ఇండియాలో జబ్బులు, చావులు!

–

ఇండియాలో ప్రజలకు అంటుకుని చావు వరకు తీసుకెళ్తున్న జబ్బుల విషయంలో గత పాతికేళ్లలో చాలా మార్పులు వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే నివేదికలో వెల్లడి అయింది. సాధారణంగా రోగాలను అంటు రోగాలు (కమ్యూనికబుల్ డిసీజెస్-సిడి), అంటు-కాని రోగాలు (నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ -ఎన్.సి.డి) అని విభజిస్తారు. ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి ఏదో ఒక మార్గం ద్వారా వ్యాప్తి చెందేవి ఎన్.సి.డి లు అంటారు. టి.బి, డయేరియా ఇన్వెక్షన్లు మొ.వి అంటు రోగాల (సి.డి) కిందకు వస్తాయి. గుండె జబ్బు, హార్ట్ అటాక్, డయాబెటిస్ మొ.వి దీర్ఘ కాలిక రోగాలు. ఇవి ఎన్.సి.డి కిందకు వస్తాయి. ఈ సంగతి తెలియని వారు ఉండరు.

2000 సం.లో మొత్తం మరణాలలో అంటు రోగాల వలన సంభవించిన మరణాలు 62 శాతం ఉన్నాయి. మరణాలకు దారి తీస్తున్న జబ్బులను పరిగణించి వాటిలో అత్యధిక మరణాలకు దారి తీస్తున్న 10 వ్యాధుల వల్ల సంభవించిన మరణాలలో అంటు వ్యాధుల మరణాలు 62 శాతం ఉన్నాయి. అదే వ్యక్తుల మధ్య వ్యాప్తి చెందని వ్యాధుల వలన సంభవించిన మరణాలు మొత్తం మరణాలలో 34 శాతం ఉన్నాయి.

2023 నాటికి ఇండియాలో ఈ పరిస్ధితి తిరగబడింది. ఎన్.సి.డి ల వలన సంభవించిన మరణాలు 75 శాతం నమోదు కాగా అంటు వ్యాధుల మరణాలు మొత్తం చావుల్లో 16 శాతం మాత్రమే ఉన్నాయి. మిగిలిన మరణాలు గాయాల వలన జరిగినవి. అంటే అంటు వ్యాధుల విషయంలో మనం ప్రగతి సాధించినా కూడా ఇతర వ్యాధుల మరణాలు అనేక రెట్లు పెరిగాయి. గుండె జబ్బు (కార్డియో వాస్క్యులార్ డిసీజ్), క్యాన్సర్, మొండి ఊపిరితిత్తుల వ్యాధులు, డయాబెటిస్ లాంటి లైఫ్ స్టైల్ వ్యాధులు ఎన్.సి.డి ల జాబితాలో ఉన్నాయి.

లైఫ్ స్టైల్ జబ్బులు

పశ్చిమ దేశాల ఆహార అలవాట్లు (పిజ్జా, బర్గర్, సాండ్ విచ్, హాట్ డాగ్, ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తా, డో నట్స్.. మొ.నవి) ఇండియాలోకి ప్రవేశించి యువతీ యువకులతో పాటు పెద్ద తరం ఆహార అలవాట్లు బాగా మారిపోవటంతో ఇలా లైఫ్ స్టైల్ వ్యాధులు ఇండియాలో ఎక్కువ అయ్యాయి. 30, 40 యేళ్ళ వారికి కూడా హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్ లు రావటం, అతి చిన్న వయసులో డయాబెటిస్ సంక్రమించటం, వయసు మీరాక దాదాపు ప్రతి ఒక్కరూ డయాబెటిస్ వ్యాధికి గురి కావటం, ఆటో ఇమ్యూన్ జబ్బుల బారిన పడటం సాధారణం అయిందంటే దానికి కారణం లైఫ్ స్టైల్ లో తీవ్ర మార్పులు రావటమే. ఉద్యోగాలలో శారీరక శ్రమ తగ్గిపోవటం, పొలం పనులు లేకపోవటం, అల్పాదాయ వర్గాలు సైతం కూల్ డ్రింక్స్, అనుకరణకు లోనయిన వంటకాలు తినటం, బిజీ లైఫ్ లో ఫాస్ట్ ఫుడ్స్ ఆరగించ వలసి రావటం… ఇవన్నీ అనివార్యంగా లైఫ్ స్టైల్ వ్యాధులను పెంచాయి.

ఎక్కడో చదివిన లేదా విన్న గుర్తు! మన పిల్లలు ఇప్పుడు కష్టపడి రాత్రనకా పగలనకా చదువుతున్నారు. ఒకటో క్లాస్ నుండే ఐ.ఐ.టి ఓరియెంటెడ్ పేరుతో లక్షల రూపాయల ఫీజులు చెల్లించి పిల్లలను హాస్టళ్లలో పడేసి అహో రాత్రాలు తోమిస్తున్నాం. హాస్టళ్లకు వేల రూపాయలు ఫీజు కడుతూనే వారి చిరు తిళ్ళ (పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ చికెన్ etc..) కోసం మరిన్ని వేలు పంపిస్తున్నాం. లక్షలు పెట్టి చదివి బైట పడ్డాక ఏవో ఉద్యోగాల కోసం నగరాల్లో పిల్లలు తిష్ట వేస్తున్నారు. ఆ ఉద్యోగాలలో శ్రమ ఉండదు. రాత్రింబవళ్ళు ఏ.సి గదుల్లో కుర్చీల్లో కూర్చొని కళ్ళు మిటకరిస్తూ స్క్రీన్ ల ముందు కూర్చోవటమే. ఇంటికీ, ఆఫీసు కీ మధ్య తిరిగేందుకు కార్లు, స్టైలిష్ టూ వీలర్స్ లక్షల పెట్టి కొంటున్నాం. ఇదంతా అయ్యాక వొంటిలో ప్రతి అంగుళమూ కండ, కొవ్వు పేరుకు పోతుంది. హెల్త్ ఆప్ ల పుణ్యమాని బరువు ఎక్కువగా ఉన్నామని పిల్లలకు అర్ధం అవుతుంది. మళ్ళీ వేలకు వేలు పోసి ఆ కండలు, కొవ్వు కరిగించటానికి జిమ్ లలో చేరుతున్నారు పిల్లలు! లక్షలు పెట్టి చదువు కుని ఉద్యోగాలు తెచ్చుకుని వాటి ద్వారా పెరిగిన వొళ్లు తగ్గించేందుకు మళ్ళీ లక్షలు పెడుతున్నారు. ఇదంతా తలచుకుంటే మన పైన మనకే జాలి వేయక తప్పదు.

–

గతంలో పల్లెల్లో ప్రతి ఒక్కరూ పొలం పనులకు వెళ్ళే వారు. కనీసం కూలీలపై అజమాయిషీ చేయటానికైనా కి.మీ దూరం నడిచి వెళ్ళేవారు, పొలాల్లో వాహనాలు వెళ్లవు కనుక. ఇప్పుడు పొలాలు కౌలుకి ఇచ్చి వారసులు పశ్చిమ దేశాలకు చెక్కేస్తున్నారు. కనపడని ఎడబాటు ఆందోళనలో వారి తల్లి దండ్రులు మానసిక ఒత్తిడి, వేదనలతో త్వరగా మరణాలకు దగ్గరవుతున్నారు. కూల్ డ్రింక్స్, చిప్స్, కుర్ కురే లాంటివి పల్లెల్లో మారుమూలలకు సైతం వెళ్లిపోయాయి. పిల్లలు పసితనం నుండీ వాటికి అలవాటు పడుతున్నారు. గతంలో పండగలు పబ్బాలకు సజ్జలు, రాగులు, నువ్వులు, జొన్నలు, శనగలు లాంటి చిరు ధాన్యాలతో వంటకాలు చేసుకుని పిల్లా పెద్దా తినేవారు. ఇప్పుడు అవి చేసేవారు లేరు, చేయమని అడిగేవారు లేరు.

ఈ చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతగా దోహద పడతాయో ఇప్పుడు డాక్టర్లు చెవిన ఇల్లు కట్టుకుని చెబుతున్నారు. గతంలో కూరగాయలు స్వచ్ఛంగా ప్రతి ఊళ్ళో తోటల్లో పండించి అక్కడే అమ్మితే అవి కొని తెచ్చుకునే వారు. పల్లెల నుండి వారసత్వంగా పండిస్తూ వచ్చిన ఆకు కూరలను పప్పుతో కలిపి తినే వాళ్ళం. ఇప్పుడు సకల కూరగాయలు హైబ్రిడ్ వి, రసాయనాలతో కలిసినవి వచ్చేశాయి. కల్తీలు, రసాయనాలు లేని అచ్చమైన ఒరిజినల్ నాటు కూరగాయలు లేనే లేవు. చివరికి కోళ్లు కూడా ఇంజెక్షన్లు చేస్తూ కృత్రిమంగా కండ పెంచి అమ్ముతున్నారు. నాటు కోళ్లు అంటూ అమ్ముతున్నారు గానీ వాటిని ఇంజెక్షన్లతో పెంచటం లేదన్న గ్యారంటీ ఏమీ లేదు. కృత్రిమంగా సింధటిక్ పాలు తయారు చేస్తున్న దొంగ రైతులు, కృత్రిమ కోళ్లు పెంచటం లేదని ఎలా నమ్మగలం? ఎంతో అవసరమైన ప్రోటీన్ ఆహారం బీఫ్ ని తిననీయ కుండా మత రాజకీయాలను అడ్డం వేశారు. తినే తిండికి కూడా మతాన్ని పులిమి భావోద్వేగాలను రెచ్చగొట్టి పెట్టారు.

రాజకీయాలు వంట గదిలోకి కూడా చొరబడడంతో అల్పాదాయ వర్గాలకు, మారిజినల్ కమ్యూనిటీస్ కి అందుబాటులో ఉన్న బీఫ్, ఇప్పుడు అందకుండా పోయింది (రేట్లు భారీగా పెరిగాయి). చిత్రం ఏమిటంటే బిజెపి-ఆర్ఎస్ఎస్ పాలనలో కూడా బీఫ్ ఎగుమతులు అవిచ్ఛిన్నంగా కొనసాగటమే కాకుండా అవి నెల నెలా పెరుగుతున్నాయి కూడా. పైగా కేంద్ర ప్రభుత్వం లోని సచివులే ముస్లిం పేర్లతో కూడిన కంపెనీలకు తామే స్వయంగా యజమానులుగా ఉండటం, కోట్లు గడించటం ఒక విపరీత పరిణామం. ఈ కల్తీ దేశభక్తి పేదల పోషక ఆహారాన్ని విలన్ గా మార్చటం ఒక పెద్ద అభాస. వివిధ పేర్లతో బీఫ్ పైన విధించిన నిషేధం ఎస్.సి, ఎస్.టి ప్రజలకు పోషక ఆహారాన్ని దూరం చేసింది.

పర్యవసానంగా మరణాలకు దారి తీస్తున్న రోగాలలో మార్పులు వచ్చాయి. గతంలో ఎక్కడో ఒక చోట కనిపించిన లైఫ్ స్టైల్ జబ్బులు ఇప్పుడు సర్వాంతర్వ్యామి అయ్యాయి. జబ్బుల గణాంకాలు ఆ విషయాన్ని విప్పి చూపిస్తున్నాయి. 2000 సం.లో టి.బి, డయేరియా జబ్బులు జాబితాలో అగ్ర స్థానంలో ఉన్నాయి. లక్ష మంది జనాభాలో 92.34 మంది టిబి బారిన పడితే 87.87 మంది వివిధ రకాల డయేరియా బారిన పడ్డారు. కానీ 2023 నాటికి ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ (ధమనుల మార్గం పాక్షికంగా మూసుకుపోయి కండరాలకు రక్త సరఫరా, ఆక్సిజన్ సరఫరా తగినంత జరగకపోవటం), క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (మొండి ఊపిరితిత్తుల వ్యాధులు), హార్ట్ స్ట్రోక్, డయాబెటిస్ లు వరుసగా లక్షకు 138.53, 83.19, 74.81 మరియు 49.01 మందికి సంక్రమించాయి.

ఇన్ఫెక్షన్ జబ్బులు కొంత తగ్గినా కూడా ప్రజలకు భారంగా కొనసాగుతున్నాయి. డయేరియా జబ్బులు, టి.బి, లోయర్ ఊపిరి తిత్తుల ఇన్వెక్షన్ లు టాప్ 10 లో కొనసాగుతున్నాయి.

ప్రపంచ వ్యాపితంగా కూడా ఇదే ధోరణి కనిపిస్తోందని WHO నివేదిక వెల్లడించింది. 2023లో ఎన్.సి.డి లు 74 శాతం చావులకు కారణం అయ్యాయి. 2000తో పోల్చితే ఇది 58 శాతం ఎక్కువ. టాప్ 10 జబ్బుల్లో 8 జబ్బులు ఎన్.సి.డి (లైఫ్ స్టైల్) జబ్బులే ఉన్నాయి. గ్లోబల్ సగటు ఆయుర్దాయం 2019లో 73.4 ఉంటే అది 2023 లో 73.3 కి పడిపోయింది. అలాగే ఆరోగ్యకరమైన జీవన కాలం గ్లోబల్ సగటు 2019 లో 63.2 సం.లు ఉండగా 2023 లో అది 62.8 సం.లకు పడిపోయింది.

స్పందించండి