
–
ఎట్టకేలకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టివికె నాయకుడు విజయ్ జోసఫ్ కు మార్గం సుగమం అయింది. రెండు వామ పక్ష పార్టీలతో పాటు తాము కూడా టివికె కు మద్దతు ఇస్తామని విసికె పార్టీ శుక్రవారం ప్రకటించినప్పటికీ ఆ తర్వాత తన మద్దతుకు కొన్ని షరతులు విధించటంతో ప్రభుత్వం ఏర్పాటు మళ్ళీ సందిగ్ధంలో పడింది.
విజయ్ రెండు స్థానాల్లో గెలిచాడు. కాబట్టి ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అలా రాజీనామా చేసే స్థానంలో పోటీ చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని విసికె పార్టీ షరతు విధించింది. తమకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఇంకో షరతు విధించినట్లుగా కూడా వివిధ చానెళ్లు శుక్రవారం పొద్దు పోయాక ప్రకటించాయి.
విసికె నుండి టివికె ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇస్తున్నట్లు తనకు మద్దతు లేఖ అందలేదని రాష్ట్ర గవర్నర్ ప్రకటించాడు. విజయ్ తనకు అందజేసిన జాబితాలో కూడా ఆ ప్రసక్తి లేదని ఆయన చెప్పాడు. దానితో ప్రభుత్వం ఏర్పాటు మళ్ళీ అనుమానంలో పడింది.
టివికె ఏర్పాటు చేసే ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నందున తాము విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం లేదని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ప్రకటించటంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాడుతుందా లేదా అన్న అనుమానాలు మరింత బలపడ్డాయి.
అప్పటికే విజయ్ జోసఫ్ మూడు సార్లు గవర్నర్ ని కలిశాడు. కనీసం బూర్జువా ప్రజాస్వామ్య సూత్రాల పట్ల కూడా తనకు గౌరవం లేదని బిజెపి తన సొంత చర్యల ద్వారా ప్రత్యక్షంగా, గవర్నర్ల చర్యల ద్వారా పరోక్షంగా అనేక సార్లు రుజువు చేసుకుంది. ఇవే రాజకీయాలను కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో అమలు చేసినందున ఈ పరిస్ధితికి బిజెపి పార్టీని ఒక్కదాన్నే తప్పు పట్టలేము.
ఏ పార్టీకి మందబలం ఉన్నా కూడా ఇండియాలో ఇవే తరహా ఆధిపత్య, ఒంటెత్తు పోకడ, ఏక పక్ష రాజకీయాలే అవలంబిస్తాయి తప్ప నిజాయితీగా రాజ్యాంగబద్ధ సూత్రాల ప్రకారం రాజకీయాలు చేయగల పార్టీ ఇండియాలో లేదు గాక లేదు. భారత దేశంలో ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్ధిక వ్యవస్థ స్వభావమే అంత! దాని నుండి నిజాయితీ బూర్జువా రాజకీయాలను ఆశించటం గొంగట్లో వెంటుకలు ఏరటంతో సమానం.
చివరికి విసికె పార్టీ “ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత పరిస్ధితుల్లో టివికె పార్టీకి మద్దతు ఇవ్వటం రాజకీయ అవసరం” అని ప్రకటిస్తూ విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించింది. తెర వెనుక విసికె పార్టీకి ఏయే హామీలు లభించాయో తెలియాల్సి ఉన్నది.
మరో పక్క ఐయుఎంఎల్ పార్టీ కూడా విజయ్ ప్రభుత్వం ఏర్పడటానికి మద్దతు ఇస్తున్నట్లు తెలియజేసింది. దానితో విజయ్ బలం 120 అసెంబ్లీ స్థానాలకు చేరింది. శనివారం (మే 9 తేదీ) సాయంత్రం 7 గంటలకు కాస్త ముందుగా విజయ్ మరోసారి తమిళనాడు గవర్నర్ ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తనకు మద్దతు ఇస్తున్న ఎంఎల్ఏ ల జాబితా అందజేశాడు.
విసికే తరహాలోనే డిఎంకె అధినేత స్టాలిన్ ప్రకటన ఉన్నది. బహుశా స్టాలిన్ ఇచ్చిన క్యూ ను అనుసరించి ఐయుఎంఎల్, టివికె పార్టీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లు కనిపిస్తోంది. అయితే డిఎంకె పార్టీ కీ, తాము టివికె కు మద్దతు ఇవ్వటానికీ సంబంధం లేదని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. “మీరు డిఎంకె అనుమతి తీసుకుని టివికె కు మద్దతు ఇస్తున్నారా?” అన్న ప్రశ్నకు కమ్యూనిస్టు పార్టీల నాయకులు “మాకు ఆ అవసరం లేదు. సొంతగా మా నిర్ణయాలు మేము తీసుకోగలం” అని బదులు ఇచ్చారు.
తాజా ఎన్నికల బై ప్రోడక్ట్ గా డిఎంకె, కాంగ్రెస్ పార్టీల మధ్య దశాబ్దాల బంధం తెగిపోయింది. డిఎంకె పార్టీని సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీ డిఎంకె కూటమితో తెగతెంపులు చేసుకున్నట్లు ప్రకటించి, టివికె కు మద్దతు ప్రకటించింది. ఇది సహజంగానే డిఎంకె పార్టీ గౌరవానికి అప్రతిష్ట అయింది. ‘కాంగ్రెస్ పార్టీ తమకు వెన్నుపోటు పొడిచింది’ అని డిఎంకె సెకండరీ నేతలు ఆరోపించారు. బిజెపి తో కూటమి కట్టిన ఏఐఏడిఎంకె తో కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధపడటం వల్లనే తాము డిఎంకె తో సంబంధం తెంచుకోవాల్సి వచ్చిందని కాంగ్రెస్ చెబుతోంది.
నిజానికి ఏఐఏడిఎంకె పార్టీతో జట్టు కట్టి బైట నుండి మద్దతు ఇవ్వటం ద్వారా ఐనా సరే ప్రభుత్వం ఏర్పాటుకు డిఎంకె సిద్ధం కావటం ఆ పార్టీ ప్రకటించిన “మత తత్వ పార్టీ వ్యతిరేకత” సిద్ధాంతానికి ఆ పార్టీయే గండి కొట్టింది. ఆ విధంగా కాంగ్రెస్ చర్య నీతిమంతంగా మారినట్లు కాంగ్రెస్ నేతలు భాష్యం చెప్పుకుంటున్నారు. ఎవరు ఏది చెప్పుకున్నా ఈ పార్టీలన్నీ అవకాశవాద రాజకీయాలు నెరపటంలో ఆరితేరినవే.
ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, విసికె, లు ఏఐఏడిఎంకె తో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా లేవు. అందుకే ఏఐఏడిఎంకె ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావించిన డిఎంకె పధకం బెడిసి కొట్టింది.
విజయ్ జోసఫ్ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుంది అని నమ్మెందుకు ఎలాంటి సూచనలు లేవు. గతంలో డిఎంకె, ఏఐఏడిఎంకె పార్టీలలో ఉన్న నాయకులే ఇప్పుడు టివికె లో ప్రధాన నాయకులుగా ఉన్నారు. వారు ఎప్పుడూ ప్రజల కోసం పని చేసిన దాఖలాలు లేవు. కేవలం ధనిక వర్గాల కోసం పని చేస్తూ సొంతగా ఆస్తులు కూడబెట్టటం కోసమే వారు పని చేశారు. అలాంటి వారితో కలిసి ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాన్ని విజయ్ జోసఫ్ నిర్వహించటం సాధ్యం కాదు. అలాంటి ఉద్దేశం విజయ్ కు ఉందా అన్నది అనుమానమే.
ఎందుకంటే సినిమాలో వేసే పాత్రలకు, నిజ జీవితంలో వారు పోషించే పాత్రలకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే రోనాల్డ్ రీగన్ నుండి, పవన్ కళ్యాణ్ వరకు అనేక మండి సినిమా నటులు, సినిమా నాయక పాత్రల పోషకులు రుజువు చేశారు. విజయ్ జోసఫ్ రుజువు చేసేది అంతకు మించి ఏమీ ఉండబోదు. హాంగ్ అసెంబ్లీ ఏర్పడ్డ దృష్ట్యా తన ప్రభుత్వాన్ని కాపాడుకోవటం లోనే విజయ్ ఎక్కువ సమయాన్ని కేటాయించ వలసి రావచ్చు.