
–
24/04/2026
** అమెరికా పసిఫిక్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ పపారో, అమెరికా నేవీ వద్ద సరిపోయినన్ని ఆయుధాలు లేవని వాపోయాడు. ఇరాన్ పైన దాడి కోసం ఆయుధాలు ఖర్చై పోయాయని ఆయన చెప్పాడు. “నా వద్ద తగినంత సంఖ్యలో యాంఫీబియస్ షిప్ (నీరు, నేల రెండింటి పై వెళ్ళగల షిప్ లు) లేవు. తగినన్ని సర్ఫేస్ డిస్ట్రాయర్ లు లేవు. తగినన్ని ఎటాక్ సబ్-మెరైన్లు అయితే ఖచ్చితంగా లేవు. మన ప్రయాణ మార్గం తప్పుడు దిశలో నడుస్తోంది” అని వాపోయినట్లు వాషింగ్టన్ టైమ్స్ పత్రిక తెలిపింది.
** “చైనా, తైవాన్ ను కలుపుకోవటానికి ప్రయత్నాలు (యుద్ధం) ప్రారంభిస్తే ఆ ప్రయత్నాలను నివారించి తైవాన్ ను కాపాడటానికి అమెరికా రంగం లోకి దిగుతుందన్న నమ్మకాన్ని ఇరాన్ యుద్ధం వమ్ము చేసింది” అని వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రిక విశ్లేషించింది. ఏ లక్ష్యాలనైతే నిర్దేశించి అమెరికా, ఇజ్రాయెల్ లు ఇరాన్ పై ఆధిపత్య యుద్ధం సాధించాయో ఆ లక్ష్యాల్లో ఒక్క దానిని కూడా అవి సాధించలేదని ఈ విశ్లేషణ ద్వారా అర్ధమవుతుంది. ఇరాన్ పాలకులను మార్చి తమ కీలు బొమ్మ ప్రభుత్వాన్ని ప్రతిష్టించటం, ఇరాన్ చమురు, గ్యాస్ లను అమెరికా కంపెనీలకి అప్పగించటం, ఇరాన్ అణు సామర్ధ్యాన్ని నిర్మూలించి ఇరాన్ వద్ద ఉన్న 600 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియంను వశం చేసుకోవటం, ఇరాన్ మిసైల్ టెక్నాలజీ సామర్ధ్యాన్ని నిర్మూలించటం ఇత్యాది లక్ష్యాలను అమెరికా, ఇజ్రాయెల్ లు ప్రకటించాయి. ఈ లక్ష్యాలను సాధించలేకపోగా రుజువు చేయబడ్డ ఆయుధ సామర్ధ్యంతో, భూమండలం పైన అత్యంత మానవతా-వ్యతిరేక, అనాగరిక, సర్వ భ్రష్టమైన రెండు రాజ్యాలను ఎదిరించి నిలబడటమే కాకుండా అత్యంత విలువైన విజయం సాధించిన దేశంగా ఇరాన్ నిలబడింది. ఏం చేయాలో పాలుపోక వెర్రి మొర్రి ప్రకటనలతో డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ ను నింపేస్తుంటే, హిజ్బొల్లా ను జయించలేక సౌత్ లెబనాన్ లో అమాయక పౌరుల ఇళ్లను నేలమట్టం చేస్తోంది ఇజ్రాయెల్!
** చైనాతో యుద్ధం చేయలేని స్థితిలోకి అమెరికా జారిపోయిందన్న విషయాన్ని అమెరికా అధికారులు వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికతో మాట్లాడుతూ అంగీకరించారు. “ఇరాన్ యుద్ధంలో అమెరికా ఎన్ని ఆయుధాలను ఖర్చు చేసిందంటే సమీప భవిష్యత్తులో చైనా, తైవాన్ పైన ఆక్రమణ దాడి చేస్తే తైవాన్ ను డిఫెండ్ చేసేందుకు తయారు చేసుకున్న పథకాలు వేటినీ పూర్తిగా అమలు చేయగల స్థితిలో అమెరికా లేదు” అని అమెరికా అధికారులు ఒప్పుకున్నారు.
** ఇరాన్ యుద్ధం కోసం ఖర్చయిన ఆయుధాలు, మందుగుండును పునరుత్పత్తి చేసేందుకు, ఆయుధాగారాన్ని యుద్ధం ముందరి నిల్వలకు చేర్చేందుకు కనీసం 6 సం లు పడుతుందని అమెరికా అధికారులు వాల్ స్ట్రీట్ జర్నల్ కు చెప్పారు.
** మరో పక్క ఇరాన్ తన మిలటరీ సామర్థ్యాన్ని, ఆయుధాలను, మందుగుండును వేగంగా పునరుత్పత్తి చేస్తున్నదని అమెరికా వర్గాలు నమ్ముతున్నాయి. ఇరాన్ వాయు సేనను పూర్తిగా నిర్మూలించామని ట్రంప్ చెప్పుకున్నాడు. కానీ మూడింట రెండింతలు ఇరాన్ వాయు సేన చెక్కు చెదరలేదు అని అమెరికా మిలటరీ అధికారులను ఉటంకిస్తూ సీబీఎస్ వార్తా సంస్థ విశ్లేషించింది.
** ఇరాన్ యుద్ధంలో తనకు సహకరించడానికి నిరాకరించిన సభ్య దేశాలను నాటో కూటమి నుండి సస్పెండ్ చేయాలని అమెరికా యోచిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ ఇంటర్నల్ మెమో ను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. అట్లాంటిక్ సముద్రానికి పశ్చిమాన అమెరికా, తూర్పున ఐరోపా ఉన్న సంగతి తెలిసిందే. గల్ఫ్ దేశాలలోని అమెరికాకి చెందిన అతి పెద్ద, చిన్న సైనిక, వాయు, నావికా స్థావరాలను ఇరాన్ ఉపయోగించటానికి వీలు లేకుండా నాశనం చేయటంతో అమెరికా ఫైటర్ జెట్లు అనివార్యంగా పశ్చిమ ఐరోపా దేశాల్లోని తన స్థావరాల నుండి యుద్ధాన్ని నిర్వహించాల్సి వచ్చింది. రెండు అమెరికన్ విమాన వాహక నౌకలను ఇరాన్ దాడుల వలన నిరుపయోగం కావటం వలన కూడా ఈ పరిస్ధితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో తమ దేశ భూభాగాన్ని ఇరాన్ పై యుద్ధానికి ఉపయోగించటానికి అనుమతించటం లేదని స్పెయిన్ ప్రధాని స్పష్టం చేశాడు. స్పెయిన్ ను నాటో నుండి సస్పెండ్ చేసేందుకు అమెరికా రక్షణ శాఖ యోచిస్తున్నట్లు ఈ వార్తను బట్టి అర్ధం చేసుకోవచ్చు.
** హార్ముజ్ జలసంధి ఇప్పటికీ ఇరాన్ కంట్రోల్ లోనే ఉందని రాయిటర్స్ తేల్చి చెప్పింది. అమెరికా విధించిన బ్లాకెడ్, సీజ్ ఫైర్ ఒప్పందం కు విరుద్ధం అనీ అమెరికా బ్లాకెడ్ ఎత్తివేసే వరకు హార్ముజ్ జలసంధి పైన తమ నియంత్రణ కొనసాగుతుందని ఇరాన్ మరోసారి స్పష్టం చేసింది.
** చిన్న చిన్న అటాక్ బోట్లతో ఇరాన్ హార్ముజ్ జలసంధి ను కంట్రోల్ చేస్తున్నదని వార్తా సంస్థల ద్వారా తెలుస్తోంది. ఇరాన్ మిస్సైల్స్, డ్రోన్ లతో పాటు ఈ చిన్న ఎటాక్ బోట్లు హార్ముజ్ లో ప్రమాదకరంగా మారాయని రాయిటర్స్ విశ్లేషించింది. “ఇరాన్ నావికా దళం మొత్తాన్ని సర్వనాశనం చేసేశామ్. కానీ ఇరాన్ అటాక్ బోట్ల వల్ల ప్రమాదం ఉండదన్న ఉద్దేశంతో వాటి జోలికి వెళ్లలేదు” అని ట్రంప్ ట్రూత్ సోషల్ లో చెబుతూ “ఈ బోట్లు సముద్రంలో ఎక్కడ కనపడినా వెంటనే నాశనం చేయమని ఆదేశాలు ఇచ్చాను” అని ట్రంప్ ప్రకటించాడు.
** ఇరాన్ యుద్ధం వల్ల ఏర్పడ్డ చమురు సంక్షోభం ప్రభావం పాలిస్టర్ సరఫరాదారులపై కూడా పడింది. పెట్రోలియం సరఫరా తగ్గటం వలన వాళ్ళు పాలిస్టర్ సరఫరా చేయలేక పోతున్నారు. దాంతో ఇండియా, బంగ్లాదేశ్ లలోని దుస్తుల ఉత్పత్తిదారులు నష్ట పోతున్నారు. దరిమిలా విదేశీ రెడీమేడ్ దుస్తుల కంపెనీలు కూడా నష్టపోతున్నాయి. బ్రాండెడ్ దుస్తుల కంపెనీలు ఏవీ సొంతగా దుస్తులు కుట్టవు. అవి ఇండియా, బంగ్లాదేశ్ లలో కుప్పలు తెప్పలు గా ఉన్న పేరు లేని రెడీ మేడ్ కంపెనీలకు ఆర్డర్లు ఇస్తాయి. వాటి పైన తమ బ్రాండ్ వేసి అనేక రెట్లు ఎక్కువకు అమ్ముతాయి.
** పాలిస్టర్ ఫైబర్ ను పెట్రోలియం నుండి తయారు చేసే ఉప ఉత్పత్తి. ఇధలీన్, టెరిఫ్తాలిక్ యాసిడ్ ల మధ్య పాలిమరైజేషన్ అనే రసాయనక చర్య జరపటం ద్వారా పాలిస్టర్ ఫైబర్ ని ఉత్పత్తి చేస్తారు.
** బ్రాండెడ్ కంపెనీలు కేవలం డిజైన్, మార్కెటింగ్, బ్రాండింగ్ మాత్రమే చూస్తాయి. ఇండియా, బంగ్లాదేశ్, చైనా, వియత్నాం, టర్కీ లాంటి దేశాల్లో చిన్న కంపెనీలకు కాంట్రాక్టు కు ఇచ్చి అతి తక్కువ లేబర్ ఖర్చులు చెల్లించి, అధిక రేట్లకు అమ్మటం ద్వారా అధిక లాభాలు ఆర్జిస్తాయి. రెడీ మేడ్ దుస్తుల్లో ముఖ్యంగా స్పొర్ట్స్ దుస్తుల్లో కాటన్ తో పాటు పాలిస్టర్ కూడా వాడతారు. నిజానికి ఫాస్ట్ ఫ్యాషన్ లో కాటన్ 40 శాతం వాడితే పాలిస్టర్ 60 శాతం వాడతారు. షూ తయారీ లో కూడా పాలిస్టర్ ప్రధాన ముడి పదార్ధంగా వాడతారు.
** పాలిస్టర్ సరఫరా తగ్గటం వలన హెచ్ & ఎం లాంటి ఫ్యాషన్ దుస్తుల కంపెనీలు తమ ఉత్పత్తులు తగ్గించుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది.
** మార్కెట్ల విషయానికి వస్తే, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏ ఐ), సెంట్రల్ బ్యాంకుల వడ్డీ రేట్లు… ఈ రెండు అంశాలతో పాటు ఇరాన్ యుద్ధం కూడా స్టాక్ పెట్టుబడిదారులు (స్టాక్ మార్కెట్ మదుపుదారులు) ను ప్రభావితం చేస్తున్న అతి పెద్ద మూడు కారణాలుగా ప్రస్తుతం ఉన్నాయి. హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం మరింత కాలం పాటు కొనసాగితే నష్టాన్ని పూడ్చుకునేందుకు అనేక సంవత్సరాలు పడుతుందని గల్ఫ్ దేశాల్లోని చమురు, గ్యాస్ కంపెనీలు చెబుతున్నాయి. ఇరాన్ దాడుల్లో పెట్రోలియం రిఫైనరీలు, గ్యాస్ ఫీల్డ్ లు తీవ్రంగా దెబ్బ తినటంతో ఉత్పత్తిని యుద్ధం ముందరి స్థాయికి చేర్చటానికి ఇప్పటి నష్టం వల్లనే కనీసం 4 యేళ్ళు పడుతుందని అవి చెప్పాయి.
** కతార్ లాంటి దేశాలు తాము సొంతగా ఒక రాజీ ఫార్ములాను తయారు చేసి చర్చలకు సహకరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కానీ కతార్ ను ఎవరూ పట్టించుకున్న దాఖలా లేదు.


** ఇరాన్ తమపై చేసిన దాడుల వలన కలిగిన నష్టాన్ని బట్టి చూస్తే, ఇరాన్ పైన ఇక ముందు నమ్మకం పెట్టుకునేందుకు దాదాపు అసాధ్యం అని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రతినిధి వ్యాఖ్యానించాడు. ఇన్నాళ్లూ అమెరికా, ఇజ్రాయెల్ లతో అంట కాగుతూ, అరబ్ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా తమ నేలపై అమెరికా సైనిక స్థావరాల నిర్మాణానికి అనుమతించి, పాలస్తీనా ప్రజల ప్రయోజనాలను అమెరికా, ఇజ్రాయెల్ కాళ్లవద్ద పడేసిన యుఏఇ ని అరబ్ ప్రజలు ఎందుకు నమ్మాలో కూడా ఈ పెద్ద మనిషి చెప్పి ఉండాల్సింది. ఇరాన్, తాను అరబ్ దేశం కాకపోయినప్పటికీ, పాలస్తీనా అరబ్బులు, లేబనీస్ అరబ్బులు, సిరియా లోని అనేక మతాలు, జాతుల (క్రిస్టియన్, అస్సిరియన్, బైజంటైన్, అలావైట్స్, కేధలీక్స్, సిరియా అరబ్, షియా మరియు సున్నీ, కుర్దు) ప్రయోజనాలను సంరక్షించటంలో అగ్ర భాగాన నిలబడిన ఇరాన్ ను కాకుండా అరబ్బు ప్రజలు మరే ఇతర గల్ఫ్ అరబ్ దేశాన్ని నమ్మాలో ఆయన చెప్పి ఉండాల్సింది.
** గురువారం సాయంత్రం (బహుశా రాత్రి) ఇరాన్ లోని ప్రధాన నగరాల పైకి అత్యంత చిన్న మైక్రో డ్రోన్ లు గుంపులు గుంపులుగా ప్రయోగించ బడ్డాయని, వాటిని సమయానికి గుర్తించి నాశనం చేయటంతో వాటి వలన నష్టం జరగలేదని ఇరాన్ ప్రకటించింది. ఈ మైక్రో డ్రోన్ ల ప్రయోగం తమ పని కాదని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి, అమెరికా ప్రతినిధులు ప్రకటించాయి. ఇరాన్ దేశం లోని అంతర్గత శత్రువులు ఆ పని చేసి ఉండవచ్చని పశ్చిమ పత్రికలు భావిస్తున్నాయి. కానీ ఇరాన్ లోపల ఉన్న అంతర్గత శత్రువులకు ఆయుధాలు సరఫరా చేసేది, చేస్తున్నది అమెరికా, ఇజ్రాయెల్ లే అన్నది తిరుగులేని సత్యం. మైక్రో డ్రోన్ ల వెనుక అమెరికా, ఇజ్రాయెల్ ల హస్తం ఉన్నా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం సీజ్ ఫైర్ నడుస్తోంది కనుక మైక్రో డ్రోన్ల ప్రయోగం సీజ్ ఫైర్ ఉల్లంఘన అవుతుంది. అందుకే అమెరికా, ఇజ్రాయెల్ లు హడావుడిగా తమకే పాపం తెలియదని చెప్పుకున్నాయి.
** ఇరాన్ ఫాస్ట్ బోట్లు సముద్రంలో రక్షణ కార్యకలాపాలకే కాకుండా ఎయిర్ డిఫెన్స్ కి కూడా ఉపయోగించ వచ్చు. ఇవి సర్ఫేస్ టూ ఎయిర్ మిసైళ్ళను మోసుకెళ్ల గలవు. అంటే సముద్రంలో ప్రయాణిస్తూనే గాలిలో ప్రయాణించే ఫైటర్ జెట్లు, మిసైళ్ల ను ఛేదించ గల శక్తిని కలిగి ఉంటాయి. ఇలాంటి బోట్లను ఇరాన్ వేలాదిగా తయారు చేసుకుందని తెలుస్తోంది. ఇరాన్ నేవీని మొత్తం సముద్రం అడుగుకి చేర్చామని ట్రంప్ గొప్పలు చెప్పినా కూడా అసలు విషయం ఏమిటంటే ఇరాన్ వద్ద నేవీ అనే విభాగం లేదు. ఈ ఫాస్ట్ బోట్ల తో కూడిన వ్యవస్తే ఇరాన్ కు వాయు సేన. ఇరాన్ వద్ద లేని నేవీని నాశనం చేశామని చెప్పటం డొనాల్డ్ ట్రంప్ మార్కు బడాయి వాగుడు తప్ప మరొకటి కాదు.