అమెరికా, ఇజ్రాయెల్ ఎన్నికలు – భౌగోళిక రాజకీయాలు -పార్ట్ 2

Israel Parliament Knesse

–

దరిమిలా, జర్మనీ లాంటి ఇండస్ట్రియల్ పవర్ హౌస్ లో కూడా జి‌డి‌పి పడిపోయింది లేదా ఎదుగు-బొదుగూ లేకుండా స్తంభించింది. 2022 కు ముందు తన గ్యాస్ అవసరాల్లో 45 శాతం రష్యా నుండి యూరోపియన్ యూనియన్ దిగుమతి చేసుకోగా, అది ఇప్పుడు సున్నా కు చేరింది. ఫలితంగా ఈయూ దేశాల్లో ఇంధనం ఖర్చు అత్యధికంగా పెరిగింది. జర్మనీ మాన్యుఫాక్చరింగ్ రంగం (రసాయనాలు, ఉక్కు, ఆటో విడి భాగాలు మొ.వి) ఇంధనం పైన (ఎనర్జీ-ఇంటెన్సివ్) ఎక్కువగా ఆధార పడతాయి. ఇంధనం ఖర్చు పెరగటం వలన పరిశ్రమలు ఉత్పత్తి తగ్గించుకోవటం, కార్యకలాపాలను రీస్ట్రక్చర్ చేసుకోవటం లేదా అమెరికాకు తరలిపోవటం చేశాయి. ఆర్ధిక వ్యవస్థ కుదేలై జి‌డి‌పి తగ్గిపోయింది. ఐరోపా ఇంజన్ గా పిలిచే జర్మనీ ఆర్ధిక మాంద్యం లోకి జారిపోయింది.

ఇంధనం ధరల ప్రభావం రవాణా, ఆహారం, ఇళ్లలో వెచ్చదనం ఖర్చులపై పడి ద్రవ్యోల్బణం హెచ్చింది. విద్యుత్, గ్యాస్ బిల్లులు పెరిగాయి. ప్రజల కొనుగోలు శక్తి పడిపోవటంతో ప్రభుత్వ ఖజానాపై సబ్సిడీల భారం పడింది. బడ్జెట్ లు ఒత్తిడికి గురై లోటు పూడ్చేందుకు రుణాలు పెరిగాయి. మరో పక్క అమెరికా, ఉక్రెయిన్ యుద్ధం ఖర్చులో అధిక భాగాన్ని ఈ‌యూ పైకి నెట్టేసింది. ఈ నేపధ్యం లోనే ఐరోపా దేశాలన్నింటా ప్రజల ఆందోళనలు, విద్యార్ధులు మరియు కార్మికుల సెమ్మెలు, పెచ్చరిల్లాయి.

అమెరికాలో గ్యాస్ కొరత లేనప్పటికీ అక్కడ చమురు, గ్యాస్ ఉత్పత్తి పెరిగినప్పటికీ అమెరికాలో గ్యాసోలిన్ సంక్షోభం తప్పలేదు. ఎందుకంటే అమెరికాలో స్వీట్ క్రూడ్ (లేదా సాఫ్ట్ క్రూడ్) మాత్రమే లభ్యం అవుతుంది. కానీ అమెరికాలో రిఫైనింగ్ పరిశ్రమలు ప్రధానంగా సోర్ క్రూడ్ (హార్డ్/హెవీ క్రూడ్) ను శుభ్రం చేసేందుకు ఉద్దేశించిన టెక్నాలజీతో నిర్మించారు. ఇవి దశాబ్దాల క్రితం పశ్చిమాసియా క్రూడాయిల్ కోసం నిర్మించిన రిఫైనరీలు. కనుక అమెరికా క్రూడ్ ని శుభ్రం చేయటం అక్కడి మెజారిటీ రిఫైనరీలకు సాధ్యం కాదు. అవి పశ్చిమాసియా/గల్ఫ్ దేశాల క్రూడాయిల్ ని లేదా మోడరేట్ హార్డ్ క్రూడ్ ని మాత్రమే రిఫైన్ చేయగలవు.

అమెరికాలో లభించే స్వీట్ క్రూడ్ ని కూడా రిఫైన్ చేసే రిఫైనరీలు అమెరికాలో ఉన్నప్పటికీ స్థానిక లభ్యత కంటే ప్రపంచం లోని వివిధ క్రూడాయిల్ రకాల మధ్య ఉన్న లాభదాయకతను ప్రధానంగా రిఫైనరీలు పరిగణనలోకి తీసుకుంటాయి. అమెరికా ప్రజల అవసరాల కంటే రిఫైనరీలకు ఏ క్రూడాయిల్ రకాన్ని రిఫైన్ చేస్తే అధిక లాభదాయకత ఉంటుందో ఆ క్రూడాయిల్ ని రిఫైన్ చేసేందుకు అవి మొగ్గు చూపుతాయి. అమెరికా పశ్చిమ తీరంలో, గల్ఫ్ తీరంలో ఉండే రిఫైనరీలకు సముద్ర రవాణాలో అంది వచ్చే క్రూడ్ ని రిఫైన్ చేయటం ఎక్కువ లాభదాయకం.

మోడరేట్ క్రూడ్ ఆయిల్ ని రిఫైన్ చేసే క్రమంలో మధ్యంతరంగా అధిక మొత్తంలో డీజిల్, జెట్ ఇంధనం (కిరోసిన్), గ్యాసోలిన్ ఉత్పత్తి అవుతాయి. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయటం వలన ఈ మూడు ఇంధనాలకు అమెరికాలో కొరత అనివార్యం అయింది. ‘వాటర్ వాటర్ ఎవ్రీ వేర్, బట్ నో డ్రాప్ టు డ్రింక్’ అన్నట్లు తయారైంది అమెరికా పరిస్ధితి. అమెరికాలో గ్యాస్, చమురు ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగినా కూడా ఆర్ధిక వ్యవస్థ ఇంధనాలైన డీజిల్, గ్యాసోలిన్, జెట్ ఫ్యూయెల్ లకు కొరత ఏర్పడింది.

ఇంకో కారణం కూడా ఇక్కడ పని చేసింది. ఇంధనం అమెరికాలో ఎంత ఉత్పత్తి అవుతుంది అన్న అంశంపైన అంతర్జాతీయ ధరలు పూర్తిగా ఆధార పడవు. అంతర్జాతీయ డిమాండ్, సరఫరాలు ఈ ధరలను నిర్ణయిస్తాయి. ఇంధనం యొక్క ప్రాంతీయ ధరలు కూడా అంతర్జాతీయ ధరల కదలికల పైన ఆధారపడతాయి. ఇంకో విధంగా చూస్తే, స్టాక్ మార్కెట్ లలో కమోడిటీల (క్రూడ్ కూడా ఒక కమోడిటీ) ధరలు ఫ్యూచర్ కాంట్రాక్ట్ ల ద్వారా (ఫైనాన్స్ కంపెనీల చేత) నియంత్రించ బడతాయి. కనుక అమెరికా ప్రజలు అంతర్జాతీయ ధరల ప్రకారమే గ్యాసోలిన్ ఖర్చు భరించాలి.

ఇరాన్, ఉక్రెయిన్, గాజా, దక్షిణ లెబనాన్ యుద్ధాల వలన అమెరికాలో పంపుల (బంకులు) వద్ద గ్యాసోలిన్ రేటు 42% నుండి 45% వరకు పెరిగాయి. అనగా గ్యాలన్ (3.8 లీటర్లు) కు 3 డాలర్లకు తక్కువగా ఉన్న గ్యాసోలిన్ రేటు 4 డాలర్లు దాటింది. కాలిఫోర్నియా లాంటి రాష్ట్రాల్లో గ్యాలన్ కు 5 డాలర్లు దాటింది. 3 డాలర్ల వరకే సగటు అమెరికన్ భరించగలడు. సరుకు రవాణాకు అత్యవసరమైన డీజిల్ ధర 58%, జెట్ ఇంధనం ధర ఏకంగా 106% పెరిగాయి. ఐరోపా దేశాలలో గ్యాస్ ధర 44% నుండి 66% వరకు పెరిగాయి. ఆసియా దేశాల్లో కూడా దాదాపు ఇదే పరిస్ధితి.

ఈ నేపధ్యంలో అమెరికాలో ద్రవ్యోల్బణం 2024 లో 2.9 శాతం ఉండగా 2026 మొదటి అర్ధభాగంలో 4 శాతం దాటింది. ప్రస్తుతం అమెరికా ద్రవ్యోల్బణం 5 శాతం దాటిందని అంచనా వేస్తున్నారు. 2 శాతం ద్రవ్యోల్బణంను అమెరికా సెంట్రల్ బ్యాంకు (ఫెడరల్ రిజర్వ్) సాధారణంగా పరిగణిస్తుంది. 3 శాతం దాటితే ఆమోదనీయం కాదని చెబుతుంది. ఇక 4 శాతం దాటితే తీవ్రంగానూ, తక్షణ పాలసీ టార్గెట్ గా పరిగణిస్తుంది. అలాంటిది 5 శాతం దాటిన ద్రవ్యోల్బణం అమెరికా ప్రజలకు ఎంత భారం అవుతుందో ఎవరికి వారే ఊహించుకోవచ్చు.

డొనాల్డ్ ట్రంప్ వివిధ ప్రపంచ దేశాల పైన విచ్చలవిడిగా టారిఫ్ లను పెంచటం కూడా ఒక సెక్షన్ వోటర్లను ప్రతికూలంగా ప్రభావితం చేసింది. గ్రీన్ కార్డుల జారీలో భారీ కోత పెట్టటంతో వలస వచ్చి స్థిర పడిన కమ్యూనిటీలలో అలజడి, ఆందోళన (panic) పెరిగాయి. ICE (ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్) విభాగానికి భారీ ఎత్తున సాయుధ బలగాలను, నిధులను సమకూర్చి విచక్షణా రహితంగా దాడులు జరిపించటం వలన ఈ ఆందోళన మరింత పెరిగింది. ఇండియా లాంటి దేశాల విద్యార్ధులు, ఉద్యోగార్ధులకు H1B వీసాల జారీ బాగా తగ్గించటం, లక్ష డాలర్ల (దాదాపు కోటి రూపాయలు) రుసుము విధించటం… ఇవన్నీ వలస వచ్చి స్థిరపడిన పౌరులలో ఏ క్షణంలో ఏ వైపు నుండి దాడులు జరుగుతాయో అన్న భీతావహ పరిస్ధితిని సృష్టించాయి.

ట్రంప్ అమలు చేసిన విధానాల వలన ప్రజల్లో ట్రంప్ పలుకుబడి సహజంగానే క్షీణించింది. రిపబ్లికన్ లలో మద్దతు కొనసాగినా కూడా, నవంబర్ మొదటి వారానికల్లా ట్రంప్ ఆమోదనీయత 37 శాతం, తిరస్కారం 61 శాతంకు చేరింది (ద న్యూయార్క్ టైమ్స్, నవంబర్ 2). ప్యూ రీసర్చ్ ప్రకారం ట్రంప్ ఆమోదనీయత అక్టోబర్ రెండో వారానికల్లా 30 శాతంకి తగ్గగా, తిరస్కారం 68 శాతంకు చేరింది. ఎకనమిస్టు పత్రిక నవంబర్ 4-6 తేదీల్లో చేసిన సర్వేలో ట్రంప్ ఆమోదనీయత 36 శాతం మాత్రమే రికార్డ్ కాగా, తిరస్కారం 62 శాతంగా రికార్డ్ అయింది.

మొత్తంగా చూస్తే…

  • అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగటం
  • వాణిజ్య భాగస్వాములు మిత్ర రాజ్యాలపై టారిఫ్ లు విపరీతంగా పెంచటం వలన దిగుమతి రేట్లు పెరగటం
  • ఇరాన్ తో యుద్ధం వలన ఇంధన ధరలు భరించగల స్థాయి దాటి పోవటం
  • ఉక్రెయిన్ కు అమెరికా, ఈ‌యూ మద్దతు వలన యుద్ధం కొనసాగి అంతర్జాతీయ గ్యాస్, చమురు ధరలు పెరగటం
  • ఇజ్రాయెల్, గాజా-దక్షిణ లెబనాన్ ప్రజలపై సాగించిన జీనోసైడ్ ను యువ అమెరికా వ్యతిరేకించటం
  • యుద్ధం ద్వారా ట్రంప్ అక్రమ లాభాలు ఆర్జించాడని అమెరికన్లు నమ్మటం (అది నిజం కూడా)
  • వలసలపై దూకుడు విధానాల వలన ICE దాడుల్లో పలువురు చనిపోవటం

ఈ కారణాలు ట్రంప్ కు వ్యతిరేకంగా పని చేశాయి. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కు వోటు వేసిన పలువురు 2026 మిడ్ టర్మ్ ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా వోటు వేశారు. లాటినోలు (లాటిన్ అమెరికా నుండి వలస వచ్చి స్థిరపడిన వారు) ట్రంప్ ను 2024 లో 93% ఆమోదించగా, అక్టోబర్ 2026 లో వారు 57% కు తగ్గారు. హిస్పానిక్ ల (లాటిన్ దేశాల నుండి వలస వచ్చిన స్పానిష్ భాషీయులు) మద్దతు 38% నుండి 24% కి తగ్గింది. యువ వోటర్లు (18-29 సం.లు) 35% ఆమోదించగా, 61% తిరస్కరించారు. (పశ్చిమ దేశాల్లో సెఫాలజిస్టుల అంచనాలు, వాస్తవ వోటింగ్ ను దాదాపు ప్రతిబింబిస్తాయి.)

వర్గ పోరాటాలను అమెరికా ఎన్నికలు నేరుగా ప్రతిబింబించక పోవచ్చు. కానీ పెట్టుబడిదారీ-కార్మిక వర్గ ఘర్షణను అవి అంతర్లీనంగా, పరోక్షంగా ప్రతిబింబిస్తాయి. ట్రంప్ విధానాలకు ప్రత్యక్ష లక్ష్యం ప్రపంచ దేశాలపై పెత్తనం సాధించటం. ఈ సందర్భంలో పశ్చిమాసియాలోని చమురు సంపదపైన నియంత్రణ సాధించి తాను శత్రువుగా భావించే చైనాకు చమురు లభ్యతను దూరం చేసే సామ్రాజ్యవాద ఆధిపత్యం అమెరికాకు ప్రధాన లక్ష్యం. ఇంకో రకంగా చూస్తే బహుళ ధృవ ప్రపంచ స్థాపన వైపుగా సాగుతున్న మూడో ప్రపంచ దేశాల గమనాన్ని ఎలాగైనా నిరోధించటం.

ఈ లక్ష్య సాధనకు అమెరికా అనుసరిస్తున్న విధానాలు అనివార్యంగా అమెరికా కార్మికవర్గాన్ని కూడా కడగండ్లకు గురి చేస్తున్నాయి. తత్ఫలితమే మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్ కు ఎదురైన తిరస్కరణ! కానీ ముందు చెప్పుకున్నట్టు ట్రంప్ కు ప్రత్యామ్నాయంగా ప్రజలు భావించిన డెమొక్రాట్ పార్టీ వాస్తవంలో ఎండమావితో సమానం. అది సామ్రాజ్యవాద శక్తులు సృష్టించిన మాయ!

ఇజ్రాయెల్ ఎన్నికలు

ఇజ్రాయెల్, పశ్చిమాసియా / మధ్య ప్రాచ్యం ప్రాంతంలో అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలకు కాపలాదారు. పశ్చిమాసియాలో అమెరికా కోసం పని చేసే ఔట్ పోస్ట్, ఇజ్రాయెల్! అమెరికా అనుజ్ఞ, ఆమోదం లేకుండా ఇజ్రాయెల్ ముందుకు అడుగు వేయదు. ఒక్కోసారి ఇజ్రాయెల్ పాలకులే అమెరికాను తన సొంత యుద్ధాల లోకి లాగుతున్నట్టు కనిపిస్తుంది. శరీరం, తోకను ఊపుతున్నట్టు కాకుండా తోకే, శరీరాన్ని ఊపుతున్న భ్రమ కలుగుతుంది. వాస్తవంలో అమెరికాయే ఇజ్రాయెల్ కదలికలను, చర్యలను నిర్దేశిస్తుంది. ఈ సంగతి డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించాడు, “అవును, నా మాటను బెంజమిన్ నెతన్యాహు జవదాటడు” అని.

ఇజ్రాయెల్ ఎన్నికల్లో రెండు కూటములు పరస్పరం తలపడ్డాయి. ఒకటి ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నాయకత్వం లోని కూటమి. నెతన్యాహు నాయకత్వం లోని లికుడ్ పార్టీ, ఫాసిస్టు భావాలతో నిండిన ఒజామా యెహుదిత్, యూదు మతతత్వ జియోనిజం పార్టీలు, అల్ట్రా ఆర్థడాక్స్ గా పేరు పొందిన షాస్ మరియు యునైటెడ్ తోరా జుడాయిజం (యూ‌ఎస్‌జే) పార్టీ.. ఇవి నెతన్యాహు నాయకత్వం వహించిన కూటమిలోని సభ్య పార్టీలు. ప్రతిపక్ష కూటమి పేరు ‘ఛేంజ్’. ఆర్మీ మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, ‘గాది ఐసన్ కోత్’ దీనికి నాయకుడు. ఐసన్ కోత్ నేతృత్వం లోని యషర్, బ్‌’యాచద్, ఆవిగోర్ లిబర్మెన్ నేతృత్వం లోని యిజ్రాయెల్ బీటీను, యాయిర్ గోలన్ నేతృత్వం లోని ది డెమొక్రాట్స్.. ఇవన్నీ ప్రతిపక్ష ‘ఛేంజ్’ కూటమిలో సభ్య పార్టీలు. ఇవి కాకుండా అరబ్ నాయకత్వం లోని రాహ్’ అహ్మ్, మరియు జాయింట్ లిస్ట్ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేశాయి.

Expected PM of Israel, Eisenkot

ఎన్నికల్లో నెతన్యాహు పార్టీ లికుడ్ కు అత్యధిక స్థానాలు వచ్చినప్పటికీ 120 మంది సభ్యుల నెస్సెట్ (Knesset) లో పాలక కూటమికి కేవలం 53 స్థానాలు దక్కాయి. మెజారిటీ అంకె 61. ప్రతిపక్ష ‘ఛేంజ్’ కూటమికి 48 స్థానాలు దక్కాయి. అరబ్ పార్టీలకు అనూహ్యంగా మొత్తం 19 సీట్లు దక్కాయి. అరబ్ పార్టీలకు అధిక స్థానాలు రావటంతో బెంజమిన్ నెతన్యాహు లెక్కలు తలకిందులయ్యాయి. నెతన్యాహు “అరబ్బులు మా ఎన్నికలను దొంగిలించారు” అంటూ తన అక్కసు వెళ్ళగక్కటం అందుకే.

ఇజ్రాయెల్ ప్రత్యేకత ఏమిటంటే పాలక వర్గాలతో పాటు ప్రజల్లో అత్యధిక శాతం యూదు జాత్యహంకారంతో కాగిపోతూ ఉంటారు. ఈ సంగతి అనేక సర్వేలలో వెల్లడి అయింది. పాలస్తీనా అరబ్బుల పట్ల ఇజ్రాయెల్ యూదులు ఎక్కువ మంది అపనమ్మకం, శతృత్వం, జాతి విద్వేషం కలిగి ఉంటారు. అక్టోబర్ 7, 2023 నాడు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్, గాజా చుట్టూ నిర్మించిన కంచె ఛేదించుకుని 251 మంది యూదులను కిడ్నాప్ చేసిన తర్వాత యూదుల్లో పాలస్తీనా అరబ్బులపై కోపం, విద్వేషం తారాస్థాయికి చేరాయి.

అందుకే కిడ్నాప్ తర్వాత గాజాపైన ఇజ్రాయెల్ ప్రారంభించిన యుద్ధంలో గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రజలపై యూదు సైన్యం సాగించిన అరాచకాలు, యుద్ధ నేరాలు అన్నీ ఇన్నీ కావు. వెస్ట్ బ్యాంక్ లోని పాలస్తీనా ప్రజలపై జరిగిన హింసలో రాడికలైజ్ అయిన యూదు ప్రజలు సైతం పాల్గొన్నారు. పసి పిల్లలు, పిల్లలు, స్త్రీలను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడులు, గృహాల కూల్చివేతలు, మెషీన్ గన్ కాల్పులు విచ్చలవిడిగా సాగించారు. యుద్ధ ట్యాంకులను, బుల్ డోజర్లను నేరుగా జనం ఉన్న ఇళ్లపై నడిపించారు. దాడులను తప్పించుకునేందుకు పక్క ప్రాంతాలకు వలస వెళుతున్న అరబ్బుల సమూహాలు లక్ష్యంగా ట్యాంకులతో కాల్పులు జరిపారు.

అపార్ట్‌మెంట్ లను నేలమట్టం చేశారు. ఫలానా దిక్కుకు పారిపోండి అని సూచించి నేరుగా యూదు సైన్యం వైపుకు నడిపించి మూకుమ్మడి హత్యాకాండ సాగించారు. శరణార్థి శిబిరాల పైకి ట్యాంకులు నడిపించి తొక్కించారు. గాయాలతో, అవయవాలు కోల్పోయి ఆసుపత్రిలో చేరిన తర్వాత వాటిని చుట్టుముట్టి హింసాకాండ జరిపారు. పాలస్తీనా పిల్లలను భవిష్యత్తు టెర్రరిస్టులుగా, స్త్రీలను టెర్రరిస్టుల ఉత్పత్తిదారులుగా ముద్రవేసి ఎంత పచ్చి హింసాత్మకంగా చంపారంటే, కొంతమంది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐ‌డి‌ఎఫ్) సైనికులు తాము పిల్లల్ని చంపిన దృశ్యాలు వారిని వెంటాడి మానసిక వికలాంగులుగా మారిపోయారు.

అక్టోబర్ 7, 2023 కిడ్నాప్ కు ప్రతీకారంతో రగులుతున్న యూదులు అత్యధిక సంఖ్యలో అరబ్ ప్రజల పైన కోపం, ద్వేషంతో ఉండటం వలన రాజకీయ పార్టీలు మెజారిటీ అరబ్ వ్యతిరేక రాజకీయాలను ఆశ్రయించారు. పాలస్తీనా అరబ్ ప్రజలను ఇజ్రాయెల్ నుండి తరిమి వేయాలని మెజారిటీ ప్రజలు డిమాండ్ చేయటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అరబ్ వ్యతిరేకతను ప్రచారం చేశాయి.

గత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దీర్ఘకాలం పాటు ప్రధానమంత్రి పదవిలో పని చేస్తున్నాడు. మధ్యలో ఏడాదిన్నర కాలం (జూన్ 2021 నుండి డిసెంబర్ 2022 వరకు) తప్ప 2009 నుండి ఆయనే ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి. అంతకు మునుపు 1996 నుండి 1999 వరకు ప్రధాని పదవిలో ఉన్నాడు. తన సుదీర్ఘ పదవీ కాలంలో గత పదేళ్ల నుండి నెతన్యాహు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. 2016 లోనే ఆయన అవినీతిపైన పోలీసులు విచారణ ప్రారంభించారు. 2019 నవంబర్ లో అవినీతి అభియోగాలు నమోదు చేశారు. లంచగొండితనం, ఫ్రాడ్, ప్రజల నమ్మకం వమ్ము చేయటం (బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్) నేరాలకు గాను 2020 నుండి ఆయనపై కోర్టు విచారణ జరుగుతోంది. త్వరలో విచారణ ముగియనుంది. నెతన్యాహుకు జైలు శిక్ష ఖాయమని అంతా భావిస్తున్నారు.

తిరిగి అధికారం చేజిక్కించుకోవటం ద్వారా జైలు శిక్ష ను తప్పించుకునేందుకు నెతన్యాహు ఎత్తుగడ వేశాడని కొందరి ఆరోపణ. ఇరాన్ యుద్ధం, గాజా-లెబనాన్ హత్యాకాండలు కొనసాగించటం ద్వారా ప్రజల్లోని పాలస్తీనా అరబ్ వ్యతిరేకతను సొమ్ము చేసుకుని ఎన్నికల్లో గెలిచేందుకు పధకం వేశాడని అనేక మంది ఆరోపించారు. అనేకమంది అంతర్జాతీయ విశ్లేషకులు, యుద్ధ వ్యతిరేకులు కూడా ఈ ప్రచారాన్ని విశ్వసించారు. ఈ ప్రచారంలో నిజం లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధాన్ని కొనసాగించే సౌలభ్యం నెతన్యాహుకు లేదు. ప్రధాన మంత్రి పదవిలో ఉన్నంత మాత్రాన శిక్ష నుండి తప్పించుకునేందుకు ఇజ్రాయెల్ చట్టాలు అనుమతించవు కూడా. అయితే అధికారం ద్వారా కోర్టు విచారణకు ఆటంకాలు కలిగించటం, వాయిదా వేయించటం లాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉండొచ్చు.

కానీ పశ్చిమాసియా ఘర్షణలు ప్రధానంగా భౌగోళిక రాజకీయాలకు, అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలకు సంబంధించినవి. ఈ ప్రయోజనాల ముందు నెతన్యాహు పదవీ ప్రయోజనాలు పెద్ద లెక్కలోనివి కాదు. ఇరాన్, పాలస్తీనాల విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించ గల నెతన్యాహు అవసరం అమెరికాకు ఉన్నది. పచ్చి అరబ్-విద్వేషాన్ని అంతర్జాతీయ వేదికలపై నిర్లజ్జగా, నిరభ్యంతరంగా ప్రకటించగల నెతన్యాహు నైతిక దిగజారుడు అమెరికా సామ్రాజ్యవాదులకు ఆకర్షణీయంగా ఉంటుంది.

ప్రస్తుతం ఐసన్ కోత్ ను ప్రధాన మంత్రిగా ఎక్కువ మంది ఎం‌పి లు ప్రతిపాదించారు. 19 సీట్లు పొందిన అరబ్ పార్టీలు కూడా ఐసన్ కోత్ ప్రధాని కావటానికి మద్దతు ప్రకటించారు. కానీ వారిని ప్రభుత్వంలో చేర్చుకునేందుకు ఐసన్ కోత్ సిద్ధంగా లేడు. బైటి నుండి అరబ్ పార్టీల మద్దతు తీసుకునేందుకు ఆయన సిద్ధం. ఐసన్ కోత్ కు మద్దతు ప్రతిపాదకుల్లో నెతన్యాహుకు గత ప్రభుత్వంలో మద్దతు ఇచ్చిన తీవ్ర అతివాది అవిగోర్ లీబర్మెన్ కూడా ఉన్నాడు. ఐసన్ కోత్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే, గాజా, దక్షిణ లెబనాన్, ఇరాన్ పట్ల ఇజ్రాయెల్ విధానంలో మార్పులు వచ్చే అవకాశం లేదు. ఇప్పటికైతే ఇజ్రాయెల్ అధ్యక్షుడు ప్రధాన మంత్రిగా ఐసన్ కోత్ కు అవకాశం ఇచ్చాడు. మద్దతు సమీకరణకు ఐసన్ కొత్ కు నెలన్నర సమయం ఇచ్చారు.

ఐ‌ఎం‌ఈ‌సి కారిడార్

ఇండియా-ఇజ్రాయెల్-యూరప్ ఎకనమిక్ కారిడార్ (IMEC India-Middle East-Europe Economic Corridor) ను నిర్మించేందుకు అమెరికా తలపెట్టింది. ఈ కారిడార్ లో ఇజ్రాయెల్ లోని పోర్ట్ ఆఫ్ హైఫా అత్యంత కీలక పాత్ర పోషించబోతోంది. ఇందులో ఇజ్రాయెల్ కు నమ్మక విధేయ దేశం యూ‌ఏ‌ఈ కి కూడా కీలక పాత్ర ఉన్నది. ఇండియా లోని ముంబై, ముంద్రా పోర్టుల నుండి యూ‌ఏ‌ఈ లోని జెబెల్ ఆలీ పోర్ట్ మీదుగా ఇజ్రాయెల్ పశ్చిమ తీరం లోని హైఫా పోర్టుకు సముద్ర మార్గం, రైలు మార్గాల ద్వారా వాణిజ్య మార్గం నిర్మిస్తే ఇక ఈజిప్టుకు చెందిన సూయజ్‌ కెనాల్, ఎర్ర సముద్రం లతో అవసరం లేదని అమెరికా, ఐరోపాలు భావిస్తున్నాయి.

ఈ ప్రాజెక్టు ప్రకారం ఇండియా నుండి, పశ్చిమాసియాకు, అక్కడి నుండి ఐరోపా, అమెరికాలకు, తిరిగి వెనక్కి చమురు, గ్యాస్, ఇతర సరుకు రవాణా జరుగుతుంది. తద్వారా ఎర్ర సముద్రంలో యెమెన్ దాడులను, పర్షియన్ అఖాతం (హోర్ముజ్ జలసంధి) లో ఇరాన్ దాడులను తప్పించుకోవచ్చు. ఇందులో భాగంగా అరబ్ రాజ్యాలు, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలను అబ్రహాం ఎకార్డ్స్ ద్వారా నార్మలైజ్ చేసే పధకాన్ని అమెరికా అమలు చేస్తున్నది.

ఇండియాలో అదాని గ్రూపు, గదత్ గ్రూపుల కన్సార్టియం కు హైఫా పోర్టు ప్రయివేటీకరణ టెండర్ అప్పగించారు. 2054 వరకు ఈ ప్రాజెక్టు టెండర్ నిర్మాణం కొనసాగనుందని అంచనా. ఇండియాలోని అదాని ప్రైవేటు పోర్టులు, యూ‌ఏ‌ఈ జెబెల్ ఆలీ పోర్టు, హైఫా పోర్టు, మధ్యధరా సముద్రం లోని గ్రీసు, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల పోర్టులను ఐ‌ఎం‌ఈ‌సి ప్రాజెక్టు కలపనుంది. ఇది పూర్తయితే సూయజ్‌ కెనాల్ వాణిజ్య రవాణా మార్గం కంటే ఐ‌ఎం‌ఈ‌సి రవాణా మార్గం ఖర్చు 40 శాతం తగ్గుతుందని అంచనా. ఐ‌ఎం‌ఈ‌సి ప్రాజెక్టు కోసమే ఇండియా-ఇజ్రాయెల్ మైత్రి వేగవంతం కావటం, ఇరాన్, రష్యా లతో ఇండియా మైత్రి బలహీనం కావటం జరుగుతోంది.

IMEC ప్రాజెక్టుతో పాటు టర్కీ, సిరియాల ద్వారా మరో రవాణా మార్గానికి ప్రతిపాదన ఉన్నది. ఈ ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు చైనా నిర్మించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బిఆర్ఐ) బలహీనం చేసి తద్వారా చైనా వాణిజ్య, ఆర్ధిక వ్యవస్థలను దెబ్బ కొట్టాలని అమెరికా, ఈ‌యూ లు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ విధంగా అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలకు అనుగుణమైన భౌగోళిక రాజకీయాలు ఇరాన్, రాజా, దక్షిణ లెబనాన్ యుద్ధాల వెనుక పని చేస్తున్నాయి. ఈ రాజకీయాలలో ప్రజల ప్రాణాలకు విలువ లేదు. ఒక జాతిని పూర్తిగా అంతం చేసే అవసరం వచ్చినా అందుకు సామ్రాజ్యవాదులకు అభ్యంతరం ఉండదు.

ఈ మహా యజ్ఞంలో నెతన్యాహు, డొనాల్డ్ ట్రంప్ లు పాత్రధారులు మాత్రమే. అమెరికా హౌస్, సెనేట్ లు డెమోక్రటిక్ పార్టీ వశం అయినా, డొనాల్డ్ ట్రంప్ తెచ్చే బిల్లులకు వచ్చే మేజర్ ప్రమాదం ఏమీ లేదు. కాకుంటే రెండు పార్టీలు ఉప్పు-నిప్పు అని అమెరికా ప్రజల ముందు ప్రదర్శించటానికి బిల్లులపై తీవ్ర చర్చలు జరిగినట్టు, ఘర్షణలు జరుగుతున్నట్టు, నువ్వా-నేనా అన్నంత పరిస్ధితి ఏర్పడినట్టు వాతావరణం సృష్టించబడుతుంది. చివరి నిమిషంలో బైపార్టిసన్ (రెండు పార్టీల) మద్దతుతో బిల్లులు ఆమోదం పొంది చట్టాలుగా ఎలాగూ మారతాయి.

ఇజ్రాయెల్ లోనూ ఇంచు మించు అదే పరిస్ధితి. బెంజిమిన్ నెతన్యాహు పదవి కోల్పోయి జైలుపాలయినా అమెరికా సామ్రాజ్యవాదులకు అది పెద్ద విషయం కాదు. అవినీతిపరులకు శిక్ష పడింది అన్న ప్రచారం పొందే అవకాశం ఇజ్రాయెల్, అమెరికా పాలకులు ఎందుకు కోల్పోతారు? జైలులో సకల సౌకర్యాలు పొందే అవకాశం ఎలాగూ ఉంటుంది. ఐ‌ఎం‌ఈ‌సి ప్రాజెక్టు నిర్విఘ్నంగా కొనసాగుతుందని భావించనవసరం లేదు. మరో వైపు నుండి చైనా, రష్యాలు సొంత ఎత్తుగడలతో అడుగులు వేస్తున్నాయి. గెలుపు ఓటములు ఇరు సామ్రాజ్యవాద శిబిరాలతో దోబూచులాడటం ఈ కాలపు విశేషం. ఈ ఆటలో అమెరికా, ఇజ్రాయెల్ ఎన్నికలకు ప్రజాస్వామ్యం అనే విలువ అంటగట్టడం అమాయకత్వం అవుతుంది.

———-సమాప్తం

స్పందించండి