
–
తమిళ సినిమా నటుడు విజయ్ జోసఫ్ నాయకత్వం లోని టివికె పార్టీ తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశలో ఆ రాష్ట్రంలో పరిణామాలు జరుగుతున్నాయి. తలా రెండు సీట్లు గెలుచుకున్న సిపిఐ, సిపిఐ (ఎం), విసికె పార్టీలు టివికె పార్టీకి మద్దతు ఇవ్వటానికి నిర్ణయించటంతో తమిళనాడు గవర్నర్ కు టి.వి.కె పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించక తప్పకపోవచ్చు.
దశాబ్దాల పాటు ఉప్పు నిప్పు గా మసలిన డిఎంకె, ఏఐఏడిఎంకె పార్టీలు ఉమ్మడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న పుకార్లు మరో పక్క దండిగానే షికార్లు చేస్తున్నాయి. పళనిస్వామి నాయకత్వం లోని ఏఐఏడిఏంకె పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో మద్దతు ఇవ్వాల్సిందిగా డిఏంకె పార్టీని మద్దతు కోరింది. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అధికారం పార్టీ నేత స్టాలిన్ కి అప్పగిస్తూ లెజిస్లేచర్ పార్టీ తీర్మానం చేయటంతో స్టాలిన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.
టివికె పార్టీకి మద్దతు ఇవ్వాలని 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయించింది. తలా 2 సీట్లు గెలిచిన సిపిఐ, సిపిఎం, వి.సి.కె పార్టీలు విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు నిర్ణయించాయి. టివికె పార్టీ 108 సీట్లు గెలిచింది. విజయ్ రెండు సీట్లకు పోటీ చేసి, రెండింటిలో గెలిచినందున ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. కనుక టివికె పార్టీ చేతిలో 107 సీట్లు మాత్రమే ఉంటాయి.
వెరసి టివికె కూటమికి 107+2+2+2+5 మొత్తం 118 సీట్లు వచ్చి చేరతాయి. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు కూడా అన్నే స్థానాలకు వెలువడ్డాయి. ఒక స్థానానికి విజయ్ రాజానామా చేస్తాడు కనుక 233 స్థానాలకు గానీ మెజారిటీ మార్కు 117 స్థానాలను టివికె కూటమి దాటినట్లే.
తాజా ఎన్నికలు హాంగ్ ఫలితాన్ని ఇవ్వటంతో అది డిఎంకె, కాంగ్రెస్ పార్టీలను విడదీసింది. టివికె కు మద్దతు ప్రకటించినందుకు గాను కాంగ్రెస్ పార్టీని విద్రోహ పార్టీ గా డిఎంకె ప్రకటించింది. ప్రభుత్వం ఏర్పాటులో ఏఐఏడిఎంకె పార్టీకి మద్దతు ఇచ్చేందుకు ఆలోచిస్తున్నదని అందుకే తాము టివికె కి మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని కాంగ్రెస్ చెబుతోంది. కానీ డిఎంకె, ఏఐఏడిఎంకె పార్టీల మధ్య చర్చలు జరగక మునుపే టివికె పార్టీ, కాంగ్రెస్ పార్టీని మద్దతు కోరటం, కాంగ్రెస్ అందుకు అంగీకరించటం జరిగినట్లు పత్రికల వార్తలను బట్టి అర్ధం అవుతోంది. ఐనా కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి రాజకీయాలు కొత్త కాదు. రాజకీయంగా చూస్తే ఏఐఏడిఎంకె, బిజెపి పార్టీతో పొత్తు ఉన్నందున ఆ పార్టీకి మద్దతు ఇవ్వటం అంటే డిఎంకె పార్టీ అవకాశవాదం తో వ్యవహరించినట్లే.
ఐయుఎంఎల్ (ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్) పార్టీ 2 సీట్లు గెలుచుకుంది. ఈ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తున్నదో సమాచారం లేదు. ఫలితాలు వెలువడ్డాక ఐయుఏంఎల్, సిపిఐ, సిపిఎం పార్టీలు టివికె పార్టీకి మద్దతు ఇచ్చేందుకు నిరాకరించాయి. కానీ పార్టీలు తమను అనుసరించవలసిన అవసరం లేదని తాము సొంతగా నిర్ణయాలు తీసుకోవచ్చని డిఎంకె నేత స్టాలిన్ ప్రకటించటంతో ఆ పార్టీ మిత్రులు సిపిఐ, సిపిఎం, విసికె టివికె కు మద్దతు ఇవ్వటానికి నిర్ణయించినట్లు కనిపిస్తున్నది.
ఐయుఎంఎల్ పార్టీ, తమ అవసరాల రీత్యా రానున్న రోజుల్లో టివికె పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ, టివికె పార్టీకి మద్దతు ఇస్తున్నందున తాము టివికె కు మద్దతు ఇవ్వలేమని ఆ పార్టీ మే 6 తేదీన ప్రకటించింది. ఆ నిర్ణయం మార్చుకునే అవకాశం కనిపిస్తున్నది.
బిజెపి నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం ఆజ్ఞలను శిరసా వహించే గవర్నర్, మరొకసారి సో=కాల్డ్ భారతీయ ప్రజాస్వామిక సాంప్రదాయాలను తుంగలో తొక్కిన సంగతి తెలిసిందే. హంగ్ అసెంబ్లీ ఫలితాలు వెలువడినప్పుడు సాధారణంగా గవర్నర్ అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలని కోరాలి.
ఈ మేరకు సుప్రీం కోర్టు గతంలో విస్పష్టమైన తీర్పు ఇచ్చింది. కానీ చిత్రంగా గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించటం కంటే బిజెపి వ్యతిరేక పార్టీలను ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా చూడటం లోనే ఎక్కువ ఆసక్తిగా ఉన్నాడు. అత్యధిక సీట్లు పొందిన టివికె పార్టీ స్వయంగా ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చినా కూడా మొదట తన వద్ద మెజారిటీ నిరూపించుకోవాలని కోరాడు. ఇది సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధం. ప్రభుత్వాలు తమ బలాన్ని నిరూపించుకోవాల్సిన ఏకైక ప్రదేశం అసెంబ్లీ యే అని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తమిళనాడు గవర్నర్ ఆ విధంగా తిరస్కరించాడు.
టివికె ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సహకరిస్తామని, 6 నెలల వరకు ఆ పార్టీ ప్రభుత్వాన్ని తాము డిస్ట్రబ్ చేయబోమని డిఎంకె అధినేత స్టాలిన్ మొదట ప్రకటించాడు. కానీ అంతలోనే ప్రభుత్వం ఏర్పాటులో మద్దతు ఇవ్వాలని కోరిన ఏఐఏడిఎంకె పార్టీ కు బైటి నుండి మద్దతు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నానని ఆయన ప్రకటించాడు. ఇది అవకాశవాదం తప్ప మరొకటి కాదు. అధిక స్థానాలు గెలిచిన టివికె పార్టీ కి అవకాశం ఇవ్వటమే సరైన నిర్ణయం అవుతుంది. రాజ్యాంగాన్ని గౌరవించినట్లు అవుతుంది.
అప్ డేట్ (09:11 PM)
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ తమిళనాడు గవర్నర్ తమిళగ వేట్రి కజగం (టివికె) పార్టీ అధినేత విజయ్ జోసఫ్ ను ఆహ్వానించాడు. శనివారం ఉదయం 11 గంటలకు చెన్నై లోని లోక్ భవన్ లో విజయ్ జోసఫ్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.
ప్రభుత్వ ఏర్పాటు కోసం తనకు మద్దతు ఇస్తున్న 118 మంది ఎంఎల్ఏ ల జాబితాను విజయ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కు సమర్పించటంతో ఆయనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించక తప్పలేదు. కాంగ్రెస్ నాయకులు అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గే, పార్టీ ఎంపి రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారని తెలుస్తున్నది.
విడుతలై చిరుతైగల్ కచ్చి (విసికె), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) పార్టీలు విజయ్ నాయకత్వం లోని టివికె పార్టీకి మద్దతు ప్రకటించాయి. 5 సీట్ల కాంగ్రెస్ పార్టీ ముందే మద్దతు ఇచ్చింది. (107+5+6 = 118) మొత్తం 118 ఎంఎల్ఏ ల మద్దతు తో మెజారిటీ నెంబర్ ను విజయ్ సాధించాడు. మూడు రోజుల్లో మూడు సార్లు విజయ్ గవర్నర్ ను కలవాల్సి రావటం, బిజెపి పార్టీ ప్రజాస్వామిక సంప్రదాయాలకు ఎలాంటి గౌరవం ఇచ్చేదీ తెలియజేస్తుంది.
విజయ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గే తీవ్ర మంతనాలు చేసినట్లు తెలుస్తున్నది. విసికె పార్టీ నాయకుడు తోల్ తిరుమ వలవన్ ను ఖార్గే నేరుగా సంప్రదించి విజయ్ కు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలుస్తున్నది. ఖార్గే విజ్ఞప్తిని విసికె అంగీకరించటంతో విజయ్ కు కధ సుఖాంతం అయింది.
ఎన్నికల ముందు ఐక్యంగా ఎన్నికల్లో పోటీ చేద్దామన్న బిజెపి ప్రతిపాదనను టివికె నేత విజయ్ జోసఫ్ తిరస్కరించటం అన్నది విజయ్ కు కాంగ్రెస్ నుండి గట్టి మద్దతు వచ్చేందుకు సహాయం అయిందని భావించ వచ్చు. మతతత్వ పార్టీలను అధికారానికి దూరంగా ఉంచాలన్న కాంగ్రెస్ సిద్ధాంతం, విజయ్ కు మద్దతు ఇచ్చేందుకు దోహదం చేసింది.
ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ లాగే తమిళనాడులో విజయ్ జోసఫ్ సహాయక పాత్ర నిర్వహించ గలడే తప్ప సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేయగల బలం ఆయనకు రాష్ట్రంలో లేదని పలువురు విశ్లేషకులు భావించారు. కానీ తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్ కాదని ఆ రాష్ట్ర ప్రజలు తమ ఓటు ద్వారా తెలియజేశారు.