
–
“గత ఇన్నేళ్లలో ఇన్ని సాధించాం, అన్ని సాధించాం, 60 యేళ్ళ కాంగ్రెస్ పాలన కంటే ఎక్కువ సాధించాం, దరిద్రాన్ని పారద్రోలాం, పేదరికాన్ని రూపు మాపాం” అంటూ బిజెపి నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు పదే పదే డప్పు కుట్టుకోవటం చాలాసార్లు విన్నాం. కానీ బిజెపి చెప్పే మాటలకు దేశంలో ఉన్న దరిద్రం, పేదరికం లకు పొంతన ఎప్పుడూ కనపడదు.
ఈ తరహాలోనే గుజరాత్ లో జల్ జీవన్ మిషన్ కు సంబంధించిన లెక్కలు తప్పుల తడకలతో కూడుకుని ఉన్నాయని తాజాగా కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (సి.ఏ.జి – కాగ్) ఎత్తి చూపింది. గుజరాత్ ప్రభుత్వం రాష్ట్ర వార్షిక యాక్షన్ ప్లాన్ ని 100 శాతం పూర్తి చేశామని చెప్పుకోగా తమ ఆడిట్ లో ఒకటిన్నర మిలియన్ కుటుంబాలు లేదా 15 లక్షల కుటుంబాలకు జల్ జీవన్ మిషన్ కింద నీళ్ల కనెక్షన్ ఇంకా అందనట్టు తేలిందని కాగ్ స్పష్టం చేసింది.
కాంగ్రెస్ / యుపిఏ ప్రభుత్వం హయాంలో 2జి స్పెక్ట్రమ్ వేలంలో 1.7 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అప్పట్లో మొదట ప్రకటించింది ఈ కాగ్ వ్యవస్థే. ఆ తర్వాత బొగ్గు గనుల కుంభకోణంలో 10 లక్షల కోట్ల నష్టం ప్రభుత్వానికి జరిగిందని ప్రకటించిన కాగ్, అంతలోనే అది కేవలం ప్రాధమిక అంచనా మాత్రమే అని చెప్పింది. పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన నివేదికకు వచ్చేసరికి కేవలం 1.86 లక్షల కోట్ల రూపాయలు నష్టం అంచనా వేసినట్టు కాగ్ నివేదిక తేల్చింది. సుప్రీం కోర్టు బొగ్గు గనుల కేటాయింపుల్ని మొత్తంగా రద్దు చేయటంతో ఆ నష్టం కూడా జరగలేదు.
చెల్లింపులు, సబ్సిడీ గ్యాస్ కూడా…
గుజరాత్ లో చీకట్లను పారద్రోలాం. ఇక విద్యుత్ లేని గ్రామం ఒక్కటి కూడా లేదు అని కొన్నేళ్ళ క్రితం ప్రకటించారు. కానీ ఆ రాష్ట్రంలో ఎన్ని గ్రామాలకు విద్యుత్ అందలేదో, పత్రికలు లెక్కలు కట్టి చెప్పాయి. బిజెపి నేతల నుండి సమాధానం లేదు. ఆ తర్వాత ప్రతి పేద ఇంటికీ ఏడాదికి 9 సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు అన్నారు. తర్వాత ఆ సంఖ్య 6 కు పడిపోయింది. ఇప్పుడు సిలిండర్ కి రు 300 చొప్పున పేద కుటుంబానికి ఏడాదికి కేవలం 4 సిలిండర్లే ఇస్తున్నారు. ఆ తర్వాత సిలిండర్ కి రు 980 పెట్టి కొనుక్కోక తప్పదు.
కాంగ్రెస్ / యుపిఏ పాలనలో యుపిఐ పేమెంట్ సిస్టం ని ప్రవేశ పెట్టారు. 2008 లో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ) ను యుపిఐ ప్రారంభించింది. ఎన్.పి.సి.ఐ ఆధ్వర్యంలో ఐ.ఎఫ్.ఎస్.సి కోడ్ మరియు బ్యాంకు ఖాతాల ద్వారా బ్యాంకుల మధ్య ఖాతాదారులే నగదు బదిలీ చేసుకునే సౌకర్యం కల్పించారు. తర్వాత యుపిఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) వ్యవస్థకు సంబంధించిన ప్లానింగ్, ఫ్రేమ్ వర్క్ రూప కల్పన అన్నీ యుపిఏ ప్రభుత్వ హయాంలో జరిగాయి. ఆ తర్వాత మోడి/ఎన్.డి.ఏ ప్రభుత్వం లాంఛనంగా యుపిఐ ని ప్రవేశ పెట్టింది.
వాస్తవం ఇదయితే మోడి ప్రభుత్వం యుపిఐ సృష్టికర్తలం మేమే అని చెప్పుకుంటారు. తమ యుపిఐ ద్వారా మారు మూల గ్రామాలలోని చిల్లర కోట్ల నుండి పట్నాల లోని తోపుడు బండ్ల వ్యాపారుల వరకు మొబైల్ ఫోన్ల ద్వారా చిటికెలో చెల్లింపులు చేసుకోగలుగుతున్నారని ప్రధాని నరేంద్ర మోడి, ఇతర మంత్రులు తరచూ చెప్పుకుంటారు. యుపిఐ ప్లాట్ ఫారం ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దానిని వినియోగిస్తున్నది మాత్రం ఫోన్ పే, గూగుల్ పే లాంటి అంతర్జాతీయ ద్రవ్య మరియు టెక్ కంపెనీలు మాత్రమే. భారత్ పే, భీమ్ పే లాంటి ప్రభుత్వ చెల్లింపు వేదికలు ఉన్నప్పటికీ ప్రైవేటు పేమెంట్ కంపెనీల స్వాధీనం లోనే అత్యధిక చెల్లింపులు జరిగేలా చేయటంలో ప్రభుత్వాలు సఫలం అయ్యాయి. మొత్తం యుపిఐ చెల్లింపుల్లో ఫోన్ పే, గూగుల్ పే ల వాటా 80 శాతం పైనే ఉంటే, ప్రైవేటు ధర్డ్ పార్టీ యాప్ ల వాటా 98 శాతం వరకు ఉన్నది.
వ్యక్తిగత పేమెంట్ వ్యవస్థల వాటా ఒక్కొక్కటి చూస్తే ఫోన్ పే 46 శాతం, గూగుల్ పే 32 శాతం, పేటిఎం 8 శాతం, నవి + సూపర్.మనీ + క్రెడ్ + ఇతర సంస్థలు 13 శాతం చెల్లింపులు చేస్తుండగా ప్రభుత్వ సంస్థ భీమ్ పే కేవలం 1 శాతం మాత్రమే చెల్లింపుల వాటా కలిగి ఉన్నది. ప్రైవేటు చెల్లింపుల కంపెనీలకు ప్రభుత్వ ప్రత్యక్ష, పరోక్ష సహకారం అందకుండా ఈ పరిస్ధితి ఏర్పడటం సాధ్యం కాదు. ప్రజల్లో చాలా మంది ఫోన్ పే, పేటిఎం లాంటివి కూడా ప్రభుత్వ కంపెనీలే అనుకుంటారు. అవి ప్రైవేటు అని తెలిసేటప్పటికి వాటికి అలవాటు పడిపోయి ఉంటారు.
అవినీతి, అవకతవకలు
జల్ జీవన్ మిషన్ మిషన్ ని మోడి ప్రభుత్వం 2019 లో ప్రారంభించింది. హర్ ఘర్ జల్ (ప్రతి ఇంటికీ నీరు) నినాదంతో దేశం లోని ప్రతి పేద ఇంటికీ రోజుకి 55 లీటర్ల ట్యాప్ వాటర్ (పైపులతో నేరుగా ఇళ్లకు మంచి నీటి సరఫరా) సరఫరా చేయాలని ఈ మిషన్ లక్ష్యం. 2024 సం లోపు ఈ మిషన్ ద్వారా దేశం లోని ప్రతి ఒక్క పేద వాడి ఇంటికి ట్యాప్ లతో నీరు అందాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఆ ట్యాప్ వాటర్ సంగతి అటుంచి కనీసం సరిపడా ట్యాంకర్లతో నీటిని, చిన్న, మధ్య సైజు పట్టణాలలో సైతం అందని పరిస్ధితి నెలకొని ఉన్నది.
తాము నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవటంలో తామే విఫలం చెందటాన్ని కప్పి పుచ్చుకోవటానికి రకరకాల మార్గాలను బిజెపి ప్రభుత్వాలు అనుసరిస్తాయి. అందులో ఒకటి: 100 శాతం లక్ష్యం పూర్తయిందని ఘనంగా ప్రకటించుకోవటం. ఈ ప్రకటనలోని వాస్తవాన్ని తేల్చే పనిని పత్రికలు తీసుకోవాల్సి ఉండగా అవి ప్రభుత్వాల ప్రకటనలను ప్రచురిస్తాయే తప్ప వాస్తవంగా పరిశీలించి నిజాలు నిగ్గు తేల్చే పనికి ఎప్పుడో స్వస్తి పలికాయి.
జల జీవన్ మిషన్ కోసం ప్రభుత్వం ఒక వెబ్ పోర్టల్ ను నిర్వహిస్తున్నది. ఈ పోర్టల్ లో గుజరాత్ స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ (ఎస్.ఏ.ఏ.పి) ప్రకారం ప్రతి ఇంటికీ పని చేసే ట్యాప్ సౌకర్యం కల్పించటం రాష్ట్రంలో 100 శాతం పూర్తయింది. సుమారు 9.12 (91.2 లక్షలు) మిలియన్ల గ్రామీణ గృహాలకు అక్టోబర్ 2022 నాటికే ట్యాప్ కనెక్షన్లు ఇచ్చేశామని అవన్నీ పని చేస్తున్నాయని పోర్టల్ లో లెక్కలు ఇచ్చారు.
ఈ లెక్కలను కాగ్ తనిఖీ చేసింది. ముఖ్యంగా జిల్లాల వారీగా డిస్ట్రిక్ట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ లను 27 జిల్లాలలో తనిఖీ చేసింది. ఏప్రిల్ 1, 2024 నాటికి కూడా జిల్లాల వారీగా చూస్తే మొత్తం 1.48 మిలియన్ల (14.8 లక్షల) గృహాలకు ట్యాప్ కనెక్షన్, పెండింగ్ లో ఉన్నట్లు లెక్కల్లో కనిపిస్తున్నదని కాగ్ తేల్చింది. జిల్లాల యాక్షన్ ప్లాన్ లు తమ తమ అంకెలు చూపిస్తే, వాటిలో వచ్చిన తరుగుదలను రాష్ట్ర ప్రభుత్వం లెక్కలోకి తీసుకోకుండా రాష్ట్ర యాక్షన్ ప్లాన్ లో మాత్రం 100 శాతం పూర్తయినట్లు రాసుకున్నారు. ఈ లెక్కన జిల్లాల యాక్షన్ ప్లాన్ లకు వాస్తవంగా భౌతికంగా ఎన్ని గృహాలకు ట్యాప్ కనెక్షన్ ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారో కూడా లెక్క కడితే కనెక్షన్ లేని గృహాలు మరిన్ని ఉన్నట్లు తేలే అవకాశం ఉంది. పని చేయకుండా పని జరిగినట్టు కాగితాల పైన చూపటం, రోడ్లు వేయకుండా వేసినట్టు కాంట్రాక్టులకు లక్షలు/కోట్లు చెల్లించటం, ప్రజలకు తెలిసిన విషయమే.
“ఈ-జలశక్తి పోర్టల్ ప్రకారం రాష్ట్ర ప్లాన్ లో 100 శాతం గృహాలకు ట్యాప్ కనెక్షన్ ఇచ్చేశామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 91.18 లక్షల ఇళ్లకు అక్టోబర్ 2022 నాటికే 100 శాతం కనెక్షన్లు ఇచ్చామని రాసుకున్నారు. కానీ జిల్లాల వారీ లెక్కలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. 27 జిల్లాలలో 14.84 లక్షల గృహాలకు కనెక్షన్ ఇచ్చేపని ఏప్రిల్ 1, 2024 తర్వాత కూడా పెండింగ్ లో ఉన్నట్లు కనిపిస్తున్నది” అని కాగ్ నివేదిక వెల్లడి చేసింది.
అంతే కాకుండా గుజరాత్ లో జల్ జీవన్ మిషన్ అమలు చేయటంలో అనేక తప్పులను అవినీతిని కాగ్ ఎత్తి చూపింది. అనేక చోట్ల ప్రాజెక్ట్ అమలులో తీవ్ర అలసత్వం, ఆలస్యం జరుగుతున్నాయని చెప్పింది. ఆర్ధిక అవకతవకలు అనేక చోట్ల చోటు చేసుకున్నాయని, పలు చోట్ల సరఫరా అవుతున్న నీటిలో క్వాలిటీ ఎంత మాత్రం లేదని, తాగటానికి అనువుగా లేని నీటిని సరఫరా చేస్తున్నారని ఎత్తి చూపింది. ఈ నివేదిక లోని అంశాల గురించి ప్రశ్నించే అవకాశం లేకుండా నివేదికను గుజరాత్ ప్రభుత్వం, అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజైన శుక్రవారం (సెప్టెంబర్ 11) నాడు అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది.
అత్యంత ఘోరం ఏమిటంటే గ్రామాల నుండి నీటి శాంపిళ్లను సేకరించి పరీక్ష చేయగా వాటిలో 89 శాతం నీటి శాంపిళ్ళు తాగటానికి అనువుగా లేని నీటిని సరఫరా చేస్తున్నట్లు తేలిందని కాగ్ తెలియజేసింది. ఆర్ధిక లెక్కల్లో అవకతవకలకు లెక్కే లేదని చెప్పింది. తప్పుడు లెక్కలు రాయటం, సమర్ధించటానికి కనీసం వీలు లేని విధంగా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయటం, కోట్లాది రూపాయల సొమ్మును అధికంగా వాళ్ళకు చెల్లించారని కాగ్ తేల్చి చెప్పింది. 2019-20 నుండి 2023-24 వరకు జరిపిన ఆడిట్ లో ఈ వాస్తవాలు వెల్లడి అయ్యాయి.
ఆర్ధిక ఖర్చుల నిర్వహణ అవినీతితో నిండి ఉన్నదని కాగ్ వెల్లడి చేసింది. రు. 28.79 కోట్ల సొమ్మును స్టాఫ్ క్వార్టర్లు, ఆఫీసు భవనాల నిర్మాణం కోసం ఖర్చు పెట్టారని, స్కీమ్ రూపొందించిన గైడ్ లైన్స్ ప్రకారం ఈ ఖర్చులకు అనుమతి లేదని కాగ్ స్పష్టం చేసింది. “గుజరాత్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్” సంస్థ మరియు “గుజరాత్ వాటర్ సప్లై అండ్ సూయరేజి బోర్డు” సంస్థలు హోల్ సెల్ ప్రైస్ ఇండెక్స్ (WPI) సూచికను తప్పుడు పద్ధతిలో వినియోగించిన ఫలితంగా కాంట్రాక్టర్లకు 54.32 కోట్ల రూపాయలు అధికంగా చెల్లించారని కాగ్ కనుగొంది. జి.ఎస్.టి లెక్కలను కూడా తప్పు లెక్కించటం వలన కాంట్రాక్టర్లకు మరో 18.65 కోట్లు అధికంగా చెల్లించారని కనుగొంది.
ఇక పనులను ఎంత కాలం ఆలస్యంగా పూర్తి చేశారన్న లెక్కలను కూడా కాగ్ ఇచ్చింది. 11 భారీ స్థాయి పైప్ లైన్ పనులను గుజరాత్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ చేపట్టగా అందులో 5 పనులను 8 నుండి 25 నెలల వరకు ఆలస్యంగా పూర్తి చేశారని చెప్పింది. మిగిలిన 6 భారీ పైప్ లైన్ పనుల్లో 5 పనులను 3 నుండి 14 నెలలు ఆలస్యంగా పూర్తి చేశారని తెలిపింది. అదీ కాక గుజరాత్ ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీటి పరిమాణం చెప్పిన 55 లీటర్ల కంటే తక్కువగా ఇస్తున్నారని తెలిపింది. స్కీమ్ గైడ్ లైన్స్ ప్రకారం ఋతుపవనాల రాక ముందు, తర్వాత నిర్దిష్ట పరిమాణంలో శాంపిల్స్ సేకరించి పరీక్షలు జరపాల్సి ఉంటే అలా జరగలేదని చెప్పింది. తక్కువ శాంపిళ్ళు సేకరించి పరీక్షలు జరిపారని చెప్పింది. ఋతుపవనాల ముందు శాంపిళ్లలో 26 శాతం తాగటానికి వీలు లేని నీరు అందించగా, ఋతుపవనాల తర్వాత 24 శాతం శాంపిళ్ళు తాగటానికి అనువుగా లేవని తేల్చింది.
కాగ్ నివేదిక వెల్లడి చేసిన లెక్కల తేడాలకు గుజరాత్ ప్రభుత్వం నుండి ఇంతవరకు సమాధానం లేదు. ఒక వేళ సమాధానం ఇచ్చినా, పని పెండింగ్ లో ఉన్నది అని అంగీకరించే బదులు, ఇతరేతర కారణాలను ప్రభుత్వం చూపించే అవకాశం ఉన్నది. లేదా గ్యాప్ కనెక్షన్ ఇచ్చేశామని వాటిలో నీళ్లు ప్రవహించటమే మిగిలి ఉందని కప్ప దాటు సమాధానాలు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ తరహా వ్యవహారం కాంగ్రెస్ హయాంలో సాగింది; బిజెపి హయాంలో కూడా సాగుతోంది. రెండింటికీ తేడా లేదని ఇప్పుడిప్పుడే జనం గ్రహిస్తున్నారు. ఈ రెండింటికి నిజమైన ప్రత్యామ్నాయం ప్రజలకు అందుబాటులో లేకపోవటమే అసలు సమస్య!
కాగ్ ఎత్తి చూపిన అవినీతి, అవకతవకలకు సమాధానం చెప్పవలసింది ఒక్క గుజరాత్ ప్రభుత్వమే కాదు. “నేను తినను, ఎవరినీ తిననివ్వను (న ఖావూంగా, న ఖానే దూంగా) అని వాగ్దానం చేసిన ప్రధాని నరేంద్ర మోడి కూడా కాగ్ వెల్లడి చేసిన అవినీతికి, అవకతవకలకు సమాధానం చెప్పాల్సి ఉన్నది. ప్రజాస్వామ్యానికి తల్లి లాంటి (మదర్ ఆఫ్ డెమోక్రసీ) భారత దేశంలో కనీసం బాధ్యతన్నా వహించాలని కోరటంలో తప్పులేదు.

