
–
ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులను, బ్యూరోక్రట్ అధికారులను అలహాబాద్ హై కోర్టు మంగళ వారం తీవ్రంగా తప్పు పట్టింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్ధిని ఆకృతి చౌదరి, తనకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామిక నిరసన హక్కును ఉపయోగించుకున్నప్పటికీ ఆమె పైన జాతీయ భద్రతా చట్టం కింద అక్రమ కేసు నమోదు చేసి జైలులో పెట్టటం విపరీత చర్యగా అభివర్ణించింది. తప్పుడు పనులు చేసే బ్యూరోక్రట్ అధికారుల వల్ల ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని “ఆర్వేలియన్ డిస్టోపియా” రాజ్యంగా దిగజార్చే అవకాశం ఉందని హెచ్చరించింది.
బ్రిటిష్ రచయిత జార్జ్ ఆర్వెల్ 1949లో “నైన్టీన్ ఎయిటీ ఫోర్” (1984) టైటిల్ తో ఒక పుస్తకాన్ని రచించారు. ఇందులో ఆయన నియంతృత్వంతో ప్రజలను అణచివేస్తూ పాలించే ప్రభుత్వ పాలనలో దేశ ప్రజలు ఎలాంటి సామాజిక, రాజకీయ, ఆర్ధిక పరిస్ధితులలో బతకవలసి వస్తుందో ఆయన ఊహించారు. రోజువారీ ప్రజలు మాట్లాడుకునే భాష పైన కూడా సామూహిక నిఘా పెడుతూ నిజం, చరిత్ర, భాషలను ప్రభుత్వాలు ఏ విధంగా వక్రీకరిస్తాయో తద్వారా ప్రజల ఆలోచనలను, భావాలను, జీవనాన్ని ఏ విధంగా తమ నియంత్రణ లోకి తెచ్చుకుంటారో విపులంగా రాశారు. ఈ రాజ్యానికి ఆయన “ఆర్వేలియన్ డిస్టోపియా” గా అభివర్ణించాడు.
ఉత్తర ప్రదేశ్ లో ప్రజలు తమ కనీస ప్రజాస్వామిక హక్కులను కూడా ఉపయోగించకుండా వివిధ పేర్లతో, కేసులతో ప్రజల ప్రాధమిక హక్కులను హరించి వేస్తూ తప్పుడు కేసులను బనాయిస్తున్న పరిస్ధితి కొనసాగితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం త్వరలో ఆర్వేలియన్ డిస్టోపియా గా మారే ప్రమాదం ఉందని అలహాబాద్ హై కోర్టు లోని ద్విసభ్య డివిజన్ బెంచి హెచ్చరించింది. జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ అచల్ సచ్ దేవ్ లతో కూడిన ధర్మాసనం ఈ అద్భుతమైన తీర్పును వెలువరించింది.
కొద్ది రోజుల క్రితం విద్యార్ధి కార్యకర్త ఆకృతి చౌదరి పైన యుపి పోలీసులు జాతీయ భద్రతా చట్టం కింద నమోదు చేసిన అత్యంత క్రూరమైన కేసును అలహాబాద్ హై కోర్టు సెప్టెంబర్ 2 తేదీన కొట్టి వేసింది. తీర్పు పూర్తి పాఠాన్ని బెంచి ఈ రోజు (సెప్టెంబర్ 2) ప్రకటించింది. తప్పుడు కేసు పెట్టి జైలులో నిర్బంధించినందుకు గాను బాధితురాలు ఆకృతి చౌదరికి రు 5 లక్షలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కేసు పెట్టిన గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా పాలనా యంత్రాంగానికి తీవ్ర స్థాయిలో తలంటు పోసింది. తగిన సాక్ష్యాలు లేకుండా కేవలం నిరసన తెలిపినందుకు జాతీయ భద్రతా చట్టం ఎలా వర్తిస్తుందని ప్రశ్నించింది.
తీర్పులో హై కోర్టు బ్యూరోక్రట్ అధికారులు ఎవరికి విధేయులుగా ఉండాలో స్పష్టంగా తేల్చి చెప్పింది. “మీరు రాజ్యాంగానికి విధేయులై ఉండాలి గానీ రాజకీయ పాలకులకు కాదు” అని స్పష్టం చేసింది. ఈ ఒక్క మాట ద్వారా హై కోర్టు తన హెచ్చరిక లక్ష్యం ఎవరో తేల్చి చెప్పింది. బ్యూరోక్రట్ అధికారులకు ఆదేశాలిచ్చే యోగి ఆదిత్య నాధ్ ప్రభుత్వాన్ని హై కోర్టు తప్పు పట్టిందన్నది స్పష్టమే. నేరం చేశారన్న వంకతో, నేరం రుజువు కాకుండానే, కోర్టుల నుండి తగిన ఆదేశాలు లేకుండానే వారి ఇళ్లను బుల్ డోజర్లతో కూల్చి వేసే ఆటవిక న్యాయానికి యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం తెగించటాన్ని దేశ ప్రజలు చూస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా ముస్లిం ప్రజల ఇళ్లను ఆగమేఘాల మీద కూల్చేయటం, దేవుడు, భక్తులను అడ్డం పెట్టుకుని శత్రువులతో వ్యవహరించినట్టుగా సామాన్య ముస్లిం ప్రజలతో వ్యవహరించటం, వారిని భయభ్రాంతులకు గురి చేయటం నిత్య వ్యవహారంగా మారింది. ఈ తరహా పాలననే “ఆర్వేలియన్ డిస్తోపియా” గా అలహాబాద్ హై కోర్టు తప్పు పట్టింది.
నేపధ్యం: కనీస వేతనాల ఉద్యమం
ఆకృతి చౌదరి అరెస్టు, నిర్బంధం ఎందుకు జరిగిందన్న వివరాలను చూడటం అవశ్యం. ఫిబ్రవరి 28 నుండి ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ఆధిపత్య యుద్ధం మొదలు పెట్టిన నేపధ్యంలో ఇండియాలో చమురు, గ్యాస్ ధరలు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు కార్మిక ప్రజానీకానికి అందుబాటులో లేకుండా పోయాయి. ఆసియాలోనే అతి పెద్ద పారిశ్రామిక కేంద్రంగా పేరు పొందిన నొయిడా పారిశ్రామిక ప్రాంతంలో వివిధ ఫ్యాక్టరీల వర్కర్లు కనీస వేతనాల పెంపును కోరుతూ ఆందోళన మొదలు పెట్టారు. అంతకు ముందే హర్యానాలో కార్మికుల కనీస వేతనాలను అక్కడి రాష్ట్ర ప్రభుత్వం పెంచటంతో తమకు కూడా పెంచాలని వారు కోరారు.
వివిధ ఫ్యాక్టరీల ముందు వేలాది మంది కార్మికులు బైఠాయించి పెరిగిన జీవన ఖర్చులకు తగినట్టు కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అప్పటికే జాతీయ రాజధాని ప్రాంతం (నేషనల్ కేపిటల్ రీజియన్) లో వర్కర్లు, హర్యానా వర్కర్ల సమ్మె విజయంతో స్ఫూర్తి పొంది ఆందోళన చేస్తున్నారు. నినాదాలు ఇవ్వడం, ఫ్యాక్టరీలో పని నిలిపివేయటం, ధర్నాలకు దిగటం మొదలైన ఆందోళన కార్యక్రమాలు వారు చేస్తున్నారు.
ఐతే ఏప్రిల్ 13 తేదీన ఆందోళన హింసాత్మకంగా మారిందని పత్రికలు రాశాయి. అయితే వాస్తవంగా వాహనాలకు నిప్పు పెట్టడం, బారికేడ్లను నెట్టివేయటం లాంటి విధ్వంసం మాత్రమే ఆందోళనకారులు చేశారు తప్ప అసలు హింస అన్నది పోలీసుల వైపు నుండి జరిగింది. ఆందోళనకారుల విధ్వంసానికి పోలీసులు హింసతో జవాబు చెప్పారు. టియర్ గ్యాస్, లాఠీ చార్జి తదితర చర్యలను పోలీసులు అమలు చేశారు. కానీ పోలీసు చర్య ఆందోళనను ఆపలేకపోయింది. పైగా మరిన్ని రంగాల కార్మికులు, ఉదాహరణకి ఇంటి పని కార్మికులు, ఆందోళనలో చేరారు. నిత్యం తమను హింసాత్మక పరిస్ధితుల్లోకి నెడుతున్న పని పరిస్ధితులను మెరుగు పరచాలని కార్మికులు డిమాండ్ చేశారు.

ఆందోళన తీవ్రం కావటంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కార్మికుల డిమాండ్లను ఆమోదిస్తూ చర్యలు తీసుకుంది. కనీస వేతనాలను 21 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. వివిధ కేటగిరీల పనులకు ఇచ్చే వేతనాలను సవరిస్తూ, సవరించిన వేతనాలు ఏప్రిల్ 18 తేదీ నుండి అమలు చేస్తున్నట్లు చెప్పింది.
ఆందోళనకారుల డిమాండ్లు కొన్ని ఆమోదించిన తర్వాత ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కార్మికులపై ప్రతీకార చర్యలు మొదలు పెట్టింది. 300 మందికి పైగా కార్మికులను నిర్బంధం లోకి తీసుకుంది. అల్లర్లు, విధ్వంసం, హత్యా ప్రయత్నం లాంటి నేరాలను కార్మికులు, కార్యకర్తల పైనే కాకుండా విలేఖరుల పైన కూడా మోపి అరెస్టులు సాగించింది.
అరెస్ట్ అయిన కార్యకర్తలలో ఢిల్లీ యూనివర్సిటీ కి చెందిన 25 సం.ల ఆకృతి చౌదరి ఒకరు. ఆమె అప్పటికే హిస్టరీలో పి.జి చేశారు. ప్రోగ్రెసివ్ ఆర్టిస్ట్స్ లీగ్ కార్యకర్తగా పని చేస్తూ “మజ్దూర్ బిగుల్” పత్రికకు విలేఖరిగా కూడా ఆమె పని చేస్తోంది. లక్నో నుండి నడిచే ఈ పత్రిక ప్రధానంగా కార్మికుల హక్కులు, కార్మికుల పోరాటాలను కవర్ చేస్తూ వార్తలు, ఆర్టికల్స్ ప్రచురిస్తుంది.
“కార్మికులను ఆందోళనకు రెచ్చగొట్టడంలో, వారి చేత హింసాత్మక ఆందోళనలు చేయించటంలో ఆకృతి కీలక మైన పాత్ర పోషించిందని పోలీసులు దాఖలు చేసిన చార్జి షీట్ ఆరోపించింది. తమ ఆరోపణలకు ఎలక్ట్రానిక్ మరియు వీడియో సాక్ష్యాలు ఉన్నాయని పోలీసులు తమ అరెస్ట్ ను సమర్ధించుకున్నారు. అంతటితో ఆగకుండా ఆకృతి చౌదరికి మరో కార్యకర్త సత్యం వర్మ కు విదేశాల నుండి నిధులు అందుతున్నాయని పోలీసులు ఆరోపించారు. ఇండియాలో ఆందోళనలు, హింస రెచ్చగొట్టేందుకే నిధులు అందాయని పోలీసుల ఉద్దేశం.
ఆకృతిని అరెస్ట్ చేసిన నెల రోజుల తర్వాత మే 13 తేదీన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆమె పైన జాతీయ భద్రతా చట్టంను ప్రయోగించింది. సత్య వర్మ పైన కూడా ఈ చట్టాన్ని ప్రయోగించారు. ఈ చట్టం నిజానికి జాతీయ భద్రతా నేరాలు జరగకుండా వాటిని నిరోధించేందుకు ముందే ప్రయోగించి నిర్బంధం లోకి తీసుకునేందుకు అనుమతి ఇస్తుంది. నేరం మోపబడిన వ్యక్తిని కోర్టు ట్రయల్ తో సంబంధం లేకుండా వ్యక్తిని నిర్దిష్ట కాలం పాటు జైలు పాలు చేయవచ్చు. నిర్బంధాన్ని ప్రభుత్వాలు తమ చిత్తానుసారం పొడిగించటానికి కూడా ఈ చట్టం అనుమతిస్తుంది. జాతీయ భద్రతకు ప్రమాదం తేనున్నాడని ఆరోపించి కోర్టు విచారణ లేకుండానే తమ నిర్బంధాన్ని ప్రభుత్వం సమర్చించుకోవచ్చు.
ఆకృతి చౌదరి అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ కోసం పిటిషన్ వేసింది. సెషన్స్ కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వటానికి అనేక మార్లు నిరాకరించింది. దానితో ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టు ఆమెకు బెయిల్ ఇవ్వకుండా మొదట హై కోర్టును సంప్రదించాలని కోరుతూ కేసును అలహాబాద్ హై కోర్టుకు వెళ్లాలని చెప్పింది. దరిమిలా ఆకృతి అలహాబాద్ హై కోర్టును ఆశ్రయించింది. తనకు వ్యతిరేకంగా జారీ చేసిన డిటెన్షన్ ఆర్డర్ ని రద్దు చేయాలని కోరింది.
పోలీసుల ఆరోపణలు ఏ విధంగా తప్పో చెబుతూ ఆమె తన పిటిషన్ లో వివరించింది. వాస్తవంగా జరిగిన ఘటనలు, పోలీసులు ఆరోపించిన ఘటనలు వేరు వేరని, నేరాన్ని సృష్టించి తనపై మోపారని ఆమె కోర్టుకు తెలిపింది. ఏప్రిల్ 13 తేదీన జరిగిన హింసాత్మక ఘటనలను తాను రెచ్చగొట్టినట్లు పోలీసులు ఆరోపించారని కానీ తాను అప్పటికే, అనగా ఏప్రిల్ 11 నుండి పోలీసుల నిర్బంధంలో ఉన్నానని, పోలీసు నిర్బంధంలో ఉంటూ బైట హింస ఎలా రెచ్చగొట్టానని ప్రశ్నించింది. తనపై అనిర్దిష్టంగా, ఆధారరహితంగా, ఎలాంటి సాక్షాల మద్దతు లేకుండా ఆరోపణలు చేశారని తెలిపింది.
కోర్టు పరిశీలించిన అంశాల్లో ఒకటి ఆకృతికి పోలీసులు నోటీసు ఇచ్చారా లేదా అన్నది. సెక్షన్ 126 కింద షో=కాజ్ నోటీసు ఇచ్చే ముందు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 130 కింద నోటీసు ఇచ్చి, శాంతి చెదరకుండా ఉంటానన్న బాండ్ ఇవ్వాలని పోలీసులు కోరారా లేదా అన్న ప్రశ్న కోర్టు ముందు తలెత్తింది. అలాంటి నోటీసు ఏమీ ఇవ్వలేదని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు చెప్పింది.
అంతే కాకుండా ఆందోళన, హింస జరపటానికి మార్చి 2026 లోనే ఆకృతి బృందం కుట్రకు పాల్పడినట్లు ప్రభుత్వం ఆరోపించింది. ఆకృతి చౌదరి, కరవాల్ నగర్ లోని హోగేష్ స్వామి లైబ్రరీ లో సహచరులతో సమావేశం ఏర్పాటు చేసి హింసాత్మక ఆందోళన నిర్వహణకు ఒక వ్యూహాన్ని రచించారని, సదరు పధకాన్ని హర్యానా లోని మనేసార్ లో అమలు చేసి తదనంతరం నొయిడా లోని గౌతమ్ బుద్ధ నగర్ లో అమలు చేశారని పోలీసులు ఆరోపించారు.
కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు కోర్టు గుర్తించింది. తమ సమావేశం వాస్తవానికి “షాహిద్ భగత్ సింగ్ యువ కేంద్ర” అనే విద్యా కేంద్రం వద్ద జరిగిందని, దీనిని ఏడాది కాలంగా నిర్మిస్తున్నామని, నిర్మాణం పూర్తయి ప్రారంభం కోసమే అక్కడ గుమి కూడామని ఆకృతి కోర్టుకు చెప్పింది. కార్మికుల పిల్లలు, పొరుగు ప్రాంతాల నివాసాల్లోని పిల్లలకు విద్య నేర్పడటానికి తమ కేంద్రం ఏర్పాటు చేశామని చెప్పింది. పిల్లలకు పెయింటింగ్, చెస్, క్విజ్ లాంటి పోటీలు పెట్టి బహుమతులు ఇచ్చేందుకు కూడిక జరిగిందని తెలిపింది.
ఆకృతి అప్పటి వరకు ఎప్పుడూ అరెస్ట్ అయిన చరిత్ర లేదు. వీడియో సాక్షాన్ని చూపాలని పోలీసులను కోర్టు కోరగా వారు చూపలేకపోయారు. వీడియో చూపటానికి బదులు మరింత సమయం కావాలని కోరారు. కానీ కోర్టు అందుకు నిరాకరించింది. పోలీసులు కట్టుకధలు అల్లుతున్నారని గద్దించింది. బూటకపు ఎన్ఎస్ఏ కేసులను రద్దు చేస్తున్నట్లు తీర్పు చెప్పింది. అక్రమంగా నిర్బంధం లోకి తీసుకున్నందుకు గాను 5 లక్షల రూపాయలు పరిహారంగా నొయిడా అధికారులు చెల్లించాలని ఆదేశించింది.
ఎన్ఎస్ఏ మినహాయింపు చట్టం, రెగ్యులర్ చట్టం కాదు
ఆకృతి చౌదరిపై ఎన్ఎస్ఏ కేసును రద్దు చేయాలని చెబుతూ 15 పేజీల తీర్పును కోర్టు ప్రకటించింది. ప్రజల ప్రాధమిక హక్కులు, పౌర హక్కులకు సంబంధించి ముఖ్యమైన పలు అంశాలను హై కోర్టు ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. “ఎన్ఎస్ఏ చట్టం మినహాయింపుగా ప్రయోగించే చట్టమే తప్ప తోచినప్పుడల్లా ప్రయోగించే చట్టం కాదు. కేసులోని మెరిట్స్ ని బట్టి నిందితునికి బెయిల్ లభించే కేసుకు బదులు మోపే చట్టం కాదిది.
రాజ్యం కట్టుకధలతో ఈ చట్టాన్ని మోపటానికి వీలు లేదు. ఒక జిల్లా మేజిస్ట్రేట్, వివరమైన కారణాలను చూపిస్తూ వ్యక్తులను నిర్బంధం లోకి తీసుకునేందుకు ఈ చట్టం అనుమతిస్తుంది. అంతే తప్ప సాక్షాలు లేకుండా కేవలం (ప్రభుత్వం/పోలీసుల) అభిప్రాయాల మీద ఆధారపడి వ్యక్తులను నిరంతరాయంగా నిర్బంధం లోకి తీసుకునేందుకు ఎన్ఎస్ఏ చట్టం అనుమతించదు” అని హై కోర్టు తన తీర్పులో పేర్కొంది.
“శాంతికి భంగం కలిగే అవకాశం ఉన్నదని ముందే ఊహించి బహిరంగ స్థలాలలో గుమి కూడకుండా ప్రజలను నోరోధించటం లేదా తమ హక్కుల కోసం ఆందోళనలు నిర్వహించ కుండా ఆటంకపరచటం అంటే అపుడే పుట్టిన పాపను స్నానపు నీళ్ళతో సహా కలిపి పారవేయటంతో సమానం… వాళ్ళు (ఐఏఎస్ & ఐపిఎస్) రాజ్యాంగానికి విధేయులుగా ఉండాలి తప్ప రాజకీయ పాలకులకు కాదు… రాజ్యాంగానికి విధేయంగా ఉంటామన్న తమ పవిత్ర ప్రతిజ్ఞను వాళ్ళు ఉల్లంఘించిన ప్రతి సారీ ఉత్తర ప్రదేశ్ ప్రజలు వారిని బ్రిటిష్ సామ్రాజ్యపు అవశేషాలుగా గుర్తించగలరని గమనించాలి” అని హై కోర్టు తీర్పు, ప్రత్యక్షంగా ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు, పరోక్షంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గడ్డి పెట్టింది. హై కోర్టు తీర్పే చెప్పినట్టుగా రాజకీయ పాలకుల ఆదేశాలను ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు తు.చ. తప్పకుండా పాటిస్తారు గనకనే ఇది యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వానికి కూడా చేసిన హెచ్చరిక! ఆర్వేలియన్ డిస్టోపియా గురించి బి.ఎస్.సి గ్రాడ్యుయేట్ ఐనా యోగి ఆదిత్యనాధ్ కి తెలియకుండా ఉండదు.
“పౌరుల రాజ్యాంగ హక్కులను, వారి గౌరవాన్ని మరియు సంక్షేమాన్ని రక్షించే బృహత్తర కర్తవ్యాన్ని వారికి అప్పగించినందున బ్యూరోక్రట్లు, పోలీసు అధికారులు విస్తారమైన అధికారాలు కలిగి ఉంటారు. వారి విధేయత రాజ్యాంగానికి ఉండాలి తప్ప రాజకీయ పాలకులకు కాదు” అని కోర్టు తీర్పు పేర్కొంది. తమ అధికారాలను వాళ్లు దుర్వినియోగం చేయరాదని హెచ్చరిస్తూ “తమ రాజ్యాంగ ప్రతిజ్ఞను ఉల్లంఘిస్తే బ్రిటిష్ సామ్రాజ్య అవశేషాలుగా భావించి ప్రజలు అలజడి, ఆందోళనలకు పాల్పడే పరిస్ధితులను కల్పించే ప్రమాదం పొంచి ఉంటుంది” అని తీర్పు పేర్కొంది.
గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా మేజిస్ట్రేట్ మేధా రూపం ను హై కోర్టు ప్రత్యేకంగా తప్పు పట్టింది. ఆకృతి చౌదరి, సత్యం వర్మలను ఎన్ఎస్ఏ చట్టం కింద నిర్బంధం లోకి తీసుకోవటాన్ని ఆమె ఆమోదించటమే అందుకు కారణం. పోలీసులు సమర్పించిన పత్రంలో నిందితులపైన ఆరోపణలు మాత్రమే ఉన్నాయి తప్ప ఆరోపణలకు సమర్ధనగా ఒక్క సాక్షాన్ని కూడా చూపలేదని ఎత్తి చూపిన కోర్టు, ఎన్ఎస్ఏ లాంటి అసామాన్య చట్టాన్ని ప్రయోగించే ముందు రికార్డులను స్క్రూటినీ చేయటంలో జిల్లా మేజిస్ట్రేట్ విఫలం అయిందని కోర్టు తప్పు పట్టింది.
ఎన్ఎస్ఏ చట్టాన్ని నాసా చట్టం అని కూడా పిలుస్తారు. ఈ చట్టాన్ని ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించిన కాలంలో ప్రజలపైనా, ఉద్యమకారుల పైనా విస్తృతంగా ప్రయోగించి వేల మందిని జైళ్ళలో నిర్బంధించింది. కాగా యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వం కేవలం కనీస వేతనాలను పెంచాలని కార్మికులు చేసిన ఆందోళనలను కారణంగా చూపిస్తూ కార్మికుల హక్కులకు ఒక విలేఖరిగా తమ రాతల ద్వారా మద్దతు ఇచ్చిన ఆకృతి చౌదరి పైన నాసా చట్టాన్ని ప్రయోగించింది. కనుక ఉత్తి పుణ్యానికి సామాన్యులపై ముఖ్యంగా మైనారిటీ మతానికి చెందిన పేద ప్రజలపై వివక్షాపూరితంగా హింసాత్మకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలకు హై కోర్టు తీర్పు, ఒక హెచ్చరికగా పని చేయాలని కోరుకోవటంలో తప్పులేదు.
