవరి నెలలో అమెరికా, WHO సభ్యత్వం నుండి ఉపసంహరించుకోవటంతో చైనా అమెరికా స్థానాన్ని ఆక్రమించినట్టు కనిపిస్తోంది. WHO డైరెక్టర్ జనరల్ పదవి 2027 ఆగస్టు నెలలో ఖాళీ కానుంది. తదుపరి డైరెక్టర్ జనరల్ గా చైనాకు చెందిన ప్రసూతి ఆరోగ్య నిపుణులు సాంగ్ లీ ని నామినేట్ చేస్తున్నట్టు ఈ రోజు చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఈ మేరకు చైనా విదేశీ శాఖ ప్రతినిధి మావో నింగ్ ప్రకటన విడుదల చేసినట్టు పత్రికలు తెలిపాయి. సాంగ్ లీ నియామకంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇక చైనా నియంత్రణ లోకి వెళ్లనున్నది. చైనా నియంత్రణ లోకి వెళ్ళటం అంటే పూర్తిగా చైనా యే WHO నడక నిర్ణయిస్తుందని అర్ధం కాదు. సంస్థ నిర్వహణ నిమిత్తం రూపొందించిన నిబంధనావళి, పాలనా సూత్రాలు సంస్థ నడకను నిర్దేశిస్తాయి. ఈ సూత్రాల అమలు ఇక ప్రధానంగా చైనా నిర్వహణ లోకి వెళుతుంది. చైనాకు అవసరం అనిపిస్తే నిబంధనలలో, మార్పులు (ఇతర సభ్య దేశాల ఫార్మల్ అనుమతితో) చేసే అవకాశం ఉంటుంది.

“ఈ నామినేషన్ ద్వారా బహుళపక్ష వాదానికి (మల్టీలేటరలిజం) చైనా సంపూర్ణ మద్దతు అందిస్తుందన్న సంగతి ఎలాంటి అరమరికలు లేకుండా రుజువు అవుతుంది” అని చైనా ప్రతినిధి వ్యాఖ్యానించింది. “WHO సంస్థ ప్రపంచ మానవుల బాగోగులు మరియు ఆరోగ్యం విషయంలో చురుకైన పాత్ర నిర్వహించేందుకు ఈ నియామకం తోడ్పడుతుంది” అని ఆమె నమ్మ బలికింది. సాంగ్ లీ ప్రస్తుతం నామినేట్ మాత్రమే అయింది. ఆయనను సభ్య దేశాలు ఎన్నుకోవలసి ఉంటుంది.

ప్రస్తుతం ఇధియోపియా కి చెందిన మైక్రో బయాలజిస్టు టెద్రోస్ అధనాం ఘిబ్రియేసస్ WHO సంస్థకు డైరెక్టర్ జనరల్ గా వ్యవహరిస్తున్నాడు. ఈయన WHO కు నాయకత్వం వహించిన మొదటి ఆఫ్రికన్. పబ్లిక్ హెల్త్ రంగంలో నిపుణుడు అయిన అధనామ్, పరిశోధకుడు మరియు డిప్లొమాట్ కూడా. ఆఫ్రికన్ యూనియన్ సిఫారసుతో ఈయన 2017 నుండి WHO డైరెక్టర్ జనరల్ గా పని చేస్తున్నాడు. రెండు సార్లు ఈ పదవిలో పని చేసినందున ఈయన పదవి నుండి తప్పుకోవలసి ఉన్నది.

Song Li

సాంగ్ లీ, చైనాలో సీనియర్ పబ్లిక్ హెల్త్ అధికారి. 20 యేళ్ళ పాటు ప్రసూతి, బాలల ఆరోగ్య విధానాల రూపకల్పనలో పని చేసింది. అంతర్జాతీయ సహకార రంగంలో ప్రవేశం ఉన్నది. సార్స్, బర్డ్ ఫ్లూ, కోవిడ్ 19 తదితర వైరస్ లకు జాతీయ స్థాయిలో స్పందించటంలో, ప్రివెన్షన్ విధానాలు అమలు చేయటంలో ఆమె పని చేశారని రాయిటర్స్ తెలిపింది. సౌదీ అరేబియా, బెల్జియం, కతార్, బొట్స్వానా, ఇండోనేషియా, స్పెయిన్ దేశాలు తమ ప్రతినిధులను నామెనేట్ చేశాయి. చైనాకు ఉన్న ఆర్ధిక శక్తి, వాణిజ్య సంబంధాల రీత్యా చైనా నామినేషన్ నెగ్గే అవకాశాలు ఉన్నాయి.

కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి చెందిన కాలంలో WHO తన మాట వినలేదని అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంస్థ పైన కినుక వహించాడు. సంస్థ నుండి అమెరికా తప్పుకుంటున్నట్టు 2025 లో ప్రకటించి ఆ మేరకు నోటీసు ఇచ్చాడు. నిబంధన ప్రకారం నోటీసు ఇచ్చిన ఏడాది తర్వాత అమెరికా ఈ యేడు జనవరిలో WHO నుండి నిష్క్రమించింది. అమెరికా నిష్క్రమణ దరిమిలా అమెరికాలో WHO సేవలు ఉండబోవు. వైరస్ లాంటి అంటు రోగాలు సంభవించినప్పుడు వ్యాధి నిర్మూలనలో అమెరికాతో సహకరించటం ఇక ఉండదు. అమెరికాలో వ్యాప్తి చెందే జబ్బుల విషయంలో WHO కు సమాచారం ఇవ్వాల్సిన అవసరం అమెరికాకు ఉండదు. అలాగే WHO కు నిధులు అందించే బాధ్యత కూడా అమెరికా పైన ఉండదు.

తన నిష్క్రమణకు అమెరికా అనేక కారణాలు చూపింది. కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి గురించి త్వరగా చర్యలు తీసుకోవటంలో విఫలం అయిందని, వైరస్ ఎక్కడ మొదలయింది అన్న అంశాన్ని పరిశోధన విషయంలో నిజాయితీగా వ్యవహరించలేదని అమెరికా ఆరోపించింది. వైరస్ వ్యాప్తి నిరోధంలో చైనాకు WHO ప్రశంసలు అందజేయటం అమెరికాకు సుతరాము నచ్చలేదు. తాను సూచించిన సంస్కరణలను అమలు చేయలేదని, తన సూచనలను ప్రతిఘటించిందని ఆరోపించింది.

పారదర్శకంగా ఉండాలన్న తన డిమాండ్ ను అమలు చేయలేదని ఆరోపించింది. అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న దేశాల ఎజెండా ప్రకారం వ్యవహరించిందని కూడా ఆరోపించింది. ఆరోగ్య సంస్థకు ఉండవలసిన స్వతంత్రతకు కట్టుబడలేదని ఆరోపించింది.

ఈ ఆరోపణలకు అర్ధం అమెరికా ఆదేశాలను అమలు చేయలేదనే. కోవిడ్ 19 దోషాన్ని చైనా మీదికి నెట్టడానికి అమెరికా తీవ్రంగా ప్రయత్నించింది. నిజానికి పశ్చిమ పత్రికల ప్రచారం పుణ్యమాని ప్రపంచం అంతా ఇప్పుడు కోవిడ్ 19 వైరస్ చైనా నుండే వ్యాపించిందని నమ్ముతోంది. కానీ వైరస్ చైనా నుండి పుట్టిందన్న అంశానికి నమ్మదగ్గ ఆధారాలు లేవని WHO మొదటి నుండి చెబుతూ వచ్చింది. చైనా లేబొరేటరీ నుండి వైరస్ తప్పించుకుని ప్రపంచం అంతా వ్యాపించిందని అమెరికా ఆరోపించగా అందుకు ఆధారాలు లేవని WHO స్పష్టం చేసింది. దానితో డబల్యూ‌హెచ్‌ఓ నుండి తప్పుకుంటున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించి ఆ నిర్ణయాన్ని అమలు చేశాడు.

ఐక్యరాజ్య సమితి అమెరికా, పశ్చిమ ఐరోపా దేశాలు ప్రపంచాన్ని రాజకీయంగా నియంత్రణ లో ఉంచుకునేందుకు ఏర్పాటు చేసుకున్న సంస్థ. ఐరాస భద్రతా సమితిలో మూడు పశ్చిమ దేశాలకు (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్) వీటో హక్కు కల్పించుకోవటం ద్వారా ప్రపంచం దేశాల్లో సాగించిన దురాక్రమణ యుద్ధాలకు అమెరికా, భద్రతా సమితి నుండి ప్రతికూల చర్యలు లేకుండా నిరోధించగలిగింది. WHO ని నియంత్రణ లో ఉంచుకోవటం ద్వారా ఏయే దేశాలకు ఆరోగ్య నిధులు వెళ్లాలో తానే నిర్ణయించేది. ఈ నియంత్రణ క్రమంగా తన చేతుల నుండి జారిపోతుండడంతో WHO కు ఇక నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని భావించి అక్కడి నుండి తప్పుకుంది.

స్పందించండి