
ప్రతి అంశాన్ని పాకిస్తాన్ తో పోల్చుకోవటం ఇండియాలో కొంత మందికి అలవాటు. ముఖ్యంగా హిందూత్వ జాతీయవాదంతో కూడిన భావజాలం ఉన్నవారిలో ఈ అలవాటు ఒకింత ఎక్కువగా ఉంటుంది. (క్రికెట్ కి వచ్చే సరికి భారతీయుల దేశ భక్తి ఆకాశాన్ని తాకుతుంది.) వారికి ఒకింత సంతృప్తిని ఇచ్చే వార్తను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.
WHO ప్రకారం 2023 లో భారతీయులు పుట్టినపుడు సగటున 71 సంవత్సరాల ఆయుర్దాయం కలిగి ఉన్నారని అంచనా వేశారు. పాకిస్తాన్ దేశీయులు ఇండియా కంటే తక్కువగా సగటున 68.2 సంవత్సరాలు మాత్రమే జీవించగలిగారు. కానీ బంగ్లా దేశ్ ప్రజలు మాత్రం అదే సం.లో భారతీయుల కంటే ఎక్కువగా సగటున 72.7 సం.లు జీవించారు. కాగా అమెరికన్లు సగటున 78.5 యేళ్ళు జీవిస్తే కెనడా దేశీయులు ఉపఖండం కంటే ఎక్కువగా 81.4 సం.లు జీవించారు.

ఐతే ఎక్కువ కాలం జీవించినంత మాత్రాన వాళ్లు జీవించినన్నాళ్లు ఆరోగ్యంతో జీవించారని కాదు. 2023లో భారతీయులు సగటున 60.6 సం.లు ఆరోగ్యవంతమైన జీవనం గడిపారు. 2019 లో కాస్త తక్కువగా 60.5 సం.ల పాటు ఇండియన్లు ఆరోగ్యంగా జీవించారు. 2019లో భారతీయుల ఆయుర్దాయం సగటున 70.5 సం,లు జీవించగా కోవిడ్ మహమ్మారి విజృంభించిన 2021లో అది 68.1 సం.లు కు పడిపోయింది. 2022లో తిరిగి 70.5 సం.లకు 2023లో 71 సం.లకు పెరిగింది.
కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందిన కాలంలో భారతీయుల ఆరోగ్యవంతమైన ఆయుర్దాయం బాగా తగ్గింది. 2021లో ఇండియన్లు సగటున 58.4 సం.లు మాత్రమే ఆరోగ్యంగా జీవిస్తే 2022లో కాస్త పెరిగి 60.2 సం.లు ఆరోగ్యంగా జీవించారు. 2023 లో అది 60.6 సం.లకు పెరిగింది. 2019 తో పోల్చితే ఇది 0.1 సం.లు మాత్రమే ఎక్కువ.
WHO తయారు చేసిన గ్లోబల్ హెల్త్ ఎస్టిమేట్స్ నివేదిక ఈ వివరాలను వెల్లడి చేసింది.
భారత వృద్ధులలో తేడా కాస్త ఎక్కువగా ఉన్నది. 60 సం.ల వయసు వద్ద భారత వృద్ధులు 2023లో సగటున మరో 18.8 సం.ల వరకు జీవించ గలిగారు. ఇది 2019లో సగటున 18.4 సం.లు. కానీ ఆరోగ్యవంతమైన జీవనం విషయానికి వచ్చేసరికి భారతీయులు 60 యేళ్ళ వద్ద 2023లో సగటున మరో 13.7 సం.ల వరకే జీవించగలరని అంచనా వేయగా 2019లో ఈ సంఖ్య 13.4 సం.లు.


