
ఈ కధ ఒక అంతులేని ధారావాహిక రాజ్యాంగం అంతరానితనం నేరం అంటుంది. కుల వివక్షను, అంటరానితనాన్ని రద్దు చేసేశామని చట్టాలు చెబుతాయి. ఇప్పుడు కులం ఎక్కడుంది? ఇప్పుడు ఎవ్వరూ పాటించటం లేదని అగ్ర కుల బుద్ధి జీవులు అమాయకంగా ప్రశ్నిస్తుంటారు? ఉద్యోగాలు రద్దు చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించటం మానేసి రిజర్వేషన్లు రద్దు చేయాలని పావు మెదడు ప్రతిభావంతులు డిమాండ్ చేస్తుంటారు. కానీ అంటరానితనం, కుల వివక్ష ఈ దేశంలో నిరాఘాటంగా సాగిపోతూనే ఉంటుంది.
ఉత్తర ప్రదేశ్ లోని భదోహి లో ఒక ప్రభుత్వ ఆసుపత్రి దళిత కులానికి చెందిన గర్భిణీ స్త్రీని ఆసుపత్రిలో చేర్చుకోవటానికి, వైద్యం అందించటానికి డాక్టర్లు, నర్సులు నిరాకరించి వెనక్కి తిప్పి పంపటంతో సదరు మహిళ ఆసుపత్రి బయట, రోడ్డు పైనే ప్రసవించ వలసి వచ్చింది. ఈ ఆసుపత్రి గ్యాన్ పూర్ లోని మహారాజా చేట్ సింగ్ జిల్లా ఆసుపత్రి కావటం గమనార్హం. ఒక జిల్లా ఆసుపత్రి లోనే విద్యాధికులైన డాక్టర్లు, నర్సులు దళిత కుల మహిళకు ఆసుపత్రిలో ప్రసవం చేసేందుకు నిరాకరించారంటే అత్యధిక జనాభా కలిగిన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక అంతరాలు విద్యా సంస్కారానికి అతీతంగా ఎంత లోతుగా పాటుకుపోయి ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు.
ఆమె పేరు రాణి. వయసు 20 సంవత్సరాలు. గత మంగళవారం ఆమెకు ప్రసవం తాలూకు నొప్పులు మొదలయ్యాయి. ఆమె కుటుంబం హుటా హుటిన ఆమెను జిల్లా ఆసుపత్రికి తీసుకు వచ్చారు. అక్కడి సిబ్బంది ఆమెను ముసాహిర్ కులానికి చెందిన మహిళగా గుర్తించారు. వెంటనే ఆమెను ఆసుపత్రి నుండి బైటికి గెంటేశారు. దానితో ఆమె కుటుంబం ఆసుపత్రి నుండి బైటికి వస్తుండగానే రాణి పరిస్ధితి విషమంగా మారింది. దానితో ఆసుపత్రి బయట రోడ్డు పక్క కుటుంబ సభ్యులు చుట్టూ నిలబడి చాటు ఏర్పాటు చేయగా రాణి అక్కడే ప్రసవించింది.
ఆ తర్వాత ఈ సంగతి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎస్ కె చక్ కు తెలిసింది. ఆయన వెంటనే స్వయంగా రాణిని ఇంటిని సందర్శించి కుటుంబానికి నచ్చజెప్పి రాణిని, అప్పుడే పుట్టిన పాపను ఆసుపత్రిలో చేర్చుకుని జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించాడు. విచారణ కోసం 4 గురు సభ్యులతో కమిటీని నియమించాడు. విచారణ కమిటీ దోషులను గుర్తిస్తూ నివేదిక అందజేసింది. ఎమర్జెన్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పంకజ్ ను ఉద్యోగం నుండి తొలగించారు. స్టాఫ్ నర్స్ నీలం మౌర్య ను మరో ఆసుపత్రికి బదిలీ చేశారు. ప్రసూతి వైద్యుడు డాక్టర్ ముఖేష్ ప్రజాపతి వేతనాన్ని నిలుపుదల చేశారు. చీఫ్ మెడికల్ సూపర్-ఇన్-టెండెంట్ డాక్టర్ అజయ్ తివారీ, డాక్టర్ నీలిమ ధావన్ ల పైన తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ పై అధికారులకు సిఫారసు చేసింది.

ఎంక్వైరీ రిపోర్ట్ ప్రకారం రాణి ఆసుపత్రికి వచ్చినపుడు డాక్టర్ పంకజ్ ఎమర్జెన్సీ డ్యూటీలో ఉన్నాడు. ఆయన రాణిని పరీక్షించకుండానే వేరే ఆసుపత్రికి రిఫర్ చేశాడు. డాక్టర్ నీలిమ ధావన్ ఒక రోజు ముందు పరీక్ష కోసం వచ్చిన రాణిని పరీక్షించి, ఆమె తీవ్ర రక్త హీనతతో బాధ పడుతున్నప్పటికీ అడ్మిట్ చేసుకోకుండా వేరే ఆసుపత్రికి రిఫర్ చేసింది. చీఫ్ మెడికల్ సూపర్-ఇన్-టెండెంట్ కూడా తన విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడు.
ఇక ప్రసూతి వైద్యుడు డాక్టర్ ప్రజాపతి డ్యూటీలో ఉన్నప్పటికీ రాణి వచ్చిన సమయంలో ఆసుపత్రిలో లేడు; టౌన్ లో లేడు, జిల్లాలో కూడా లేడట. ఓ గంటన్నర తర్వాత ఆసుపత్రికి వచ్చాడట. నర్సు గారేమో రాణి కుటుంబం ముసాహర్ కుటుంబంగా గుర్తించి అడ్మిషన్ నిరాకరించింది.
ముసాహర్ కులాన్ని భారత ప్రభుత్వం ఎస్.సి కులాల జాబితాలో చేర్చింది. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ కుల ప్రజలను దళితుల్లో దళిత కులంగా పేర్కొంటారు. ముసాహర్ అంటే ఎలుకలు తినేవారు అని అక్కడి జనం చెబుతుంటారు. స్కాలర్లు మాత్రం ముసాహర్ అంటే మాంసం తినేవారు అని అర్ధం (మాసు = మాంసం, హెరా = కోరేవారు) అని చెబుతారు. చారిత్రకంగా చూస్తే ఇండియాలో ఒకానొకప్పుడు తీవ్రమైన కరువు ఏర్పడిన పరిస్ధితుల్లో వీరు ధాన్యం నిలువ చేసే గుంటల్లో పడ్డ ఎలుకలను తిని బతికి బట్టకట్టారని తెలుస్తున్నది. వీరు సాధారణంగా మంఝి, సదా, ఋషిదేవ్ లను ఇంటి పేర్లుగా కలిగి ఉంటారు.
బీహార్, ఉత్తర ప్రదేశ్ లలో ముసాహర్ కుల ప్రజలు సమాజంలో అట్టగు స్థాయిని కలిగి ఉన్నారు. వీరికి కుంట భూమి కూడా ఉండదు. ప్రభుత్వ భూ సంస్కరణ చట్టాలు వీరికి సెంటు భూమి కూడా ఇవ్వలేకపోయాయి. బీహార్ ప్రభుత్వం వారిని మహా దళితులు అని గుర్తించినా కూడా వారి అభ్యున్నతి కోసం, శాశ్వత ఉన్నతి కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ముసాహర్ ప్రజల పైన అత్యంత తీవ్ర స్థాయిలో అణచివేత, గెంటివేత అమలవుతోంది. వారికి వెల్ఫేర్ పధకాల ఫలాలు అందటం గగనం. ఫలితంగా తరతరాలుగా వీరు దారుణమైన పరిస్ధితుల్లో జీవనం సాగిస్తున్నారు.

