1970ల్లో బోర్డర్ దాటిన వాళ్లందర్ని బంగ్లాకి పంపగలరా?

–

అక్రమ వలసదారుడు అన్న పేరుతో చట్ట బద్ధ ప్రక్రియ లేకుండా నెలల తరబడి పౌరులను నిర్బంధం లోకి ఎలా తీసుకుంటారని కలకత్తా హై కోర్టు ప్రశ్నించింది. చట్ట బద్ధ ప్రక్రియను అనుసరించకుండా ఒక వ్యక్తిని నిర్బంధించటం కుదరదని, చట్టంలో అందుకు అవకాశం లేదని కలకత్తా హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌగత భట్టాచార్య గురువారం స్పష్టం చేశారు.

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తరపున వాదిస్తున్న అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాజ్ డీప్ మజుందార్ చేసిన వాదనలకు స్పందిస్తూ కలకత్తా హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌగత భట్టాచార్య కొన్ని కీలకమైన ప్రశ్నలను సంధించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో ముస్లిం ప్రజలను బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వచ్చిన వారని ముద్ర వేసి అనేక మంది బెంగాల్ ముస్లింలను పోలీసులు జైలు పాలు చేసిన నేపధ్యంలో కలకత్తా హై కోర్టు విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.

“1970 లలో ఎంతమంది బోర్డర్ దాటి వచ్చారు? వాళ్లందరిని బంగ్లాదేశ్ కి వెనక్కి పంపటం సాధ్యం అవుతుందా? బోర్డర్ జిల్లాలకు ఒకసారి వెళ్లి చూడండి.. అది అసలు సాధ్యం అయ్యే పనేనా? చట్టం నిర్దేశించిన ప్రక్రియను అనుసరించకుండా ఒక వ్యక్తిని ఎలా నిర్బంధించ గలరు?” అని జస్టిస్ సౌగత భట్టాచార్య, రాష్ట్ర ప్రభుత్వ లాయర్ ను ప్రశ్నించారు.

కోర్టు అనుమానితుడిని ఎంత కాలం పాటు నిర్బంధించారు అన్న అంశాన్ని ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంది. “ఆగస్టు 8 తేదీ నుండి జైలు లోనే నిర్బంధించి ఉంచారా?” అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎలాంటి విచారణ, ఆధారం లేకుండా రెండు నెలల పాటు, విదేశీయుడు అన్న అనుమానంతో జైలులో నిర్బంధించటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సదరు వ్యక్తిని డిపోర్ట్ చేయాలని (స్వదేశానికి తిరిగి పంపించి వేయాలని) ఆదేశాలు చేయటానికి ఆధారపడిన మెటీరీయల్ ఆధారాల పట్ల న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు కుటుంబ సభ్యులు ఇచ్చిన స్టేట్ మెంట్ ల పైన ఆధారపడి డిపోర్టేషన్ ఆదేశాలు ఇచ్చినట్టుగా ఉన్నదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. “ఆ వ్యక్తి బంగ్లాదేశ్ దేశీయుడన్న సంగతి అతని కుటుంబ సభ్యుడు ఇచ్చిన స్టేట్ మెంట్ నిరూపిస్తుందా?” అని జస్టిస్ ప్రశ్నించారు.

డిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇవ్వటానికి ముందు మొదట అతని జాతీయతను నిరూపించే మెటీరీయల్ ఆధారాలను మొదట పరిశీలించాలని జస్టిస్ భట్టాచార్య సూచించారు. అయితే అడిషనల్ అడ్వకేట్ జనరల్ మజుందార్ తాము పరిగణించిన ఆధారాల గురించి చెప్పే ప్రయత్నం చేశారు. “పాన్ లేదా ఆధార్ ఇత్యాది పత్రాలను ఫోర్జడ్ పత్రాల ద్వారా సంపాదించినట్లయితే అదే ఆయనను పంపేయటానికి తగిన ఆధారం అవుతుందని ఏఏజి వాదించాడు.

ఈ విషయంలో కోర్టు అప్పటికే ఒక ఆర్డర్ జారీ చేసిందని, కోర్టులో ప్రొసీడింగ్స్ పెండింగ్ లో ఉండగానే ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేస్ ఆఫీసర్, సదరు వ్యక్తిని డిపోర్ట్ చేయటానికి ఆదేశాలు ఇచ్చారని కోర్టుకు సమాచారం ఇవ్వబడింది. కోర్టు విచారణ ప్రక్రియ పెండింగ్ లో ఉండగానే డిపోర్టేషన్ ఆర్డర్ జారీ చేశారని కోర్టు తన పరిశీలనగా పేర్కొన్నది.

అయితే పిటిషనర్ ను మళ్ళీ ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఎఫ్.ఆర్.ఆర్.ఓ) వద్దకు వెళ్ళాల్సిందిగా ఆదేశించాలని ఏఏజి కోర్టుకు విజ్ఞప్తి చేశాడు. సదరు విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. పోలీసులు ఆ వ్యక్తిని నిర్బంధించారని, పోలీసు అధికారులే స్వయంగా డిటెన్షన్ మేమో జారీ చేశారని కనుక ఈ దశలో ఎఫ్.ఆర్.ఆర్.ఓ వద్దకు వెళ్ళమని చెప్పలేమని కోర్టు స్పష్టం చేసింది.

అనంతరం కోర్టు రిట్ పిటిషన్ ను రిలీజ్ చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) తాలూకు అంశాలను పరిశీలిస్తున్న తగిన జ్యూరిస్ డిక్షన్ కలిగిన బెంచి ముందు పిటిషన్ ను ఉంచాలని హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనగా విదేశీయుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వోటు హక్కును నిర్ధారించటానికి కర్ణాటక హై కోర్టు నియమించిన జస్టిస్ కృష్ణారావు ఆధ్వర్యం లోని బెంచి ముందుకు కేసు విచారణకు వెళుతుంది.

నేపధ్యం

సహిదుల్ షేక్ అనే వ్యక్తి ముర్షిదాబాద్ జిల్లాలోని దుబాపర గ్రామ నివాసి. ఆగస్టు 8, 2026 తేదీన రాణి నగర్ పోలీసులు రాత్రి పూట అరెస్ట్ చేసి పట్టుకెళ్లారు. ఆయన బంగ్లాదేశ్ జాతీయుడని అక్రమంగా అంతర్జాతీయ సరిహద్దు దాటి వచ్చాడని పోలీసులు ఆరోపించారు. చనిపోయిన కలాం షేక్ కొడుకుగా చెప్పుకున్నాడని, తప్పుడు పద్ధతుల్లో ఫోర్జరీ పత్రాలు ఉపయోగించి పాన్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు సంపాదించాడని ఆరోపించారు.

కానీ చిత్రం ఏమిటంటే 2026 ఎస్.ఐ.ఆర్ సందర్భంగా ఆయన వోటు హక్కు ధృవీకరించబడింది. ఇటీవల జరిగిన బెంగాల్ ఎన్నికల్లో ఆయన వోటు కూడా వేశాడు. కానీ తాను సరిహద్దు దాటి వచ్చానని అతనే స్వయంగా పోలీసుల ముందు అంగీకరించాడని చెబుతున్నారు. ఆయన తండ్రిగా చెప్పిన కలాం షేక్ భార్య మరియు కుమార్తె, అతను ఎవరో తమకు తెలియదని చెప్పారని పోలీసులు చెబుతున్నారు.

Shafidul Shaik

పోలీసుల లాజిక్ ను జస్టిస్ సౌగత గట్టిగా ప్రశ్నించారు. తన తండ్రి ఎవరో చెప్పలేకపోవటాన్ని బట్టి లేదా కుటుంబ సభ్యులు అతనిని గుర్తించనంత మాత్రాన ఒక వ్యక్తి ఆటోమేటిక్ గా విదేశీయుడు అయిపోడని జస్టిస్ సౌగత బట్టాచార్య స్పష్టం చేశారు. అతను తన వాదనలను వినిపించటానికి, తన వంశ పరంపర గురించి వివరించటానికి ఎఫ్ఆర్ఆర్ఓ, అతనికి అసలు అవకాశమే ఇవ్వలేదని న్యాయమూర్తి ఎత్తి చూపారు. ఏ అవకాశం ఇవ్వకుండా ఏకాఎకిన ఆయనను డిపోర్ట్ చేయాలని ఆదేశించటం చట్టసమ్మతం కాదని జస్టిస్ భట్టాచార్య స్పష్టం చేశారు.

కింది నుండి పై వరకు కోర్టులు అన్నీ ఒకే విధమైన చట్టబద్ధ ఆలోచనా దృష్టి, చట్టాలకు సంబంధించిన ఒకే రకమైన లాజిక్ కలిగి లేకపోవటం ఒక లోపంగా ఉంటోంది. చట్టాలను అమలు చేసే దృక్పధం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇతర న్యాయాధికార వ్యవస్థలు అన్నింటికీ ఒకే పరిశీలనా దృష్టి ఉన్నట్టయితే ప్రజలకు, ముఖ్యంగా కక్షిదారులకు చాలా కష్టాలు లేకుండా పోతాయి.

బంగ్లాదేశ్ నిజానికి ఒకప్పుడు భారత ఉపఖండంలో అంతర్భాగం. మియాన్మార్, బంగ్లాదేశ్, ఈశాన్య భారత్, ఇవన్నీ ఒకదాని పక్కన ఒకటి వరుసగా ఉన్న ప్రాంతాలు 1947 ఆగస్టు 15 ను రిఫరెన్స్ గా తీసుకున్నా కూడా బంగ్లాదేశ్, ఇండియాలు ఒకే దేశంలో భాగంగా ఉన్నాయి. ముఖ్యంగా మియాన్మార్, బంగ్లాదేశ్, ఈశాన్య భారత్ రాష్ట్రాల ప్రజలు చారిత్రకంగా మూడు ప్రాంతాల లో ఒక దాని నుండి మరొక ప్రాంతానికి అవసరం వచ్చినప్పుడల్లా వలస పోవటం సర్వ సాధారణంగా జరుగుతూ ఉండేది. ఇలాంటి ప్రజా సమూహాల మధ్య అకస్మాత్తుగా సరిహద్దులు ప్రత్యక్షం అయ్యాయి. అప్పటి వరకు సొంత ప్రాంతాలుగా భావించిన అటవీ ప్రాంతం కాస్తా తమది కాని దేశంగా మారి పోవటం వారికి తెలియకుండానే జరిగిపోయింది. ఇది ప్రజల సౌకర్యం కోసం కాకుండా రాజకీయ పార్టీల స్వార్ధ ప్రయోజనాల కోసం జరగటంతో ప్రజలు బాధితులుగా మిగిళుతున్నారు.

Leave a Reply