దేశీయ టెక్ రీసర్చ్ కంపెనీలకు నిధులు బంద్! ఏడాదిలోనే పధకాన్ని మడతేసిన కేంద్రం!

–

నరేంద్ర మోడి ప్రభుత్వం దేశీయ ప్రైవేటు పరిశోధనా సంస్థల అభివృద్ధి కోసం అని చెబుతూ నవంబర్ 2025 లో ఆర్భాటంగా ప్రారంభించిన పధకం పది నెలలు గడవకుండానే మూలన పడే పరిస్ధితికి చేరినట్టు కనిపిస్తోంది. ఆరేళ్లలో లక్ష కోట్ల నిధులు సమకూర్చుతామని చెబుతూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెక్నాలజీ డవలప్^మెంట్ బోర్డు (టిడిబి) తమకు ప్రభుత్వం నుండి నిధులు అందటం లేదు కనుక ఇక కొత్త ప్రైవేటు కంపెనీలను ఆహ్వానించలేమని చేతులెత్తేస్తూ తన ఆఫీసు ముందు బోర్డు పెట్టింది (తన వెబ్ సైట్ లో ప్రకటన విడుదల చేసింది.)

టెక్నాలజీ రంగంలో శరవేగంతో దూసుకు పోతున్న చైనా, అమెరికా లతో పాటు పశ్చిమ ఐరోపా దేశాలతో పోటీ పడే లక్ష్యంతో సొంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు కంపెనీలకు నిధులు ఇస్తామని మోడి ప్రభుత్వం గత యేడు వాగ్దానం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ మరియు క్లీన్ ఎనర్జీ.. ఈ కీలక రంగాలలో పరిశోధనను ప్రోత్సహించాలని తద్వారా ఇండియా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంకు సంబంధించి పరిశోధన మరియు అభివృద్ధిలో స్వయం సమృద్ధి సాధించాలని తమ లక్ష్యంగా నరేంద్ర మోడి ప్రకటించాడు. వివిధ దూరదర్శన్ మరియు ఆకాశవాణి రేడియో ప్రకటనల్లో, కార్యక్రమాల్లో ఈ లక్ష్యాన్ని ప్రకటిస్తున్న మోడి ప్రసంగాన్ని క్రమం తప్పకుండా ప్రసారం చేస్తున్నారు.

ఇందుకోసం “ఆర్.డి.ఐ ఫండ్ (రీసర్చ్, డవలప్^మెంట్, ఇన్నోవేషన్ ఫండ్)” పేరుతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు మోడి ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే 6 సంవత్సరాల్లో ఆర్.డి.ఐ ఫండ్ కోసం లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు నవంబర్ 2025 లో ప్రకటించారు. ఈ నిధిని నిర్వహించటానికి చట్టబద్ధ సంస్థ “అనుసంధాన్ నేషనల్ రీసర్చ్ ఫౌండేషన్ (ఏ.ఎన్.ఆర్.ఎఫ్)” ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. “స్పెషల్ పర్పస్ ఫండ్” (ఎస్.పి.ఎఫ్) ద్వారా నిధులను ఏ.ఎన్.ఆర్.ఎఫ్ నిర్వహిస్తుందని ప్రకటించారు.

ఈ సంస్థల ఏర్పాటులో ప్రభుత్వానికి ఉన్న ముఖ్య లక్ష్యాలు: ప్రయోగశాలలో ఉన్న ఐడియాలను గ్లోబల్ స్థాయిలో పోటీ పడగల ఇన్నోవేషన్స్ గా అభివృద్ధి చేయటం, సన్ రైజ్ సెక్టార్లుగా గుర్తించిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ, అంతరిక్షం, రోబోటిక్స్, బయో టెక్నాలజీ, క్లీన్ ఎనర్జీ రంగాలలో ప్రపంచ వాణిజ్య స్థాయిలో ఉత్పత్తులను తయారు చేయటం. ఈ రంగాలలో ముఖ్యంగా ఏఐ, అంతరిక్షం, రోబోటిక్స్ రంగాలలో చైనా, ఇప్పటికే అమెరికాను మించిన అభివృద్ధి సాధించటం గమనార్హం. ప్రతి అంశంలోనూ చైనాతో పోటీ పడే మోడి నేతృత్వం లోని పాలకవర్గాలు బహుశా ఆ దృష్టితోనే ఆర్.డి.ఐ ఫండ్ కు శ్రీకారం చుట్టి ఉండవచ్చు. ఏ దృష్టితో ఉన్నప్పటికీ ఆర్ & డి రంగానికి నిధుల కేటాయింపుకు ప్రపంచ స్థాయికి చేరే లక్ష్యంతో పూనుకోవటం నిస్సందేహంగా సానుకూల చర్యే!

నిధుల పంపకానికి ప్రభుత్వ రంగంలో రెండు సంస్థలను ప్రభుత్వం స్థాపించింది. వాటిని సెకండ్ లెవెల్ ఫండ్ మేనేజర్స్ (ఎస్.ఎల్.ఎఫ్.ఏం) అని పిలుస్తోంది. ప్రభుత్వ రంగంలో టెక్నాలజీ డవలప్^మెంట్ బోర్డ్ (టిడిబి), బయోటెక్నాలజీ కోసం “బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసర్చ్ ఆసిస్టెన్స్ కౌన్సిల్ (BIMRC)” లను ఏర్పాటు చేశారు. ప్రైవేటు రంగంలో అనుభవం ఉన్న సంస్థలను 30 నుండి 40 వరకు ఎస్రీఎల్ఎఫ్.ఏం లుగా నియమించాలని నిర్ణయించారు. రీసర్చ్ & అభివృద్ధి రంగంలో ఆసక్తి ఉన్న కంపెనీలు, ఇప్పటికే తగిన ఐడియాలు కలిగి ఉండి డబ్బు లేక ముందుకు వెళ్లలేని వాళ్లు ప్రభుత్వం నుండి నిధులు పొందడం కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని ఆహ్వానించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద టిడిబి ఉంటుందని ప్రకటించారు.

ఆశ్రిత పక్షపాతం

2026 ఆరంభంలో ప్రభుత్వం టిడిబి కి 2,000 కోట్ల రూపాయలు అందజేశారు. ఈ నిధుల కోసం ప్రైవేటు కంపెనీలు ఒక వెల్లువగా దరఖాస్తులు చేసుకున్నారు. ఈ నిధులు ఏప్రిల్ 2026 నెలతో ముగిసిన మొదటి రౌండ్ నాటికే 2,000 కోట్ల రూపాయల మొత్తం పూర్తిగా కేటాయించ వలసి వచ్చింది. 22 కంపెనీలను నిధులను కేటాయించగా, వారికి 2,192 కోట్ల రూపాయల మొత్తాన్ని రుణం కింద అందజేశారు.

తీరా చూస్తే ఎంపిక చేసిన 22 కంపెనీలలో మూడు వంతులు సెలక్షన్ కమిటీ సభ్యులతో సంబంధం ఉన్న వారికి చెందిన కంపెనీలు లేదా వారికి పెట్టుబడి భాగస్వామ్యం ఉన్న కంపెనీలే అని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక జరిపిన పరిశోధనలో వెల్లడి అయింది. ఆగస్టు 10 తేదీన పత్రిక ప్రచురించిన పరిశోధనాత్మక వెల్లడి ప్రకారం టిడిబి కి చెందిన సెలక్షన్ కమిటీ 22 కంపెనీలను ఉదారంగా ఇవ్వజూపిన రుణాల స్వీకరణకు ఎంపిక చేయగా అందులో 15 కంపెనీలలో సెలక్షన్ కమిటీలోని 7 గురు సభ్యులు స్వయంగా పెట్టుబడి పెట్టారు. అంటే సెలక్షన్ కమిటీ సభ్యులు తాము పెట్టుబడి పెట్టిన కంపెనీలనే రుణాల జారీకి ఎంపిక చేసుకున్నారు.

ఇలా సెలక్షన్ కమిటీ సభ్యులు పెట్టుబడి భాస్వామ్యం కలిగిన కంపెనీల అర్హతలను పరిశీలించటం అనేది ‘Conflict of Interest’ అవుతుంది. అనగా ఒక జడ్జి నేరానికి పాల్పడితే ఆ నేర విచారణలో ఆ జడ్జి స్వయంగా పాల్గొనడం లాంటిది. ఒక ఎస్.ఐ చేసిన నేరాన్ని ఆయన కింద పని చేసే పోలీస్ స్టేషన్ వారే నేర పరిశోధన జరపడం. ఈ అంశాన్ని పత్రిక ఎత్తి చూపగా సదరు కమిటీ సభ్యులు తమ కంపెనీ అర్హతను పరిశీలించే సమయంలో తాము ఆ పరిశీలన నుండి తప్పుకున్నామని చెప్పారట! ఇది నిజమా కాదా అన్నది ఎవరూ తేల్చలేరు. ఒక కమిటీ సభ్యుడి కంపెనీని పరిశీలించే సమావేశంలో ఆ సభ్యుడు పాల్గొనక పోయినప్పటికీ ఇతర సభ్యులు ఆయన కంపెనీకి అనుకూలంగా నిర్ణయం చేసే అవకాశం భారీగా ఉంటుంది. ఒక ఎస్.ఐ నేరాన్ని ఆయనతో పని చేసే హెడ్ కానిస్టేబుల్ విచారిస్తే నిస్పక్షపాతంగా ఆయన విచారించగలడా?

ఇక నిధులు లేవు

రెండు రౌండ్ల పాటు ఎంపిక కోసం దరఖాస్తులు ఆహ్వానించగా మొత్తం 300 పైగా కంపెనీలు దరఖాస్తు చేశాయి. ఈ 300 ప్లస్ కంపెనీలు భారత పరిశోధన & అభివృద్ధి రంగంలో పాల్గొనేందుకు తగిన వినూత్న ఐడియాలు కలిగి ఉండి నిధుల కోసం ఎదురు చూస్తున్నారని అర్ధం. వాటిలో 100 కంపెనీల ఐడియాలను, అర్హతలను, వాణిజ్య స్థాయి ఉత్పత్తులను అభివృద్ధి చేయగల సామర్ధ్యాన్ని మున్నగు అంశాలను పరిశీలించి మదింపు వేసి వాటిలో 35 కంపెనీలను కమిటీ ఎంపిక చేసింది. మొదటి రౌండ్ రుణాల జారీ కోసం 22 కంపెనీలు, రెండవ రౌండ్ రుణాల జారీ కోసం 13 కంపెనీలను కమిటీ ఎంపిక చేసింది.

మొదటి రౌండ్ లో ఎంపిక చేసిన కంపెనీలలో అంతరిక్ష రంగ పరిశోధన కోసం ఎంపిక చేసిన అగ్నికూల్ కాస్మోస్, మరియు గలాక్స్ ఐ (GalaxEye) కంపెనీలు ఉన్నాయి. అలాగే క్వాంటమ్ టెక్నాలజీ లో ఆసక్తి ఉన్న స్టార్టప్ కంపెనీ QuNu Labs కంపెనీ, రోబోటిక్స్ రంగం కోసం ఐడియా ఫోర్జ్ (ideaForge), ఎండూర్ ఎయిర్ (EndureAir) కంపెనీలు ఇందులో ఉన్నాయి.

ప్రభుత్వ పధకం ప్రకారం పరిశోధన & అభివృద్ధి రంగంలో శ్రద్ధ, ఆసక్తి ఉన్న ప్రైవేటు కంపెనీలను సులభ తరమైన రుణాలు సమకూర్చి ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రాజెక్టుకు అయ్యే మొత్తం ఖర్చులో 50 శాతం అతి తక్కువ వడ్డీకి రుణంగా ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన 50 శాతం కంపెనీ భరించాలి. కంపెనీ భరించటం అంటే సొంత డబ్బు పెట్టాలన్న రూల్ లేదు. వారు ప్రభుత్వేతర సంస్థల నుండి నిధులు తెచ్చుకోవచ్చు.

నిబంధనల ప్రకారం అర్హులైన కంపెనీలను ముందు చెప్పిన సెకండ్ లెవల్ ఫండ్ మేనేజర్ కంపెనీలు ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం సొంతగా టిడిబి ని సొంత ఎస్.ఎల్.ఎఫ్.ఏం గా స్థాపించి 50 శాతం ఖర్చును రుణంగా అందిస్తుండగా మిగిలిన 50 శాతం ఖర్చును ప్రైవేటు రంగంలోని ఫండ్ మేనేజర్ కంపెనీల నుండి దర్ఖాస్తుదారులు నిధులు సమకూర్చుకోవచ్చు. దీని నుండి మనం గ్రహించాల్సింది ఏమిటంటే ప్రైవేట్ రంగం లోని ఫండ్ మేనేజర్ కంపెనీలు ఇలా ప్రైవేటు రంగంలో స్థాపించబడే ఆర్&డి కంపెనీల పైన అజమాయిషీ కలిగి ఉంటాయి అని.

ఒకప్పుడు 5% పెట్టుబడితో టాటా కంపెనీ ప్రభుత్వ రంగం లోని స్టీల్ కంపెనీ టిస్కో ను కంట్రోల్ చేసిన చరిత్ర మనకి ఉన్నది. కేంద్ర ప్రభుత్వానికి 40 శాతం పెట్టుబడులు TISCO (టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ) లో ఉన్నప్పటికీ ప్రైవేటు వాటాదారులే కంపెనీని కంట్రోల్ చేయగలిగారు. జనతా పార్టీ హయాంలో అప్పటి మంత్రి బిజూ పట్నాయక్ టిస్కో కంపెనీని జాతీయం చేసి పూర్తిగా ప్రభుత్వ రంగ కంపెనీగా మార్చాలని ప్రయత్నించాడు. కానీ టాటా, ఇతర ప్రైవేటు వాటాదారులకు ప్రభుత్వం లోనే మంత్రులుగా ఉన్న ఎల్.కె.అద్వానీ, సుబ్రమణ్య స్వామి లాంటి వారు అడ్డం వచ్చారు. టాటాకు మద్దతుగా నిలబడ్డారు. కార్మిక యూనియన్ నాయకులను కొనేసి జాతీయం చేయకుండా అడ్డు పడ్డారు.

ఎల్ కె అద్వానీ, సుబ్రమణ్య స్వామి ప్రస్తుతం బిజెపి నాయకులు. వారి వారసులు నడిపిస్తున్న బిజెపి ప్రభుత్వమే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తోంది. జామ విత్తనం నాటి మామిడి చెట్టు మొలవాలంటే కుదరదు కదా!

మొదటి రౌండ్ లో 22 కంపెనీలను ఎంపిక చేసి నిధుల కేటాయింపు జరిపిన తర్వాత ప్రాజెక్టు కుంటి నడక నడవటం మొదలు పెట్టింది. రెండో రౌండ్ కంపెనీలను ఎంపిక చేయాల్సి ఉండగా అది జరగటం లేదు. మొదటి విడత ఎంపిక జనవరిలో పూర్తయి ప్రైవేటు ఎస్.ఎల్.ఎఫ్.ఏం ల నియామకం కూడా పూర్తి కాగా రెండో విడత ఎంపిక మే నెలలో పూర్తయిందని చెప్పారు కానీ ఆ తర్వాత ఎలాంటి ముందడుగు పడలేదు. దానికి కారణం పన్ను సంబంధిత నిబంధనలు కారణం అని వార్తలు వచ్చాయి.

50 శాతం ప్రైవేటు రుణాలు మంజూరు చేసి ఫండ్ మేనేజర్ కంపెనీలు తాము ఇచ్చే రుణాలను ఈక్విటీలుగా మార్చే అవకాశం ప్రభుత్వం కల్పించింది. అంటే కొత్తగా అభివృద్ధి అయిన పరిశోధన కంపెనీలో వాటాలుగా తాము ఇచ్చే రుణాలను మార్చుకునే అవకాశం ఫండ్ మేనేజర్ కంపెనీలకు ఇచ్చారు. కొత్త కంపెనీలో ఈక్విటీ వాటాలు (షేర్లు) సొంతం చేసుకున్నాక వాటాల నుండి డివిడెంట్ (లాభం) లను ఫండ్ మేనేజర్ కంపెనీలు సంపాదించటం అనివార్యం. ఈ లాభాల పైన పన్ను వసూలు చేస్తామని ప్రభుత్వం చెప్పటం ప్రైవేట్ ఫండ్ మేనేజర్ కంపెనీలకు రుచించలేదు. ఈ అంశంలో స్పష్టత ఇవ్వాలని అవి డిమాండ్ చేస్తున్నాయి. పరోక్షంగా తమకు వచ్చే లాభాలపై పన్ను వేయటానికి వీలు లేదని చెబుతున్నాయి.

తాము మిగిలిన 50 శాతం డబ్బు రుణంగా ఇచ్చే ముందు పన్ను విషయంలో స్పష్టత ఇవ్వాలని అవి ఫైనాన్స్ మంత్రిత్వ శాఖను కోరుతున్నాయి. ఫలితంగా కొత్త కంపెనీలకు ప్రభుత్వం నుండి 50 శాతం నిధులు అందాయి గానీ ప్రైవేటు ఫండ్ మేనేజర్ల నుండి మిగిలిన 50 శాతం నిధుల పంపకం జరుగుతుందా లేదా అన్న సంశయం ఏర్పడింది. దానితో ప్రభుత్వం నుండి ఆ మొదట విడుదల చేసిన 2,000 కోట్ల రూపాయలు తప్ప మళ్ళీ నిధుల కేటాయింపు జరగలేదు. ప్రభుత్వం కూడా వెనకడుగు వేసిందా అన్నది తెలియటం లేదు.

ఎంతో ఆశగా ముందుకు వచ్చిన ప్రైవేటు స్టార్టప్ కంపెనీలు ఇప్పుడీ ఇబ్బందిలో పడ్డాయి. ప్రభుత్వం ప్రకటించిన లక్ష కోట్ల నిధి తమకు చాలా అవసరం అని, ఈ తరహాలో నిధుల పంపిణీ అకస్మాత్తుగా ఆగిపోతే ప్రభుత్వం ఆశించినట్టు టెక్నాలజీ రంగంలో ఇండియా పురోభివృద్ధి సాధించటం అనుమానమే అని వాళ్లు మొత్తుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దలేమో “పాలనా పరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటికైతే నిధులు లేవు” అని కారణం చెప్పి తప్పుకుంటున్నారు.

డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి గత సంవత్సరం రు 3,000 కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం రు 20,000 కోట్లు కేటాయించారు. ఇందులో ఎంత మొత్తం ఆర్.డి.ఐ కింద ఇవ్వాలని ప్రభుత్వం భావించిందో తెలియదు. ఇప్పటి వరకు రు 2,000 కోట్లు పంపిణీకి కంపెనీలను ఎంపిక చేయటంతోటే పధకం అమలు ఆగిపోయింది. ఇది ఎప్పుడు ముందుకు కదులుతుందో అసలు కదులుతుందో లేదో తెలియదు.

Leave a Reply