ఇరాన్ దాడుల్లో అమెరికా గల్ఫ్ స్థావరాలకు తీవ్ర నష్టం -ఫోటోలు

Boeing E3 Sentry Aircraft at Prince Sultan Air Base in Saudi Arabia

అమెరికా మిలటరీ (పెంటగాన్) అధికారులు యుద్ధంలో అమెరికాకు జరిగిన నష్టం వివరాలను ఎట్టకేలకు కాస్తయినా వెల్లడి చేసేందుకు సుముఖంగా ఉన్నారు. గల్ఫ్ దేశాలలో అమెరికా సైనిక, నౌకా, మరియు వాయు దళాల స్థావరాల పైన ఇరాన్ మిలటరీ చేసిన దాడుల్లో తాము తీవ్రంగా నష్టపోయామని పెంటగాన్ అధికారులు వెల్లడించారు.

అమెరికాకు చెందిన పలు యుద్ధ పరికరాలు (ఫైటర్ జెట్ విమానాలు, ఎం.క్యూ9 రీపర్ డ్రోన్ లు, మిసైల్ లాంచర్లు, రాడార్లు, మొదలైన పరికరాలను అమెరికా నష్టపోయింది. కాగా అమెరికాకు చెందిన సైనికులు డజను మంది చనిపోగా, 400 మందికి పైగా సైనికులు వివిధ స్థాయిల్లో గాయపడ్డారని పెంటగాన్, అధికారికంగా వెల్లడి చేసిన నివేదిక తెలిపింది.

అమెరికాకు జరిగిన ప్రాణ నష్టం గురించి పూర్తి వివరాలను వెల్లడి చేయలేదని అనుమానాలు ఉన్నాయి. కాగా నష్టపోయిన యుద్ధ పరికరాల ఖరీదు కనీసం 38 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అమెరికా మిలటరీ ఖర్చును చూసే కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ సెప్టెంబర్ 15 తేదీన తెలియజేసింది.

అమెరికాకు చెందిన సిబిఎస్ న్యూస్ మంగళవారం (సెప్టెంబర్ 15) అమెరికా మిలటరీ స్థావరాలకు జరిగిన నష్టం తాలూకు ఫోటోలను ప్రచురించింది. అమెరికన్ మిలటరీలో యాక్టివ్ డ్యూటీలో ఉన్న అధికారులు లేదా సైనికులు సిబిఎస్ న్యూస్ కు ఈ ఫోటోలను అనధికారికంగా అందజేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ తో అమెరికా చేస్తున్న యుద్ధం పట్ల అనేక మంది సర్వీస్ సైనికులు వ్యతిరేకంగా ఉన్నారని గతంలో పలు వార్తలు వచ్చాయి. నెలల తరబడి సముద్రం పైన విమాన వాహక నౌక లో గడపవలసి రావటంతో అందులోని అమెరికా సైన్యం ఉద్దేశ్య పూర్వకంగా నౌకలోని డ్రైనేజి వ్యవస్థలను చెడగొట్టటంతో నౌకను యుద్ధం నుండి ఉపసంహరించుకోవలసి వచ్చింది.

“ఇరాన్ పైన అమెరికా చేస్తున్న యుద్ధంలో అమెరికా సైన్యానికి జరుగుతున్న తీవ్ర నష్టాన్ని ప్రజలకు తెలియజేప్పేందుకు ప్రభుత్వం నిరాకరిస్తోంది. అందుకే ఈ ఫోటోలు పంపిస్తున్నాం” అని ఫోటోలు పంపిన సైన్యాధికారి సిబిఎస్ న్యూస్ తో అన్నాడు. “మన మిలటరీ బేస్ లు బాగా దెబ్బ తిన్నాయి. ఇరాన్ మా ముఖాలపై గుద్దుతుంటే మేమిక్కడ కళ్లు మూసుకుని దెబ్బల్ని భరిస్తున్నాం” అని అమెరికన్ సైనికుడు వాపోయాడు. “మన బేస్ లను మనం రక్షించటం లేదు. అవి నాశనం అవుతుంటే చూస్తూ నిలబడాల్సి వస్తోంది” అని ఆయన ఆగ్రహం వెలిబుచ్చాడు. (సిబిఎస్ న్యూస్, సెప్టెంబర్ 15).

కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (సిబిఓ) వేసిన అంచనా ప్రకారం యుద్ధంలో ఉపయోగించిన మందు గుండును తిరిగి నింపటానికి, నష్టపోయిన యుద్ధ పరికరాలకు, మిలటరీ ఉపయోగించిన ఇంధనానికి మొత్తం 38 బిలియన్ డాలర్లు ఖర్చయింది. ఈ లెక్క ఆగస్టు 1 తేదీ వరకు అయిన ఖర్చులు మాత్రమే. ఆగస్టు 1 తేదీ నుండి పెట్టిన ఖర్చు ఇందులో కలిసి లేదు. ఇకనైనా యుద్ధం ఆపకపోతే ఖర్చు తడిసి మోపెడు అవుతుందని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ హెచ్చరించింది. యుద్ధ తీవ్రతను బట్టి నెలకు 2 నుండి 3 బిలియన్ డాలర్ల వరకు మును ముందు వెచ్చించాల్సి ఉంటుందని తెలిపింది.

గత జులై నెలలోనే రక్షణ శాఖ సెక్రటరీ పీట్ హెగ్ సెత్, యుద్ధం తాలూకు ఖర్చు 37.5 బిలియన్ డాలర్ల వరకు అయి ఉంటుందని అంచనా వేయటం విశేషం. ఇప్పటి వరకు అంచనా వేసిన ఖర్చులో ప్రాణాలు కోల్పోయిన సైనిక కుటుంబాలకు, గాయపడిన సైనికులకు వెచ్చించిన ఖర్చులను కలపలేదు. భావిషత్తులో మరణించిన సైనికుల కుటుంబాల సంక్షేమానికి, గాయపడ్డ సైనికుల ఆరోగ్య సంరక్షణ మరియు కుటుంబ సంక్షేమానికి అమెరికా రక్షణ శాఖ ఖర్చులను భరించాల్సి ఉంటుంది.

యుద్ధం వలన అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. హోర్ముజ్ జలసంధి గుండా జరిగే నౌకల రవాణా పైన ఇరాన్, దిగ్బంధనం (బ్లాకేడ్) విధించటంతో పెట్రోలియం, సహజ వాయువు ధరలు పెరిగాయి. దరిమిలా సకల వినియోగ సరుకుల ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణం పైకి ఎగబాకేందుకు దోహదం చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం గత అంచనాలకు మించి పెరగవచ్చని ఆర్ధికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాగా యుద్ధం నిమిత్తం మరో 87.6 మిలియన్ డాలర్ల నిధులు విడుదల చేయాలని ట్రంప్ ప్రభుత్వం లేదా వైట్ హౌస్ కాంగ్రెస్ కు విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని ఇంకా కాంగ్రెస్ ఆమోదించ లేదు. పూర్తి ఖర్చుల వివరాలను అందజేయాలన్న బడ్జెట్ ఆఫీస్ విజ్ఞప్తిని రక్షణ శాఖ తిరస్కరించటంతో యుద్ధ ఖర్చుల లెక్కల విషయమై తాము వేసిన అంచనాలు ఖచ్చితం కాకపోవచ్చని సిబిఓ తెలిపింది.

అమెరికాలో ప్రజల కోసం ఉద్దేశించిన దేశీయ ఖర్చుల కార్యక్రమాల కంటే యుద్ధ ఖర్చులకు ట్రంప్ ప్రభుత్వం ప్రాధామ్యం ఇవ్వటాన్ని ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ విమర్శించింది. కానీ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు ఒబామా హయాంలో కూడా ప్రభుత్వ పని తీరు ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఆఫ్ఘన్ యుద్ధాన్ని విరమిస్తానని సైన్యాన్ని వెనక్కి పిలిపిస్తానని హామీ ఇచ్చి 2009లో అధ్యక్ష పదవి చేపట్టిన బారక్ ఒబామా, పదవి చేపట్టాక ఆఫ్ఘనిస్తాన్ నుండి సైన్యాన్ని వెనక్కి రప్పించే బదులు మరిన్ని వేల మంది సైన్యాన్ని అక్కడికి పంపాడు. దరిమిలా ఆఫ్ఘన్ యుద్ధం మరో పదేళ్ళు కొనసాగింది.

Leave a Reply