
–
25/04/2026
ట్రంప్ ఎన్ని అబద్ధాలు చెప్పినా హార్ముజ్ జలసంధి ఇరాన్ కంట్రోల్ లో కొనసాగుతున్నది. ఇరాన్ అదుపులోనే హార్ముజ్ గుండా రవాణా జరుగుతున్నది.
హార్ముజ్ జలసంధి ఇరాన్ కంట్రోల్ లో ఉన్నది అంటే దాని గుండా నౌకలను ఇరాన్ అనుమతించటం లేదు అని అర్థం కాదు. నిజానికి హార్ముజ్ గుండా సరుకు, చమురు రవాణా జరుగుతోంది. కాకుంటే అది ఇరాన్ అనుమతి తో మాత్రమే జరుగుతున్నది.
ఇరాన్, ఏ షరతులతో ఐతే అమెరికాతో చర్చలకు అంగీకరించి కాల్పులు విరమించిందో, ఆ షరతుల ప్రకారమే హార్ముజ్ లో చమురు రవాణా జరుగుతున్నది.
హార్ముజ్ జలసంధి తెరవటానికి సంబంధించి ఇరాన్ విధించిన షరతులు ఇవి:
- హార్ముజ్ గుండా జరిగే రవాణా ఐ ఆర్ జి సి నియంత్రణలో జరుగుతుంది. రవాణా ట్యాంకర్ హార్ముజ్ గుండా వెళ్ల దలిస్తే ఐ ఆర్ జి సి అనుమతి తీసుకోవాలి. ట్యాంకర్ రూట్, సమయం, రక్షణ ఐ ఆర్ జి సి నిర్ణయిస్తుంది.
- చమురు ట్యాంకర్, టోల్ ట్యాక్స్ ను ఇరాన్ కి చెల్లించాలి.3. టోల్ ట్యాక్స్ ను (2 మిలియన్ డాలర్లతో సమానం) యువాన్ లలో మాత్రమే చెల్లించాలి.
- టోల్ ట్యాక్స్ ను (2 మిలియన్ డాలర్లతో సమానం) యువాన్ లలో మాత్రమే చెల్లించాలి.
కొద్ది రోజుల క్రితం యూఏఈ అమెరికాకు వర్తమానం పంపింది. తమ దగ్గర డాలర్ నిల్వలు ఐపోయాయి అని, చమురు అమ్మకాలు నిలిచి పోయినందున డాలర్లు సంపాదించే మార్గం లేదని కనుక తమకు ఏదో విధంగా డాలర్లు అందే మార్గం చూడాలని ఆ వర్తమానంలో తెలిపింది. మరో మార్గంగా ఆ దేశం కరెన్సీ స్వాప్ ద్వారా యువాన్ నిల్వలు పెంచుకునేందుకు యు.ఏ.ఇ ప్రయత్నం చేస్తున్నదని తెలుస్తోంది. యువాన్ నిల్వలు సంపాదిస్తే ఇరాన్ అనుమతితో చమురు ఎగుమతి చేయొచ్చని యు ఏ ఇ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
గల్ఫ్ లో ఆర్థిక సంబంధాల్లో మెల్లగా మార్పులు వస్తున్నాయని యువాన్ చెల్లింపులను బట్టి చెప్పవచ్చు. మారిన పరిస్థితులకు అలవాటు పడేందుకు గల్ఫ్ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్ తో రాజీ పడటం తప్ప వేరే మార్గం వారికి కనిపించటం లేదు. తమ వాణిజ్య ప్రయోజనాలను అమెరికా కాపాడుతుందని భావిస్తూ తమ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాల స్థాపనకు అంగీకరించిన గల్ఫ్ దేశాలు, ఇరాన్ యుద్ధం దరిమిలా అమెరికా సామర్ధ్యం పైన వారి నమ్మకం బలహీన పడింది.
ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దేశాల యుద్ధం దరిమిలా అంతర్జాతీయ సంబంధాలలో, ముఖ్యంగా పశ్చిమాసియా వాణిజ్యంలో సానుకూల మార్పులను గల్ఫ్ దేశాల పైన ఇరాన్ రుద్ద గలుగుతున్నది.
ఇరాన్ చమురు ఒక్క హార్ముజ్ ద్వారా మాత్రమే ఎగుమతి అవుతున్నదని భావించటం పొరపాటు. భూమార్గంతో పాటు, ఇరాన్ కు ఎగువన ఉన్న కాస్పియన్ సముద్రం గుండా కూడా ఇరాన్ ఎగుమతులు జరుగుతున్నాయి. యుద్ధం ముందు హోర్ముజ్ గుండా నెలకు సగటున 200 మిలియన్ బ్యారెల్స్ ఎగుమతి జరిగితే ఇప్పుడు నెలకి 100 బ్యారెల్స్ ఎగుమతి జరుగుతున్నదని నిపుణుల అంచనా. అయితే ధరలు పెరగటం వలన, టోల్ ట్యాక్స్ వలన రెట్టింపు ఆదాయం ఇరాన్ సంపాదిస్తున్నది.
జపాన్, సౌత్ కొరియా, చైనా, ఇండియా ఇంకా ఇతర దేశాలు ఇరాన్ చమురును ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్నాయి. ఫ్రాన్స్ లాంటి ఐరోపా దేశాలు కూడా ఇరాన్ తో చర్చించి హార్ముజ్ గుండా సరుకు చమురు రవాణా పొందుతున్నాయి. అంటే ఐరోపా దేశాలు కూడా చచ్చినట్లు యువాన్ లలో చెల్లింపులు చేస్తున్నదని భావించవచ్చు.
ఇరాన్ పాలకుల మధ్య విభేదాలు తలెత్తాయని, పార్లమెంట్ స్పీకర్ చర్చల కమిటీ నుండి రాజీనామా చేశాడని వచ్చిన వార్తల్లో నిజం లేదని ఇరాన్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇతర దేశాల్లో మల్లే ఇరాన్ లో మిలటరీ లేదా ఐ ఆర్ జి సి, సివిల్ ప్రభుత్వం ఆధీనంలో ఉండదు. సివిల్ ప్రభుత్వమే ఐ ఆర్ జి సి కింద పని చేస్తుంది. ఐ ఆర్ జి సి విషయానికి వస్తే అది సుప్రీం లీడర్ కింద పని చేస్తుంది. కనుక చర్చలు సుప్రీం లీడర్, ఐ ఆర్ జి సి అనుమతి ప్రకారమే జరుగుతున్నాయి. యుద్ధ కాలంలో అయితే పూర్తిగా ఐ ఆర్ జి సి కిందనే నిర్ణయాలు జరుగుతాయి. ఐ.ఆర్.జి.సి కీ ప్రభుత్వ అధ్యక్షునికీ మధ్య విభేదాలు తలెత్తాయని, ఐ.ఆర్.జి.సి హార్డ్ లైన్ అవలంబిస్తుంటే అధ్యక్షుడు, స్పీకర్ అభ్యంతరం చెబుతున్నారని, ఈ విభేదాల వలన స్పీకర్ ఘాలీబాఫ్ రాజీనామా చేశాడని పశ్చిమ పత్రికలు వార్తా విశ్లేషణలు ప్రచురిస్తున్నాయి. ట్రంప్ కూడా అదే విషయాన్ని ట్రూత్ సోషల్ లో రాస్తున్నాడు. కానీ అటువంటి పరిస్ధితి ఏర్పడేందుకు ఇరాన్ ప్రభుత్వ నిర్మాణంలో అవకాశం లేదు.
హార్ముజ్ జలసంధి గుండా జరిగే చమురు ఎగుమతి యుద్ధం ఆరంభం కావటానికి మునుపు, సగటున రోజుకి 13 మిలియన్ బ్యారెల్స్ కాగా అది ఇప్పుడు రోజుకి అర మిలియన్ బ్యారెల్స్ కు పడిపోయింది. దీనిని సరిదిద్దాల్సిన బాధ్యత అమెరికా పైన ఉంది, యుద్ధం అమెరికాయే మొదలు పెట్టింది కనుక. కానీ అమెరికా ఆ పరిస్థితి లో లేదు. ఇరాన్ బ్లాకేడ్ ను బాల ప్రయోగంతో తొలగించేందుకు అమెరికాకు అవకాశం లేదు. ఎందుకంటే ఇరాన్ తీరానికి చేరే లోపే అమెరికా యుద్ధ నౌకలను ఇరాన్ నాశనం చేస్తుంది. అమెరికా తన మెరైన్ సైనికులను నష్ట పోవాల్సి ఉంటుంది.
ఫలితంగా వివిధ మాన్యుఫాక్చరింగ్ సప్లై లైన్స్ కొలాప్స్ అయ్యే పరిస్థితి మెల్లగా సమీపిస్తున్నది. మరో రెండు నెలలు ఈ పరిస్థితి కొనసాగితే సరుకుల సరఫరా పూర్తిగా ఆగిపోతుందని నిపుణుల అంచనా. ఎందుకంటే మాన్యుఫాక్చరింగ్ లో ముఖ్యమైన దినుసు ఏది కొరవడినా గాని తయారీ పరిశ్రమ మూసివేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి హీలియం ప్రధానంగా గల్ఫ్ దేశాల నుండి హార్ముజ్ ద్వారా సరఫరా కావాలి. హీలియం గ్యాస్ చాలా పరిశ్రమలకు కావాలి. సెమీ కండక్టర్లు, ఎం.ఆర్.ఐ డయాగ్నాస్టిక్, ఏరో స్పేస్, డిఫెన్స్, ఫైబర్ ఆప్టిక్స్, కంప్యూటర్ టెక్నాలజీ ఉత్పత్తులు ఇలా. డీజిల్ లేకుంటే తగ్గిపోతాయి. చాలా ఫ్యాక్టరీలు మూసేయాలి.
కనుక హార్ముజ్ ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థ పై పడుతుంది. అసలు రెండు నెలలు కాదు రెండు వారాలు చాలు అన్ని దేశాలకు నెప్పి తెలియటానికి అని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా, ఐరోపా, ఆసియా అందరికీ హార్ముజ్ గుండా వివిధ పరిశ్రమలకు కావలసిన కొన్ని ముడి పదార్ధాలు సరఫరా అవుతాయి.
ఒక విధంగా చెప్పాలంటే అమెరికా, ఐరోపా ఆంక్షల వలన 40 ఏళ్ల కు పైగా ఇరాన్ ప్రజలు ఎన్ని బాధలు నెప్పి అనుభవించ వలసి వచ్చిందో అంత నెప్పి ప్రపంచ ప్రజలకి తెలిసి వస్తుంది. ఇన్నాళ్లు అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ ఐరోపా ఇరాన్ పైన సాగించిన రాక్షసత్వం ఏమిటో వాటిని ఇరాన్ ఎలా ఎదుర్కొందో ప్రపంచానికి తెలుస్తుంది.
డీజిల్ కరువై, లేదా అధిక ధరలకి డీజెల్ కొనలేక అమెరికా రైతులు దివాళా తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమెరికా వ్యవసాయ రంగంలో ట్రాక్టర్లు తదితర యంత్రాల వాడకం చాలా ఎక్కువ. కార్లు, వాహనాలు వాడే గ్యాసోలిన్ రేటు లీటర్ కి 2 డాలర్ల చిల్లర నుండి యుద్ధం వలన 4 డాలర్లకు పైన పెరిగింది. కనుక ఇరాన్ ప్రజల 40 ఏళ్ల నొప్పి అమెరికా జనానికి కొంత తెలుస్తోంది.
అందుకే అమెరికా జనాన్ని జో కొట్టేందుకు ట్రంప్ అబద్ధాలు వల్లే వేస్తూ ఉన్నాడు. పరిస్థితి కంట్రోల్ లో ఉందని, హార్ముజ్ అంతా తన కంట్రోల్ లో ఉందని, తానేమీ ఆందోళన చెందటం లేదని, ఇరాన్ ట్యాంకర్ల ను దిగ్బంధించామని, ఇరాన్ పీచం అణచి వేశానని, తన దెబ్బకి ఇరాన్ నేతలు తమలో తాము కొట్టుకుంటున్నారని, వాళ్ళ లక్ష్యం ఏమిటో వారికే తెలియటం లేదని… ఇలా చెబుతున్నాడు. నిజానికి వీటిలో చాలా అంశాలు ట్రంప్ కి వర్తిస్తాయి.
ఇరాన్ హార్ముజ్ జలసంధి ఎలా కంట్రోల్ చేస్తున్నది?
- ఐ ఆర్ జి సి అనుమతి లేకుండా జలసంధి లోకి ప్రవేశిస్తే గన్ బోట్ లతో కాల్పులు జరుపుతుంది.
- జలసంధి లో కొంత భాగాన్ని పేలుడు మైన్ లతో నింపి నౌకలు వెళ్లేందుకు కొంత భాగాన్ని దారి కింద వదిలి పెట్టింది.
- మైన్లు ఎక్కడ ఇరాన్ అమర్చింది బైట వారికి తెలియదు. అవి e రూట్ లో వెళ్ళాలో ఐ ఆర్ జి సి చెప్పాల్సిందే. ఐ ఆర్ జి సి ముందుండి వెళ్ళే దారిలో నౌకలు వెళ్ళాలి. లేకపోతే మైన్ లు పేలిపోతాయి.
ప్రకటించిన ప్రకారం ఇరాన్ విదేశీ మంత్రి అబ్బాస్ అరాగ్చి నేతృత్వం లోని బృందం ఈ రోజు ఇస్లామాబాద్ సందర్శించి అక్కడి నుండి ఒమన్ సందర్శనకు బయలుదేరిందని పత్రికలు తెలియజేశాయి.
ఇరాన్ యుద్ధం ఫలితంగా ఇరాన్ ప్రపంచంలో ఒక మేజర్ పవర్ హౌస్ గా అవతరిస్తున్నది. ఇరాన్ ను బలహీనం చేయాలన్న అమెరికా లక్ష్యం చివరికి అమెరికానే బలహీనం కావిస్తున్న పరిస్థితి ఏర్పడుతున్నది.
పెట్రో డాలర్ నడ్డి విరవటం ఇరాన్ యుద్ధం ద్వారా జరిగిన ప్రధాన పరిణామం.
డాలర్ నిల్వలు నిండుకున్నాక తమకు అమెరికన్ ట్రెజరీ లను అమ్మేసి యువాన్ నిల్వలను సమకూర్చుకోవడం తప్ప మరో దారి లేదని యు ఏ ఇ అమెరికాకు చెప్పటం బట్టి పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ పై యుద్ధం చేయటం వలన తమ దేశం దుష్ఫలితాలను ఎదుర్కొంటున్నదని యు ఏ ఇ అధికారులు ఆరోపిస్తున్నారు. యుద్ధ పరిణామాలు యుద్ధం ముగిసినా ఆగవని కొన్నేళ్ల పాటు ప్రభావం ఉంటుందని, నాశనం అయిన రిఫైనరీలు, చమురు ఉత్పత్తి సెంటర్లను రిపేర్ చేసేందుకు నెలలు ఏళ్ళు పడుతుందని వారు వాపోతున్నారు.
చైనా 2021 లోనే Mbridge అనే పేరుతో ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ప్లాట్ఫారం ఏర్పాటు చేసింది. దీని ద్వారా ఇప్పటి వరకు 55 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరిగింది. చూసేందుకు ఇది చాలా తక్కువే. కానీ ఇందులో 95 శాతం వాణిజ్యం యూరోపియన్ దేశాలే చేయటం అసలు విషయం. అంటే డాలర్ ప్రత్యామ్నాయ వాణిజ్యం లో యూరోపియన్ దేశాలే పాల్గొనటం బట్టి అమెరికా వాణిజ్య పెత్తనానికి సమీప భవిష్యత్తు లో ముంపు పొంచి ఉందని భావించవచ్చు.
ఇరాన్ యుద్ధ ద్వారా ఏర్పడిన అనిశ్చిత పరిస్థితి, డాలర్ వ్యతిరేక వాతావరణం చైనా ఎప్పటి నుండో ఏర్పాటు చేస్తూ వచ్చిన సరికొత్త వాణిజ్య వేదికకు భారీ సానుకూల అవకాశం కల్పిస్తున్నది. ఇది అమెరికా చేజేతులా తెచ్చుకున్న పరిస్థితి. సామ్రాజ్యవాద దురహంకారం చిన్నవి అనుకునే దేశాలతో సర్దుబాటుకు నిరాకరిస్తుండటం తో అమెరికా తన పాదంలో తానే గునపం దించుకుంటోంది .
చైనా అభివృద్ధి చేసిన మరో ఎలక్ట్రానిక్ వ్యవస్థ – CIPS – చైనా ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్. ఇది అమెరికా కి చెందిన SWIFT కు ప్రత్యామ్నాయంగా 2023 లో ఏర్పాటు చేసింది చైనా. ఈ మార్గం లో కూడా యువాన్ ల లోనే చెల్లింపులు చెయ్యాలి. ఇది 2022 లో ఉక్రెయిన్ యుద్ధం నుండి మెల్లగా వాడుక లోకి వచ్చింది. 2023 లో రష్యా పైన సెకండరీ ఆంక్షలు అమెరికా విధించినాక మరి కొంత ఊపు అందుకుంది. 2025 లో మరిన్ని గ్లోబల్ బ్యాంకులు CIPS చేరాయి. దాంతో 2026 మార్చిలో ఇరాన్ యుద్ధం ఆరంభం తో CIPS ద్వారా జరిగే అంతర్జాతీయ చెల్లింపులు 921 బిలియన్ యువాన్లకు (135 బిలియన్ డాలర్లు) చేరింది. ఈ 135 బిలియన్ల రోజుకు ద్వారా జరిగే వాణిజ్యం విలువ!
గ్లోబల్ కరెన్సీ నిల్వలలో ఇప్పుడు డాలర్ వాటా కేవలం 40 శాతం మాత్రమే. గత పదేళ్లలో 18 శాతం వాటాను డాలర్ కోల్పోయింది.
యువాన్ వైపు మొగ్గు చూపుతున్న దేశాల్లో యు.ఏ.ఇ (ఈ దేశం చైనాతో వాణిజ్య ఒప్పందం కూడా చేసుకుంది. చెల్లింపులు యువాన్ లలో జరిగేందుకు ఈ ఒప్పందంలో వీలు కల్పించారు) మొదటిది కాదు. కెనడా, యుకె, ఐర్లాండ్, సౌత్ కొరియా, స్పెయిన్ లు తమ ప్రతినిధులను ప్రత్యేకంగా పంపి చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నాయి. ఓ పక్క ట్రంప్ టారిఫ్ లు ప్రకటించటం లో బిజీ గా ఉంటే, అమెరికా మిత్ర దేశాలు చైనాతో ఒప్పందం చేసుకోవటంలో బిజీ గా గడిపాయి.