
–
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గం ఫిలిబిత్ లో వోటర్ల జాబితాలో జరిగిన అక్రమాలు కేవలం పొరపాటు గానీ నిర్లక్ష్యం గానీ కాదని, ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరిగిన నేరం అనీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ -సిఈఓ) నవ డీప్ రిన్వా స్పష్టం చేశాడు. ఈ నేరంలో ఇద్దరు ఈఆర్‌ఓ (ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్) లు, ఒక కంప్యూటర్ అసిస్టెంట్ లు పాల్గొన్నారని ఆయన చెప్పాడు. వారి ముగ్గురిపైన కొత్వాలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని తెలిపాడు.
అమారియా ఎస్‌డిఎం (సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్) మరియు ఈఆర్‌ఓ అయిన మయాంక్ గోస్వామి, మరొక ఎస్‌డిఎం మరియు ఈఆర్‌ఓ అయిన హేమంత్ కుమార్, కంప్యూటర్ అసిస్టెంట్ లేదా విఆర్‌సి ఆపరేటర్ (వోటర్ రిజిస్ట్రేషన్ సెంటర్ ఆపరేటర్) అయిన అనీల్ కుమార్… ఈ ముగ్గురూ కలిసి 10,470 వోటర్ల పేర్లను మార్చి సంబంధం లేని పేర్లను వారి స్థానంలో చొప్పించిన నేరంలో పాత్రధారులని సిఈఓ వెల్లడించాడు. వోటర్ రికార్డ్ లో సవరణల కోసం ఉపయోగించే ఫారం 8 దరఖాస్తులు వచ్చాయన్న నెపంతో ఈ మార్పులు చేశారని, కానీ సదరు దరఖాస్తులు గానీ, సంబంధిత పత్రాలు గానీ ఎన్నికల కార్యాలయంలో అందుబాటులో లేవని చెప్పాడు.
ముగ్గురు నిందితుల పైన ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 32, భారతీయ న్యాయ సన్హిత సెక్షన్ 201 ప్రకారం కేసు పెట్టి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని తెలుస్తోంది. ఉత్తర ప్రదేశ్ లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగిసిన ఏప్రిల్ 10 తేదీ తర్వాత మే 31 నుండి ఆగస్టు 29, 2026 వరకు ఈ నేరానికి నిందితులు పాల్పడ్డారు (టైమ్స్ ఆఫ్ ఇండియా, 24/10/2026). జిల్లా అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ కృష్ణ కుమార్ కశ్యప్, ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాడు. ఎఫ్‌ఐఆర్ ప్రకారం మే 31 నుండి ఆగస్టు 29 వరకు 13,779 ఫారం 8 దరఖాస్తులు అందినట్టు నిందితులు చెప్పగా, అందులో 10,470 దరఖాస్తులను ఆమోదించి, 3,309 దరఖాస్తులను తిరస్కరించినట్టు చెప్పారు.
అందిన ఫారం 8 దరఖాస్తులలో 4,717 న్టిని జులై 16 వరకు కంప్యూటర్ లో ఎంటర్ చేశారు. మరో 9,062 దరఖాస్తులను జులై 17 నుండి ఆగస్టు 29 వరకు ఎంటర్ చేశారు. ముందు చెప్పినట్టు 13,779 దరఖాస్తులకు మద్దతుగా ఇచ్చిన పత్రాలు అధికారిక రికార్డులలో అందుబాటులో లేవు. మరీ ముఖ్యంగా ఆమోదం పొందిన 10,470 ఫారం 8 లలో ఏవీ సక్రమంగా లేవు. అన్నీ అక్రమ ఎంట్రీలే.
“హ్యాకింగ్ లాంటివి ఏమీ జరగలేదు, కంప్యూటర్ సిస్టమ్ గ్లిచ్ లాంటి లోపాలు గానీ సాంకేతికంగా మిషన్లు పని చేయకపోవటం గానీ అస్సలు జరగలేదు. వోటర్ల జాబితాలను నిర్వహించవలసిన బాధ్యత అప్పగించబడ్డవారు తమ బాధ్యత నిర్వహణలో ఘోరంగా విఫలమయ్యారు. వోటర్ల నుండి ఫారం 8 దరఖాస్తులు అందకుండానే కంప్యూటర్ అసిస్టెంట్ వాటిని కంప్యూటర్ లో ఎంటర్ చేశాడు. అవేవీ లేకుండానే ఈఆర్‌ఓ (నియోజకవర్గం మొత్తానికి ఎన్నికల అధికారి) లు వాటిని ఆమోదించారు” అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రిన్వా స్పష్టీకరించాడు.
దరఖాస్తులను అధికారికంగా ధృవీకరించే ప్రక్రియ గురించి ఉత్తర ప్రదేశ్ CEO వివరించాడు. “కంప్యూటర్ ఆపరేటర్, ఫారం 8 దరఖాస్తు అందినపుడు ఆయన తన క్రెడెన్షియల్స్ (యూజర్ నేమ్, పాస్ వర్డ్) ను ఉపయోగించి ఆ వివరాలను కంప్యూటర్ లో ఎంటర్ చేస్తాడు. అతని రిజిస్టర్డ్ ఫోన్ కు ఓటిపి వస్తుంది. దాని ద్వారా దరఖాస్తు ఎంట్రీని అతను ధృవీకరిస్తాడు. లేకపోతే ఎవరికైనా ఓటిపి ఇచ్చి అయినా ఎంటర్ చేయాలి. ఎలా చేసినా ఆయనే ఎంట్రీని ఆధరైజ్ చేసినట్టే లెక్క. అనంతరం ఈఆర్‌ఓ సదరు ఎంట్రీని పరిశీలించి ఆమోదించడమో తిరస్కరించడమో చేస్తాడు. ఆయన కూడా తన లాగిన్, పాస్ వర్డ్ క్రెడెన్షియల్స్ ఉపయోగించాలి, ఓటిపి ని ఎంటర్ చేసి అథెంటికెట్ చేయాలి” అని రిన్వా వివరించాడు.
“మీ పాస్ వర్డ్ ని ఎవరో దొంగిలించారని మీరు చెప్పటానికి వీలు లేదు. మీ రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ కే ఓటిపి వస్తుంది. మీరైనా ఎంట్రీని ధృవీకరించి ఉండాలి లేదా మీరు నమ్మిన మరొక వ్యక్తికైనా ఓటిపి ఇచ్చి ఉండాలి. 10,000 కు పైగా ఉన్న అటువంటి ఫారం లను ఎలాంటి స్క్రూటినీ లేకుండా ఎలా ఆమోదిస్తారు? ఈఆర్‌ఓ లు ఏం చేస్తున్నారు?” అని రాష్ట్ర సిఈఓ రిన్వా ప్రశ్నించాడు. రిన్వా ఇచ్చిన సమాచారం ప్రకారం మే 31 నుండి జులై 16 వరకు ఎంట్రీలను గోస్వామి ఆమోదించగా, జులై 17 నుండి ఆగస్టు 29 వరకు చేసిన ఎంట్రీలను హేమంత్ కుమార్ అప్రూవ్ చేశాడు.
ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 32 ప్రకారం నేరానికి పాల్పడిన ఎన్నికల అధికారులకు (ఈ కేసులో ఏ కారణం లేకుండా నిర్దిష్ట చర్యలకు ఉల్లంఘనలకు పాల్పడినందుకు) రెండేళ్ల వరకు జైలు శిక్ష గానీ, జరిమానా గానీ లేదా రెండూ గానీ విధిస్తారు. “మేము చట్ట పరంగా సాధ్యమైనంత కఠినమైన ప్రక్రియను ప్రారంభించాము. కంప్యూటర్ ఆపరేటర్ ను పూర్తిగా ఉద్యోగం నుండి తొలగిస్తున్నాము. ఇద్దరు ఎస్‌డిఎం లకు వ్యతిరేకంగా డిపార్ట్ మెంట్ పరంగా క్రమశిక్షణా చర్యలను ప్రారంభిస్తున్నాం. ఈ చర్యలు కోర్టులో జరిగే నేర విచారణ ప్రక్రియకు అదనంగా జరుగుతాయి” అని రాష్ట్ర సిఈఓ వివరించాడు.
అయితే విచారణను కేవలం ఈ 10,470 ఎంట్రీల వరకు మాత్రమే చేయటం లేదని సిఈఓ చెప్పాడు. “నేర విచారణ పరిధిని ఒక్క ఫారం 8 తోనే సరిపెట్టకుండా మరింత విస్తృతం చేస్తున్నాం. ఈ కంప్యూటర్ ఆపరేటర్ వోటర్లను చేర్చటానికి ఫారం 6 లను, వోటర్ల జాబితా నుండి పేర్లు తొలగించటానికి ఫారం 7 లను కూడా ఎంటర్ చేశాడు. వాటిని కూడా విచారిస్తున్నాము. ఫిలిబిత్ జిల్లాలోని మిగిలిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహాలో స్క్రూటినీ జరిపిస్తున్నాము” అని ఆయన తెలిపాడు.
అలాగే విచారణను రాష్ట్ర వ్యాపితంగా కూడా విస్తరించామని రిన్వా చెప్పాడు. ఇదే తరహా మోసపూరిత ఎంట్రీలు అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన దాఖలాలు ఉన్నాయేమో పరిశీలించాలని వివిధ జిల్లాల మేజిస్ట్రేట్ లకు ఆదేశాలు వెళ్ళాయని రిన్వా తెలిపాడు. స్క్రూటినీ అనంతరం నివేదికలు పంపాలని కూడా ఆయన ఆదేశించాడు.
ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మోసాలన్నీ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో జరిగినవి కావు. ఫిలిబిత్ అక్రమాల గురించి ఆందోళన చెందినట్టు కనిపిస్తున్న యూపి సిఈఓ నిజానికి ఇలాంటి అక్రమాలను ఎత్తిచూపినా కూడా పట్టించుకోలేదు. ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా 2.4 కోట్ల వోటర్లను అప్పటికే తొలగించి పారేశారు.
రిపోర్టర్స్ కలెక్టివ్ అనే స్వచ్ఛంద పరిశోధనా సంస్థ అక్టోబర్ 9 తేదీన ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొత్తగా రూపొందించిన సాఫ్ట్ వేర్, స్వయంగా ఎలాంటి కారణం లేకుండా 87,127 వోటర్ల తొలగింపు కోసం ఫారం 8 దరఖాస్తులను సృష్టించింది (జనరేట్ చేసింది). ఈ తొలగింపులకు కారణాలు ఏమిటో సాఫ్ట్ వేర్ ఇవ్వలేదు, ఈసిఐ కూడా చెప్పలేదు. పైగా ఈ తొలగింపు పత్రాలపై సంతకాలు చేయాల్సిందేనని స్థానిక ఎన్నికల అధికారులను (ఈఆర్‌ఓ లను) ఈసిఐ (అనగా సిఈసి) ఒత్తిడి చేసింది.
కారణాలు లేకుండా తొలగించిన 87,127 వోట్ల గురించి వివరాలు అడిగితే ఉత్తర ప్రదేశ్ సిఈఓ నేరుగా సమాధానం చెప్పకుండా ఒక వీడియోలో ప్రత్యక్షమై రిపోర్టర్స్ కలెక్టివ్ నివేదిక తప్పుదోవ పట్టించేదిగా ఉందని ఆరోపించాడు. ఆరోపణలు చేస్తూనే 85,854 వోటర్లను ఏ కారణం చూపకుండా తొలగించిన మాట నిజమేనని అంగీకరించటం విశేషం. ఇలా ఆటోమేటిక్ గా సాఫ్ట్ వేర్ ద్వారా జనరేట్ చేసిన ఫారం 8 లకు కారణాలు ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే ఆయన సమాధానం ఇవ్వలేదు. ఎన్నికల చట్టం ప్రకారం కారణం లేకుండా వోటర్లను తొలగించకూడదు. ఎస్‌ఐఆర్ కోసం సవరించిన చట్టం ప్రకారం కూడా కారణం చూపకుండా తొలగించటం చట్టవిరుద్ధం.
ఇంకొన్ని అక్రమాలు, యూపి సిఈఓ వాటికి ఇచ్చిన సమర్ధనలు, ఎగవేత సమాధానాలు కూడా చూద్దాం. కింది మూడు అక్రమాలను రిపోర్టర్స్ కలెక్టివ్ సంస్థ వెలుగులోకి తెచ్చింది.
(1) ఉత్తర ప్రదేశ్ ఎన్నికల జాబితాలో 16.18 లక్షల వోటర్లను ఊరు పేరు చెప్పకుండా చేర్చారు. ఈ 16.18 లక్షల వోటర్ల పేర్లను తాము వెల్లడి చేయని మాట నిజమేనని యూపి సిఈఓ రిన్వా అంగీకరించాడు. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారమే వారి పేర్లు బహిరంగం చేయలేదని తన చర్య సమర్ధించుకున్నాడు. కానీ ఈసిఐ సూచనలను (instructions) చూస్తే వాటి ప్రకారం జాబితాలో చేర్చిన ప్రతి వోటర్ పేరును ప్రజా పరిశీలన కోసం ఖచ్చితంగా బహిరంగం చేయాలి.
(2) పైన చెప్పిన ప్రకారం ఈసిఐ సాఫ్ట్ వేర్ 87,127 ఫారం 8 (తొలగింపు పత్రాలను) లను ఆటోమేటిక్ గా జనరేట్ చేసింది. అందులో తొలగింపుకు కారణాలు ఇవ్వలేదు. యూపి సిఈఓ, 85,854 ఫారం 8 అప్లికేషన్లను సాఫ్ట్ వేర్ ఆటో-జనరేట్ చేసిందని, కారణాలు ఇవ్వలేదని ఒప్పుకున్నాడు. కానీ వోట్లు/వోటర్ల పేర్లు తొలగించినందుకు కారణాలు ఇవ్వవలసిన అవసరం లేదని బొంకాడు. వాస్తవం ఏమిటంటే ఎన్నికల అధికారులు తొలగింపు పత్రాలపై సంతకం చేసేటప్పుడు తొలగింపుకు కారణం ఇవ్వటం చట్టం ప్రకారం తప్పనిసరి!
(3) ఉత్తర ప్రదేశ్ ఎన్నికల జాబితా నుండి ముస్లింల పేర్లను గుండుగుత్తగా (బల్క్ గా) తొలగించటానికి కనీసం 200 సార్లు ప్రయత్నాలు జరిగాయి. రాష్ట్ర సిఈఓ కూడా ఈ అంశాన్ని అంగీకరించాడు. 200 సార్లు ప్రయత్నాలు జరిగాయంటే అర్ధం 200 వోట్లు మాత్రమే అని అర్ధం కాదు. ఒక్కొక్క సారి యాభై వోట్లో, వంద వోట్లో తొలగించే ప్రయత్నం జరిగిందని అర్ధం. ఒక్కోసారి ఎన్ని వోట్లు తొలగించేందుకు ప్రయత్నం జరిగిందో తెలిస్తే, మొత్తం ఎందరు ముస్లిం వోట్లు తొలగించే ప్రయత్నం జరిగిందో తెలుస్తుంది. ఆ వివరాలు ఈసిఐ కంప్యూటర్లలో ఉంటాయి. అడిగితే ఇవ్వరు. కానీ సిఈఓ మాత్రం ఇవి కొద్ది సంఖ్యలో జరిగినవే అని కొట్టి పారేస్తూ సమాధానం ఇవ్వకుండా దాటవేశాడు. ఈ ఎన్నికల అధికారులే ఒకప్పుడు “ప్రతి వోటు విలువైనది. ప్రతి వొక్కరు వోటు వేయండి. వోటర్ గా నమోదు కండి” అని ప్రచారం చేసేవారు. జమానా మారాక వాళ్లే “ఎలాగైనా ముస్లిం వోట్లు తొలగించండి, అది చట్ట విరుద్ధంగానైనా సరే!”
(4) రిపోర్టర్స్ కలెక్టివ్ వెల్లడి చేసిన అక్రమాల నివేదిక ప్రకారం, ఎన్నికల అధికారులే వోట్ల తొలగింపును కోరారని సాఫ్ట్ వేర్ చూపించింది. తొలగించమని కోరిన అధికారులు అందుకు కారణాలు ఇవ్వలేదని కూడా సాఫ్ట్ వేర్ రికార్డ్ చేసింది. అలాగే 1,10,476 వోటర్ల పేర్లు తొలగించాలని వ్యక్తిగత దరఖాస్తులు అందగా ఆ వోటర్లు అందరినీ తొలగించి పారేశారు. అది కూడా ఈసిఐ ఆదేశించిన తుది గడువు తర్వాత ఈ తొలగింపులు జరిగాయి.
ఈ అక్రమాలపై యూపి సిఈఓ నోరు మెదపలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఉత్తర ప్రదేశ్ సిఈఓ కు మద్దతుగా ముందుకు రాలేదు. అందుకు బదులుగా ఏ ఒక్క వ్యక్తి 30 కి మించి వోటర్ తొలగింపు దరఖాస్తులు ఇవ్వరాదని ఒక ఆదేశం ఇచ్చి ఊరుకుంది. ఎస్‌ఐఆర్ కోసం ఎలక్షన్ కమిషన్ అనేక ఆదేశాలు ఇచ్చినా కూడా అందులో అనేక ఆదేశాలను ఎన్నికల అధికారులు అడ్డంగా ఉల్లంఘిస్తూ ఎస్‌ఐఆర్ పూర్తి చేశారు. వారి ప్రధాన లక్ష్యం టార్గెట్ చేసుకున్న వోటర్లను జాబితా నుండి తొలగించటమే అన్నట్టుగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తి చేశారు.
భారత ఎన్నికల వ్యవస్థను ఇంత ఘోరంగా మార్చి వేశాక కూడా భారత ప్రజాస్వామ్యాన్ని ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ గా అంతర్జాతీయ వేదికలపై ప్రశంసించటం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మానలేదు. అసలు ఇంత దరిద్రంగా మార్చాము గనకనే అది మదర్ ఆఫ్ డెమోక్రసీ అయిందని ఆయన ఉద్దేశం అయి ఉండొచ్చు.


