
–
బిజేపి తన కంచుకోటగా చెప్పుకునే ఉత్తర ప్రదేశ్ ఎన్నికల జాబితాలో జరిగిన అక్రమాలలో మరో వినూత్న కోణం బైట పడింది. ఎన్నికల జాబితాలను తమకు అనుకూలంగా మార్చుకోవటానికి బిజేపి ఈ సారి ఎస్ఐఆర్ మాత్రమే కాకుండా ఎస్ఐఆర్ అనంతర జాబితాలో కూడా అక్రమంగా మార్పులు చేర్పులు చేయటం ద్వారా వినూత్న రీతిలో మోసాలకు పాల్పడిన సంగతి వెల్లడి అయింది. సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల పిటిషన్లతో ఫిలిబిత్ జిల్లా ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ స్థానిక ఈఆర్ఓ మరియు అసిస్టెంట్ ఈఆర్ఓ లపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారి (సిఈఓ) ఈ అక్రమాలపై విచారణ జరపవలసిందిగా ముగ్గురు అసిస్టెంట్ జిల్లా ఎన్నికల అధికారులను పురమాయించాడు (ఇండియన్ ఎక్స్ ప్రెస్, 23-10-2026). వారు ఇప్పటికే విచారణా నివేదిక సమర్పించారని తెలుస్తోంది. నివేదిక ప్రకారం ఒక కంప్యూటర్ అసిస్టెంటు, వోటర్ల జాబితాలో సవరణల కోసం దాదాపు 13,779 ఫారం 8 అప్లికేషన్ లను మే 31, ఆగస్టు 29, 2026 తేదీల మధ్య వోటర్ జాబితాలో ఎంటర్ చేశాడని తేలింది. కానీ సదరు ఎంట్రీలకు మద్దతుగా ఏ రకమైన రికార్డులు ఆఫీసులో అందుబాటులో లేవని విచారణా అధికారులు కనుగొన్నారు. ఈ సంగతి రాష్ట్ర ఎన్నికల అధికారి స్వయంగా పత్రికలకు ప్రకటన రూపంలో తెలియజేశాడు.
ఈ కంప్యూటర్ అసిస్టెంట్ ఎంటర్ చేసిన 13,779 ఎంట్రీలలో 10,470 ఎంట్రీలు లేదా సవరణలు లేదా ఫారం 8 అప్లికేషన్ లు ఆమోదించబడ్డాయి. ఎవరు ఈ ఎంట్రీలను ఆమోదించిందీ అధికారులు గానీ పత్రికలు గాని వెల్లడి చేయలేదు.
ఆరంభం
ఉత్తర ప్రదేశ్ ఎస్ఐఆర్ అనంతరం ఏప్రిల్ 10, 2026 తేదీన ప్రచురించిన అంతిమ వోటర్ల జాబితాలో EPIC నంబర్లకు ఎదురుగా అసలు పేర్లకు బదులు ఏవేవో ఇతర పేర్లు ఉన్నాయంటూ రాష్ట్ర సిఈఓ కు ఫిర్యాదులు అందాయి. ఈ వోటర్లు అందరూ ఎస్ఐఆర్ పరీక్షలో పాసై అసలు వోటర్లుగా సర్టిఫికేట్ పొంది అంతిమ వోటర్ల జాబితాలో చోటు చేసుకున్న వారే కావటంతో రాష్ట్ర సిఈఓ కు అనివార్యంగా విచారణకు ఆదేశించవలసి వచ్చింది.
అంతే కాకుండా కొత్త వోటర్లను జాబితాలో చేర్చేందుకు అందిన ఫారం 6 తాలూకు ఎంట్రీలను మరియు వోటర్ల తొలగింపు కోసం అందిన ఫారం 7 తాలూకు ఎంట్రీలను స్క్రూటినీ చేయవలసిందిగా ఫిలిబిత్ జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ ను ఆదేశించాడు. ప్రత్యేకంగా పైన చెప్పిన 13,779 అక్రమ ఎంట్రీలలో మార్పులు చేసిన కంప్యూటర్ అసిస్టెంట్ డీల్ చేసిన ఫారం 6, ఫారం 7 ఎంట్రీలను మాత్రమే స్క్రూటినీ చేయాలని ఆదేశించాడు. ముఖ్యంగా ఏప్రిల్ 10 మరియు అక్టోబర్ 21 తేదీల మధ్య జరిగిన ఎంట్రీలను ఈ స్క్రూటినీ పరిధిలోకి తెచ్చారు.
ఫిలిబిత్ జిల్లా ఎన్నికల అధికారి నవ్ డీప్ రిన్వా ప్రకారం సమాజ్ వాదీ పార్టీ నుండి ఎన్నికల జాబితాలో జరిగిన అక్రమాలను గురించి, ఇతర అంశాలతో పాటు, అక్టోబర్ 19 తేదీన ఒక ఫిర్యాదు లేదా మెమోరాండం అందింది. “వారి మెమోరాండంలోని మూడు, నాలుగు పేజీల్లో ఫిలిబిత్ వోటర్ల జాబితా అక్రమాలకు సంబంధించిన అంశం చోటు చేసుకుంది. దసరా సెలవులకు ఫిలిబిత్ సిఈఓ ఆఫీస్ అక్టోబర్ 20 వరకు మూసివేసినందున ఆ తర్వాత ఈ అంశంపై విచారణ చేపట్టారు. ఫిలిబిత్ జిల్లా మేజిస్ట్రేట్ నుండి నివేదికను కూడా ఆయన కోరారు.
వోటర్ అప్రమత్తత!
అలాగే అక్టోబర్ 14 తేదీన అడ్వకేట్ ఫైజన్ ఆలీ ఖాన్ నుండి ఒక ఫిర్యాదు అందింది. అతని మరియు అతని తమ్ముడు ఫరాన్ పేర్లు ఎస్ఐఆర్ అనంతర ఫైనల్ జాబితాలో ఉన్నప్పటికీ ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో తమ ఇద్దరి పేర్లు కనిపించటం లేదని ఆ ఫిర్యాదు పేర్కొంది. ఫిలిబిత్ లోని ఆవాస్ వికాస్ కాలనీ నివాసి అయిన ఖాన్, ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో మాట్లాడుతూ తమ ఇద్దరికీ ఎస్ఐఆర్ ప్రక్రియలో నోటీసులు అందాయని, తామిద్దరం ఎన్నికల కమిషన్ అధికారులను స్వయంగా కలిసి కావలసిన పత్రాలను సమర్పించామని, వారా పత్రాలను ధృవీకరించారని చెప్పాడు.
తమ EPIC (ఎలక్టార్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్) నెంబర్ లను చెక్ చేయగా తన పేరుకు బదులు ‘రాయీస్ ఆలీ’ అనే పేరు కనిపించిందని ఫైజన్ అలీ ఖాన్ తన ఫిర్యాదులో తెలిపాడు. ‘రాయీస్ అలీ సన్/రెలిటివ్ ఆఫ్ హుజాయిబ్ ఆలీ’ అని తప్పుగా ఉన్నట్టు తెలిపాడు. తన తండ్రి అసలు పేరు ముష్ఫిక్ ఆలీ కాగా అది కూడా తప్పుగా కనిపిస్తోందని ఫిర్యాదు చేశాడు. ఫరాన్ పేరుకు బదులు గుఫ్రాన్ అస్లామ్ సన్ ఆఫ్ హమీద్ అస్లామ్ అని ఉన్నట్టు తెలిపాడు. నిజానికి ఆ పేర్లతో ఆ కాలనీలో ఎవరూ నివసించటం లేదు. ఉద్దేశ్యపూర్వకంగా బూటకపు పేర్లు చొప్పించి తమకు వోటు హక్కు లేకుండా చేశారని తెలిపాడు.
ఎన్నికల అధికారులు మొదట తమ ఫిర్యాదును కొట్టి పారేశారని చెప్పటం విశేషం. అది టెక్నికల్ ఎర్రర్ అయి ఉంటుందని కొట్టిపారేసేందుకు ప్రయత్నించారు. అయితే వారి అసలు వివరాలను పునరుద్ధరిస్తామని, తప్పిదం ఎలా జరిగిందో విచారణ చేస్తామని మాకు వర్తమానం పంపారు. ముఖ్యంగా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ను తనిఖీ చేసిన తర్వాత కూడా ఎన్నికల జాబితాలో మార్పులు ఎలా చోటు చేసుకున్నాయో తనిఖీ చేస్తామని రాశారని చెప్పాడాయన. ఫిలిబిత్ జిల్లా లోని ఇతర మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు బర్ఖెరా, పురాన్ పూర్, బిస్లాపూర్ లలో కూడా విచారణ జరపాలని ఫైజన్ అలీ ఖాన్ కోరాడు.
అనుకోకుండా… బై ఛాన్స్…
మరో ఫిలిబిత్ వోటర్ రేహాన్ ఆలీ కూడా తన పేరు, తన సోదరుడు, సోదరి ల పేర్లు కూడా మారిపోయిన సంగతిని గమనించాడు. వారి EPIC నంబర్లకు ఎదురుగా వారి పేర్లకు బదులు సంబంధం లేని పేర్లు ఉన్నట్టు గమనించారు. అడ్వకేట్ కూడా అయిన రెహాన్ ఆలీ కుటుంబం పేర్లు మార్పు గురించి తెలుసుకున్న కాంగ్రెస్ నేత కుముద్ గంగ్వార్ ఈ విషయాన్ని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఎలక్షన్ కమిషన్ వెబ్ సైట్ లో ఒక నిర్దిష్ట తేదీన వోటర్ల జాబితా రివిజన్ జరిగిందని, రివిజన్ లో పేరు మార్పు జరిగిందని వెబ్ సైట్ సూచించినప్పటికీ వాస్తవంగా సదరు తేదీలలో అసలు ఏకక్టోరల్ జాబితాల్లో రివిజన్ అన్నదే జరగలేదని వెల్లడి అయింది.
అక్రమాల గురించి తనకు అనుకోకుండా, బై ఛాన్స్ తెలిసిందని అడ్వకేట్ రెహాన్ ఆలీ చెప్పటం గమనార్హం. ఒక వోటర్ మరియు కంప్యూటర్ ఆపరేటర్ ల మధ్య జరుగుతున్న సంభాషణలను అనుకోకుండా ఆయన విన్నాడు. వారి మాటలు ఆందోళనకరంగా ఉండడంతో ఆయన ఆ సంభాషణా వివరాలను తన ఇరుగు పొరుగు వారికి తన బూత్ లోని ఇతర వోటర్లకు కూడా తెలియజేసి చెక్ చేసుకోమని చెప్పాడు. వారు పేర్లు కూడా అక్రమంగా మారిపోయినట్టు తేలడంతో ఇదేదో భారీ వ్యవహారం అని గ్రహించిన రెహాన్ ఆలీ కాంగ్రెస్ నేత గంగ్వార్ కు సమాచారం ఇచ్చాడు.
గంగ్వార్ ప్రకారం 55 సభ్యులు, వాలంటీర్లతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి వోటర్ల జాబితా తనిఖీ చేసేందుకు రంగం లోకి దింపాడు. వారు బూత్ తర్వాత బూత్ లను వరుసగా తనిఖీ చేస్తూ పోయారు. అనేక రోజుల పాటు శ్రమించి 3.48 లక్షల వోటర్ల రికార్డ్ లను తనిఖీ చేశారు. మొత్తం మీద 13,150 మంది వోటర్ల వివరాలలో అక్రమ మార్పులు జరిగాయని తేల్చారు. “ఈ మార్పులు బాగా పొద్దుపోయాక రాత్రి పూట గాని లేదా ఆదివారం లాంటి సెలవు రోజుల్లో గానీ జరిగినట్టు మా పరిశీలనలో తేలింది” అని గంగ్వార్ తెలిపాడు.
కాంగ్రెస్ నేత గంగ్వార్, సమాజ్ వాదీ పార్టీ నాయకుల ప్రకారం వోటర్ వివరాల్లో మార్పులు జరిగిన వారిలో అత్యధికులు ముస్లింలు. 2011 సెన్సస్ ప్రకారం ఫిలిబిత్ జిల్లాలో పాతిక శాతం మంది ముస్లిం వోటర్లు ఉన్నారు. ఈ వోటర్ల పేర్లు ఎన్నికల జాబితా లోని పేర్లతో సరిపోలటం లేదని చెబుతూ వోటింగ్ సమయంలో వారిని వోటు వేయటానికి అనర్హులుగా తేల్చి ఉండేవారని ప్రతిపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
అంతే కాకుండా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరో కొద్ది నెలల్లో జరగనున్నాయి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపి కి చెందిన సంజయ్ సింగ్ గంగ్వార్ ఫిలిబిత్ సీటు నుండి 7,000 వోట్ల అల్ప మెజారిటీతో గెలిచాడు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్ధి రెండో స్థానంలో నిలిచాడు. అయితే 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఫిలిబిత్ లోక్ సభ నియోజకవర్గంలో బిజేపి అభ్యర్ధి ఒక లక్ష వోట్ల భారీ మెజారిటీతో విజయం సాధించాడు.
వోటర్ జాబితా అక్రమాలు ఫిలిబిత్ నియోజకవర్గం వరకు మాత్రమే పరిమితం కావని ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలు భయపడుతున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని 100 ఇతర నియోజకవర్గాల్లో వోటర్ల జాబితాలను తనిఖీ చేయాలని అవి నిర్ణయించుకున్నాయి. “ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా ఈ అక్రమాలు ఎలా చోటు చేసుకున్నాయన్నది మా ప్రధాన ప్రశ్న. ముఖ్యంగా కేవలం ముస్లిం వోటర్ల పేర్లలో మాత్రమే మార్పులు జరగటం మరింత ఆందోళనకరం’ అని పార్టీల ప్రతినిధులు చెప్పారు.
ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటోంది. మూడు సార్లు వరుసగా ఎన్నికల్లో వోటమి చెందినా కూడా, ముఖ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమకు మెజారిటీ వచ్చినా కూడా తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో భారీ వోటమి చవి చూసిన తర్వాత వారు అదే పనిగా ఈవిఎం అక్రమాలపై తమ ఆరోపణలను కేంద్రీకరించారే తప్ప మరే విధంగానైనా అక్రమాలు జరిగి ఉంటాయా అన్న సంగతిని వారు ఊహించలేదు, పట్టించుకోలేదు, అసలు ఆ వైపు ఆలోచించే ప్రయత్నాలే చేయలేదు.
ముఖ్యమైన కాంగ్రెస్ పార్టీ నాయకులకు తమ తమ ఆర్ధిక, వ్యాపార ప్రయోజనాలను నెరవేర్చుకోవటం కోసం బిజేపి నాయకులు, మంత్రులతో లోపాయకారీ సంబంధాలు కలిగి ఉంటే సహజంగానే వోటర్ జాబితా అక్రమాల గురించి వారు పట్టించుకునే అవసరం తలెత్తదు. ప్రభుత్వం అధికారం అన్నది దేశాభివృద్ధి లేదా ప్రజల అభివృద్ధి కోసం కాకుండా స్వార్ధ ఆర్ధిక-వాణిజ్య ప్రయోజనాలు సాధించే అధికారిక మార్గంగా మారిపోతే ఆ ప్రయోజనాలు ఎలా సాధిస్తే ఏమిటి? ప్రజల బాగోగులు ఎవడికి కావాలి?


