
–
అయోధ్యలోని రాముడి గుడిలో భక్తులు సమర్పించిన కరెన్సీ కానుకలను దారి మళ్లించి చోరీ చేసిన కేసులో ట్రయల్స్ ప్రారంభం కావటానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం -ఎస్ఐటి) మొత్తం 8 మందిని నిందితులుగా గుర్తించింది. ఈ 8 మంది పైన ఎస్ఐటి చార్జ్ షీటు నమోదు చేసింది.
కాగా భక్తుల కానుకలలో అవినీతికి పాల్పడిన మొత్తం 2.7 కోట్ల రూపాయలని ఎస్ఐటి అంతిమంగా తేల్చింది. ఆరంభంలో రు 30 లక్షలు అని కొందరు, రు 80 లక్షలు అని మరి కొందరు అంచనా వేశారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపిన ఎస్ఐటి అంతిమంగా రు 2.7 కోట్ల మేరకు నిధుల చోరీ జరిగిందని తేల్చింది. చోరీలో 8 మందిని నిందితులుగా గుర్తించి చార్జ్ షీటు దాఖలు చేసింది.
చార్జి షీటు దాఖలు అనంతరం సుప్రీం కోర్టు తన పర్యవేక్షణను విరమించుకుంది. తతిమా ప్రక్రియను ట్రయల్ కోర్టు పూర్తి చేయాలని ఆదేశించింది. అవినీతి కుంభకోణంపై సిబిఐ చేత పూర్తి స్థాయి విచారణ జరపాలని వివిధ పిటిషనర్లు సుప్రీం కోర్టును అభ్యర్దిస్తూ పిటిషన్లు దాఖలు చేసిన నేపధ్యంలో పిటిషనర్లు అందరినీ బాధితులుగా నమోదు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. పిటిషనర్లు ట్రయల్ కోర్టు విచారణలో సహాయం చేయాలని కోరింది.
శ్రీరామ్ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ను ఆద్యంతం ఆడిట్ చేయాలని లేదా 2019 నాటి అయోధ్య భూమి తీర్పును పునః పరిశీలించాలని కోరిన పిటిషన్ల విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. భూమి కేటాయింపులో అనుమానాలు ఉన్నట్లయితే లేదా రామ జన్మభూమి మార్కింగ్ లో అనుమానాలు ఉన్నట్లయితే సివిల్ కోర్టులో పిటిషన్ వేయాలని సుప్రీం కోర్టు సలహా పడేసింది.
సిట్ గుర్తించిన ఎనిమిది మంది నిందితులు క్రింది స్థాయి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే కావటం గమనార్హం. ట్రస్ట్ లో ముఖ్య సభ్యుడైన అనీల్ శర్మ కు చెందిన ప్రైవేటు సంస్థ నుండే ఈ ఉద్యోగులను నియమించి నప్పటికీ అనీల్ శర్మ ను ఎస్ఐటి తప్పు పట్టలేదు. ఆయన ప్రైవేటు సంస్థకూ నిధుల చోరీకి సంబంధాలు ఉన్నాయా అన్న సంగతి విచారించామని, ఎలాంటి తప్పిదం అనీల్ శర్మ వైపు నుండి లేదని ఎస్ఐటి క్లీన్ చిట్ ఇచ్చేసింది.
శ్రీ రామ్ జన్మ భూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్ట్ లోని సీనియర్ సభ్యులలో ఏ ఒక్కరూ చోరీలో కుమ్మక్కు అయినట్టుగా తమ విచారణలో తేలలేదని సిట్ తెలిపింది. ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ సిఫారసుతో చోరీకి పాల్పడిన వారిలో కొందరిని నియమించినప్పటికీ ఆయనకు కూడా సిట్ క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఐతే చోరీకి నైతిక బాధ్యత వహిస్తూ డా అనీల్ మిశ్రా తన ట్రస్ట్ సభ్యత్వానికి రాజీనామా చేయటం గమనార్హం.
చంపత్ రాయ్ మరియు డా అనిల్ మిశ్రా లను నిందితులుగా చేర్చటానికి బదులు ప్రాసిక్యూషన్ సాక్షులుగా ఎస్ఐటి నమోదు చేసింది. వారిప్పుడు తాము నియమించిన కౌంటింగ్ సిబ్బందికి వ్యతిరేకంగా కోర్టులో సాక్షం చెప్పబోతున్నారు. డా అనిల్ మిశ్రా కి చెందిన ప్రైవేటు ఏజన్సీయే కరెన్సీ గ్రేడింగ్ (నోట్ లను వేటికవి విడిగా తీసి కట్టలు కట్టటం) కాంట్రాక్ట్ సంపాదించింది. ట్రస్ట్ సిబ్బందిలో కూడా పలువురిని ఆయన లేదా ఆయన మిత్రులు సిఫారసు చేసిన వారిని నియమించారు. అయినప్పటికీ ఆయన నిందితుల్లో ఒకరుగా లేరు.
చోరీ బైట పడ్డ అనంతరం డా అనీల్ మిశ్రా పాత్రపై పలు అనుమానాలు తలెత్తాయి. కరెన్సీ గ్రేడింగ్ మరియు కౌంటింగ్ సందర్భంగా పాటించటానికి పలు నిబంధనలు (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ – ఎస్ఓపిలు) రూపొందించినప్పటికీ వాటిని అమలు చేయటంలో అనీల్ మిశ్రా ఏనాడూ శ్రద్ధ చూపలేదని పలువురు ఆరోపించారు. సిబ్బంది నిబంధనలను పలుమార్లు ఉల్లంఘించినప్పటికీ అనీల్ మిశ్రా గానీ ఆయన సంస్థ గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎస్ఐటి కూడా తప్పు పట్టింది. కానీ ఆయన జాగ్రత్తగా లేరని, రిలాక్స్ గా ఉన్నారని, అప్రమత్తత వహించలేదని మాత్రమే సిట్ ఆరోపించింది తప్ప ఎలాంటి దోషమూ ఎంచలేదు.
ఆరంభం
జూన్ 7 తేదీన మొదట చోరీ సంగతి బయిటకు వచ్చింది. స్థానిక రాజకీయ నాయకుడు అయోధ్య గుడిలో భారీ అవినీతి జరుగుతోందని బహిరంగంగా ఆరోపించటంతో కలకలం ప్రారంభం అయింది. మరో మూడు రోజులకి ప్రధాన మంత్రి కార్యాలయం జోక్యం చేసుకుని నివేదిక ఇవ్వాల్సిందిగా ట్రస్ట్ ను కోరింది. ట్రస్ట్ సిఫారసుతో జూన్ 13 తేదీన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ముగ్గురు సభ్యుల సిట్ ను నియమించింది. చందాల వసూలు, లెక్కింపు, నిలువ ప్రక్రియలను సమీక్షించాలని ఆదేశించింది.
రాష్ట్రం నియమించిన సిట్ 45 రోజుల పాటు ఏప్రిల్ 27 నుండి జూన్ 5 వరకు రికార్డ్ అయిన సిసిటివి ఫుటేజీ ని స్కానింగ్ చేసి డబ్బును స్మగుల్ చేస్తున్న పద్ధతులను పసి గట్టింది. జూన్ 23 తేదీన ప్రాధమిక నివేదిక సమర్పించింది. ట్రస్ట్ ప్రతినిధి కృష్ణ మోహన్ అధికారిక ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. పోలీసులు దాడులు నిర్వహించి అల్ప ఉద్యోగులైన కౌంటింగ్ సిబ్బంది 8 మందిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
అరెస్టులు జరిగిన నేపధ్యంలో పలువురు చోరీపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ పిటిషన్ల తో జులై 27 తేదీన సుప్రీం కోర్టు మెట్లు ఎక్కారు. దరిమిలా చీఫ్ జస్టిస్ సూర్య కాంత్, కోర్టు ఆధ్వర్యంలో 4 గురు సభ్యులతో ఉన్నత స్థాయి సిట్ ను నియమించింది. సిట్ అధిపతిగా ఇనస్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్. కిరణ్ ను నియమించింది. సమగ్ర ఫోరెన్సిక్ విచారణ చేయాలని, ఆడిట్ మదింపు చేయాలని సిట్ ను ఆదేశించింది.
సుప్రీం కోర్టు నియమించిన సిట్, సెప్టెంబర్ 21 తేదీన విచారణ పూర్తి చేసినట్టు కోర్టుకు తెలిపింది. సీల్ట్ కవర్ లో తన రిపోర్ట్ ను కోర్టుకు ఇచ్చింది. సిసిటివి ఫుటేజీ ద్వారా ఖచ్చితంగా 105 సార్లు చోరీ జరిగిందని, మొత్తం 2.7 కోట్ల రూపాయలు తస్కరణకు గురయిందని నివేదికలో ధృవీకరించింది. 74,000 పేజీల మేరకు రూపొందించిన చార్జి షీట్ లో 133 మందిని సాక్షులుగా పేర్కొన్నది. అయోధ్య లోని అవినీతి నిరోధక కోర్టులో చార్జి షీటు దాఖలు చేసింది.
నివేదికను పరిశీలించిన సుప్రీం కోర్టు నవంబర్ 2 తేదీన తన నిర్ణయాన్ని వెలువరించింది. ఎనిమిది నిందితులపై విచారణ మొదలు పెట్టేందుకు ట్రయల్ కోర్టుకు అనుమతి ఇచ్చింది. అక్కడితో తన పర్యవేక్షణ పూర్తయిందని తెలిపింది.
డబ్బు చోరీలో కౌంటింగ్ సిబ్బందితో పాటు పిలిగ్రిమ్ ఫెసిలిటేషన్ సెంటర్ భవనంలో నియమించబడిన ఆలయ ఉద్యోగులు కొందరు పాల్గొన్నారని నివేదిక తేల్చింది. నిందితుల పేర్లు: టిన్ను యాదవ్, అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, మనీష్ యాదవ్, సుభాష్ శ్రీవాత్సవ, అవినాష్ శుక్లా, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రా. వీరందరూ ఇప్పుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
దొంగిలించిన సొమ్ము మొత్తం రికవరీ అయిందా లేదా అన్న సంగతి తెలియలేదు. అయితే నిందితులు చోరీ సొమ్మును ఆస్తుల కొనుగోలుకు, వాహనాల కొనుగోలుకు కొంత సొమ్మును ఖర్చు చేయగా మరికొంత సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో డిపాజిట్ చేశారని సిట్ తెలిపింది.
కనీసం 5 నెలల పాటు జరిగిన చోరీని ఎవరూ గమనించకపోవటం విచిత్రమైన విషయం. అదీ కింది స్థాయి సిబ్బంది చోరీ చేస్తున్నప్పుడు ఆ సంగతి చాలా త్వరగా ఇతర కింది స్థాయి సిబ్బంది కనిపెడతారు. అదీ కాక ఔట్ సోర్సింగ్ ద్వారా నియమించబడిన ఉద్యోగులు ఆస్తులు కొన్నప్పుడు, వాహనాలు కొన్నపుడు సహ ఉద్యోగులకు వెంటనే అనుమానాలు వస్తాయి. తమ తమ సొంత విచారణలు చేస్తారు. ఆ నోటా ఈ నోటా విషయం బైటికి పొక్కుతుంది. దానికి 5 నెలల సమయం పట్టటమే విచిత్రం!


