యుపి: లంచం ఇవ్వనందుకు కరెంటు బిల్లు 19 రెట్లు పెరిగింది!

Public Grievance by Minister A K Sharma

–

ఒక లక్నో నివాసి ఇంటికి విద్యుత్ కనెక్షన్ అవసరం అయింది. మార్చి 2026 నెలలో నూతన కనెక్షన్ ఫీజు రు 11,622 లు కట్టేశాడు. కానీ ఫీజు కట్టిన 7 నెలల తర్వాత కూడా కనెక్షన్ ఇవ్వలేదు. కారణం ఏమిటి అంటే విద్యుత్ శాఖ ఉద్యోగి కనెక్షన్ కోసం రు 50,000 ల లంచం డిమాండ్ చేస్తే దాన్ని చెల్లించేందుకు లక్నో నివాసి తిరస్కరించాడు. ఆ తర్వాత రు 2.24 లక్షల మేరకు రివైజ్డ్ డిమాండ్ నోటీసు అతనికి అందింది.

ఫిర్యాదుదారు పేరు అభినవ్ త్రిపాఠి కాగా ఆయన ఖరగ్ పూర్ లోని గోమతి నగర్ ఎక్స్=టెన్షన్ నివాసి. విషయం బహిరంగం కావటంతో రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి ఏ కె శర్మ, లంచం వ్యవహారం పైన విచారణకు ఆదేశించాడు. మంత్రి నివాసం వద్ద నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార జాతా లో ఈ మేరకు మంత్రి ఆదేశం ఇచ్చాడు.

త్రిపాఠి, 3 కిలో వాట్ల ఇంటి కనెక్షన్ కోసం ఫిబ్రవరి 2026 లో దరఖాస్తు చేశాడు. విద్యుత్ శాఖ రు 11,622 లు కనెక్షన్ ఇచ్చేందుకు ఖర్చవుతుందని చెప్పగా త్రిపాఠి చెల్లించాడు. కానీ కనెక్షన్ మాత్రం ఇవ్వలేదు. ఆయన అధికారులను ప్రశ్నించగా అసిస్టెంట్ ఇంజనీర్ రు 50,000 ల మేర లంచం చెల్లించకపోతే, కనెక్షన్ ఇవ్వటం కుదరదని చెప్పాడు. లంచం చెల్లించటానికి త్రిపాఠి నిరాకరించటంతో రివైజ్డ్ ఎస్టిమేషన్ పేరుతో ఆయనకు అక్టోబర్ 12 తేదీన రు 2.25 లక్షలు చెల్లించాలని డిమాండ్ నోటీసు అందించి.

మంత్రి విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడట! అసిస్టెంట్ ఇంజనీర్ ని సస్పెండ్ చేయాలని, సంఘటన పైన విచారణ చేయాలని ఆదేశించాడు, ఆ మంత్రివర్యులు! ట్విస్ట్ ఏమిటంటే పెంచిన ఫీజు సాంకేతికంగా ఏ విధంగా సరైనదో చెప్పాలని మంత్రి కోరాడు; వినియోగదారుడికి పెంచిన ఫీజుకి కారణాలు ఏమిటో చెప్పారా లేదా అని ఆరా తీశాడు. లంచం డిమాండ్ నిజమేనా అని అడిగాడు. పెంచిన ఫీజుకి తగిన కారణాలు చూపించటం విద్యుత్ శాఖ అధికారులకి పెద్ద విషయం కాదు. తగిన కారణాలు చూపిస్తే 2.24 లక్షలు కట్టాలని మంత్రి కూడా చెబుతాడా?

వినియోగదారులను ఇబ్బంది పెట్టవద్దని, అన్యాయమైన బిల్లులతో వారి పైన భారం వేయవద్దని, లంచాలు డిమాండ్ చేయొద్దని ఈ సందర్భంగా మంత్రి గారు ఉద్యోగులకు హితబోధ చేశాడు. ఇప్పటి వరకు వారికి అలాంటి హితబోధ చేసినవారు లేరా అన్నది ఒక ప్రశ్న కాగా, హితబోధలు, నీతి వాక్యాలు ఉద్యోగుల్లో ఎంతవరకు మార్పు తెస్తాయి అన్నది మరో ప్రశ్న.

మంత్రి గారి గ్రీవెన్స్ జాతాలో తాగు నీటి సమస్యల గురించి బోలెడు వినతి పత్రాలు అందాయి. తమ స్థలాలను కబ్జా చేసిన ఫిర్యాదులు అందాయి. మోయ లేని విద్యుత్ బిల్లులు అందుతున్న ఫిర్యాదులు వచ్చాయి. కొత్త సబ్ స్టేషన్లు నిర్మించాలన్న డిమాండ్లు అందాయి. వీటన్నింటినీ నిర్దిష్ట కాలం లోపు పరిష్కరించాలని మంత్రి గారు ఆదేశాలిచ్చి చక్కా పోయారు. వాటికి కావలసిన నిధుల గురించి మాత్రం ఆయన ఒక్క ముక్కా చెప్పకుండా వెళ్ళిపోయారు.

విద్యుత్ కనెక్షన్, మంచి నీటి కుళాయి కనెక్షన్, గృహ నిర్మాణ ప్లాన్ ఆమోదం, గృహ స్థలాల అక్రమ ఆక్రమణల ఫిర్యాదులు, ఇల్లు/చిన్న వ్యాపారం/ఇంటి నిర్మాణ మోడిఫికేషన్ ల రిజిస్ట్రేషన్లు… ఇలా అనేకానేక గృహ నివాసుల అవసరాలు మునిసిపాలిటీల, విద్యుత్ శాఖల, రిజిస్ట్రేషన్ శాఖల ఉద్యోగుల పై ఆదాయాలకు ప్రధాన వనరుగా అనేక దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. పార్టీలు ప్రభుత్వాలు మారుతున్నా కూడా ఇవి స్థిరంగా కొనసాగుతూనే ఉన్నాయి.

ఇంకా చెప్పాలంటే లంచాల వసూళ్లలో ప్రభుత్వ పెద్దల నుండి, మారుతున్న పార్టీ ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, నిర్దిష్ట టార్గెట్ లు ఇస్తూ ఆదేశాలు అందుతాయని కూడా అధికారులు ప్రైవేటు సంభాషణల్లో చెబుతుంటారు. అంటే మంత్రి గారి హితబోధలు, నీతి సూత్రాలు కేవలం పత్రికలు, ప్రజల కోసమే తప్ప నిజంగా ఆచరించటానికి కాదు.

స్పందించండి