
–
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఇసిఐ) 17 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్) జరపనున్నట్టు అక్టోబర్ 15 తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కు భిన్నమైన కార్యక్రమం. ఎస్ఎస్ఆర్ ప్రక్రియ అన్నది ప్రతి సంవత్సరం జనవరి నాటికి పూర్తి చేయవలసిన కార్యక్రమం. జనవరి 2027 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో తాజా ఎస్ఎస్ఆర్ ప్రక్రియకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది.
జనవరి 2025 నాటికి కొత్త ఎస్ఎస్ఆర్ ను పూర్తి చేసి వోటర్ల జాబితాలను ప్రకటించ వలసి ఉండగా ఎన్నికల కమిషన్ ఆ పని చేయలేదు. దానికి బదులు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని ప్రకటించింది. నిజానికి దేశం మొత్తం ఒకే సారి ఎస్ఐఆర్ జరపాలన్న నిబంధన గానీ, జరపటానికి అవకాశం గానీ ఎన్నికల చట్టాల్లో లేదు. నిర్దిష్ట ప్రాంతంలో నిర్దిష్ట కాలంలో నిర్దిస్థ పరిస్ధితులు ఏర్పడినప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరపటానికి ఎన్నికల చట్టాల్లో అవకాశం ఉంది తప్ప దేశం మొత్తం ఒకేసారి ఎస్ఐఆర్ జరిపేందుకు అవకాశం ఇవ్వబడలేదు. అందుకే ఎస్ఐఆర్ చట్టబద్ధత పైన సుప్రీం కోర్టు తీర్పు అవసరం అయింది.
బెంగాల్ ఎన్నికలకు ముందు సుప్రీం కోర్టు తీర్పు మేరకు దేశ వ్యాపిత ఎస్ఐఆర్ చట్టబద్ధంగా మార్చబడింది. కేసు విచారణ సందర్భంగా “గుండు గుత్తగా వోట్లు తొలగిస్తే చెప్పండి, అప్పుడు ఈ ప్రక్రియను రద్దు చేస్తాం” అని సిజెఐ చేసిన వ్యాఖ్య చివరికి తీర్పులో ప్రతిఫలించలేదు. ఆ వ్యాఖ్య చేసిన మరుసటి రోజుల్లోనే “ఎస్ఐఆర్ ఆపటానికి వీలు లేదు” అని వ్యాఖ్యానించటం ద్వారా తాను ముందు చేసిన వ్యాఖ్యానానికి విలువ లేకుండా చేశారు యువర్ హానర్ సిజెఐ! ఆ విధంగా ఎస్ఐఆర్, సుప్రీం కోర్టు జోక్యంతో చట్టబద్ధం కావించబడింది.
దిద్దుబాటు చర్యలు?
అప్పటి వరకు నరేంద్ర మోడి ప్రభుత్వానికి, గ్యానేష్ కుమార్ చేపట్టిన బుల్ డోజర్ ఎస్ఐఆర్ కు బలవంతపు సానుకూలత విజయవంతంగా రుద్దబడుతున్న వాతావరణం కాస్తా, ఇండియన్ ఎక్స్ ప్రెస్ పరిశోధనాత్మక కధనం తర్వాత ఒక్కసారిగా తిరగబడింది. కాంగ్రెస్ పార్టీ నియమించిన బృందం 6 నెలల పాటు కష్టపడి కర్ణాటక ఎస్ఐఆర్ లో జరిగిన అవతవకలు ఏ విధంగా జరిగిందీ పరిశోధించాక, పరిశోధన ఫలితాలను రాహుల్ గాంధీ గంటల తరబడి పత్రికలకు వివరించినా కూడా ఆయన వాదనలను నమ్మిన వారు తక్కువ మంది! ఇండియన్ ఎక్స్ ప్రెస్ కొన్ని వాస్తవాలను బైట పెట్టాక పరిస్ధితి తారుమారయింది.
ఎక్స్ ప్రెస్ కధనాన్ని చేత బట్టుకుని కాక్రోచ్ జనతా పార్టీ, INDIA కూటమి లు ఉద్యమాల బాట పట్టటంతో ప్రభుత్వమూ, చీఫ్ ఎన్నికల కమిషనర్, బిజేపి, మంత్రులు అందరూ డిఫెన్స్ లో పడిపోవలసి వచ్చింది. ఎస్ఐఆర్ జరపవలసిన రాష్ట్రాలు ఇంకా మిగిలి ఉన్నప్పటికీ తలవని తలంపుగా సెప్టెంబర్ 29 తేదీన గ్యానేష్ కుమార్/ఎన్నికల కమిషన్ ప్రత్యేక ప్రకటన చేసింది. ఎస్ఐఆర్ లో వోటర్లుగా తొలగించబడ్డ వారిని “లెఫ్ట్ ఔట్” వోటర్లుగా సంభోదిస్తూ వారి కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నట్టు ఆ ప్రకటన సారాంశం. సెప్టెంబర్ 13 తేదీన ఇండియన్ ఎక్స్ ప్రెస్ పరిశోధనాత్మక కధనం వెలువడ్డ తర్వాత ప్రజల్లో అలజడి, ఆందోళన తీవ్రమైన నేపధ్యంలో సెప్టెంబర్ 29 ప్రకటన వెలువడింది అన్నది నిర్వివాదాంశం.
సిఇసి దిద్దుబాటు చర్యలు అక్కడితో ఆగలేదు. అక్టోబర్ 15 తేదీన ఎలక్షన్ కమిషన్ మరో భారీ కార్యక్రమం -17 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీలలో ఎస్ఎస్ఆర్- ప్రకటించటంతో చీఫ్ ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ తన తప్పులను సరిదిద్దుకునే కార్యక్రమంలో పడినట్టు అనుమానాలు తలెత్తాయి. కానీ గ్యానేష్ కుమార్ ఎస్ఐఆర్ లో అడ్డగోలు చర్యల ద్వారా భారత చట్టబద్ధ ప్రజాస్వామిక ఎన్నికల ప్రక్రియలో చట్ట విరుద్ధ జోక్యాలను చొప్పించినట్టయితే అవి దిద్దుబాటు చర్యలతో సమసిపోతాయా? అలా సమసిపోయే విధంగా గ్యానేష్ తప్పులు ఉన్నట్టయితే, మునుముందు ప్రచారంలో గానీ, కోర్టులో గానీ ఆ తప్పులను కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు రుజువు చేయగలవా? ఇది ప్రతిపక్ష పార్టీలు ఆత్మశోధన చేసుకోవాల్సిన విషయం.
ఒక ముఖ్యమైన వెనకడుగు
గ్యానేష్ కుమార్ లేదా ముగ్గురు ఎన్నికల కమిషనర్లతో కూడిన ఎన్నికల కమిషన్, ప్రతిపక్షాల వాదనకు ముఖ్యంగా కాంగ్రెస్ లోక్ సభ నాయకుడు రాహుల్ గాంధీ వాదనకు బలం చేకూర్చే చర్య ఒకదానిని స్పెషల్ సమ్మరీ రివిజన్ ప్రక్రియలో ప్రకటించాడు. “వోటర్ల కు సంబంధించిన డ్రాఫ్ట్ జాబితా మరియు ఎస్ఎస్ఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తయారయ్యే వోటర్ల ఫైనల్ జాబితాలను ‘రీడబుల్ పిడిఎఫ్ ఫార్మాట్ లో ఒక డిజిటల్ కాపీ మరియు ఒక హార్డ్ కాపీ ప్రతి ఒక్క గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీకి సరఫరా చేయండి” అని ఎన్నికల అధికారులకు ఆదేశాలు (డైరెక్టివ్) జారీ చేశాడు.
మెషీన్ రీడబుల్ ఫార్మాట్ లో అనగా పిడిఎఫ్ గా కన్వర్ట్ చేసిన టెక్స్ట్ ఫార్మాట్ జాబితాల కాపీలను రాజకీయ పార్టీలకు సప్లై చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ వచ్చింది. మెషీన్-రీడబుల్-ఫార్మాట్ కోసం కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. చిత్రం ఏమిటంటే రీడబుల్ ఫార్మాట్ లో ఇవ్వాలన్న రూల్ ఎన్నికల చట్టంలో ఎక్కడా లేదని, దేశ వోటర్ల జాబితాను ఆ రూపంలో ఇస్తే వోటర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందని, స్వార్ధపర శక్తులకు డేటా మైనింగ్ చేసే అవకాశం ఇస్తున్నట్టే అని చెబుతూ కాంగ్రెస్ పార్టీ వాదనను జస్టిస్ ఏ కె సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్ లు అక్టోబర్ 2018 లో తిరస్కరించారు. కాంగ్రెస్ నేతలు కమల్ నాధ్, సచిన్ పైలట్ లు దాఖలు చేసిన పిటిషన్ లో సుప్రీం కోర్టు ఈ తీర్పు ప్రకటించింది.
రీడబుల్ పిడిఎఫ్ ఫార్మాట్ లో వోటర్ల జాబితాను చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సిఈఓ) వెబ్ సైట్ లో ఉంచాలన్న క్లాజు ఎలక్షన్ మాన్యువల్ 2016 లో చాప్టర్ XI కింద క్లాజ్ 11.2.2.2 లో ఉన్నా కూడా సుప్రీం కోర్టు తీర్పు అందుకు విరుద్ధంగా రావటం గమనార్హం. క్లాజ్ 11.2.2.2 ఇలా చెప్తోంది: “అదనంగా డ్రాఫ్ట్ వోటర్ల జాబితాను పబ్లిక్ డొమెయిన్ లో, చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెబ్ సైట్ లో, అదే రోజున పిడిఎఫ్ ఫార్మాట్ లో ఉంచాలి. టెక్స్ట్ మోడ్ లో డ్రాఫ్ట్ జాబితాను ఉంచాలి; కానీ వోటర్ల ఫోటోలను పబ్లిక్ డొమెయిన్ లో ఉంచరాదు. దానికి బదులు ఫోటోల స్థానంలో వోటర్ ఫోటో జాబితాలో అందుబాటులో ఉన్నదా లేదా అన్న సమాచారం మాత్రమే ఇవ్వాలి” అని. ఈ క్లాజ్ ని సుప్రీం కోర్టు ధర్మాసనం పట్టించుకోకపోవటం ఏమిటో అర్ధం కాని విషయం.
కానీ రీడబుల్ పిడిఎఫ్ ఫార్మాట్ లో ఉంచాలన్న నిబంధనను ఎన్నికల కమిషన్ అనుసరించింది. అందులో కూడా ఒక మోసం చేసింది. రీడబుల్ టెక్స్ట్ ఫార్మాట్ లో ఉంచమని ఎలక్షన్ మాన్యువల్ చెబుతుండగా, దాని బదులు టెక్స్ట్ రూపంలో ఉన్న జాబితా డాక్యుమెంట్ ను ఫోటో రూపంలోకి మార్చి ఆ ఫోటోలను పిడిఎఫ్ ఫార్మాట్ లో ఉంచింది ఎలక్షన్ కమిషన్. జాబితా ఫోటోలను పిడిఎఫ్ ఫార్మాట్ లోకి మార్చటం వలన వాటిలో పేర్లను Ctrl+F కమాండ్ ద్వారా వెతకటం సాధ్యపడదు. చూసేందుకు టెక్స్ట్ ఫార్మాట్ లో ఉన్నా కూడా అది ఫోటో కనుక అందులో అక్షరాలను మెషీన్ గుర్తించలేదు. అంటే అది మెషీన్ రీడబుల్ పిడిఎఫ్ ఫార్మాట్ కాదు. టెక్స్ట్ డాక్యుమెంట్ ని పిడిఎఫ్ లోకి మార్చినట్లయితేనే అది మెషీన్ రీడబుల్ అవుతుంది. ఈ తేడాని తన ఆలోచనకు అనుకూలంగా ఉపయోగించుకుని రాజకీయ పార్టీలకు కంప్యూటర్లలో పేర్లను వెతుక్కునే అవకాశం లేకుండా చేసింది. దానితో తప్పులు, మోసాలు గుర్తించటం సాధ్యం కాలేదు.
మెషీన్ రీడబుల్ ఫార్మాట్ లో జాబితాలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు అడిగింది? ఎందుకంటే అప్పటికే వోటర్ల జాబితాలో నుండి ముస్లిం వోట్లను, బిజేపి వ్యతిరేక వోట్లను ఫారం 7 ద్వారా తొలగిస్తున్నారన్న ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. తన ఆరోపణలను రుజువు చేసే అవకాశం అటు ఎన్నికల కమిషన్, ఇటు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. అసలు ఒక ప్రజాస్వామిక ప్రక్రియలో తప్పులు, పొరపాట్లను, మ్యానిపులేషన్లను (అవి జరిగినట్లయితే) వాటిని నిరూపించే అవకాశాన్ని రాజకీయ పార్టీలు అడిగితే ఎన్నికల కమిషన్, సుప్రీం కోర్టు ఇవ్వకపోవటమే కాకుండా, వారి ప్రయత్నాలకు అడ్డు పడటం ఏ ప్రజాస్వామ్య ప్రక్రియ కిందకు వస్తుంది? ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక రాజకీయ పార్టీ, దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన ఒక రాజకీయ పార్టీ, ఎన్నికల ప్రక్రియ, వోటర్ల జాబితా ప్రక్రియ ల్లో మతలబులు జరుగుతున్నాయని ఆరోపించి, ఆరోపణను రుజువు చేసే అవకాశాన్ని ఇవ్వమని కోరితే, ఆ కోరికను తిరస్కరించటం ఏ ప్రజాస్వామిక సూత్రం పరిధిలోకి వస్తుంది? పోనీ ఆ కోరిక నెరవేర్చేందుకు చట్టంలో అవకాశం లేదనే అనుకుందాం. ఒక కొత్త అవకాశాన్ని కల్పించవచ్చు కదా! దానివల్ల ఉపయోగమే తప్ప నష్టం లేదు కదా? ఏ న్యాయసూత్రం ఇందుకు అడ్డు పడుతుంది?
ఇది మా విజయం -కాంగ్రెస్
అక్టోబర్ 15 తేదీన ఎస్ఎస్ఆర్ ప్రక్రియ ప్రారంభానికి నోటిఫికేషన్ జారీ చేస్తూ ఎలక్షన్ కమిషన్ గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలన్నింటికీ మెషీన్ రీడబుల్ పిడిఎఫ్ ఫార్మాట్ లో డ్రాఫ్ట్ జాబితాలను, ఫైనల్ జాబితాలను రెండింటినీ ఇవ్వాలని ఇచ్చిన ఆదేశం, కాంగ్రెస్ సాధించిన విజయం అని కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ప్రకటించాడు. అంత పార్టీ ఇంత చిన్న విజయానికి సంతృప్తి పడటం అసంగతం. అది తమను తాము తగ్గించుకోవటమే తప్ప మరొకటి కాదు.
ఎందుకంటే ఎస్ఎస్ఆర్ నిర్వహించవలసిన రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ కూడా ఉన్నది. వెస్ట్ బెంగాల్ లో ఇప్పటికే ఎస్ఐఆర్ పూర్తయింది. అంటే ఎస్ఐఆర్ ద్వారా పూర్తి చేసిన జాబితాను మాత్రమే డ్రాఫ్ట్ జాబితాగా ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఇవ్వనున్నారు. ఎస్ఎస్ఆర్ ప్రక్రియ ప్రకారం ఈ జాబితాలో 18 సంవత్సరాలు నిండిన కొత్త వోటర్లను ఆటోమేటిక్ గా ఎలాంటి డాక్యుమెంట్ లు లేకుండా జాబితాలో కలుపుతారు. మరో చోటు నుండి అక్కడికి షిఫ్ట్ అయిన వారిని కూడా కలుపుతారు. అలాగే చనిపోయిన వోటర్లను తొలగిస్తారు. షిఫ్ట్ అయిన వోటర్లను లేదా మరో చోటికి వెళ్ళిన వోటర్లను తొలగిస్తారు. ఇదే ఎస్ఎస్ఆర్ ప్రక్రియ. ముందే చెప్పుకున్నట్టు ఎన్నికల చట్టం ప్రకారం ఇది ప్రతి సంవత్సరం, వార్షిక ప్రాతిపదికన జనవరి నాటికి పూర్తి చేయాలి.
ఇక్కడ అర్ధం కానీ విషయం ఏమిటంటే ఎస్ఐఆర్ అనంతరం తయారు చేసిన జాబితా ఇప్పుడు డ్రాఫ్ట్ జాబితా గా, ఎస్ఎస్ఆర్ పూర్తయ్యాక ఫైనల్ జాబితాను రాజకీయ పార్టీలకు ఇస్తే అది ప్రతిపక్షాలకు తమ ఎస్ఐఆర్ ఆరోపణలను రుజువు చేసేందుకు ఎలా ఉపయోగపడుతుంది? ఇదే అర్ధం కానీ విషయం. రీడబుల్ పిడిఎఫ్ ఫార్మాట్ ఇచ్చేందుకు కమిషన్ చేసిన నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నదో అర్ధం కాని విషయం. ఎందుకంటే “ఎస్ఐఆర్ ముందరి జాబితాలలో దేశం మొత్తం మీద 13 కోట్ల మంది వోటర్లను కమిషన్ తొలగించింది, ఇది అన్యాయం, చట్ట విరుద్ధం, బిజేపి కోసమే ఇది కమిషన్ చేసింది” అని కాంగ్రెస్, ప్రతిపక్షాలు, ప్రజాస్వామిక వాదులు, ఎన్జిఓలు చేసిన ఆరోపణలను అవి ఎలా నిరూపిస్తాయి? ఎస్ఐఆర్ ముందు ఉన్న జాబితాలను మెషీన్ రీడబుల్ పిడిఎఫ్ ఫార్మాట్ లో లేదా Text ఫార్మాట్ లో ఇస్తేనే వారు తమ ఆరోపణలను రుజువు చేయగలరు!
ఈ సంగతి కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల దృష్టిలో ఉన్నదా? వారి సంతోషం వాస్తవంగా అల్ప సంతోషమేనా? గ్యానేష్ కుమార్ తప్పులను రుజువు చేసేందుకు ఇప్పటికీ అవకాశం లేదన్నదే ఈ బ్లాగర్ అనుమానం!


