యుపి: మత మార్పిడి కుట్ర కేవలం ఊహాజనితం -హై కోర్టు


ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మత మార్పిడి కుట్ర జరిగింది అనటానికి ఎలాంటి ఆధారాలు లేవని అలహాబాద్ కోర్టు స్పష్టం చేసింది. స్వచ్ఛందంగా హిందూ మతంను త్యజించి ముస్లిం మతం స్వీకరించిన ఇద్దరు అక్కా చెల్లెళ్ల ను పోలీసుల సాయంతో ఇంటిలో నిర్బంధించిన వారి తండ్రిని, పోలీసులను, చివరికి రాష్ట్ర ప్రభుత్వ చర్యలను కూడా హై కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది.

ఉత్తర ప్రదేశ్ కు చెందిన అక్కా చెల్లెళ్ల వయసు 35 సం, 20 సం.లు. వారిని మత మార్పిడి కోసం బలవంతంగా మతాంతర వివాహం జరిపించి పశ్చిమ బెంగాల్ కు తరలించారని బాలికల తండ్రి యు.పి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముస్లిం లపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ, లవ్ జీహాద్ లో భాగంగా హిందూ యువతులను కిడ్నాప్ చేసి బలవంతంగా ముస్లిం యువకులకు వివాహం చేస్తున్నారని, తద్వారా బలవంతంగా మత మార్పిడులకు పాల్పడుతున్నారని ఆర్ఎస్ఎస్, బిజెపి, ఇతర హిందూత్వ సంస్థలు చేసే ఆరోపణలకు బాలికల కిడ్నాప్ ఫిర్యాదు ఒక అవకాశంగా దొరికింది.

లవ్ జీహాద్, బలవంతపు మత మార్పిడి నిరోధానికి అని చెబుతూ కఠినమైన మత మార్పిడి నిషేధ చట్టాన్ని యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం తెచ్చిన సంగతి తెలిసిందే. అనేక బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా ఇదే తరహా చట్టాలు చేశాయి. ముస్లింల పైన ద్వేషం ప్రకటించటానికి అలవాటు పడిన యు.పి ముఖ్యమంత్రి, బాలికల తండ్రి ఆరోపణలకు ఆలంబనగా నిలిచింది.

కేసును విచారించిన అలహాబాద్ హై కోర్టు, బాలికలను నిర్బంధించే హక్కు వారి తండ్రికి లేదని స్పష్టం చేసింది. తండ్రి అయినంత మాత్రాన తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించేందుకు బాలికలకు గల హక్కును నిరాకరించటం చట్ట విరుద్ధం అని, మేజర్ బాలికలకు రాజ్యాంగం కల్పించిన హక్కును ఉల్లంఘిస్తూ వారిని ఇంట్లో నిర్బంధించే హక్కు తండ్రికి లేదని హై కోర్టు స్పష్టం చేసింది.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం సైతం పోలీసుల ద్వారా బాలికలకు వారి మౌలిక హక్కులను నిరాకరించే విధంగా చర్యలు తీసుకోవటం “పూర్తిగా చట్ట విరుద్ధం” అని హై కోర్టు తన తీర్పులో పేర్కొంది. బాలికల తండ్రి, రాష్ట్ర ప్రభుత్వం బాలికలను నిర్బంధించి వారి హక్కులను కాలరాచినందుకు గాను ఉమ్మడిగా 25 లక్షల రూపాయలను పరిహారంగా ఇద్దరు బాలికలకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

జైలుగా మారిన ఇల్లు

తండ్రి ఫిర్యాదును పురస్కరించుకుని ఉత్తర ప్రదేశ్ పోలీసులు అక్కా చెల్లెళ్ల కోసం గాలించారు. వారు పశ్చిమ బెంగాల్ లో ఉన్నట్లు కనుగొని వెనక్కి తెచ్చారు. వారిని కిడ్నాప్ చేశారని ఆరోపిస్తూ బెంగాల్ కు చెందిన పలువురు ముస్లిం వ్యక్తులను అరెస్టు చేసి యు.పి కి తరలించారు. అరెస్టు చేసిన వారిపై తీవ్ర ఆరోపణలతో కేసులు మోపారు. “ఒక ఆర్గనైజ్డ్ సిండికేట్ లో భాగంగా ఉద్దేశపూర్వకంగా, దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రత లకు భంగం కలిగించారని ఆరోపణలు మోపారు. ఉత్తర ప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రెలిజియన్ యాక్ట్ చట్టం కింద అభియోగాలు మోపారు.

అక్కా చెల్లెళ్లను వారి తండ్రికి అప్పగించిన పోలీసులు బెంగాల్ నుండి అరెస్ట్ చేసి తెచ్చిన ఆరోపితులను జైలులో వేశారు.

అలహాబాద్ హై కోర్టు లోని జస్టిస్ సందీప్ జైన్ నేతృత్వం లోని ఏక సభ్య ధర్మాసనం కేసును విచారించింది. బాలికలు ఇద్దరు ధర్మాసనం ముందు తమ ప్రకటనను రికార్డు చేసిన తర్వాత కేసు పూర్తిగా తిరగబడింది. కేసును పోలీసులు తల కిందులుగా నిలబెట్టగా, న్యాయ స్థానం దానిని తిరిగి దాని కాళ్ల పైన నిలబెట్టింది.

ఆగస్టు 6 తేదీన తీర్పు ప్రకటించిన న్యాయమూర్తి బాలికలకు తండ్రి చెర నుండి విముక్తి కలిగించాడు. బెంగాల్ నుండి వచ్చిన తర్వాత ఏడాది కాలం పాటు కుటుంబ హింసలో నలిగిన ఇద్దరు బాలికలను తండ్రి వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.

“మేజర్ పిల్లలు / బాలికల మతం, నమ్మకం, వారి వ్యక్తిగత ఎంపికలు నచ్చనంత మాత్రాన వారిని నిర్బంధించటానికి తల్లిదండ్రులకు లైసెన్స్ లాంటివి ఏవీ రాజ్యాంగం ఇవ్వలేదు. రాజ్యాంగ హక్కులను తల్లి దండ్రుల ఆధారిటీ, సామాజిక నైతికత, మెజారిటీ మత సెంటిమెంట్… ఇవేవీ ఉల్లంఘించ జాలవు” అని జస్టిస్ సందీప్ జైన్ తన తీర్పులో పేర్కొన్నాడు.

జడ్జి ఇంకా ఇలా పేర్కొన్నారు. “ఒక అడల్ట్ వ్యక్తి యొక్క స్వేచ్ఛను ఎవరూ ఉల్లంఘించ లేరు. బలవంతంగా లేదా బల ప్రయోగంతో వ్యక్తి స్వేచ్ఛా హక్కును అణచివేసేందుకు ప్రయత్నిస్తే వారు ఈ కోర్టు నుండి రాజ్యాంగ బద్ధ స్క్రూటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. మౌలిక హక్కుల ఉల్లంఘనలకు గాను తదనుగుణమైన ప్రజా చట్టాల పర్యవసానాన్ని, మానిటరీ నష్టపరిహారంతో సహా, ఎదుర్కోవాల్సి ఉంటుంది.” అని న్యాయమూర్తి హెచ్చరించారు.

తమను తమ తండ్రి ఇంట్లో నిర్బంధించి భౌతికంగా బంధించారని బాలికలు ఆరోపించారు. ప్రతి రోజూ బెదిరించేవారని, మానసికంగా హింసించారని బాలికలు ఆరోపించారు. బాలికలు విద్యాధికులు కూడా. పెద్దమ్మాయి M. Sc, M. Phil, BEd పూర్తి చేయగా, ఆమె చెల్లెలు క్లాస్ 12 పాస్ అయింది. వారికి వారి ఇల్లు జైలుగా మారింది.

బాలికల తండ్రి అక్కడితో ఆగకుండా పిల్లల పాస్ పోర్ట్ లు, చదువుకు సంబంధించిన సర్టిఫికేట్ లు, బ్యాంక్ పాస్ బుక్ లు, చెక్ బుక్ లు, మతం మారిన డాక్యుమెంట్లు, ఇంకా ఇతర వ్యక్తిగత వస్తువులు అన్నిటినీ తండ్రి లాక్కున్నాడని బాలికలు ఆరోపించారు.

బాలికల తరపున వాదించిన లాయర్ ఆలీ బిన్ సైఫ్ తెలిపిన వివరాల ప్రకారం తన పిల్లలు ఇస్లాం మతం స్వీకరించిన సంగతి తండ్రికి 2021లో తెలిసింది. ఆ వెంటనే వాళ్లు ఇంటి నుండి కదలకుండా తండ్రి నిర్బంధించాడు. నాలుగేళ్లు తండ్రి నిర్బంధంలో ఉన్న బాలికలు గత యేడు 2025 లో నిర్బంధం నుండి తప్పించుకుని పారిపోయారు.

రాష్ట్ర ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ (ఏఏజి) వాదనలు వినిపిస్తూ “బాలికల మత మార్పిడి, ఒక పెద్ద సంఘటిత కుట్ర” అని ఆరోపిస్తూ “ఈ కుట్ర వలన భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతల పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది” అని వాదించాడు. విచారణ పోలీసులు కూడా “చట్ట విరుద్ధమైన మత మార్పిడుల ద్వారా దేశం లోని సామాజిక నిర్మాణాన్ని భంగం చేసే లక్ష్యంతో జాగ్రత్తగా వేసిన ప్రణాళికలో భాగంగానే ఈ బాలికల మత మార్పిడి జరిగింది” అని వాదించాడు.

రాష్ట్ర న్యాయవాది అంతటితో ఆగలేదు. బాలికల మత మార్పిడి కుట్రలో విదేశీ సంస్థల పాత్ర, విదేశీ శక్తుల ప్రభావం ఉందని చెప్పేందుకు తగిన భౌతిక సాక్ష్యాలు ఉన్నాయని చెప్పాడు. ఐతే బాలికల మత మార్పిడి వలన దేశ సార్వభౌమాధికారానికి, ఐక్యత సమగ్రతలకు భంగం కలుగుతుందని చెప్పటం కేవలం ఊహాజనితమే అని, అందుకు తగిన వస్తుగత సాక్షాలు ఏవీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోయిందని బాలికల న్యాయవాది వాదించాడు. అసలు బాలికలు తమకు నచ్చిన మతం లోకి మారితే అది దేశ సార్వభౌకత్వం పైనా, ఐక్యత సమగ్రతల పైనా ప్రభావం ఎలా పడుతుందో అర్ధం కావటం లేదని వాదించాడు.

రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కు

ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ వాదనలు నమ్మదగినవిగా లేవని కొట్టి పడేసింది. మహిళలు హిందూయిజం నుండి ఇస్లాం మతం లోకి మారటం అన్నది భారీ కుట్ర లో భాగం అన్న వాదనను తిరస్కరించింది. భారత దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు విఘాతం అన్న వాదనను మొదలంటా తిరస్కరించింది.

అమ్మాయిలను హై కోర్టు న్యాయమూర్తి విచారిస్తున్న సందర్భంగా బాలికలు ఇచ్చిన సమాధానాలు “సహజంగా, వాస్తవికంగా, స్పష్టంగా ఎలాంటి తడబాటు లేకుండా ఇచ్చినట్లుగా ఉన్నాయి” అని జస్టిస్ జైన్ తేల్చి చెప్పాడు. “ఏ సందర్భం లోనూ బలవంతంగా, భయంతో, ఇతరుల చేత ప్రభావితమైనట్లుగా, లేదా కానుకలకు ప్రభావితం అయినట్లుగా లేవు” అని జడ్జి స్పష్టం చేశాడు.

జస్టిస్ సందీప్ అమ్మాయిల తండ్రి ప్రవర్తనను, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన విధానాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. “తన ఇద్దరు మేజర్ కూతుళ్లను, వారి ఇష్ట ప్రకారం వేరే మతం స్వీకరించినందుకు గాను వారి తండ్రి బలవంతంగా నిర్బంధించటం అంటే చట్ట బద్ధ పాలనకు తీవ్ర విఘాతం కలిగించినట్లే. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21, ఆర్టికల్ 25 ద్వారా కల్పించిన గ్యారంటీ హక్కులను తీవ్రంగా, ఉద్దేశ పూర్వకంగా, దీర్ఘకాలం పాటు తండ్రి ఉల్లంఘించాడు” అని కోర్టు తీర్పులో పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం, దాని అంగాలు ఈ కేసులో వ్యవహరించిన తీర్పు తీవ్రంగా కలవరపరిచే విషయం అని కోర్టు పేర్కొంది. “ప్రతి పౌరుడి యొక్క జీవితం, స్వేచ్ఛల కాపలాదారుగా, రక్షకుడుగా రాజ్యం పైన అత్యున్నతమైన రాజ్యాంగ బాధ్యత మోపబడి ఉన్నది. ఆ బాధ్యత ప్రకారం అమ్మాయిలకు చట్ట విరుద్ధమైన తండ్రి చెర నుండి విముక్తి కలిగించటానికి బదులుగా, కేసు మోపిన దగ్గరి నుండి కేసు విచారణ పేరుతో నిర్బంధం కొనసాగించటానికి రాజ్యం అనుమటించింది. రాజ్యం అంగాలు తమ రాజ్యాంగ బాధ్యత నిర్వర్తించటంలో తీవ్రంగా విఫలం అయ్యాయని రికార్డులు నిర్ద్వంద్వంగా నిరూపిస్తున్నాయి” అని కోర్టు స్పష్టం చేసింది.

“ప్రభుత్వం ఈ విధంగా నిశ్చేష్టులై క్రియా రహితంగా వ్యవహరించటానికి, రాజ్యాంగం అమలులో ఉదాసీనంగా ఉండటానికి న్యాయవ్యవస్థ నుండి ఆమోదం లభించదు. ప్రజా చట్టాల ప్రకారం మహిళలు కలిగి ఉన్న మౌలిక హక్కులను ఉల్లంఘించటంలో రాజ్యం కూడా సమాన పాత్ర పోషించింది” అని కోర్టు యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వానికి గట్టిగా చీవాట్లు తగిలించింది.

రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కై అమ్మాయిల తండ్రి వారిని నిర్బంధించటం పూర్తిగా చట్ట విరుద్ధం అని స్పష్టం చేస్తూ హై కోర్టు వారికి వారి స్వేచ్ఛని తిరిగి అప్పగించాలని, వ్యక్తిగత స్వేచ్ఛను పునరుద్ధరించాలని తీర్పు చెప్పింది. కేసులో తదుపరి విచారణ న్యాయబద్ధంగా, చట్టం ప్రకారం ఎలాంటి ప్రలోభాలకు ప్రభావాలకు లొంగకుండా జరపాలని ఆదేశించింది.

25 లక్షల రూపాయల నష్టపరిహారంలో 50 శాతం తండ్రి నుండి వసూలు చేసేందుకు కోర్టు నుండి అనుమటించింది. ఇద్దరు మహిళలను రాజ్యాంగ చట్టాలకు విరుద్ధంగా నిర్బంధించబడటానికి ఏయే ప్రభుత్వాధికారుల చర్యలైతే దోహద పడ్డాయో వారి నుండి మిగిలిన 50 శాతం పరిహారం వసూలు చేయాలని కోర్టు ఆదేశించింది.

హిందూత్వ గణాలు చేస్తున్న ‘లవ్ జీహాద్’ లాంటి అసత్య ప్రచారాలు కేవలం ఊహాజనితం అని, వాటికి ఎలాంటి సాక్షాధారాలు లేవని అలహాబాద్ హై కోర్టు తీర్పు ద్వారా స్పష్టం అవుతోంది. ఓ పక్క హిందూ మతం లోకి మారటానికి ప్రభుత్వాలే ఉద్దేశపూర్వకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇస్లాం మతం లోకి ఇష్టాపూర్వకంగా మారటాన్ని ఒక నేరంగా మార్చటం చట్టబద్ధం కాజాలదని హై కోర్టు తీర్పు పరోక్షంగా సూచిస్తున్నది.

ప్రస్తుతం అమలులో ఉన్న రాజ్యాంగం పరిధిలో ఆర్ఎస్ఎస్, బిజెపి లాంటి హిందూత్వ సంస్థలు భారత సమాజంలో తలపెట్టిన ప్రగతి నిరోధక మార్పులు ప్రవేశ పెట్టటం సాధ్యం కాదని గ్రహించే రాజ్యాంగం మార్చాలని ప్రచారం చేస్తున్నాయన్న సంగతి అర్ధం అవుతున్నది. ఈ సంగతిని భారత దేశ యువతరం సరిగ్గానే గ్రహిస్తున్నదని ఇటీవల Gen Z, దేశవ్యాపితంగా నిర్వహించిన ఆందోళన ద్వారా స్పష్టం అవుతోంది.

వ్యాఖ్యానించండి