
–
అక్టోబర్ 31 తేదీన ప్రతిపక్ష పార్టీలు ఒక మాక్ పార్లమెంట్ సమావేశం జరిపాయి. ఇందులో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యానేష్ కుమార్ పైన మాక్ ఇంపీచ్-మెంట్ తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. అందులో పాల్గొన్న రాజ్య సభ్య ప్రతిపక్ష నాయకుడు మరియు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గే చీఫ్ ఎన్నికల కమిషనర్ గ్యానేష్ కుమార్ పైన ఆరు అభియోగాలు మోపాడు. అవి ఇలా ఉన్నాయి.
ఒకటి, ఎన్నికల తీర్పు దొంగిలించేందుకు కుట్ర: పాలక పార్టీ అయిన బిజేపి తో కలిసి ఎన్నికల ఫలితాలను మ్యానిపులేట్ చేయటానికి, జాతీయ మరియు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను దొంగిలించటానికి నేరపూరిత కుట్రకు సిఈసి గ్యానేష్ కుమార్ పాల్పడ్డాడు.
రెండు, 13.2 కోట్ల మంది వోటర్ల పేర్లను వోటర్ల జాబితా నుండి తొలగించాడు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా వోటర్ల జాబితా నుండి కనీసం 13.2 కోట్ల నుండి 14 కోట్ల వరకు వోటర్ల పేర్లను తొలగించాడు. ఈ తొలగింపులో బిజేపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వోట్లు వేస్తారని అనుమానం ఉన్న వోటర్లను టార్గెట్ చేసుకున్నాడు.
మూడు, ఎలాంటి పర్యవేక్షణ లేకుండా ఫారం 6 లో సవరణలు చేశాడు: వోటర్ల రిజిస్ట్రేషన్ నిబంధనలు – 1960 ప్రకారం రాజ్యాంగ బద్ధంగా రూపొందించిన ఫారం 6 లో, పార్లమెంటుకు తెలియకుండా, చెప్పకుండా మొదటి సారి వోటు హక్కు పొందగోరు నూతన వోటర్లను ఆటంకం కలిగిస్తూ, చట్టవిరుద్ధ సవరణలు చేశాడు.
నాలుగు, ECINET / ERONET ద్వారా కేంద్రీకృత నియంత్రణను ప్రవేశ పెట్టాడు: కేంద్ర ఎలక్షన్ కమిషన్ కు చెందిన వెబ్ సైట్ అయిన ECINET లేదా ERONET ద్వారా భారత ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా) లో అంతర్గతంగా భారత దేశ వోటర్ల జాబితా పైన నియంత్రణను దురుద్దేశపూర్వకంగా తన చేతుల్లో కేంద్రీకృతం చేసేందుకు పూనుకున్నాడు.
ఐదు, ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్లను విశ్వాసం లోకి తీసుకోలేదు: అధికారిక నిర్ణయాలను తీసుకోవటంలో ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ లోని మిగతా ఇద్దరు ఎన్నికల కమిషనర్ లను విశ్వాసం లోకి తీసుకోలేదు. వారు అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోలేదు.
ఆరు, రాజకీయ నాయకత్వం చెప్పినట్టు నడుచుకున్నాడు: ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించ వలసి ఉండగా, అందుకు విరుద్ధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడి మరియు హోమ్ మంత్రి అమిత్ షా ల ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి సూచనల ప్రకారం కార్యకలాపాలు నిర్వహించాడు.
కాగా పాలక బిజేపి పార్టీ ప్రతినిధి మాక్ పార్లమెంటు ను ఉద్దేశిస్తూ రాహుల్ గాంధీని ఎద్దేవా చేశాడు. రాహుల్ గాంధీ మాక్ పార్లమెంటులో మాత్రమే ప్రధాన మంత్రిగా ఉండగలడనీ, నిజంగా ఆయన ప్రధాన మంత్రి కాలేడని ఎగతాళి చేశాడు. హోమ్ మంత్రి అమిత్ షా ఈ ఎద్దేవాలో జత కలిశాడు.


