
–
పశ్చిమ బెంగాల్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించిన అనంతరం 91 లక్షల వోటర్ల పేర్లను వోటర్ల జాబితా నుండి ఎన్నికల కమిషన్ తొలగించింది. ఇవి అక్రమ తొలగింపులు అని త్రిణమూల్ కాంగ్రెస్ నాయకులు, వోటర్లు, ఇతర ప్రతిపక్ష పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించటంతో, తమ పేర్లు తొలగించటానికి వ్యతిరేకంగా 91 లక్షల వోటర్ల అప్పీళ్లను విచారించటానికి రిటైర్ అయిన న్యామూర్తుల నాయకత్వంలో 19 అప్పీళ్లను సుప్రీం కోర్టు నియమించింది. గత నెల రోజులుగా ఈ ట్రిబ్యూనళ్ల న్యాయమూర్తులు వరుసపెట్టి రాజీనామా చేయటం కలకలం రేపుతోంది.
19 అప్పిలేట్ ట్రిబ్యునళ్లు ఇప్పటి వరకు లక్ష అప్పీళ్లలో విచారణ పూర్తిచేశాయి. వాటిలో 93 శాతం వోటర్లు నిజమైన వోటర్లేనని వారి పేర్లను అక్రమంగా తొలగించారని ట్రిబ్యునళ్లు తేల్చాయి. రెండు నెలలుగా కేవలం లక్ష అప్పీళ్లు మాత్రమే పరిష్కారానికి నోచుకోవటం ప్రశ్నార్ధకం కాగా, మొత్తం అప్పీళ్లు పరిష్కారం కావటానికి రెండు దశాబ్దాలు పడుతుందని పత్రికలు లెక్క కట్టటంతో పరిస్ధితి మరింత విషమంగా మారింది.
ఈ నేపధ్యంలో నవంబర్ 7 తేదీన నాలుగవ ట్రిబ్యునల్ జడ్జి తన పదవికి రాజీనామా చేశాడు. ముషీరాబాద్ జిల్లా వోటర్ల అప్పీళ్లను విచారిస్తున్న జస్టిస్ బిస్వజిత్ బసు తన పదవికి రాజీనామా చేసినట్టు వెల్లడి అయింది. తన వ్యక్తిగత కారణాల రీత్యా తాను రాజీనామా చేస్తున్నట్టు బిస్వజిత్ చెప్పినట్టు తెలుస్తున్నది. బసు రాజీనామా తో ఇప్పటి వరకు 4గురు అప్పిలేట్ ట్రిబ్యునల్ జడ్జిలు రాజీనామా చేసినట్టయింది.
గత నెల రోజుల్లో రిటైర్ అయిన కలకత్తా హై కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ టి ఎస్ శివజ్ఞానం, రిటైర్డ్ జడ్జి రంజిత్ కుమార్ బాగ్, మరో రిటైర్డ్ జడ్జి ఇంద్రజిత్ చటర్జీ లు రాజీనామాలు చేశారు. నలుగురు జడ్జిల రాజీనామా తో జాబితా నుండి తొలగించబడిన వోటర్ల అప్పీళ్ల విచారణ మరింత ఆలస్యం అవుతుందని అధికారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధిక సంఖ్యలో వోటర్లు తొలగింపుకు గురయిన ముషీరా బాద్ జిల్లా అప్పిలేట్ ట్రిబ్యునల్ జడ్జి రాజీనామా చేయటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
“శ్రీ బసు తన నిర్ణయాన్ని కలకత్తా హై కోర్టు చీఫ్ జస్టిస్ కు శుక్రవారం ఒక లేఖద్వారా తెలియజేశాడు” అని ఎన్నికల అధికారిని ఉటంకిస్తూ పిటిఐ వార్తా సంస్థ తెలిపింది. ముర్షిదాబాద్ జిల్లాకు కేటాయించిన ఇద్దరు జడ్జిలు (బసు మరియు చటర్జీ) ఇద్దరు రాజీనామా చేయటంతో, అత్యధిక వోటర్లు తొలగించబడ్డ ఆ జిల్లాలో అప్పీళ్ల పరిష్కారం తీవ్ర సందిగ్ధంలో పడింది. ఆ జిల్లాలో అప్పీళ్ల పరిష్కారం పూర్తిగా నిలిచిపోయింది.
కొద్ది రోజుల క్రితమే రాజీనామా చేసిన జస్టిస్ చటర్జీ, ప్రతిరోజూ 22 కి.మీ ప్రయాణం చేసి కోర్టుకు చేరుకోవటం కష్టంగా మారిందని చెప్పాడు. వోటర్ల అప్పీళ్ల పరిష్కారం రెండు మూడు నెలల సమయంలో ముగిసి పోతుందని జస్టిస్ చటర్జీ, అంచనా వేశాడు. కానీ ఏళ్ల తరబడి కొనసాగే అవకాశం ఏర్పడటంతో ఆయన రాజీనామా చేసేశాడు. భారీ సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉండటంతో పరిష్కారం తన వల్ల కాదన్న నిర్ణయానికి వచ్చాడు.
జస్టిస్ బాగ్, జస్టిస్ శివ జ్ఞానంలు కూడా ఒకరు వ్యక్తిగత కారణాలు, మరొకరు కుటుంబ కారణాలు చెప్పి బాధ్యతల నుండి తప్పుకున్నారు. “ఈ తరహాలో లక్షలాది కేసులు పరిష్కరించటం చాలా కష్టం. సుప్రీం కోర్టు ఈ పద్ధతిలోనే కేసులు పరిష్కరించాలని ఆదేశాలు ఇవ్వటంతో ఈ పద్ధతి పాటించవలసి వస్తోంది” అని జస్టిస్ బసు అన్నట్టు తెలుస్తోంది. అది ఏ పద్ధతి అన్నది తెలియలేదు.
ఎస్ఐఆర్ అప్పీళ్ల పరిష్కారానికి నియమించిన అప్పిలేట్ ట్రిబ్యునల్స్ కు తగిన సౌకర్యాలను అందుబాటులో ఉంచలేదని జడ్జిలు ఆరంభం నుండి మొట్టుకుంటూనే ఉన్నారు. వాహన సౌకర్యం గానీ, తగినంత మంది సిబ్బందిని గానీ ప్రభుత్వాలు ఇవ్వకపోవటంతో జడ్జిలు నానా యాతనలు పడవలసి వస్తోంది. అదీ రిటైర్ అయ్యాక!
జస్టిస్ బసు ఈ సంగతి నొక్కి చెప్పినట్టు తెలుస్తోంది. “ట్రిబ్యూనల్స్ కు కనీస మౌలిక నిర్మాణ వసతులను కల్పించాల్సి ఉన్నది. మరిన్ని ఆధునిక సౌకర్యాలు కల్పించాలి. అప్పుడే సమర్ధవంతంగా అప్పీళ్లు పరిష్కరించటం వీలవుతుంది” అని జస్టిస్ బసు అబిప్రాయ పడ్డాడు (పిటిఐ, జవంబర్ 7)
కనీస మౌలిక వసతులు కల్పించటం ప్రభుత్వాల చేతుల్లో ఉన్నది. ఇది పశ్చిమ బెంగాల్ సమస్య కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు పూనుకోవాలి. లేదా కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు ఎస్ఐఆర్ అప్పీళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. రెండు చోట్లా బిజేపి పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ముస్లిం వోటర్లను, ఇమ్మిగ్రెంట్లు అని ఆరోపిస్తూ జాబితా నుండి తొలగించేందుకు ఆ పార్టీ లక్ష్యం చేసుకున్నట్టు కనిపిస్తున్న దృష్ట్యా, అప్పీళ్ల పరిష్కారం ఆ పార్టీ కోరుతున్నదా లేదా అన్నది ఒక అనుమానం. ఈ 91 లక్షల వోట్ల రద్దు ఫలితంగా బిజేపి బెంగాల్ శాశన సభను కైవశం చేసుకున్నందున అప్పీళ్ల పరిష్కారం ఎప్పటికీ తెగుతుందో మరి!
తమ ఖాతాలో పడని వోటుకు ఎలాంటి విలువా లేదని, అలాంటి వారిని ఏదో ఒక పేరుతో దేశం నుండి కూడా తరిమి వేసేందుకు దేశంలోని ఒక ప్రధాన రాజకీయ పార్టీ సిద్ధపడి ఉన్నదని ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా ప్రజలకు తెలిసి వచ్చింది. ఇన్నాళ్ళు వోటు హక్కుకు ఎనలేని విలువ ఉన్నదని చెబుతూ వచ్చిన రాజకీయ పార్టీలు ఆ విలువ పొందటానికి అనేకానేక కుల, మత, జాతి లకు సంబంధించిన షరతులు వర్తిస్తాయని కూడా ప్రజలకు తెలిసి వచ్చింది.
షరతులతో కూడిన వోటు హక్కుకు నిజమైన విలువ ఉంటుందా? విలువ లేని వోటు హక్కును కలిగి ఉన్న ప్రజలకు ప్రజాస్వామిక పాలన అందుతున్నట్టేనా? అసలు భారత దేశ ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యమేనా? ఎస్ఐఆర్ పుణ్యమా అని ప్రజలు ఈ ప్రశ్నలు వేసుకోవలసి వచ్చింది.


