
–
తగిన సాక్షాలు లేకుండా ప్రజలను అక్రమ కేసుల్లో ఇరికించి జాతీయ భద్రతా చట్టం లాంటి కఠిన చట్టాలు ప్రయోగించటం పట్ల ఉత్తర ప్రదేశ్ యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం పైన సుప్రీం కోర్టు మరోసారి కన్నెర్ర చేసింది. 2024లో జరిగిన శంభాల్ అల్లర్ల కేసులో ఏ కారణాలు లేకుండా ముస్లింలపై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ చట్టం (నాసా చట్టం) కింద నిర్బంధం లోకి తీసుకున్నందుకు గాను యోగి ఆదిత్య నాధ్ ప్రభుత్వం రు 10 లక్షలు చెల్లించాలని సుప్రీం కోర్టు ధర్మాసనం మంగళవారం నాడు తీర్పు చెప్పింది.
రాష్ట్ర ప్రభుత్వం పైన విధించిన 10 లక్షల జరిమానా సొమ్ముని నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తికి చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పైన కోర్టులు జరిమానా విధించటం ఇది రెండో సారి. ఇదే చట్టం ప్రయోగించి వ్యక్తిని అక్రమంగా సంవత్సరం పాటు నిర్బంధించినందుకు కొద్ది రోజుల క్రితం అలహాబాద్ హై కోర్టు రు 5 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని చట్టం ప్రయోగానికి అనుమతి ఇచ్చిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ వేతనం నుండి వసూలు చేయాలని అలహాబాద్ హై కోర్టు తీర్పు ఇవ్వగా, ఎస్.డి.ఎం వేతనం నుండి వసూలు చేయటం పైన సుప్రీం కోర్టు స్టే విధించింది. కాగా మరో కేసులో సుప్రీం కోర్టు కూడా అదే తరహాలో జరిమానా విధించటం విశేషం.
2024 నవంబర్ నెలలో ఉత్తర ప్రదేశ్ లోని శంభాల్ జిల్లాల్లో మతం పేరుతో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లకు ముస్లిం మతానికి చెందిన ముల్లా ఆఫ్రోజ్ మాస్టర్ మైండ్ గా వ్యవరించాడని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆరోపించింది. అతనిని జాతీయ భద్రతా చట్టం (నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ -నాసా) కింద ప్రివెంటివ్ డిటెన్షన్ (ముందస్తు నిర్బంధం) లోకి తీసుకుని నిర్బంధించింది. ఈ కేసు ట్రయల్ దశ, హై కోర్టులను దాటి సుప్రీం కోర్టుకు చేరగా జస్టిస్ దీపంకర్ దత్తా, జస్టిస్ శీల్ నాగు లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
కేసును విచారించిన ధర్మాసనం పోలీసు నిర్బంధంలో నిందితుడి నుండి రాబట్టిన నేరాంగీర ఒప్పుకోలు ఆధారంగా మాత్రమే ఒక వ్యక్తిని ముందస్తు నిర్బంధం లోకి తీసుకోవటం చెల్లదని నిర్ధారించింది. డిటెన్షన్ ను చట్టబద్ధమే అని ఆమోదించిన అలహాబాద్ హై కోర్టు తీర్పును కొట్టి వేసింది. నాసా లాంటి అంత్యంత కఠిన చట్టం కింద నిర్బంధంలో తీసుకోవటానికి సాక్షాధారాలు బలంగా ఉండాలని, పోలీసు నిర్బంధంలో ఉండగా నిందితుడి నుండి రాబట్టిన ఒప్పుకోలు సాక్షంగా పనికిరాదని సుప్రీం కోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
చట్ట విరుద్ధమైన రీతిలో అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం డిటెన్షన్ లోకి తీసుకున్న ముల్లా ఆఫ్రోజ్ కు 10 లక్షల రూపాయల మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. కోర్టు నిజానికి ముల్లా ఆఫ్రోజ్ కు కేసు మెరిట్స్ ఆధారంగా బెయిల్ మంజూరు చేసిందని. కానీ బెయిల్ మంజూరు అయ్యాక నాసా చట్టాన్ని ప్రయోగించి నిందితుడిని ‘ప్రివెంటివ్ డిటెన్షన్’ పేరుతో అరెస్ట్ చేసి ఏడాదికి పైగా జైలులో నిర్బంధించటం పూర్తిగా చట్ట వ్యతిరేకం అని సుప్రీం కోర్టు తేల్చింది. నేరాల్ని నిరోధించటానికి ప్రయోగించవలసిన చట్టాన్ని శిక్ష విధించటం కోసం ప్రయోగించటానికి వీలు లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
“అక్టోబర్ 13, 2025 తేదీన ముల్లాకు కోర్టు రిలీఫ్ ప్రకటించింది. అప్పిలెంట్ అప్పటికే తన స్వేచ్ఛలో గణనీయ మొత్తాన్ని నిందితుడు కోల్పోయాడు. `అన్ని కేసులలో బెయిల్ మంజూరు అయిన తర్వాత కూడా నిర్బంధాన్ని అతను ఎదుర్కోవలసి వచ్చింది” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. “సంఘటన జరిగిన రెండు నెలల తర్వాత చర్య తీసుకున్నారని, విచారణ సంస్థ తన వద్ద వీడియో సాక్షం ఉందని చెప్పినా కూడా దానిని కోర్టు ముందు ఉంచటంలో ప్రభుత్వం విఫలం అయింది. ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసిన 54 రోజుల తర్వాత నిందితుడిని అరెస్ట్ చేయటం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది.


