ఇరాన్ యుద్ధం -నోట్స్ అండ్ అప్ డేట్స్ -6


SHIPS STRANDED IN HORMUZ STRAIT -REUTERS

22/04/2026

రెండు వారాల సీజ్ ఫైర్ గడువు ఏప్రిల్ 22 తేదీతో ముగిసింది. గడువు ముగియటానికి సరిగ్గా రెండు గంటల ముందు సీజ్ ఫైర్ గడువు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. యుద్ధ విరమణ చర్చలు సజావుగా కొనసాగటానికి వీలుగా తాత్కాలిక సీజ్ ఫైర్ కాలాన్ని పొడిగించాలన్న పాకిస్తాన్ విజ్ఞప్తి మేరకు గడువును “నిరంతరాయంగా” (indefinite period) పెంచుతున్నానని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మెసేజ్ లో బొంకాడు.

నిజానికి గడువు ముగిసినా, ఒప్పందం కుదరక పోయినా ఇరాన్ పైన బాంబులు మిసైళ్లతో దాడులు చేయటానికి తయారుగా ఉన్నామని డొనాల్డ్ ట్రంప్ మూడు రోజుల నుండి చెబుతూనే ఉన్నాడు. ‘ఇక చాలు మొర్రోయ్’ అని ఇరాన్ దండం పెట్టే వరకూ ఆ దేశాన్ని దాడులతో కుళ్ల బొడుస్తానని ట్రంప్ ఎప్పటిలా గొప్పలు పోయాడు. మరో పక్క ‘యుద్ధానికి సర్వ సన్నద్ధంగా ఉన్నాము’ అని ఇరాన్ నాయకులు స్పష్టం చేశారు. ప్రపంచం మళ్ళీ ఉగ్గ బట్టుకుని ఏం జరుగుతుందా అని ఎదురు చూసింది. స్టాక్ మార్కెట్లు టెన్షన్ తో గడిపాయి. చివరికి పాకిస్తాన్ ను అడ్డం పెట్టుకొని అమెరికా అధ్యక్షుడు సీజ్ ఫైర్ గడువును నిరవధికంగా పొడిగిస్తున్నట్లు చక్కా ప్రకటించాడు.

సీజ్ ఫైర్ గడువు పొడిగింపు తో తమకు సంబంధం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి స్పష్టం చేశాడు. సీజ్ ఫైర్ ఒప్పందం అంటేనే యుద్ధంలో ఉన్న ఇరు పక్షాలు మాట్లాడుకుని ప్రకటించేది. సీజ్ ఫైర్ కాలాన్ని పొడిగించాలన్నా ఇరు పక్షాలు మాట్లాడుకుని అంగీకరిస్తేనే సాధ్య పడుతుంది. అసలు ఇరాన్ తో మాట్లాడకుండా ఏక పక్షంగా ప్రకటించేస్తే అది సీజ్ ఫైర్ ఒప్పందం గడువు పొడిగింపు ఎలా అవుతుందన్నది ఇరాన్ ప్రశ్న! అందుకే ట్రంప్ ప్రకటనతో తమకు సంబంధం లేదని ఇరాన్ ప్రకటించింది.

అసలు మాట్లాడితే ట్రంప్ ప్రకటించిన గడువు పొడిగింపుకు అర్థమే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. యుద్ధంలో ఓడిపోయిన పక్షం షరతులు ఎలా విధిస్తుందని ప్రశ్నించింది. సీజ్ ఫైర్ కొనసాగాలంటే తమ షరతులకు అంగీకరించాలని కొద్ది రోజుల క్రితం ట్రంప్ విధించిన షరతులను ఉద్దేశిస్తూ ఇరాన్ ఈ ప్రశ్న సంధించింది.

కాగా ఇరాన్ చమురు ట్యాంకర్ ను అడ్డగించి నిర్బంధించామని అమెరికా ప్రకటించింది. చైనాకు చమురు సరఫరా చేసి ఇరాన్ పోర్టుకు తిరిగి వస్తున్న ట్యాంకర్ అమెరికా డిస్ట్రాయర్ నాయకులు అటకాయించిందని పత్రికలు తెలిపాయి. అయితే తమ చమురు ట్యాంకర్ క్షేమంగా పోర్టుకు చేరిందని ఇరాన్ ప్రకటించింది. ఇది అమెరికా అదుపులోకి తీసుకున్న ట్యాంకరా లేక మరొక ట్యాంకరా అన్నది తెలియలేదు. ఇరానియన్ ట్యాంకర్ పైకి అమెరికా సైనికులు ఎక్కి సీజ్ చేసినట్లు ట్రంప్ స్వయంగా ప్రకటించాడు. మొదట ట్యాంకర్ ఇంజన్ రూమ్ పైకి కాల్పులు జరిపి, కదలకుండా చేసి అనంతరం అమెరికా సైనికులు ట్యాంకర్ ని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది.

సదరు ట్యాంకర్ చైనాకు చమురు సరఫరా చేసి వస్తున్నందున ట్యాంకర్ దిగ్బంధనం అన్నది చైనా సార్వభౌమాధికారం పైన దాడి చేసినట్లే. ఈ చర్యతో చైనా తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇది కొనసాగితే ప్రతీకార చర్యలకు చైనా పాల్పడే అవకాశం ఉన్నది.

హార్ముజ్ జలసంధి దాటాలని ప్రయత్నించిన రెండు ట్యాంకర్ల పైకి ఇరాన్ గన్ బోట్లు కాల్పులు జరిపాయి. దానితో రవాణా ఆగిపోయింది. హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపారని యుకె ఆరోపించింది. ఈ ఆరోపణలను ఇరాన్ నిరాకరించింది. తగిన హెచ్చరికలు చేసిన తర్వాతే కాల్పులు జరిపామని ప్రకటించింది.

హార్ముజ్ జలసంధి మూసివేత ను ప్రధాన అంశం చెయ్యటం ద్వారా ఇరాన్, యుద్ధం కు సంబంధించి చొరవను తన చేతుల్లోకి తీసుకుంది. అంటే షరతులు విధించే చొరవ, అవసరం అయితే యుద్ధాన్ని పునః ప్రారంభం చేసే చొరవ ఇపుడు ఇరాన్ చేతుల్లోకి వచ్చింది. దీనిని “ఎస్కలేషన్ ల్యాడర్ పైన ఆధిపత్యం సాధించటం” అంటారని జియోపొలిటికల్ ఎకనమిక్స్ వెబ్ సైట్ ఎడిటర్ వివరించాడు. ఈ తరహా ఆధిపత్యం ఉన్నప్పుడు ఇరాన్ తానే డిమాండ్లు చెయ్యగల పరిస్ధితిలో ఉంటుంది. ఒక వేళ అమెరికా, ఇజ్రాయెల్ లు మొదట దాడి ప్రారంభిస్తే అవి ప్రపంచం ముందు దోషులుగా నిలబడాల్సి ఉంటుంది.

ఇన్నాళ్లు ఈ తరహా ఆధిపత్యం ఇజ్రాయెల్, అమెరికా, పశ్చిమ యూరప్ దేశాల చేతుల్లో ఉండేది. అణు శుద్ధి నిలిపేయాలని, మిసైల్ తయారీ ఆపాలని ఆ దేశాలు ఇరాన్ పైన డిమాండ్లు విధించేవి. ఇప్పుడు అది ఇరాన్ చేతుల్లోకి వచ్చింది. చాలా జాగ్రత్తగా ఎత్తులు వేయటం ద్వారా ఇరాన్ ఈ ఆధిపత్యాన్ని సాధించింది.

ఈ పరిస్థితిని తిరగ దోడాలని అమెరికా కష్ట పడుతోంది అందులో భాగంగానే ఇరాన్ విధించిన హోర్ముజ్ బ్లాకేడ్ పైన తాను సొంత బ్లాకెడ్ విధించింది. కానీ అమెరికా తన బ్లాకేడ్ ను ఖచ్చితంగా అమలు చేసే పరిస్ధితిలో లేదు. అలా చేస్తే చమురు ధరలు మరింత పై పైకి ఎగబాకే అవకాశం ఉన్నది. చమురు ధరలు పెరిగితే ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం అవధులు దాటే ప్రమాదం పొంచి ఉంది. దరిమిలా మరోసారి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం సంభవించవచ్చు.

సి ఎన్ ఎన్ ప్రకారం అమెరికా వద్ద ఆయుధాగారం నిండుకుంది. అనగా అమెరికా వద్ద ఆయుధ నిల్వలు పడిపోయాయి. ఇంకోసారి ఇరాన్ యుద్ధం చెలరేగితే ఎక్కువ కాలం అమెరికా యుద్ధం సాగించటం కష్టం.

సి ఎన్ ఎన్ ప్రకారం: ధాడ్ డిఫెన్స్ మిస్సైల్స్ 50% ఖర్చై పోయాయి. అలాగే పేట్రియాట్ మిస్సైల్స్ 50%, ప్రెసిషన్ స్ట్రైక్ మిస్సైల్స్ 45%, తోమహాక్ మిస్సైల్స్ 30%, ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైల్స్ 20% ఖర్చై పోయాయి. మొదటి మూడు ముఖ్యమైన ఆయుధాలు.

అమెరికా మిసైల్ ఉత్పాదకత చాలా తక్కువ. పైగా ఖరీదు ఎక్కువ. కనుక ఆయుధ గిడ్డంగి పూడ్చు కునేందుకు కొన్ని సం లు పడుతుంది. ఈ పరిస్ధితి నేపధ్యం లోనే మళ్ళీ యుద్ధానికి దిగలేక సీజ్ ఫైర్ ను ఇరాన్ అడగక పోయిన ట్రంప్ పొడిగించాడు.

సి ఎస్ ఐ ఎస్ – సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ రిపోర్ట్ లో కింది టేబుల్ లో అమెరికా ఆయుధ నిల్వల పరిస్ధితి పై ఒక అంచనా ఇచ్చారు.

పై పట్టికలోని చివరి కాలం (column) లో ఒక్కో ఆయుధ రకం తయారీ కి ఎంత కాలం పడుతుందో ఇవ్వబడింది. కనీసం 4 ఏళ్ళు ఐతే గాని అమెరికా ఆయుధ పునఃసరఫరా జరిగి ఆయుధ నిల్వలు యధాతధ స్థితికి చేరవు.

ఇరాన్ మాత్రం తన డ్రోన్లు, మిస్సైల్స్ వేగంగా పునరుత్పత్తి చేస్తున్నది. ఈ సంగతి సూచిస్తూ ఇరాన్ తమ మిస్సైల్స్ తయారీ ఫ్యాక్టరీలో మిసైళ్లు తయారవుతున్న వీడియోను ఇంటర్నెట్ లో ప్రచురించింది. ఇరాన్ డ్రోన్ లు అత్యంత చౌకగా తయారవుతాయి. మిసైళ్ల విషయానికి వస్తే ఇరాన్ వద్ద మిసైళ్ల నిల్వలు ఎంత భారీగా ఉన్నాయో ఎవరికీ తెలియదు. వాటిని ఇరాన్ కొండల కింద ఉన్న భారీ సొరంగాలలో ఉంటాయి. వాటిని ‘మిసైల్ నగరాలు’ అని పత్రికలు తరచుగా అభివర్ణిస్తాయి. మిసైళ్లు దాచిన ‘కొన్ని’ కొండల పైన అమెరికా, ఇజ్రాయెల్ లు బాంబు దాడులు చేయటంతో సొరంగాల ద్వారాలు కూలిపోయి కప్పబడి పోయాయి. వాటిని ఇరాన్ వేగంగా తవ్వి తీస్తున్న సంగతిని కూడా పత్రికలు తెలియజేస్తున్నాయి.

23/04/2026

అమెరికా ప్రకటించిన సీజ్ ఫైర్ ప్రకటనలకే పరిమితం అయింది. అమెరికా నావల్ బ్లాకెడ్ కొనసాగుతోంది. బ్లాకేడ్ ని ఉల్లంఘిస్తూ ఇరాన్ చమురు రవాణా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ కి చెందిన కొన్ని నౌకలని ఇరాన్ పట్టుకుని నిర్బంధించింది. కాగా సౌత్ లెబనాన్ లో ప్రజల ఇళ్లను ఇజ్రాయెల్ సైన్యం కూల్చేస్తోంది. ఇజ్రాయెల్ దాడులను హిజ్బొల్లా సైనికులు ప్రతిఘటించటం కొనసాగుతున్నది. సౌత్ లెబనాన్ లో పరిస్ధితి ఎలా ఉందంటే:

  1. ఇజ్రాయెల్ కి చెందిన వందల మర్కావా ట్యాంకులు హిజ్బొల్లా నాశనం చేసింది.
  2. ఇజ్రాయెల్ చంపిన వారిలో అత్యధికులు లెబనాన్ పౌరులు (ముస్లింలు, క్రిస్టియన్ లు). దరిమిలా ఇజ్రాయెల్ లెబనాన్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూట గట్టుకుంటోంది.
  3. ఇజ్రాయెల్ ఆదేశాలు పాటిస్తున్నందుకు లెబనాన్ ప్రభుత్వం దేశంలో అపఖ్యాతి పాలయింది. గత 40 సంవత్సరాల కాలంలో ఇజ్రాయెల్ తో లెబనాన్ ప్రభుత్వం ఏనాడూ సఖ్యతగా లేదు. ఇజ్రాయెల్ తో సఖ్యతగా ఉండటం అంటే దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించటమే. లెబనాన్ రాజ్యాంగం లోనే ఇజ్రాయెల్ తో చర్చలు జరపరాదన్న నిబంధన ఉన్నది. ఇప్పటి లెబనాన్ ప్రభుత్వం తమ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి ఇజ్రాయెల్ తో చర్చలు జరిపింది.
  4. 2025 తో పోలిస్తే హిజ్బొల్లా మరింత శక్తివంతం అయింది. మెరుగైన ఆయుధాలు పొందింది. మెరుగ్గా ఆర్గనైజ్ అయింది.
  5. హిజ్బొల్లా ను నిరాయుధం చేయాలన్న ఇజ్రాయెల్ డిమాండ్ ను లెబనాన్ ఆర్మీ నిరాకరించింది. జనం లో 50 శాతం షియా అయినందున హిజ్బొల్లా ను తాకితే వాళ్ళు తిరగబడతారు. దరిమిలా లెబనాన్ లో 1980 ల్లో జరిగినట్లు అంతర్యుద్ధం అనివార్యం అవుతుంది.

ఏప్రిల్ 12 న జరిగిన హంగేరి ఎన్నికల్లో ప్రధాని విక్టర్ ఓర్బన్ ఓడిపోయాడు. ఆయన ట్రంప్ కి ఫ్రెండ్. కొత్త ప్రధాని పీటర్ మగ్యార్ అమెరికా, ఐరోపా లకు ఫ్రెండ్ అని భావిస్తున్నారు. కానీ ఎన్నికల తర్వాత ఆయన ప్రకటనలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి.

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు హంగేరి వచ్చినట్లయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ జారీ చేసిన అరెస్ట్ వారెంట్ అమలు చేస్తానని హంగేరీ కొత్త ప్రధాన మంత్రి పీటర్ మగ్యార్ ప్రకటించాడు. గత ప్రధాన మంత్రి ఇజ్రాయెల్ తో చెట్టపట్టాలతో వ్యవహరించాడు.

వ్యాఖ్యానించండి