ఎస్ఐఆర్ అవతవకలపై కోర్టు: మీరు కొత్త రూల్స్ ఎలా విధిస్తారు?

–

వోటర్ల జాబితా తయారు కోసం ఇప్పటికే చట్ట బద్ధ నిబంధనలు ఉండగా ఎస్.ఐ.ఆర్ కోసం అసలు నిబంధనలకు భిన్నంగా సరికొత్త నిబంధనలు ఎలా విధిస్తారని బొంబే హై కోర్టు ఎలక్షన్ కమిషన్ ను ప్రశ్నించింది. ఆరుగురు సభ్యులు గల కుటుంబం పాత నివాసం నుండి కొత్త చోటికి మారిన నేపధ్యంలో ఎస్.ఐ.ఆర్ ఎన్యూమరేషన్ సందర్భంగా ఎన్నికల నిబంధనల ప్రకారం ఫారం నెంబర్ 8 ని సమర్పించి నప్పటికీ ఆ కుటుంబాన్ని ఎన్నికల జాబితా లో చేర్చటానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తిరస్కరించటాన్ని ముంబై హై కోర్టు తీవ్రంగా విమర్శించింది.

చట్ట పరంగా ఏయే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలను మాత్రమే ఎన్నికల కమిషన్ అమలు చేయవలసి ఉండగా ప్రస్తుతం జరుగుతున్న ఎస్.ఐ.ఆర్ సందర్భంగా కొత్త అదనపు నిబంధనలను కమిషన్ అమలు చేయటం ఏమిటని హై కోర్టు ప్రశ్నించింది. కమిషన్ చేర్చిన కొత్త నిబంధనలను అమలు చేసినట్టయితే చిరునామా మారిన వారు కమిషన్ కి అబద్ధపు వాస్తవాలతో ఫారం లు సమర్పించాల్సి ఉంటుందని, అబద్ధాలు చెప్పేందుకు వోటర్లను ప్రోత్సహిస్తూ కొత్త నిబంధనలను ఎన్నికల కమిషన్ ప్రవేశ పెట్టడానికి వీలు లేదని ముంబై కోర్టు స్పష్టం చేసింది.

“ఎస్.ఐ.ఆర్ నిర్వహిస్తున్నారు కాబట్టి పాత అడ్రస్ నుండి మారిన వారు ఎలక్షన్ కమిషన్ కి తప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలని లేకపోతే జాబితా నుండి తొలగిస్తామని కమిషన్ వోటర్లకు చెప్పదలుచుకుందా?” అని కోర్టు ప్రశ్నించింది.

గోవా లోని శాంతా క్రజ్ నియోజకవర్గంలో ఆరుగురు సభ్యులు గల కుటుంబం నివసిస్తున్నది. వారు అక్కడి నుండి అదే నియోజకవర్గం లోనే మరొక ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ఈ కారణంతో కమిషన్ ఆరుగురి వొట్లను తొలగించింది. చట్టం ప్రకారం ఇల్లు షిఫ్ట్ అయిన వారు ఫారం 8 ని నింపి ఎన్నికల కమిషన్ కు సమర్పించాల్సి ఉంటుంది. చట్టం ప్రకారం ఫారం. 8 ని కమిషన్ ఆమోదించి ఆ ఆరుగురి వోటుని కొత్త చోటు వద్ద నమోదు చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా జాబితా నుండి తొలగించారు.

కారణం ఏమిటా అని చూస్తే స్థానిక ఎన్నికల అధికారులు వారి వోట్లను కొత్త చోటులో వోటు మార్చేందుకు ప్రయత్నిస్తే సెంట్రల్ ఎన్నికల కమిషన్ అమలు చేసిన కొత్త సాఫ్ట్ వేర్ అందుకు అనుమతించలేదు. అంటే చట్ట ప్రకారం కొత్త చోటులో వోట్లు మార్చే అధికారం కలిగిన స్థానిక ఎన్నికల అధికారికి (ERO) ప్రవేశాన్ని కొత్త సాఫ్ట్ వేర్ రద్దు చేసేసింది. కొత్త వోట్ల నమోదు అధికారాన్ని కేంద్ర ఎన్నికల కమిషనర్ కు (సిఇసి) మాత్రమే ఉండేలా సాఫ్ట్ వేర్ ను మార్చేశారు. ఇలా కొత్త వోట్ల నమోదు అధికారాన్ని తన చేతుల్లో మాత్రమే సిఇసి కేంద్రీకరించుకోవటాన్ని ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వ్యతిరేకిస్తూ అభ్యంతరం లేవనెత్తారని, దానికి సిఇసి పట్టించుకోలేదని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక వెల్లడి చేసింది.

ఈ కేసులోనే ప్రస్తుతం ముంబై హై కోర్టు ముందు వాదోపవాదాలు నడుస్తున్నాయి. ఎన్నికల కమిషన్ సదరు కుటుంబాన్ని ఫారం 9 కి బదులు ఫారం 6 (కొత్త వోటర్లు తమ వోటు నమోదుకు నింప వలసిన ఫారం) నింపి ఇవ్వాలని ఆదేశించింది. అందుకు ఆ కుటుంబం నిరాకరించింది. తాము కొత్త వోటర్లమ్ కాదని, పాత వోటర్లమే కనుక చట్టబద్ధ నిబంధనల ప్రకారం ఇల్లు మారిన వాళ్లు ఇవ్వవలసిన ఫారం 8 మాత్రమే సమర్పిస్తామని చెప్పారు. ఫారం 6 సమర్పిస్తే కొత్త చోటులో వారి పేర్లు 2002 జాబితాలో ఉండవు. కనుక వారి పేర్లు జాబితా నుండి తొలగించే అవకాశం ఉన్నది. అందుకే ఆ కుటుంబం ఫారం 6 లో అప్పటికే ఎన్నికల కమిషన్ చట్ట విరుద్ధంగా, చట్టం అనుమతి లేకుండా కొత్త ప్రశ్నను (2002 జాబితాలో మీ పేరు ఉన్నదా?) చేర్చారు. ఈ ప్రశ్నకు ఆ కుటుంబం “నో” అని సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. నో అని ఇస్తే కూడా వారి పేర్లను జాబితా నుండి తీసేస్తారు. ఏ విధంగా చూసినా ఆ కుటుంబం వోట్లను జాబితా నుండి తొలగించే ప్రమాదం ఎదుర్కొంటోంది.

“మీరు ఫారం 6 ఇవ్వమని చెబుతున్నారు. అందులో ఆ కుటుంబం తప్పుడు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అబద్ధం చెప్పమని మీరు కుటుంబానికి చెబుతున్నారా?” అని కోర్టు కమిషన్ లాయర్ ని ప్రశ్నించింది. “ఎన్నికల కమిషన్ ఫారం 8 ని నిరాకరించే అధికారం లేదు. ఎందుకంటే అదే సాధారణ పత్రం. నివాసం మారినప్పుడు ఇవ్వాల్సిన సరైన పత్రం అదే కదా!” అని కోర్టు ప్రశ్నించింది. దానికి కమిషన్ లాయర్ చేసిన వాదన ఇంకా విచిత్రంగా ఉంది.

సుప్రీం కోర్టు ఇప్పటికే ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ చట్టబద్ధమే అని ధృవీకరించిందని చెబుతూ కమిషన్ లాయర్, ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వటానికి కుటుంబం నిరాకరించింది అని నెపాన్ని కుటుంబం మీదికి నెట్టేశాడు. అందుకే వారి పేర్లు తొలగించాము అని తమ తప్పును సమర్ధించుకున్నాడు.

దానికి ద్విసభ్య ధర్మాసనం ఇలా చెప్పింది, “ఇదిగో చూడండి. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ జరుగుతుండగా ఒక వ్యక్తి పాత నివాసంలో నివసించని కేసు కోర్టు ముందుకు వచ్చింది. ఆయనకు ఎన్యూమరేషన్ ఫారం ఒకటి ఇచ్చి అది నింపి ఇవ్వండి లేకపోతే మీ వోటు తొలగిస్తాము అని ఎన్నికల కమిషన్ చెబుతున్నది. దానికి ఆ వ్యక్తి తాను ఇక అక్కడ నివసించటం లేదు కాబట్టి ఎన్యూమరేషన్ ఫారం నింపను అంటున్నాడు. 1960 ఎన్నికల చట్టం, రూల్ 13 ప్రకారం ఫారం 8 మాత్రమే ఇస్తాను అంటున్నాడు. కానీ మీరు తయారు చేసుకున్న సాఫ్ట్ వేర్ సిస్టమ్ ఫారం 8 ని ప్రాసెస్ చేయలేకపోతోంది” అని ధర్మాసనం దెప్పి పొడిచినట్టుగా వ్యాఖ్యానించింది.

2002 లో ఎస్.ఐ.ఆర్ జరిగిన నాటి నుండి ఇంకా ఎన్నో కుటుంబాలు నివాసం మారి ఉంటారని గుర్తు చేస్తూ ధర్మాసనం వారి అప్లికేషన్ లను ఎలా ప్రాసెస్ చేయాలనుకుంటున్నారో ముందు చెప్పాలని కమిషన్ లాయర్ ని కోరింది. అసలు అలాంటి దరఖాస్తులను ప్రాసెస్ చేసే మెకానిజం మీ వద్ద ఉందా లేదా అని ప్రశ్నించింది. కమిషన్ లాయర్ “ఎస్.ఐ.ఆర్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఏ కుటుంబం కూడా ఇలా నివాసం మారటానికి వీలు లేదు” అంటూ ఇంకో కొత్త నిబంధన ధర్మాసనం ముందు ప్రకటించాడు.

“ఫారం 8 అన్నది సాధారణ సమయాల్లో ఇల్లు మారిన వారికి మాత్రమే వర్తిస్తుంది. ఎస్.ఐ.ఆర్ జరుగుతున్నప్పుడు ఫారం 8 వర్తించదు” అని ఎన్నికల కమిషనర్ తరపున వాదిస్తున్న లాయర్ గౌరీష్ అగ్ని వాదించాడు. కమిషన్ అప్పటికే నివాసం మారిన, చనిపోయిన వోటర్ల పేర్లు అన్ని స్థాయిల్లో నోటీస్ బోర్డ్ లలో అంటించింది అని చెప్పాడు. అందుకు ధర్మాసనం అంగీకరించలేదు. ఎస్.ఐ.ఆర్ నిర్వహణకు తయారు చేసిన మార్గదర్శక సూత్రాలు (గైడ్ లైన్స్) వాస్తవ చట్టబద్ధ నిబంధనలకు విరుద్ధంగా ఉండటానికి వీలు లేదని స్పష్టం చేసింది.

“ఎన్నికల జాబితాలో అర్హత ఉన్న వోటర్లు అందరి పేర్లను జాబితాలో ఎక్కించటానికి ఎన్నికల కమిషన్ సకల ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఎస్.ఐ.ఆర్ జరుగుతున్నప్పుడు ఫారం 8 ని మీరు ఎందుకు నిరాకరిస్తున్నారు?” అని కోర్టు సూటిగా ప్రశ్నించింది.

“మాకిప్పుడు ఒక సంగతి అర్ధం అవుతోంది. నివాసం మారిన కొన్ని వందల వేల మంది వోటర్లు మీరు చెప్పే ఎన్యూమరేషన్ ఫారం (ఫారం 6) సమర్పించటానికి సిద్ధంగా ఉండరు అని అర్ధం అవుతున్నది. ఎందుకంటే వాళ్లు అక్కడ నివసించటం లేదు కాబట్టి. తాము అక్కడ నివసించటం లేదు అని నివాసం మారిన వోటర్లు మీకు చెప్పటానికి ఏ మెకానిజం తయారు చేశారో చెప్పండి” అని ఎన్నికల కమిషన్ ను ముంబై హై కోర్టు ఆదేశించింది.

వోటర్ల పేర్లను జాబితా నుండి ఏదో ఒక విధంగా తొలగించటానికే ఎన్నికల కమిషన్ కట్టుబడి ఉన్నట్టు కమిషన్ లాయర్, ముంబై హై కోర్టులో చేసిన వాదనలను బట్టి భావించ వలసి వస్తోంది. ఈ తరహాలో నివాసం మారిన వోటర్లు తమ వోటును కొత్త చోటుకు మార్చటానికి సవా లక్ష నిబంధనలు, అడ్డంకులను ఎన్నికల కమిషన్ సృష్టించిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదు. బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన ముస్లింల వోట్లను తొలగించే పేరుతో ఈ విధంగా అన్ని రాష్ట్రాల్లో నివాసం మారిన వోటర్ల వోట్లను కూడా తొలగించేందుకే ఎన్నికల కమిషన్ ఎక్కువ ఆసక్తిగా ఉండటం అన్నది ఏ విధంగా అర్ధం చేసుకోవాలో అంతుబట్టని సంగతి! కొత్త, పాత వోటర్లను జాబితాలో చేర్చటం కంటే తొలగించటానికే ఎస్.ఐ.ఆర్ ని డిజైన్ చేసినట్టు కనిపిస్తున్నది. ఎస్.ఐ.ఆర్ ని పాజిటివ్ గా తీసుకుని సర్ది చెప్పుకునేందుకు ఎక్కడా అవకాశం ఉండటం లేదు. ఏ మార్గంలో వెళ్ళినా వోటు రద్దు అయ్యే పరిస్ధితిని ఎస్.ఐ.ఆర్ సృష్టించినట్టు కనిపిస్తున్నది.

లేదంటే ఇండియాలో ఎన్నికలను అనాదిగా నిర్దేశిస్తున్న భారత ఎన్నికల చట్టం ప్రకారం రూపొందిన పత్రాలను కూడా తీసుకునేందుకు ఎన్నికల కమిషన్ ఎలా నిరాకరిస్తుంది? మోడి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ లతో పాటు సుప్రీం కోర్టు కూడా ఈ వోట్ల తొలగింపు ప్రక్రియలో సహకరించుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఎస్.ఐ.ఆర్ ప్రక్రియలో అనేక లోపాలను కపిల్ సిబాల్ లాంటి లాయర్లు వివిధ కోర్టు కేసుల సందర్భంగా (బీహార్, బెంగాల్ ఎస్.ఐ.ఆర్ లు) వాదించినప్పటికీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ సదరు లోపాలను సవరించటానికి గాని, కమిషన్ అడ్డగోలు ఆదేశాలను విమర్శనాత్మకంగా వోటర్లకు అనుకూలంగా పరిశీలించటానికి నిరాకరించటమే కాకుండా ఎస్.ఐ.ఆర్ ను దాని తీవ్ర లోపాలతో సహా చట్టబద్ధం చేసే తీర్పులు ప్రకటించాడు.

ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులకు సంబంధించిన వ్యవహారం అనీ, ఎలాంటి చిన్న లోపం కూడా ఉండటానికి వీలు లేదని రాజ్యాంగబద్ధ విచికిత్స జరిపేందుకు ఏ మాత్రం సుముఖత చూపలేదు. లక్షల మంది వోటు హక్కు కోల్పోతున్నారని చెప్పినా కూడా “ఈ ఎన్నికలకు కాకపోతే వచ్చే ఎన్నికల్లో వోటు వేస్తారు” అని సింపుల్ గా తీసిపారేయటం అది కూడా సాక్షాత్తు ఈ దేశ అత్యున్నత న్యాయ స్థానం అధినేత అయిన చీఫ్ జస్టిస్ అలా తీసి పారేయటం బొత్తిగా అర్ధం చేసుకోలేని విషయం. తగని విషయం కూడా. ఒక దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్యం అని చెప్పుకోవటానికి సాక్ష్యంగా ఉన్న ఒకే ఒక వ్యవస్థ ఎన్నికల వ్యవస్థ. అటువంటి ముఖ్యమైన వ్యవస్థలో తీవ్రమైన లోపాలు కొనసాగేందుకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అనుమతించటం ఒక మతి లేని, నిరంకుశమైన, అప్రజాస్వామిక చర్య! ఇది ఏ విధంగానూ క్షమార్హం కాదు.

Leave a Reply