అమెరికా, ఇజ్రాయెల్ ఎన్నికలు – భౌగోళిక రాజకీయాలు -పార్ట్ 1

–

ఇటీవల రెండు రోగ్ రాజ్యాలు అమెరికా, ఇజ్రాయెల్ దేశాల్లో ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడ్డాయి. ప్రపంచంలోనే అత్యంత హీనమైన రోగ్ రాజ్యం అమెరికా అయితే, పశ్చిమాసియా ప్రాంతంలో అత్యంత హీనమైన రోగ్ రాజ్యం ఇజ్రాయెల్. ఈ రెండు రాజ్యాలు ఒకదానికొకటి మిత్ర రాజ్యాలు కావటం యాదృచ్ఛికం కాదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుండీ అమెరికా సామ్రాజ్యవాద రాజ్యం ప్రపంచ దేశాలను, ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాలను, ప్రజలను అన్ని రకాలుగా దోచుకు తింటుంటే, అమెరికాకు ఉపగ్రహ రాజ్యంగా ఇజ్రాయెల్ పశ్చిమాసియా ప్రాంతంలో, అమెరికా ప్రయోజనాలకు ప్రతినిధిగా అరబ్ ప్రజల ప్రయోజనాలను కాలరాస్తున్నది.

అక్టోబర్ 7, 2023 నుండి హమాస్ నాయకత్వంలో యూదు జాత్యహంకార వలస ఆక్రమణపైన పాలస్తీనా చేస్తున్న ప్రతిఘటనా యుద్ధం, ఏప్రిల్ 1, 2024 నుండి అమెరికా-ఇజ్రాయెల్ లు సాగిస్తున్న దురాక్రమణ యుద్ధానికి వ్యతిరేకంగా ఇరాన్ చేస్తున్న సాయుధ ప్రతిఘటనా యుద్ధం… ఈ రెండు యుద్ధాలు అమెరికా, ఇజ్రాయెల్ ఎన్నికలకు తక్షణ పూర్వ రంగంగా ఉన్న సంగతిని ప్రధానంగా గమనంలో ఉంచుకోవాలి.

హమాస్ ప్రతిఘటనా పోరాటానికి అక్టోబర్ 7, 2003 తేదీయే ఆరంభం కాకపోవచ్చు. కానీ పాలస్తీనా సమస్యను కను మరుగు చేసే లక్ష్యంతో, ట్రంప్ ప్రభుత్వం అబ్రహాం ఎకార్డ్స్ పేరుతో ఇజ్రాయెల్ మరియు అరబ్ రాజ్యాల మధ్య సాధారణీకరణ (నార్మలైజేషన్) ప్రక్రియ ప్రారంభించిన నేపధ్యంలో, ఆ రోజు హమాస్ బలగాలు గాజా కంచె ఛేదించుకుని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బలగాలతో ప్రత్యక్ష పోరాటం చేసి 251 మంది యూదులను కిడ్నాప్ చేసిన ఘటన పాలస్తీనా సమస్యను తిరిగి అంతర్జాతీయ రంగం పైకి లాక్కొచ్చింది. అందుకే పాలస్తీనా పోరాటంలో ఆ తేదీ ఒక మైలు రాయిగా నిలుస్తుంది.

అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాలే ఈ రెండు యుద్ధాలకు ప్రధాన కారణం. అమెరికా-ఐరోపా రాజ్యాల కుట్ర పూరిత ఒత్తిళ్లను ఎదుర్కొంటూ, స్వతంత్ర ఉనికిని కొనసాగించాలన్న కృత నిశ్చయంతో అమెరికా, పశ్చిమ సామ్రాజ్యవాదాన్ని ఇరాన్ దేశం ప్రతిఘటిస్తున్నది. యూదు దురహంకార వలస ఆక్రమణ నుండి పాలస్తీనా ప్రజలు చేస్తున్న పోరాటాలకు నిర్ణయాత్మక మద్దతు ఇస్తున్నది, ఇరాన్. అలాగే ఇజ్రాయెల్ దురాక్రమణను ప్రతిఘటిస్తున్న లెబనాన్ లోని సాయుధ ప్రతిఘటనా సంస్థ హిజ్బొల్లాకు కూడా ఇరాన్ మద్దతు ఇస్తున్నది. సౌదీ అరేబియా ఆధిపత్యం నుండి విముక్తి కోసం, అమెరికా-పశ్చిమ రాజ్యాల దురాక్రమణ విధానాలకు వ్యతిరేకంగా ప్రాణాలకు ఒడ్డి పోరాడుతున్న యెమెన్ లోని హుతీ సంస్థకు సైతం ఇరాన్, శక్తి కొద్దీ మద్దతు, సహకారం అందిస్తోంది.

సిరియా బాత్ ప్రభుత్వం, ఇరాక్ లోని షియా పాపులర్ మొబిలైజేషన్ ఫోర్స్ బలగాలు, యెమెన్ లో జైదీ షియా కు చెందిన హుతీ బలగాలు, పాలస్తీనా లోని హమాస్, లెబనాన్ లోని హిజ్బొల్లా బలగాలు… వీరందరిని కలుపుకుని స్థిరమైన సామ్రాజ్యవాద ప్రతిఘటనా-అక్షాన్ని (Axis of Resistance) ఇరాన్ నిర్మించింది. ఈ అక్షంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సిరియా సెక్యులర్ బాత్ ప్రభుత్వాన్ని, డిసెంబర్ 2024లో టెర్రరిస్టుల సాయంతో అమెరికా కూల్చగలిగింది.

సిరియాలో బషర్ ఆల్-అస్సాద్ ప్రభుత్వం కూల్చివేత, వెనిజులా అధ్యక్షుడు రాబర్ట్ మదురో కిడ్నాప్ ద్వారా అక్కడి బొలివారన్ రివల్యూషనరీ ప్రభుత్వాన్ని బలహీనం కావించటం… ఈ రెండు విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో ఇరాన్ ను తేలికగా లొంగదీయవచ్చని అమెరికా, ఇజ్రాయెల్ లు నమ్మాయి. పశ్చిమ సామ్రాజ్యవాద విధానాలను నాలుగు దశాబ్దాలుగా స్థిరంగా ప్రతిఘటిస్తున్న ఇరాన్ లక్ష్యంగా ఆ నమ్మకంతోనే గత ఏడాదిన్నర కాలంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ప్రత్యక్ష యుద్ధం సాగిస్తుండగా, ఐరోపా దేశాలు పరోక్షంగా ఆయుధ సహాయ సహకారాలు అందిస్తున్నాయి.

సిరియా ప్రభుత్వం కూలిపోవటానికి పరోక్ష సహకారం అందించిందన్న ఆరోపణలను రష్యా ఎదుర్కొంటున్నది. అమెరికా వలే రష్యాలో కూడా బలంగా ఉన్న యూదు లాబీ ఒత్తిడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ లొంగిపోయాడని ప్రగతిశీల శక్తులు ఆరోపిస్తున్నాయి. రష్యా పాలకవర్గాలకు సొంత సామ్రాజ్యవాద ప్రయోజనాలే ముఖ్యం కనుక ఇదేమీ ఆశ్చర్యకర పరిణామం కాదు. కానీ ఈ పరిణామంతో పశ్చిమాసియా అరబ్ ప్రజల్లో రష్యా పలుకుబడి పలుచబడింది లేదా కోల్పోయింది. యుద్ధంలో ఇరాన్ కు చైనా, రష్యాలు సాంకేతికంగా సాయం చేస్తున్నాయని అమెరికా, ఐరోపాలు ప్రచారం చేస్తున్నాయి. కానీ బహిరంగ సాక్షాలు లేవు. ఇరాన్ కు సాయం చేస్తున్నామన్న వార్తల్లో నిజం లేదని రష్యా, చైనాలు ప్రకటించాయి.

ఎన్నికలు – ఫలితాలు

ఈ పూర్వ రంగంలో అమెరికా, ఇజ్రాయెల్ దేశాల్లో ఎన్నికలు జరిగాయి. ఇజ్రాయెల్ లో సాధారణ ఎన్నికలు జరగగా, అమెరికాలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ (హౌస్), సెనేట్ లకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. అమెరికా ఎన్నికల గురించి కొంత చెప్పుకోవాలి. అమెరికా హౌస్ కు రెండేళ్లకు ఒక సారి ఎన్నికలు జరుగుతాయి. అంటే ఒక్కో హౌస్ సభ్యుడి పదవీకాలం రెండు సం.లు. హౌస్ లో 435 మంది వోటింగ్ లో ఎన్నికయ్యే  సభ్యులు, 6 గురు నాన్-వోటింగ్ (నామినేట్ అయ్యే) సభ్యులు ఉంటారు. సెనేట్ లో 100 మంది సభ్యులు ఉంటారు. వారి పదవీ కాలం 6 యేళ్లు. మొత్తం 100 సీట్లకు ఒకేసారి ఎన్నికలు జరగవు. రెండేళ్లకు ఒకసారి 1/3 వంతు సీట్లకు ఎన్నికలు జరుగుతాయి.

ఒక్కో రాష్ట్రం నుండి ఇద్దరు చొప్పున 50 రాష్ట్రాల ప్రజలు 100 మంది సెనేట్ సభ్యులను ఎన్నుకుంటారు. అధ్యక్ష ఎన్నికలు 4 యేళ్లకు ఒకసారి జరిగితే, అధ్యక్షుడు ఎన్నికయిన రెండేళ్లకు ‘మిడ్-టర్మ్’ ఎన్నికల పేరుతో హౌస్ కు, 1/3 వంతు సెనేట్ కు ఎన్నికలు జరుగుతాయి. సెనేట్ సభ్యుల ఎన్నికకు ఆయా రాష్ట్రాలు తమ సొంత పద్ధతిని రూపొందించుకుంటాయి. కొన్ని రాష్ట్రాలు రన్-ఆఫ్ ఎన్నికలు జరుపుతాయి. కొన్ని ఎవరికి ఎక్కువ వోట్లు వస్తే వారిని సెనేట్ కి పంపే పద్ధతి పాటిస్తాయి. ఏ రాష్ట్రంలోనూ ఒకే ఎన్నికలో ఇద్దరు సభ్యులను ఎన్నుకోరు. రాష్ట్రాల జనాభాతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రం ఇద్దరు సెనేట్ సభ్యులను ఎన్నుకుంటుంది.

మిడ్ టర్మ్ ఎన్నికలు జరిగేటప్పుడే రాష్ట్రాల గవర్నర్ పదవులకు ఎన్నికలు జరుగుతాయి. 48 రాష్ట్రాలకు 4 యేళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగితే, రెండు రాష్ట్రాల (న్యూ హ్యాంప్ షైర్, వెర్మోంట్) గవర్నర్ల పదవీ కాలం రెండేళ్లు ఉంటుంది. 2026 ఎన్నికలకు ముందు రిపబ్లికన్ ల చేతుల్లో 28 రాష్ట్రాలు ఉండగా డెమొక్రాట్ల చేతుల్లో 22 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్నికల అనంతరం రిపబ్లికన్ పార్టీ కింద 28 రాష్ట్రాలు, డెమొక్రాట్ పార్టీ కింద 20 రాష్ట్రాలు మిగిలాయి. (వివిధ కారణాల రీత్యా 34 స్థానాల్లో గవర్నర్ ఎన్నికలు జరగగా రిపబ్లికన్ పార్టీకి 22, డెమొక్రాట్ పార్టీకి 12 రాష్ట్రాలు దక్కాయి.)

బూర్జువా వ్యవస్థలో ఎన్నికలే ప్రజాస్వామ్యంగా చెల్లుబాటు అవుతున్నాయి. ఆ తర్వాత జరిగే సమస్త ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర నిర్ణయాలు, కేవలం పాలకవర్గాల ప్రయోజనం కోసమే జరుగుతాయి తప్ప ప్రజల కోసం కాదు. ముఖ్యంగా శ్రామిక ప్రజలకు దక్కేది కేవలం కొన్ని నిమిషాల్లో ముగిసిపోయే వోటు మాత్రమే. పత్రికలు, రాజకీయ నాయకులు, టి.వి చానెళ్లు, వీధి వీధినా ఉండే ఛోటా మోటా లీడర్లు, రౌడీలు.. అందరూ కలిసి ఎన్నికలను ఒక సంరంభంగా, ఒక ముఖ్యమైన ప్రజాస్వామిక ఘట్టంగా ప్రజల ముందు ప్రదర్శిస్తారు. ప్రతి ఎన్నికల్లోనూ నిజంగా ఓడిపోయేది శ్రామిక ప్రజలే. ఈ వివరణ ఇండియాకే కాదు, అమెరికాకి కూడా వర్తిస్తుంది.

ఎన్నికల సందర్భంగా ప్రజల జీవనంతో సంబంధం లేని ఏవో కొత్త సమస్యలను జనం ముందుకు తెస్తారు. వారి అసలు సమస్యలు -పేదరికం, నిరుద్యోగం, పాక్షిక నిరుద్యోగం, కొనుగోలు శక్తి క్షీణత, ధరల పెరుగుదల, అందుబాటులో లేని విద్య మరియు వైద్యం, మౌలిక సౌకర్యాల కొరత- మరుగు పరుస్తారు. అమెరికాలో కూడా ఇదే జరుగుతుంది. ముదిరిపోయిన పెట్టుబడిదారీ వ్యవస్థ కనుక అక్కడి సమస్యలు కొంత భిన్నంగా కనిపించినా సారాంశం ఒకటే.

A person walks next to large colorful signs encouraging people to vote and decyring the high cost of various living necessities on the Election Day in Raleigh, North Carolina, US, November 3, 2026. REUTERS/Jonathan Drake TPX IMAGES OF THE DAY

ముఖ్యంగా రాజకీయ పార్టీలు ప్రచార ఎత్తుగడలను ఔట్ సోర్స్ చేస్తాయి. కట్టు కధలతో అభ్యర్ధుల గుణగణాల గురించి ప్రచారం చేసి పెట్టే కన్సల్టెన్సీ సంస్థలకు ప్రచార బాధ్యతలు అప్పగిస్తారు. తమను అద్దెకు తీసుకున్న అభ్యర్ధికి వోట్లు పడటం కోసం, ప్రత్యర్థి అభ్యర్ధికి వోట్లు పడకుండా ఉండటం కోసం ఈ సంస్థలు చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. చట్టబద్ధ వ్యాపారం కింద అవన్నీ చెల్లుబాటు అవుతాయి.

అమెరికా ఎన్నికలు ప్రజలు పండగగా జరుపుకోదగిన రాజకీయ ఘట్టం కాదు. రిపబ్లికన్ పార్టీ గెలిచినా, డెమోక్రటిక్ పార్టీ గెలిచినా తేడా ఉండదు. డెమోక్రటిక్ పార్టీని లెఫ్ట్ పార్టీగా చెప్పటమే ఒక వింత! (న్యూయార్క్ టైమ్స్ ని లెఫ్ట్ పత్రిక అనీ, బిబిసి ని లెఫ్ట్ టి.వి/రేడియో అనీ చెప్పటం ఇంకో వింత) కానీ అమెరికాలో ద్రవ్య పెట్టుబడి గుట్టలుగా పేరుకుని, లాభాలు ఆర్జించే పెట్టుబడిగా రియలైజ్ కావటం తగ్గిపోయే కొద్దీ సామ్రాజ్యవాద సంక్షోభం మరింత లోతుకు విస్తరిస్తోంది. దరిమిలా ప్రధాన పార్టీలు రెండూ బహిరంగంగా కార్పొరేట్ కంపెనీల అనుకూల విధానాలకు వివిధ ముసుగు పేర్లతో మద్దతు ఇస్తున్నాయి.

ఈ నేపధ్యంలో రాజకీయంగా మరియు ఆర్ధికంగా డెమోక్రటిక్ పార్టీ మితవాదం (రైటిస్ట్) వైపు జరుగుతోంది. అంటే సంక్షేమ విధానాలకు వ్యతిరేకంగా, బడా కంపెనీల లాభార్జనకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తున్నది. అప్పటికే మితవాదం వైపు ఉన్న రిపబ్లికన్ పార్టీ మరింత కుడి వైపుకి జరిగి మితవాదంలో కూడా అతివాదం వైపు జరుగుతోంది. దానితో ఇరు పార్టీల మధ్య తేడా మాయం అవుతోంది. డెమోక్రటిక్ పార్టీ మితవాద విధానమే ఒక్కోసారి వామపక్ష విధానంగా ప్రచారం జరుగుతోంది.

‘రెండు పార్టీలలో ఒకటి’ అనే ఎంపిక (ఛాయిస్) ఒకటి ప్రజలకు అందుబాటులో ఉన్నది అన్న భ్రమను ఎన్నికలు కలిగిస్తాయి తప్పితే ప్రజలకు నిజంగా ఛాయిస్ లేదు. రెండు పార్టీలకు పోషకులు ఒకటే సూపర్ ధనిక వర్గం. వాల్ స్ట్రీట్ దానికి ప్రధాన గృహం. ‘ద సిటీ’ (లండన్) గృహంలో దీనికి వాటా ఉన్నది. ఎన్నికల విజయం కోసం రెండు పార్టీలు ఎంత కాట్లాడుకున్నా అమెరికా సామ్రాజ్యవాద వర్గం నియంత్రణ లోనే రెండు పార్టీలు నడుచు కుంటాయి. ఒక అమెరికన్ విశ్లేషకుడు అన్నట్లు, “ఒకే విధంగా వాసన వెదజల్లే రెండు గుర్రాల విసర్జితాలను ప్రజల ముందు ఉంచి వాటిలో ఒకటి ఎన్నుకోమని చెబితే అది ప్రజాస్వామ్యం కాజాలదు. ఒకటి కాస్త తక్కువ వాసవ వస్తే దానిని గొప్ప ఛాయిస్ గా చెప్పటం ప్రజలను అవమానించటమే.”

అమెరికా భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని వోటు వేస్తున్న ప్రజలకు పార్టీలు, పత్రికలు చెబుతాయి. కానీ అమెరికా సామ్రాజ్యవాద యుద్ధాల్లో ఏ అమెరికన్ల జీవితాలు ముగిసి పోవాలో, ఏ దేశం పైన బాంబులు పడాలో, ఏ దేశం అమెరికా దురాక్రమణకు బలి కావాలో, ఏ దేశ ప్రజలు పేదరికం, దరిద్రం, కరువు, అంతర్జాతీయ ఆంక్షలకు కుంగి కృశించాలో, అమెరికా పన్ను చెల్లింపు దారుల డబ్బు ఏ యుద్ధానికి ఆహుతి కావాలో నిర్ణయించే యంత్రాంగం వోటర్ల నిర్ణయానికి కట్టుబడి ఉండదు.

అమెరికా ఎన్నికల్లో డెమొక్రాట్ పార్టీ అధిక స్థానాలు గెలిచింది. పార్లమెంటులో ఉభయ సభలు (హౌస్, సెనేట్) ఇప్పుడు డెమొక్రాట్ పార్టీ కంట్రోల్ లోకి వచ్చాయి. డెమొక్రాట్లు గెలిస్తే ట్రంప్ అరాచక పాలన అంతం అవుతుందని ఊరించిన ప్రచారాలు ఎంత అబద్ధమో చెప్పనవసరం లేదు. ఒబామా నాయకత్వం లోని డెమొక్రాట్ పార్టీ ప్రభుత్వంలోనే యెమెన్ లోని పెళ్లి ఊరేగింపులపై కూడా డ్రోన్ దాడులు జరిగాయి. అసలు ఎవరికి చెప్పకుండా, ఎవరి అనుమతి లేకుండా అంతర్జాతీయ చట్టాలను కాలరాస్తూ యెమెన్, సోమాలియా, సిరియా, లిబియా, సూడాన్ దేశాలపై డ్రోన్ బాంబులతో దాడులు చేయటం ఒబామా యే మొదలు పెట్టాడు. గాజా, దక్షిణ లెబనాన్ ప్రజల సామూహిక జాతి హత్యాకాండలకు, అక్కడి సమస్త నిర్మాణాల విధ్వంసానికి ఆటంకం కలగకుండా ఇజ్రాయెల్ కు జోసెఫ్ బైడెన్ ప్రభుత్వ హయాంలోనే అత్యాధునిక ఆయుధాల సరఫరా జరిగింది.

అమెరికా ప్రజలు అమ్నీసియా (మరుపు రోగం), అది కూడా నిర్దిష్ట పరిణామాలను మాత్రమే మరిచిపోయే అమ్నీసియా కలిగి ఉండాలని, అమెరికా సామ్రాజ్యవాదం కోరుకుంటుంది. రెండు పార్టీల్లో తక్కువ/చిన్న దుష్ట పార్టీ గెలిచినందుకు సంబరాలు జరుపుకోమని ప్రోత్సహిస్తుంది. ఎన్నికలు ముగిశాక, అమెరికా విదేశీ విధానం కొన్ని దేశాలకు అంతిమ యాత్రకు సమానంగా మారితే, సో-కాల్డ్ అమెరికన్ డెమోక్రసీ ఒక ప్రజా సమూహానికి పీడకలగా అవతరిస్తుంది.

ఇప్పుడూ అదే జరగనుంది. గత హౌస్ లో రిపబ్లికన్ పార్టీకి 218 సీట్లు, డెమొక్రాట్ పార్టీకి 214 సీట్లు ఉన్నాయి. ఎన్నికల అనంతరం మెజారిటీ అంకె 218 కాగా డెమొక్రాట్ పార్టీకి 242 సీట్లు రిపబ్లికన్ పార్టీకి 151 సీట్లు దక్కాయి. గత సెనేట్ లో ఇరు పార్టీలకు 50-50 స్థానాలు ఉన్నాయి. వోటింగ్ జరిగినప్పుడు రిపబ్లికన్ పార్టీకి చెందిన వైస్-ప్రెసిడెంట్ వోటు టై-బ్రేకర్ గా ఉండేది. ఎన్నికల అనంతరం డెమొక్రాట్ పార్టీకి 55, రిపబ్లికన్ పార్టీకి 44 సీట్లు వచ్చాయి. అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) లో రెండు సభలు డెమొక్రాట్ పార్టీ కంట్రోల్ లోకి వచ్చినందున రిపబ్లికన్ పార్టీకి చెందిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిల్లులు పాస్ కావటం కష్టం అవుతుంది, రెండు సభలు ఆమోదిస్తేనే ఒక బిల్లు చట్టం అవుతుంది కనుక.

ఈ ఒకే ఒక్క కారణంతో ట్రంప్ మట్టి కరిచాడని, అమెరికాలో నీలి విప్లవం (డెమొక్రాట్ పార్టీ రంగు నీలం) సంభవించిందని పశ్చిమ కార్పొరేట్ పత్రికలు కోడై కూస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీకి కంచుకోటలైన టెక్సాస్, కాన్సాస్, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, ఓహియో, ఐయోవా, మెయిన్ ఈ 7 స్థానాలను డెమొక్రాట్ పార్టీ బద్దలు కొట్టిందని కార్పొరేట్ పత్రికలు సంచలనంగా అభివర్ణిస్తున్నాయి.

ఇరాన్, ఉక్రెయిన్ యుద్ధాలు

ఎన్నికల నాటికి అమెరికా, సామ్రాజ్యవాద సాధారణ సంక్షోభంలో కూరుకుని ఉండటంతో పాటు, ఇరాన్, పాలస్తీనా-దక్షిణ లెబనాన్, ఉక్రెయిన్ యుద్ధాల వలన ద్రవ్యోల్బణం, చమురు, కొనుగోలు శక్తి క్షీణత లకు సంబంధించిన తాజా సంక్షోభం కూడా ఎదుర్కొంటున్నది. ఇరాన్ పై దురాక్రమణ దాడుల దరిమిలా, పర్షియన్ అఖాతం లోని హోర్ముజ్ జలసంధి గుండా అంతర్జాతీయ చమురు రవాణా జరపకుండా ఇరాన్ దిగ్బంధనం అమలు చేసింది.

ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం హోర్ముజ్ జలసంధి ద్వారా జరుగుతుంది. పర్షియన్ గల్ఫ్ రాజ్యాలు ఇరాక్, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, యూ‌ఏ‌ఈ, ఒమన్ ల నుండి చమురు ఐరోపా, చైనా, దక్షిణ ఆసియా, తూర్పు మరియు ఆగ్నేయాసియా దేశాలకు, హోర్ముజ్ గుండా రవాణా అవుతుంది. కనుక సహజంగానే చమురు లభ్యత పడిపోయి ధరలు పెరిగాయి. యుద్ధం ముందు బ్యారెల్ కు 65 డాలర్ల నుండి 72 డాలర్ల వరకు ఉన్న చమురు ధర యుద్ధం వలన ఒక దశలో 110-120 డాలర్లకు చేరింది. దానితో ఐరోపా, అమెరికా లకు చమురు సరఫరా బాగా తగ్గిపోయింది.

నిజానికి అమెరికాలో చమురు, గ్యాస్ ల ఉత్పత్తి గత పదేళ్ళలో మునుపు ఎన్నడూ లేని విధంగా పెరిగింది. అమెరికా డ్రిల్లింగ్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందటం, ఫ్రాకింగ్ (రాతి పొరలను బద్దలు కొట్టి చమురు, గ్యాస్ వెలికి తీయటం), సమానాంతర డ్రిల్లింగ్ టెక్నాలజీ అభివృద్ధి లు ఇందుకు దోహదం చేశాయి. 2023 నాటికే ఏ ఒక్క ఓ‌పి‌ఈ‌సి (ఒపెక్) సభ్య దేశం కంటే కూడా ఎక్కువగా అమెరికా ఉత్పత్తి చేయటం ప్రారంభించింది.

అప్పటికే ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని అడ్డం పెట్టుకుని రష్యా గ్యాస్ దిగుమతి చేసుకోకుండా ఐరోపా రాజ్యాలపై ఒత్తిడి చేసి సఫలం అయింది. రష్యా నుండి జర్మనీకి అక్కడి నుండి ఇతర ఐరోపా దేశాలకు గ్యాస్ సరఫరా చేస్తున్న నార్డ్ స్ట్రీమ్ -1 కి తోడు నార్డ్ స్ట్రీమ్ -2 పైప్ లైన్ కూడా రష్యా నిర్మించింది. ఈ రెండు సముద్రం అడుగు భాగంలో నిర్మించబడిన పైప్ లైన్లు. ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో అమెరికా, నార్డ్ స్ట్రీమ్ ల లోని నాలుగింటిలో మూడు పైప్ లైన్ లను సెప్టెంబర్ 26, 2022 తేదీన పేల్చి వేసింది. ఆ నేరాన్ని ఉక్రెయిన్ మీదికి నెట్టారు.

దానితో జర్మనీ, ఐరోపా దేశాలకు రష్యా నుండి నార్డ్ స్ట్రీమ్ ద్వారా గ్యాస్ సరఫరా బంద్ అయింది. కేవలం ఉక్రెయిన్ భూభాగం గుండా మాత్రమే గ్యాస్ సరఫరా పరిమితం అయింది. అది కూడా గతంలో కుదిరిన కాంట్రాక్టులే తప్ప కొత్త కాంట్రాక్టులు లేవు. రష్యా పైన విధించిన ఆంక్షలను ఉల్లంఘించారని సాకు చూపిస్తూ ఇండియా లాంటి దేశాలు కూడా రష్యన్ చమురు, గ్యాస్ లు దిగుమతి చేసుకోకుండా అమెరికా నిషేధం విధించింది. ఇండియా ఎగుమతులపై భారీ టారిఫ్ లు ప్రకటించి ఇండియాను బెదరగొట్టింది; ఇండియా పాలకులు బెదిరి పోయారు.

ఇప్పుడు రష్యా గ్యాస్ కు బదులు అమెరికా తన సొంత గ్యాస్ సరఫరా చేయటం మొదలు పెట్టింది. అమెరికా నుండి గ్యాస్, చమురు దిగుమతికి వేల మైళ్ల దూరాలను ట్యాంకర్లు ప్రయాణించాలి. కనుక రవాణా ఖర్చులు కలిసి ఇంధనం ధరలు కూడా అధికం అవుతాయి. ఐనా సరే ఐరోపాతో పాటు ఇండియా లాంటి ఆసియా దేశాలు ఒత్తిడికి లొంగి అమెరికా గ్యాస్, చమురు దిగుమతులు పెంచుకున్నాయి. అమెరికాతో పాటు ఖరీదైన నార్వే, ఉత్తర ఆఫ్రికా దేశాల గ్యాస్, చమురు లను యూరోపియన్ యూనియన్ దిగుమతి చేసుకుంటోంది. ఆంక్షల వలన అత్యంత చౌక ధరకు లభ్యమయ్యే రష్యన్ గ్యాస్ బదులు అధిక ధరలకు అమెరికా గ్యాస్ ను ఐరోపా దేశాలు కొనుగోలు చేస్తున్నాయి.

ఫలితంగా ఇంధన ఖర్చు బాగా పెరిగి ఐరోపాలో అనేక మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలు మూత పడ్డాయి. కొన్ని పరిశ్రమలు అమెరికాకు వెళ్ళటం మొదలు పెట్టాయి. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) అంటూ ట్రంప్ అప్పటికే పిలుపు ఇచ్చిన నేపధ్యంలో, సొంత ఇండస్ట్రియల్ సెక్టార్ ను పస్తులు పెట్టి అమెరికా మాన్యుఫాక్చరింగ్ రంగాన్ని ప్రోత్సహించే అమెరికా ఎత్తుగడకు విచిత్రంగా ఐరోపా దేశాలు -జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ లతో సహా- సహకరిస్తున్నాయి. రష్యా ఆర్ధిక వ్యవస్థను పతనం చేసి ఆ దేశాన్ని ముక్కలు చేసి పంచుకోవాలని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అమెరికా-ఐరోపా పాలక వర్గాల కసి, ద్వేషం ఈ సహకారం వెనుక పని చేశాయి. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ఐరోపా భద్రతా బాధ్యత నుండి తప్పించుకోకుండా అధ్యక్షుడిని ప్రసన్నం చేసుకునేందుకు కూడా ఈ‌యూ, భారం మోసేందుకు సిద్ధపడింది.

————(సశేషం)

స్పందించండి