
–
02-05-2026
ఇరాన్, చైనా దేశాల మధ్య పెరుగుతున్న మైత్రి ప్రపంచ రంగంలో ఇరాన్ స్టాండింగ్ మెరుగు పడేందుకు దోహదం అవుతున్నది.
చైనా ట్యాంకర్ల పై ట్రంప్ యుద్ధం ప్రకటించటం ప్రమాదకర పరిణామం కానుంది. చైనా నుండి అమెరికాకు ఎగుమతులు తగ్గించుకునేందుకు, చైనాలో అంతర్గత వినియోగం పెంచుకునేందుకు తద్వారా అమెరికా – చైనా ల మధ్య వాణిజ్య సమతూకం (అమెరికా ఎగుమతుల కంటే చైనా ఎగుమతులు చాలా ఎక్కువ) తెచ్చేందుకు ట్రంప్ బల ప్రయోగంతో ప్రయత్నాలు చేయటంగా ఈ ట్యాంకర్ల యుద్ధాన్ని చైనా పరిగణిస్తున్నది. ఇది ప్రపంచ స్థాయి ఘర్షణకు దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యుద్ధం ముగిసే నాటికి గల్ఫ్ సంక్షోభం నుండి ఇరాన్ రెట్టించిన శక్తితో బైట పడుతుందని చైనా పరిశీలకులు అంచనా వేస్తున్నారు. చమురు మార్కెట్ ను, చమురు రవాణా రూట్లను అదుపులోకి తెచ్చుకుని ఆధిపత్యం సాధించేందుకు అమెరికా ఎన్ని యత్నాలు చేసినా చైనా ఆత్మ రక్షణ శక్తిని అమెరికా తక్కువ అంచనా వేయటం అమెరికా చేస్తున్న పొరపాటు. చైనా ఇప్పటికే పెట్రోలియం పై ఆధారపడటం తగ్గించి పవన విద్యుత్, సోలార్ విద్యుత్ లపై కొత్త టెక్నాలజీలు కనిపెడుతూ ఇంధన శక్తి ఉత్పత్తిలో వైవిధ్యాన్ని సాధిస్తున్నది. అంటే చైనా చమురు రవాణా ను అటకాయించినంత మాత్రాన ఆ దేశ శక్తి వనరులు తగ్గిపోయే పరిస్థితి లేదు. పైగా చైనా సొంతగా చమురు ఉత్పత్తి చేస్తున్నది కూడాను.
చైనా ఆర్థికంగా చాలా వరకు స్వయం సమృద్ధి సాధించింది. ఏ.ఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) ని వినియోగించి అనేక రంగాల్లో ఉత్పత్తి ఖర్చులు తగ్గించింది. అంటే ఉత్పాదకతా సామర్ధ్యాన్ని పెంచుకుంది. చైనా లో డేటా సెంటర్ పై పెట్టే విద్యుత్ ఖర్చు కంటే అమెరికాలో డేటా సెంటర్లపై పెట్టే విద్యుత్ ఖర్చు 6 రెట్లు అధికంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఒక గిగా వార్ అవర్ విద్యుత్ ఉత్పత్తి కి పెట్టే ఖర్చు చైనా కంటే అమెరికాలో 6 రెట్లు ఎక్కువ ఖర్చు అవుతోంది. చైనా సరుకుల ఉత్పత్తిలో క్వాంటిటీ పైన దృష్టి తగ్గించి క్వాలిటీ పైన దృష్టిని కేంద్రీకరిస్తున్నది.
చైనా విద్యుత్ తో అమెరికా విద్యుత్ పోటీ పడాలంటే అమెరికా తన డాలర్ విలువను 150 శాతం తగ్గించుకోవాల్సి ఉంటుంది. అది రాజకీయంగా అసాధ్యం. కాబట్టి అమెరికా విధిస్తున్న ఆంక్షలు, చమురు ట్యాంకర్ల రవాణా ను అమెరికా అటకాయించటం చైనాకు పెద్ద సమస్యగా కనిపించటం లేదు. ఐరోపా కూడా చైనా పై ఆంక్షలు ప్రకటించటం ద్వారా (రష్యాపై 20 వ విడత ఆంక్షలు ప్రకటిస్తూ చైనా ను కూడా ఆంక్షల జాబితా లోకి ఈ యు చేర్చింది) సెల్ఫ్ గోల్ చేసుకుంటోంది.
అమెరికా, ఈ యు లు వివిధ దేశాల పైన ఆంక్షలు విధించటం ద్వారా, నానాటికీ ఆంక్షలను విస్తృతం చేయటం ద్వారా శత్రువుల సంఖ్యను పెంచుకుంటున్నాయి. స్వయం చర్యలతో వివిధ దేశాలు దూరం జరిగేందుకు తామే కారణం అవుతున్నాయి. గతంలో వలే పెత్తనం కొనసాగించే పరిస్ధితి రద్దయిందన్న సంగతిని విస్మరిస్తున్నాయి.
03-05-2026
అమెరికా ఆర్థిక వ్యవస్థ నిజ ఆర్థిక వ్యవస్థ నుండి ఫైనాన్షియలైజ్డ్ ఎకానమీ గా స్ట్రక్చరల్ మార్పులకు లోనైంది. ఇన్సైడర్ ట్రేడింగ్, అవినీతి అమెరికా ఎకానమీ లో సాధారణ లక్షణాలుగా మారాయి. ప్రజలు మరింత పేదలు అవుతున్నారు. అమెరికా పేదరికానికి పాలక వర్గాల నుండి సమాధానం, పరిష్కారం లేవు. ప్రజలు కేవలం ఓట్లు వేసే పరికరాలు మాత్రమే.
ప్రజలు నిరసనలకు దిగితే నిర్బంధం ప్రయోగించటం, అణచివేయటం చేస్తున్నారు. నిరసనల ద్వారా పరిస్థితుల్లో మార్పులు తేలేని పరిస్థితి ఏర్పడితే ప్రజలు తప్పనిసరిగా మరింత హింసాత్మక చర్యలకు దిగుతున్నారు.
సెమూర్ హర్ష్ అని ఒక అమెరికా జర్నలిస్టు ఉన్నాడు. ఆయనకి చాలా అవార్డులు వచ్చాయి. వియత్నాం యుద్ధంలో అమెరికా హత్యాకాండ ను బైట పెట్టిన క్రెడిట్ ఆయనకి ఉంది. ఆయన ఏప్రిల్ 29 తేదీన రాసిన ఒక ఆర్టికల్ ప్రకారం ఇరాన్ తో చర్చలకు ఒప్పుకున్న దగ్గరి నుండి ట్రంప్ కి ఇజ్రాయెల్ కి సంబంధాలు బలహీన పడ్డాయి. ఇరాన్ ను తేలికగా ఓడించవచ్చు అని ఇజ్రాయెల్ ప్రధాని తనని నమ్మించి తప్పుదారి పట్టించాడని ట్రంప్ భావిస్తున్నాడు.
ఇరాన్ కి కనీసం 25 బిలియన్ డాలర్లు చెల్లించి హార్ముజ్ జలసంధి తెరిపించేందుకు ట్రంప్ నిర్ణయించినట్లు ఇజ్రాయెల్ ఇన్సైడర్ వర్గాలు చెప్పినట్లు సెమూర్ రాశాడు. ఐతే ఇది నిజం అని నమ్మలేము. ట్రంప్ పరువును దెబ్బ కొట్టేందుకు ఇజ్రాయెల్ సృష్టించిన ప్రచారం కావచ్చు. ఇలాంటి ప్రచారాలకు ఇజ్రాయెల్ పేరు పొందింది.
ఇజ్రాయెల్ ఇన్సైడర్ వర్గాల ప్రకారం ట్రంప్ ఇక ఇజ్రాయెల్ ను నమ్మే పరిస్థితిలో లేడట. యుద్ధం నుండి బయట పడాలని చూస్తున్నాడట. ట్రంప్ ప్రభుత్వం లో ఇరాన్ పట్ల ఎలా స్పందించాలి అన్న విషయంలో తీవ్ర వైరుధ్యాలు తలెత్తాయట.
2026 లో ఇప్పటి వరకు ఇండియా నుండి ఫారిన్ పోర్ట్ ఫోలియో పెట్టుబడులు ( ఎఫ్.పి.ఐ. వీటిలో ఎఫ్ఐఐ ఒక భాగం) రు. 1.8 లక్షల కోట్లకు పైగా తరలి పోయాయి. ఫిబ్రవరి దాకా పరిస్థితి బానే ఉన్నప్పటికీ యుద్ధం తర్వాత పరిస్థితి మారింది. రూపాయి బలహీన పడటం, ఆయిల్ ధరలు పెరగటం, ఏఐ పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు ఇండియాలో లేకపోవటం… ఈ కారణాలతో ఇండియా షేర్ మార్కెట్ నుండి హాట్ మనీ తరలి పోతున్నది.
ప్రపంచంలో అతి పెద్ద విమాన వాహక నౌక యు ఎస్ ఎస్ గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ మళ్ళీ ఎర్ర సముద్రం నుండి ఇంటికి పంపటానికి అమెరికా నిర్ణయించింది. ఇది ఇరాన్ దాడుల్లో దెబ్బ తిని రిపేర్ల కోసం గ్రీసు వెళ్ళింది. రిపేర్ల అనంతరం ఎర్ర సముద్రం కు తిరిగి వచ్చిందని చెప్పారు. కానీ మళ్ళీ మొరాయించిందో ఏమో తెలీదు కానీ ఇంటికి వెళుతోంది. ఇది రంగంలో లేకపోతే అమెరికా ఫైర్ పవర్ బాగా తగ్గుతుంది. అనగా రెండో సారి ఇరాన్ పై దాడి చేసే శక్తి అమెరికాకు సన్నగిల్లుతుంది.
ఇరాన్ యుద్ధం లో అమెరికా ఎన్ని విధాలుగా వైఫల్యాలు ఎదుర్కొన్నది?
- ఇరాన్ తో చర్చలు జరుపుతూనే ఇరాన్ పైన మిసైల్ దాడులు చేసి దొంగ దెబ్బ తీసేందుకు ప్రయత్నించి విఫలం అయింది.
- రాజకీయ, మత నాయకులను, సైనిక అధికారులను హత్యలు చేసి ఇరాన్ ప్రజలను బెదిరించాలని డీ మొరలైజ్ చెయ్యాలని ప్రయత్నం చేసి విఫలం అయింది.
- ఇరాన్ ప్రజలను సామూహికంగా చంపేస్తామని లేదా జీనోసైడ్ కు పాల్పడతానని, దేశాన్ని నాశనం చేసి నాగరికతని అంతం చేస్తానని బెదిరించి విఫలం అయింది.
- ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం ను రహస్యంగా ఎత్తుకెళ్లేందుకు సీక్రెట్ ఆపరేషన్ జరిపింది; ఇస్ఫహాన్ అణు కర్మాగారం నాశనం చేసేందుకు ట్రై చేసింది; అన్నటిలో విఫలం అయింది.
- మధ్యవర్తిత్వం వహించమని పాకిస్తాన్, చైనా, గల్ఫ్ దేశాలని బతిమాలింది. ఎవరూ సాయం చేయలేకపోయారు. ఇరాన్ అందుకు తావు ఇవ్వలేదు.
ఇరాన్ స్టోరేజీ కెపాసిటీ నిండిపోయిందని, ఇరాన్ తన ఉత్పత్తి తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చేసిన ట్రంప్ ప్రచారాన్ని బ్లూంబర్గ్ పత్రిక (జర్మనీ వాణిజ్య పత్రిక) కొట్టిపారేసింది. ఇరాన్ అలాంటి స్థితిలో లేదని విశ్లేషించింది. ట్రంప్ చెబుతున్నట్టు ఇరాన్ ప్రభుత్వం ఆర్థిక పతనం దరి దాపుల్లో కూడా లేదని బ్లూంబర్గ్ తేల్చేసింది.
ఇరాన్ సరుకు రవాణా కోసం పాకిస్తాన్ 6 ల్యాండ్ కారిడార్లు తెరిచింది. పాక్ కి చెందిన 8 పోర్టుల గుండా ఈ 6 ల్యాండ్ కారిడార్లు ఇరాన్ కు వచ్చి పోయే సరుకులను చేరవేస్తున్నాయి. ఇవి ఒక్క ఆయిల్ నే కాకుండా ఇతర సరుకులను కూడా తీసుకెళ్తాయి. తద్వారా పాకిస్తాన్ అంతర్జాతీయంగా ముఖ్యమైన సరుకు రవాణా కేంద్రం (హబ్) గా అభివృద్ధి చెందే అవకాశం ఒడిసి పట్టింది. ఇది ఇండియా పాలకులకు తీవ్ర నిరాశ కలిగించే పరిణామం. (భారత పాలకుల ప్రయోజనాలు భారత ప్రజల ప్రయోజనాలు ఒకటి కాదు. ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా పాలకుల ప్రయోజనాలు ఉన్నాయి.)
ఏప్రిల్ 29 తేదీన పుతిన్, డొనాల్డ్ ట్రంప్ కి ఫోన్ చేసి మరోసారి ఇరాన్ పైన దాడి చేయవద్దని హెచ్చరించాడని అమెరికా మాజీ సీఐఏ అధికారి ఒకరు వెల్లడించాడు. మే 1 తేదీ నాటికి ఇరాన్ పైన యుద్ధం కొనసాగించేందుకు ట్రంప్ హౌస్ ఆఫ్ కాంగ్రెస్ నుండి అనుమతి తీసుకోవాల్సి ఉంది. దానికి బదులు ట్రంప్ “ఇరాన్ తో యుద్ధం ఇక ముగిసింది” అని ప్రకటించాడు. జరగని యుద్ధానికి అనుమతి కోరవలసిన అవసరం లేదు కదా! అయితే యుద్ధ విరమణ విషయంలో ట్రంప్ సీరియస్ గానే ఉన్నాడని కొందరు విశ్లేషకుల అంచనా. పుతిన్ హెచ్చరిక ట్రంప్ పైన పని చేసిందని వారు భావిస్తున్నారు.
ఐతే ఇరాన్ సమీపంలో అమెరికా పెద్ద ఎత్తున మిలటరీ విమానాలను చేరవేస్తున్న నేపథ్యంలో ఇంకోసారి ఇరాన్ పైన దాడికి ట్రంప్ సిద్ధం అవుతున్నాడని ఇంకొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గడియకోసారి మాట మార్చే ట్రంప్ మాటలను బట్టి అమెరికా ఏం చేయనుందో అంచనా వేయటం అంత సులభం కాదు.
ట్రంప్ ఆదేశాల ప్రకారం పర్షియన్ గల్ఫ్ లోని ఖార్గ్ ద్వీపాన్ని గాని, క్వెంష్ ద్వీపాన్ని గాని లేదా రెండు ద్వీపాలను గాని దాడి చేసి ఆక్రమించేందుకు అమెరికా సెంట్రల్ కమాండ్, జనరల్ కమాండ్, నేవీ విభాగాలన్నీ అవసరమైన దాడి పథకాన్ని సిద్ధం చేసి పెట్టినట్లు సమాచారం.
ఇరానియన్ న్యూక్లియర్ కేంద్రాల పై దాడికి గల మార్గాలను, పథకాలను కూడా అమెరికా సైనిక విభాగాలు సిద్ధం చేసినట్లు సమాచారం.
సెంట్రల్ కమాండ్, ట్రంప్ ఆదేశాల ప్రకారం దాడి పథకాలు సిద్ధం చేసినప్పటికీ ఇరాన్ పై దాడిని పునః ప్రారంభించ వద్దని గట్టిగా సలహా ఇచ్చినట్లు తెలుస్తున్నది. మళ్ళీ దాడి చేసినా గాని ఇరాన్ లొంగిపోవడం గానీ, హార్ముజ్ జలసంధి ని తెరవటం గాని జరగదని వాళ్ళు ట్రంప్ కి చెప్పారు. మరో దాడి వల్ల లక్ష్యం నెరవేరకపోగా అమెరికా వద్ద మిస్సైల్స్ నిలువ ఇంకా తగ్గిపోతాయని అది అమెరికాకు మంచిది కాదని వారు సలహా ఇచ్చారు.
మే 1 – 2 తేదీల నాటికి ఇరాన్ ప్రభుత్వ బహిరంగ ప్రకటనలు, ఐ.ఆర్.జి.సి, అధ్యక్షుడు, స్పీకర్ ల ప్రకటనలు ప్రకారం చూస్తే అమెరికా, ఇరాన్ విధించిన షరతులు పూర్తిగా అంగీకరించే వరకు హార్ముజ్ జలసంధి తెరవడం గానీ, యుద్ధం నుండి పూర్తిగా వెనక్కి తగ్గడం గాని ఇరాన్ చేయదు. తన షరతులపై చర్చలు చేయటం జరగని పని అని ఇరాన్ అనేకసార్లు తేల్చి చెప్పింది.
ఇటీవల పాక్ ద్వారా అమెరికాకు అందజేసిన ప్రతిపాదనలో కూడా తన షరతులను పేర్కొంది. దాని ప్రకారం:
- ఇరానియన్ పోర్టుల పైన అమెరికా విధించిన నావల్ బ్లాకెడ్ ను అమెరికా వెంటనే తప్పనిసరిగా ఎత్తివేయాలి.
- ఇరు పక్షాలు యుద్ధాన్ని సంపూర్ణంగా విరమించాలి (ఐరాస చట్టబద్ధంగా గ్యారంటీ చేయబడ్డ లాంగ్ టర్మ్ సీజ్ ఫైర్)
- అందుకు బదులుగా ఇరాన్ హార్ముజ్ పైన బ్లాకెడ్ ను ఎత్తివేస్తుంది. మైన్ లను తొలగిస్తుంది. దాడులు నిలిపేస్తుంది. అంతర్జాతీయ షిప్పింగ్ ను అనుమతిస్తుంది.
- తక్షణ సంక్షోభాన్ని పరిష్కరించుకున్న తర్వాత ఇరాన్ అణు కార్యక్రమం పైన తర్వాత కాలంలో చర్చలు చేయవచ్చు.
ట్రంప్, ఈ ప్రతిపాదన తనకు అసంతృప్తిగా ఉన్నదని చెప్పాడు. అణు కార్యక్రమం పైన చర్చలను వాయిదా వేయటం ట్రంప్ కి నచ్చలేదు. తాను ఎన్.పీ.టి సభ్యదేశం కనుక, ఐ.ఏ.ఇ.ఏ ఇనస్పెక్టర్లను తనిఖీకి అంగీకరించాను కనుక తమకు యురేనియం ను శుద్ధి చేసే చట్టబద్ధ హక్కు ఉన్నదని ఇరాన్ వాదిస్తున్నది.
చర్చలు స్తంభించినప్పటికీ ఇరాన్ దౌత్య పనులతో బిజీ గానే ఉంటోంది. ఏప్రిల్ 30, మే 1 తేదీల్లో ఇరాన్ విదేశీ మంత్రి అబ్బాస్ అరాగ్చి పలు దేశాల విదేశీ మంత్రులతో ఫోన్ లో చర్చలు చేశాడు. టర్కీ (తుర్కియే), ఈజిప్టు, కతార్, ఇరాక్, సౌదీ అరేబియా, అజర్ బైజాన్ దేశాలు జాబితాలో ఉన్నాయి. అమెరికాకు తాము చేసిన కొత్త ప్రతిపాదన గురించి, యుద్ధ విరమణకు తాము చేస్తున్న కృషి గురించి ఆయన ఆయా దేశాలకు వివరించాడు.
ఇరాన్ దాడుల్లో అమెరికా పశ్చిమాసియా సైనిక స్థావరాలు ఎంత దారుణంగా నష్టపోయాయో తెలియజేస్తూ సి.ఎన్.ఎన్ వార్తా సంస్థ, మే 2 తేదీన వివరమైన వార్తా కథనం ప్రచురించింది. దీని ప్రకారం అమెరికాకి చెందిన 16 స్థావరాలపై ఇరాన్ చేసిన దాడులు మునుపు అనుకున్నదానికంటే అత్యంత అధునాతనమైనవి, తీవ్రమైనవి, మరియు వినాశకరమైనవి. పశ్చిమాసియాలో అమెరికాకి ఉన్న సైనిక స్థావరాల్లో మెజారిటీ ఇప్పుడు తీవ్ర స్థాయిలో నష్ట పోవటమో లేదా అసలు ఏ మాత్రం వాడకానికి వీలు లేకుండా నాశనం కావటమే జరిగింది.
“ఎదురులేని అమెరికా” అన్న నమ్మకాన్ని ఇరాన్ తీవ్రంగా దెబ్బ కొట్టింది. ముఖ్యంగా అమెరికా తమకు రక్షణగా ఉంటుందన్న గల్ఫ్ దేశాల నమ్మకాన్ని ఇరాన్ బదాబదలు చేసేసింది. అమెరికాతో చేసుకున్న భద్రతా ఒప్పందాల పైన సౌదీ అరేబియా నమ్మకం కోల్పోయింది. అమెరికా కేవల పేపర్ టైగర్ మాత్రమే అని గల్ఫ్ దేశాలకు సాక్ష్యాలతో సహా అర్ధం అయింది. అమెరికా కల్పించే రక్షణ/భద్రత పైన వారికి ఇక నమ్మకం లేదు. ఇరాన్ తో ఏదో విధంగా చర్చలు జరిపి సత్సంబంధాలు ఏర్పరుచుకుని స్థానికంగా సహజ భద్రతా ఒప్పందాల చేసుకోవటమే మేలు అని గల్ఫ్ దేశాలు భావించే స్థాయిలో ఇరాన్ దాడుల తీవ్రత ఉన్నదని సి.ఎన్.ఎన్ విశ్లేషించింది.
ఇదే అంశాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన సొంత విశ్లేషణతో ధృవీకరించింది.
ఇరాన్ తన నూతన 14 పాయింట్ల కొత్త ప్రతిపాదన ద్వారా అమెరికాకు సవాలు విసిరింది. ఇరాన్ తో ఒప్పందానికి రావటానికి 30 రోజుల గడువు విధించింది. ఆ లోపు తమ ప్రతిపాదనను అంగీకరించాలని తెగేసి చెప్పింది. ఇరాన్ ప్రతిపాదనకు అమెరికా ఒప్పుకుంటే హార్ముజ్ జలసంధి ని పూర్తిగా తెరుస్తామని చెప్పింది. అది కూడా తమ షరతుల ప్రకారమే హార్ముజ్ తెరుస్తానని చెప్పింది.
భవిష్యత్ లో దాడులకు పాల్పడబోమన్న చట్టబద్ధ హామీ, పశ్చిమాసియా నుండి అమెరికా ట్రూప్స్ ఉపసంహరణ, స్తంభింప జేసిన ఇరాన్ ఆస్తులు, నిధులు అన్నింటినీ విడుదల చేయటం, యుద్ధ నష్టాలకు పరిహారం చెల్లింపు, ఇరాన్ పై ఉన్న ఆంక్షలను ఎత్తివేయటం, ఇరాన్ కొత్తగా విధించిన హార్ముజ్ నియంత్రణను అంగీకరించటం, అమెరికా విధించిన నేవల్ బ్లాకెడ్ ను ఎత్తేయటం, ఇవీ స్థూలంగా ఇరాన్ కోరుతున్న డిమాండ్లు. ఇరాన్ పూర్తిగా లొంగిపోవాలని యుద్ధానికి ముందు అమెరికా డిమాండ్ చేసింది. యుద్ధం తర్వాత అమెరికా పూర్తిగా లొంగిపోవాలని ఇరాన్ డిమాండ్ చేస్తున్నది. అందుకు తగిన శక్తి, అనుకూలత తనకు వచ్చాయని ఇరాన్ కాన్ఫిడెంట్ గా ఉన్నది.
అమెరికా డిస్ట్రాయర్ నౌక ఒకటి ఈ రోజు – మే 4 – హార్ముజ్ జలసంధి ని దాటేందుకు ప్రయత్నం చేసింది. ఇరాన్ దాని మీదికి 2 మిస్సైల్స్ ప్రయోగించి ముందుకు రాకుండా నిరోధించింది. ఈ సంగతి ఇరాన్ ప్రకటించింది. అయితే అమెరికా మిలట్రీ అలాంటిది ఏమీ జరగలేదని నిరాకరించింది.
బహుశా అమెరికా పెట్రోల్ బోట్లు హార్ముజ్ ను దాటేందుకు ప్రయత్నించి ఉండాలి. ఇరాన్ హెచ్చరికగా మిస్సైల్స్ ప్రయోగించి ఉండాలి. వెంటనే అమెరికా బోట్లు వెనక్కి వెళ్లిపోయి ఉంటాయి. అని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇరాన్ విదేశీ మంత్రి మాస్కో వెళ్లి పుతిన్ ను కలిసినప్పుడు పుతిన్ అమెరికాకు నర్మగర్భంగా హెచ్చరిక చేశాడు. ఇరాన్ పైన మళ్లీ యుద్ధానికి దిగవద్దని, మరో దాడి చేస్తే ఈ సారి కొత్త దేశాలు రంగం లోకి దిగుతాయని, ఆర్థికంగా అల్లకల్లోలం ఏర్పడుతుందని హెచ్చరిక చేశాడు. అమెరికా దాడి చేస్తే ఇరాన్ వెనక్కి తగ్గదని, ప్రతి దాడి చేస్తుందని ఈ సారి ప్రతి దాడి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించాడు.
చైనా కూడా అమెరికా పైన ఆర్థిక యుద్ధానికి రెడీ అన్నట్లుగా ఒక చర్య ప్రకటించింది. చైనా 2021 లోనే విదేశీ ఆంక్షలను అడ్డుకునేందుకు కొన్ని చర్యలు సిద్ధం చేసింది. అయితే వాటిని అమలు చేయకుండా నిలిపి ఉంచింది. ఇన్నాళ్ళూ ఇరాన్ పైన అమెరికా విధించిన చమురు ఆంక్షలను చైనా అనుసరిస్తూ వచ్చింది.
ఇరాన్ చమురును శుద్ధి చేసే 5 పెద్ద రిఫైనరీల పైన అమెరికా ఆంక్షలు విధించగా వాటిని చైనా ప్రభుత్వం అమలు చేసింది. ఇప్పుడు అమెరికా ఆంక్షలను పాటించాల్సిన అవసరం లేదని చైనా తన కంపెనీలకు ఆదేశాలు ఇచ్చింది. అంటే 2021 లో సిద్ధం చేసిన చర్యలను అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్యల ప్రకారం విదేశాలు విధించే ఆంక్షలను చైనా కంపెనీలు అమలు చేయటానికి వీలు లేదు. అమలు చేస్తే అలాంటి కంపెనీల పైన చైనా ఆంక్షలు అమలు అవుతాయని చెప్పింది. అమెరికా బ్యాంకులతో సంబంధాలు నిర్వహిస్తున్న 5 చైనా రిఫైనరీలు అలాంటి ఆంక్షలను అమలు చేసే చట్టబద్ధ అవకాశాన్ని చైనా ప్రభుత్వం రద్దు చేసింది. అంటే అమెరికా ఆంక్షలను చైనా లో అమలు కాకుండా నిరోధించింది. అమెరికా ఆంక్షలను చైనా కంపెనీలు అమలు చేయటం ఇక చట్ట విరుద్ధం అవుతుంది.
చైనా ఈ చర్య తీసుకోవటం అమెరికా-చైనా దేశాల వాణిజ్య సంబంధాల రీత్యా చాలా పెద్ద చర్య. ఇన్నాళ్ళూ ఇరాన్ పైన అమెరికా ఆంక్షలను పాటించిన చైనా ఈ చర్యతో అమెరికా ఆధిపత్యాన్ని ప్రత్యక్షంగా ధిక్కరించింది. ఇది భౌగోళిక రాజకీయాలలో ఒక ముఖ్యమైన పరిణామం.
05-05-2026
పనామా కాలువ గతంలో చైనా ఆధీనంలో ఉండేది. ట్రంప్ రెండో సారి అధ్యక్షుడు అయ్యాక పనామా కాలువను స్వాధీనం చేసుకున్నాడు. (పనామా కాలువ నిర్వహించే కంపెనీలను అమెరికా ఫైనాన్స్ కంపెనీలు కొనుగోలు చేశాడు). ఈ నేపథ్యంలో పనామా కాలువ ద్వారా వచ్చే వాణిజ్య నౌకలకు చైనా పోర్టులలో ప్రవేశం ఉండబోదని చైనా ఇప్పుడు ప్రకటించింది. పనామా కాలువ వాస్తవానికి చైనాతో వ్యాపారానికి నిర్మించబడిన సముద్ర కారిడార్. అలాంటి పనామా కాలువను ఉపయోగించే నౌకలకు తమ పోర్టుల్లో ప్రవేశం లేకుండా నిషేధించింది చైనా. తన నిబంధనలు ప్రపంచంలో అన్ని చోట్లా వర్తిస్తుందని చైనా స్పష్టం చేసింది. తద్వారా అమెరికా పాటించే ఆంక్షల సూత్రాలనుండే ఒక సూత్రాన్ని చైనా అమలు చేస్తోంది. అమెరికా ప్రపంచ వాణిజ్య సామర్థ్యాన్ని చైనా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నది.
మే 14 తేదీన ట్రంప్ చైనా పర్యటన ఉన్నది. డొనాల్డ్ ట్రంప్, జిన్ పింగ్ మధ్య వాణిజ్య చర్చలు జరగనున్నాయి. ట్రంప్ పర్యటనకు ముందే చైనా తాజా చర్యలు తీసుకుంటున్నది. దరిమిలా ట్రంప్ చైనాలో కఠిన చర్చలు ఎదుర్కొన బోతున్నాడు.
గత రెండు వారాలుగా చమురు ట్యాంకర్లు ఒక్కటి కూడా ఐరోపా దేశాలకు చేరలేదు. వివిధ ఉత్పత్తులకు కావలసిన ఇతర వాణిజ్య సరుకులు కూడా యూరప్ కు అందటం లేదు. సప్లై చైన్ రూపంలో సరుకుల ఉత్పత్తి వివిధ దేశాల మధ్య విభజించబడి ఉన్న నేపధ్యంలో ప్రపంచ దేశాలకు హార్ముజ్ జలసంధి మూసివేత తాలూకు నొప్పి తీవ్రం కానుంది.
అమెరికాకు చెందిన ఒక యుద్ధ నౌక పైన ఇరాన్ మిస్సైల్స్ ప్రయోగించారని నిర్ధారించేందుకు సాక్షులు ఉన్నాయని ఆల్ జజీరా ఛానెల్ ప్రకటించింది. కాబట్టి హార్ముజ్ సమీపానికి వచ్చిన అమెరికా షిప్ పైన ఇరాన్ దాడి నిజమే అని స్పష్టం అయింది.
ప్రస్తుతం ఇరాన్, అమెరికా యుద్ధం ప్రతిష్టంభన దశలో ఉన్నది. ఇరాన్ 14 అంశాలతో ఒక రాజీ పధకాన్ని అమెరికాకు ఇవ్వగా, అమెరికా అధ్యక్షుడు ‘సింగిల్ పేజీ మెమోరాండం’ పేరుతో తానొక రాజీ ప్రతిపాదనను ఇరాన్ కు అందజేశాడు. అమెరికా ప్రతిపాదన పైన ఇరాన్ ప్రభుత్వం చర్చిస్తున్నది. చర్చల ఫలితం ఏమిటో ఇంకా తెలియలేదు. పత్రికలు మాత్రం ఇరు దేశాలు దాదాపు ఒప్పందానికి చేరువలోకి వచ్చాయని చెబుతున్నాయి.
మరో ప్రక్క ట్రంప్ దూకుడు ప్రకటనలు కొనసాగిస్తూ షేర్ మార్కెట్లు తీవ్రంగా ఊగిసలాడేందుకు కారణం అవుతున్నాడు. ఒక పధకం ప్రకారం తనకు, తన మిత్రులకు సంబంధించిన కంపెనీలకు షేర్ మార్కెట్ లాభాలు ఆర్జించి పెట్టేందుకే డొనాల్డ్ ట్రంప్ ఈ తరహా దూకుడు ప్రకటనలు చేస్తున్నాడని అమెరికా మాజీ ఇంటలిజెన్స్ విశ్లేషకుడు ల్యారీ జ్యాన్సన్ విశ్లేషించాడు.
ఇరాన్ పై మరో దాడికి తమ దేశం లోని సైనిక స్థావరాలను వినియోగించేందుకు సౌదీ అరేబియా ప్రిన్స్ సల్మాన్ అనుమతి నిరాకరించాడు. అమెరికా, ఇరాన్ పై దాడి చేస్తే ఇరాన్ పర్షియన్ గల్ఫ్ లోని గల్ఫ్ దేశాల పైన దాడులు చేస్తున్న నేపధ్యంలో మరింత నష్టాన్ని ఎదుర్కోవటానికి సౌదీ అరేబియా సిద్ధంగా లేదని ఈ చర్య తెలియజేస్తున్నది. ఇరాన్ పై దాడికి గల్ఫ్ దేశాల నుండి వచ్చిన మద్దతు తగ్గిపోయిందని కూడా ఈ చర్య తెలియజేస్తున్నది.