విదేశీ మద్దతు నీకే ఉంది, దమ్ముంటే చర్చకు రా, ప్లేస్, టైమ్ నువ్వే చెప్పు! -రాహుల్ సవాల్

–

ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గట్టి సవాలు విసిరాడు. మోడి చెపుతున్న విదేశీ శక్తులు నిజానికి మోడికే మద్దతు ఇస్తున్నాయని ఆరోపించాడు. ఎస్‌ఐ‌ఆర్ కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజల వెనుక విదేశీ హస్తం ఉందంటూ ఆర్‌ఎస్‌ఎస్ మొదలు అధినేత మోహన్ భగవత్ మొదలుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వరకు పదే పదే ఆరోపణలు గుప్పిస్తున్న నేపధ్యంలో రాహుల్ గాంధీ ట్విట్టర్/ఎక్స్ వేదికగా ఈ సవాలు విసిరాడు. హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లో సవాలు విసరటం ద్వారా ఎక్స్ లో ఉన్నవారందరికి తన సవాలు అర్ధం అయ్యేలా జాగ్రత్త వహించాడు.

“మిస్టర్ మోడి, దేశ ప్రజలకు అబద్ధాలు చెప్పటం ఇకనైనా కట్టిపెట్టు.

“విదేశీ సహాయంతోనే మీరు ప్రధాన మంత్రి అయ్యారు. విదేశీ సహాయంతోనే నువ్వు ఇప్పటికీ ప్రధాన మంత్రి పదవిలో కొనసాగ గలుగుతున్నావు.

“మీ వెనుక ఉన్న ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా పూర్తిగా విదేశీయుల నియంత్రణలో ఉన్నది. విదేశీయుల మద్దతు మీకు పూర్తిగా ఉన్నది. విదేశీ సోషల్ మీడియా మీకు పూర్తి మద్దతు ఇస్తున్నది.”

అని రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి తీవ్ర స్థాయిలో సవాలు విసిరాడు.

అసలు నరేంద్ర మోడి ప్రధాన మంత్రి కావటమే విదేశీ సహాయంతో, మద్దతుతో జరిగిందన్న ఆరోపణ ఇంతవరకు రాహుల్ గాంధీ చేయలేదు. వివిధ పత్రికలలో, విశ్లేషణలలో వివిధ వాల్ స్ట్రీట్ బ్యాంకులు, జర్మనీ, ఇంగ్లండ్ లకు చెందిన కన్సల్టెన్సీ సంస్థలు 2014 ఎన్నికలలో మోడి ఎన్నికల ప్రచారానికి సంబంధించి సలహాలు, సూచనలు ఇచ్చారన్న సంగతి తెలిసిన విషయమే. అయితే ఈ సంగతి ఆరోపణ రూపంలో ప్రతిపక్ష పార్టీ నాయకుల నోటి నుండి రావటం ఇదే మొదటిసారి కావచ్చు.

రాష్ట్రీయ ఏక్తా దివస్ సందర్భంగా గుజరాత్ లో ప్రధాన మంత్రి మోడి చేసిన ప్రసంగానికి బదులిస్తూ రాహుల్ గాంధీ ఈ సవాలు విసిరాడు. తన ప్రసంగంలో ప్రధాన మంత్రి “కొన్ని శక్తులు దేశాన్ని విభజించే కుట్రలో మునిగి ఉన్నారని హెచ్చరించాడు. ఈ కృషిలో భాగంగా సోషల్ మీడియాను ఆయుధంగా ఉపయోగిస్తున్నారని, పుకార్లు వ్యాపింపజేస్తున్నారని, ఇండియా ప్రతిష్టకు మచ్చ తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించాడు.

మోడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు గొంతెత్తినా, దేశ సమస్యల గురించి ప్రశ్నించినా, సమస్యలు పరిష్కరించాలని కోరినా కూడా వారిని దేశ ద్రోహులనీ, యాంటీ-నేషనల్స్ అనీ, టుక్డే టుక్డే గ్యాంగ్ అనీ బొత్తిగా అతకని ఆరోపణలతో పేర్లతో నిందించటం ఒక అలవాటుగా హిందూత్వ సంస్థలు చేసుకున్నాయి. దేశాన్ని విభజించేందుకు కుట్ర చేస్తున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి సైతం ఆరోపించటం బాధ్యతారాహిత్యం కాగలదు. అదే నిజమైతే, దేశాన్ని ఏ విధంగా విభజించాలని కుట్ర చేస్తున్నారో ఆయన చెప్పవలసి ఉంటుంది. ఆయన ప్రధాన మంత్రి పదవిలో ఉన్నందున నిజాలు చెప్పవలసిన బాధ్యత ఆయన పైన ఉంటుంది.

మోడి ప్రభుత్వ విధానాల పైన, ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యల పైనా వ్యతిరేకత, నిరసన వ్యక్తం చేస్తే అదే దేశ విభజనకు కుట్ర చేయటం అవుతుందని ప్రధాన మంత్రి చెప్పదలిచారా? లేక ప్రజల న్యాయబద్ధమైన నిరసన హక్కుకు, అసమ్మతి ప్రకటించే హక్కుకు యాంటీ-నేషనల్ అని బిరుదు తగిలిస్తున్న ఫ్రింజ్ శక్తుల (చిల్లర మూకల) అర్ధం లేని ఆరోపణలకు ప్రధాని వత్తాసుగా వస్తున్నారా?

–

“ప్రస్తుత కాలంలో ప్రతిపక్షం (అపోజిషన్), ప్రతిపక్షంగా (విరోధ్ పక్ష్) కాకుండా ఆటంక శక్తులు (అవరోధ్ పక్ష్) గా వ్యవహరించటం మన దురదృష్టం. దేశం అభివృద్ధి బాటలో సాగుతుండగా, నిస్సహాయ పరిస్ధితుల్లో ఉన్న కొందరు ఆ అభివృద్ధి బాటలో ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఇది ప్రతిపక్షం (అపోజిషన్) కాదు, ఇది ఆటంకపరచటం (obstruction)” అని ప్రధాన మంత్రి ఆరోపించాడు.

రాహుల్ గాంధీ విదేశీ టూర్లకు వెళ్ళటాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ, “దశాబ్దం పాటు ఫ్రస్ట్రేషన్ లో ఉన్న వీళ్లు ఇప్పుడు బహిరంగంగా ముందుకు వచ్చారు. విదేశాల్లో రహస్య సమావేశాలు జరుపుతున్నది ఎవరు? ఇండియా వ్యక్తిరేక శక్తులు ఎవరికి మద్దతు ఇస్తున్నాయి? ఇండియా వ్యతిరేకుల భాష మాట్లాడుతున్నది ఎవరు? ఇలాంటి ధోరణులను అన్నింటినీ మనం పసి గట్టాలి” అని ప్రధాన మంత్రి తన ప్రసంగంలో హెచ్చరించాడు.

ఈ ఆరోపణలతో నిద్రాణమైన రాహుల్ గాంధీ పౌరుషం బద్దలైనట్టు కనిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఆరోపణలతో ప్రధాన మంత్రి పైన విరుచుకు పడ్డాడు. అయితే ఈ ఆరోపణలు ఏవో యధాలాపంగా చేసినవి కావన్నది స్పష్టమే.

అక్కడితో ఆగకుండా ప్రధాన మంత్రి మోడీకి రాహుల్ గాంధీ నేరుగానే సవాలు విసరడం గమనార్హం.

“ఈ విషయంలో నేను మిమ్మల్ని బహిరంగ చర్చకు రావాలని సవాలు చేస్తున్నాను. ఏ వేదిక అయినా సరే మీరే చెప్పండి, సమయం ఎప్పుడో కూడా మీరే చెప్పండి. మీకు దమ్ములు (guts) ఉంటే చర్చకు రండి”

అని రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడికి బహిరంగ సవాలు విసిరాడు.

“మీ ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా విదేశీ నియంత్రణలో, విదేశీయుల మద్దతుతోనే నడుస్తున్నది. విదేశీ సోషల్ మీడియా మీకు పూర్తి మద్దతు ఇస్తున్నది” అని రాహుల్ చేసిన ఆరోపణలకు అర్ధం ఏమిటి? ప్రధాన మంత్రి మరియు ఒక పార్టీ నేతగా ఆయనకు విదేశాల నుండి నిధులు వస్తున్నాయని అర్ధమా? లేక భారతదేశ ప్రభుత్వ ఫైనాన్షియల్ వ్యవస్థ విదేశాల నియంత్రణలో ఉన్నదని అర్ధమా?

మూడో ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్థలన్నీ పశ్చిమ దేశాలలోని ఫైనాన్స్ సంస్థలు, ముఖ్యంగా అమెరికాలోని ఫైనాన్స్ సంస్థల (బ్యాంకులు, హెడ్జ్ ఫండ్ లు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పెన్షన్ ఫండ్ లు, ఇంకా అనేకానేక పేర్లతో ఉన్న ఫండ్ లు) నియంత్రణలో ఉన్నాయన్న సంగతి జోసెఫ్ స్టిగ్లిట్జ్ లాంటి నోబెల్ బహుమతి గ్రహీతలైన ఆర్ధికవేత్తలు కూడా అంగీకరించే సంగతి. ఆ మాటకు వస్తే రష్యా నుండి చమురు దిగుమతి చేసుకోవాలంటే అమెరికా అనుమతి తప్పనిసరి అనీ, ఈ నిబంధనను భారత ప్రభుత్వం తప్పనిసరిగా పాటిస్తుందని ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాల పుణ్యామా అని అందరికీ అర్ధం అయింది.

భారత దేశ ఆర్ధిక విధానాలను అమెరికాలోని వాల్ స్ట్రీట్ కంపెనీలు నియంతృస్తాయన్న సంగతి, చివరికి ఆర్ధిక మంత్రిగా ఎవరు ఉండాలన్న సంగతిని కూడా అమెరికా రాజకీయ, ద్రవ్య సంస్థల అధిపతులు నిర్ణయిస్తారన్న సంగతి వికీ లీక్స్ వెల్లడి చేసిన డిప్లొమేటిక్ కేబుల్స్ ద్వారా తెలిసిన సంగతి కూడా ఇటీవల చరిత్రే. కనుక భారత ఆర్ధిక వ్యవస్థ గమనం పశ్చిమ దేశాల భారీ ఫైనాన్స్ కంపెనీల ప్రయోజనాల మేరకే సాగుతుందన్న సంగతి ఇప్పటికే రుజువైన సత్యం!

కానీ నరేంద్ర మోడి ఫైనాన్షియల్ సిస్టమ్ ని విదేశీయులు నియంత్రిస్తున్నాయన్న ఆరోపణ ఇప్పుడే వినటం. అసలు రాహుల్ గాంధీ ఆరోపణకు అర్ధం ఏమిటో తెలియాల్సి ఉన్నది.

స్పందించండి