
అమెరికా, ఇజ్రాయెల్ లు ఇరాన్ పైన ఆధిపత్య దురాక్రణ యుద్ధాన్ని ప్రారంభించి 6 నెలలు పైనే గడించాయి. ఈ కాలంలో అమెరికా బాంబు దాడుల్లో ఇరాన్ లో పలు రోడ్లు, బ్రిడ్జ్ లు, భవనాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఇరాన్ సైనికులు పలువురు చనిపోయారు. ఈ సంగతి ఇరాన్ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నది. అదే సమయంలో పశ్చిమాసియా అరబ్ దేశాలలో ఉన్న అమెరికా మిలటరీ, నావిక, వైమానిక స్థావరాల పైన కూడా ఇరాన్ పలుమార్లు ఎదురు దాడులు చేసింది. ఇరాన్ దాడుల్లో అమెరికా స్థావరాలు తీవ్రంగా దెబ్బ తిన్నప్పటికీ ఆ సంగతి అమెరికా ఎప్పుడూ ఒప్పుకోలేదు.
నిన్న గురువారం మాత్రం ఇరాన్ దాడుల్లో తాము తీవ్రంగా దెబ్బ తిన్నామని అమెరికా మొదటిసారి అంగీకరించింది. పర్షియన్ అఖాతంలో సౌదీ అరేబియాకు కొద్ది దూరంలో ఉన్న చిన్న ద్వీప దేశం బహ్రెయిన్. ఈ దేశంలో అమెరికాకు అతి పెద్ద నౌకా స్థావరం, మిలటరీ స్తావారం ఉన్నాయి. అమెరికా నౌకా బలగానికి చెందిన ఫిఫ్త్ ఫ్లీట్ కు బహ్రెయిన్ లోని నావికా స్థావరమే హెడ్ క్వార్టర్ గా పని చేస్తుంది. అమెరికా సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడే ఉన్నది. అటువంటి ముఖ్య మైన అమెరికా మిలటరీ స్థావరాన్ని ఇరాన్ చావుదెబ్బ తీసిందని గురవారం నాడు అమెరికాకు చెందిన మృత సైనిక విభాగం (సిఏఓ) అంగీకరించింది.
ఇరాన్ మిసైల్ దాడుల్లో బహ్రెయిన్ లోని నౌకా స్థావరం విస్తృతంగా దెబ్బ తిన్నదని ఎపోక్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిఏఓ అధికారి ఒప్పుకున్నాడు. బహ్రెయిన్ లోని అమెరికా స్థావరాన్ని “నావల్ సపోర్ట్ యాక్టివిటీస్ బహ్రెయిన్” (ఎన్.ఏ.ఎస్.బి) అని పిలుస్తారు. “వాళ్లు బహ్రెయిన్ ని చావుదెబ్బ కొట్టారు” అని సిఏఓ లోని సీనియర్ అధికారి చెప్పాడు. ఎన్.ఏ.ఎస్.బి లో కనీసం 8,000 నుండి 9,000 వరకు అమెరికా సైనికులు బైఠాయించి ఉంటారు.
అమెరికా సెంట్రల్ కమాండ్ అంటే పశ్చిమాసియా, ఉత్తర ఆఫ్రికా, మధ్యధరా సముద్రం ఈ ప్రాంతాల్లో అమెరికా మిలటరీ కార్యకలాపాలకు నాయకత్వం వహించే కమాండ్ సెంటర్. బహ్రెయిన్ లో విస్తారమైన ప్రాంతంలో నిర్మించిన నౌకా స్థావరం నుండి సెంట్రల్ కమాండ్ పని చేస్తుంది. ఇరాన్ పైన ఆధిపత్య యుద్ధానికి ఇక్కడి నుండే పధక రచన జరిగింది. అయితే ఇరాన్ దాడులు మొదలయ్యాక సెంట్రల్ కమాండ్ తన హెడ్ క్వార్టర్ ని జర్మనీకి మార్చుకోవలసి వచ్చింది.

అప్పటి వరకు బహ్రెయిన్ లోని ఎన్.ఏ.ఎస్.బి కి బహ్రెయిన్ అతి ముఖ్యమైన కేంద్రంగా పని చేసేది. అమెరికా మిలటరీ లాజిస్టిక్స్ వ్యవహారాలను ఇక్కడి నుండి పర్యవేక్షణ జరిగేది. ఇతర పశ్చిమాసియా దేశాలలో (సౌదీ అరేబియా, కతార్, యుఏఈ, కువైట్, ఒమన్, జోర్డాన్) ఉన్న ఇతర మిలటరీ స్థావరాలకు కూడా ఇక్కడి నుండి ఆదేశాలు జారీ అయ్యేవి. అందువల్లనే ఇరాన్ దీని పైన అనేకసార్లు దాడులు చేయటం ద్వారా సెంట్రల్ కమాండ్ ను పశ్చిమ యూరప్ లోకి తరిమి కొట్టింది.
సాధారణంగా తాను ఎదుర్కొన్న మిలటరీ నష్టాలను అమెరికా పైకి చెప్పుకోదు. చెప్పుకుంటే తన మిలటరీ ని ఎవరూ ఓడించలేరు అన్న ప్రతిష్ట మాసిపోతుంది. కానీ బహ్రెయిన్ స్థావరం ఎంతగా దెబ్బ తిన్నదంటే దానికి దాచి పెట్టి ఉంచటం అమెరికాకు సాధ్యం కాలేదు.
బహుశా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా మిలటరీ స్థావరాలపైన నేరుగా మిసైళ్లతో దాడి చేయటమే కాకుండా దాన్ని సర్వనాశనం చేయటం ఇదే మొదటి సారి. అమెరికా అనేకసార్లు రష్యా సైనికులపై పరోక్ష దాడులు చేసినప్పటికీ రష్యా స్పందించలేకపోయింది. సిరియా లో టెర్రరిస్టు శక్తులను ప్రవేశ పెట్టిన తర్వాత వారికి మద్దతు ఇవ్వటంలో భాగంగా అమెరికా అధునాతన ఆయుధాలను సరఫరా చేసి రష్యా సైన్యాన్ని నష్టపరిచింది. అయినప్పటికీ రష్యా స్పందించి అమెరికా సైన్యంపై ప్రతి దాడి చేయలేకపోయింది. మొదటిసారి ఇరాన్ ఆ పని చేసింది.
పూర్తిగా నాశనం అయిన స్థావరాన్ని పునరుద్ధరించాలా లేదా అన్న ఆలోచనలో అమెరికా ఉన్నది. బేస్ ను రిపేర్ చేయాలని నిర్ణయిస్తే గనక పెద్ద ఎత్తున నిధులు అవసరం అవుతాయి. పునర్నిర్మాణం చేయగల పరిస్ధితి వస్తుందా లేదా అన్నది అనుమానమే. ఎందుకంటే పశ్చిమాసియా ప్రాంతం నుండి అమెరికాను పూర్తిగా సాగనంపే లక్ష్యంతో ఇరాన్ పని చేస్తున్నది. యుద్ధం ఆరంభం నుండి హోర్ముజ్ జలసంధి ని పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిపోవాలని అమెరికాను ఇరాన్ డిమాండ్ చేస్తూ వచ్చింది.

–
కతార్ లో “ఆల్ ఉదీద్ ఎయిర్ బేస్” పేరుతో అమెరికాకు భారీ మిలటరీ స్థావరం ఉన్నది. దీనిని కూడా ఇరాన్ మిసైల్, బాంబు దాడులతో నష్టపరిచింది. కువైట్, యుఏఈ, సౌదీ అరేబియా దేశాల్లోని అమెరికా స్థావరాలు సైతం ఇరాన్ దాడుల్లో దెబ్బ తిన్నాయి. ఆల్-ఉదీద్ ఎయిర్ బేస్ లో గరిష్టంగా 10,000 సైనికులను అమెరికా ఉంచుతుంది. వీరిలో కొందరు అమెరికా మిత్ర రాజ్యాలు ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాల సైనికులు కూడా ఉంటారు.
ప్రస్తుతం బహ్రెయిన్ స్థావరం ఉన్న స్థితిలో అమెరికా సైన్యం తిరిగి రావటానికి సాహసం చేస్తుందా అని ఇతర దేశాలు కూడా అనుమానిస్తున్నాయి. ఇక్కడి దేశాలకు రక్షణ కల్పించే నెపం తోనే అమెరికా ఇక్కడ అనేక మిలటరీ, నౌకా, వాయు స్థావరాలను నిర్మించింది. కాబట్టి ఇక్కడ స్థావరాలు రద్దయితే గనక గల్ఫ్ లోని అరబ్ దేశాల భద్రతా వ్యవస్థలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పటికే గల్ఫ్ దేశాలు భద్రత కోసం చైనా, రష్యా దేశాలతో మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
“అక్కడికి మళ్ళీ వెనక్కి రావటం అన్నది ఇప్పట్లో సాధ్యం అయ్యే విషయం కాదు” అని ఆగస్టు 31 తేదీన ఒక టౌన్ హాల్ మీటింగ్ లో మాట్లాడుతూ అమెరికా మిలటరీ అధికారి కాడిల్ స్పష్టం చేశాడు. “ఆ విషయంలో మాత్రం నేను నిజం చెప్పక తప్పదు” అని ఆయన అంగీకరించాడు.
భారీ నష్టం
కొద్ది రోజుల క్రితం ఇరాన్ కి చెందిన ఐదు ఆయిల్ ట్యాంకర్ల పైన అమెరికా దాడి చేయటంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. ఇరాన్ ప్రతీకార దాడుల్లో అమెరికాకు చెందిన పలు యుద్ధ విమానాలు ధ్వంసం అయ్యాయి (సిబిఎస్ న్యూస్). ముఖ్యంగా జోర్డాన్ లోని మువాఫాక్ సాల్టీ ఎయిర్ బేస్ లో నెలకొల్పిన యుద్ధ విమానాలు దెబ్బ తిన్నాయి. ఒక A-10 ధండర్ బోల్ట్ విమానం కు రెక్క విరిగిపోగా 8 ఎఫ్-15 ఫైటర్ జెట్ విమానాలు వివిధ స్థాయిల్లో దెబ్బ తిన్నాయి.
ఎఫ్-15 ఫైటర్ జెట్ లు మైనర్ గా దెబ్బ తిన్నాయని, రిపేర్లు పూర్తి చేసుకుని మళ్ళీ వాయుసేనలో వచ్చి చేరాయని అమెరికా చెబుతోంది. కానీ ఈ మాటల్ని నమ్ముతున్న వాళ్లు చాలా తక్కువమంది. అమెరికా, ఇరాన్ పైన 30 వరకు పాట్రియాట్ మిసైళ్లు ప్రయోగించి 5 ఆయిల్ ట్యాంకర్లను దెబ్బ తీసినట్లు తెలుస్తున్నది.


