దిప్కే-నేహా అరెస్ట్, సిజెపి-ఐసా వినూత్న ఫ్లాష్ ప్రొటెస్ట్ లు!

–

కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి), ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ -ఐసా) లు ఇచ్చిన పిలుపు మేరకు అభిజిత్ దిప్కే, నేహా బోరాలు తమ తమ ప్రాంతాల నుండి సెంట్రల్ పార్క్ లో జాతీయ జెండా ఎగుర వేసేందుకు బయలుదేరిన కొద్ది క్షణాల్లోనే వారిని పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. ఒక సమాజ్ వాదీ పార్టీ ఎంపి నివాసం వద్ద దిప్కేను, మండి మార్కెట్ దారిలో నేహాను పోలీసులు అరెస్టు చేశారు.

నేహా బోరాను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదని, పోలీసులు చెప్పటం లేదని ఆమె సహచరులు ఆరోపించారు. నేహాను పోలీసులు అరెస్టు చేయటం కాదని ఆమెను అపహరించుకు వెళ్లారని వారు ఆరోపించారు.

అంతకు ముందు మధ్యాహ్నం ప్రాంతంలో 20 మంది పోలీసులు దిప్కే ఉంటున్న ఇంటికి వెళ్లి నిరసన ప్రదర్శన చేయవద్దని, ప్రదర్శన ద్వారా శాంతి భద్రతల సమస్య సృష్టించ వద్దని ఆదేశిస్తూ నోటీసు ఇచ్చారు. సాయంత్రం ఐదున్నర ప్రాంతంలో తానున్న చోటు నుండి బయల్దేరిన దిప్కేను పోలీసులు చుట్టుముట్టి ముందుకు కదలకుండా ఆపేశారు.

“నేను నిరసన చేయటానికి వెళ్ళటం లేదు. కేవలం సెంట్రల్ పార్క్ లో జాతీయ జెండా ఎగరవేసేందుకు మాత్రమే వెళ్తున్నాను. జెండా ఎగరవేయటం నేరం ఎలా అవుతుంది, చెప్పండి. ఎందుకు అంత భయపడుతున్నారు” అని ప్రశ్నించాడు. మరు నిమిషంలో దిప్కేను పోలీసు వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు.

మరో వైపు నేహా బోరా కన్నాట్ ప్లేస్ లోని మండి హౌస్ వద్ద హాజరు కావాలని మధ్యాహ్నం తమ కార్యకర్తలను ఎక్స్ ద్వారా కోరింది. సాయంత్రం ఆమె మండి హౌస్ వద్దకు వెళుతుండగానే పోలీసులు మహిళా పోలీసులు చుట్టుముట్టారు. అప్పటికే నేహా చుట్టూ మూగిన ఐసా కార్యకర్తలు పోలీసులు నేహాను చేరకుండా చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. చివరికి పోలీసులు నేహాను దొరకబుచ్చుకుని లాక్కెళ్ళారు.

ఫ్లాష్ ప్రొటెస్ట్స్!

ఐతే సిజెపి, ఐసా, ఇతర విద్యార్ధి సంఘాల కార్యకర్తలు వెనకడుగు వేయలేదు. కన్నాట్ ప్లేస్ లోనే భారీ సంఖ్యలో గుమి కూడి అప్పటికప్పుడు ప్రదర్శన తీయటం ప్రారంభించారు. నినాదాలు ఇస్తూ జాతీయ జెండాను ఎత్తి చూపుతూ ఊరేగింపు తీయటం ప్రారంభించారు. పోలీసులు పరుగెత్తుకుంటూ అక్కడికి రాగానే వాళ్లు వెంటనే అక్కడి నుండి చెల్లా చెదురై పరుగెత్తుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ సమీపంలోనే మరోచోట మెరుపులా గుమి కూడి నినాదాలు చేయటం జెండా ప్రదర్శించటం ప్రారంభించారు. ఇలా పిల్లి-ఎలుక ఆట మాదిరిగా కార్యకర్తలు చెల్లా చెదురు కావటం, గుమి కూడటం నినాదాలు చేస్తూ జెండాలు ప్రదర్శించటం పోలీసులు రాగానే మళ్ళీ చెదిరి పోవటం చేస్తున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక తెలియజేసింది.

మండి హౌస్ వద్ద ఐసా కార్యకర్తలు ఇదే విధంగా పోలీసులతో దోబూచులాడుతూ మెరుపులా ప్రదర్శనలు చేస్తున్నట్టు పత్రికలు తెలిపాయి.

ప్రదర్శకులు ఓ వైపు నిరసన ప్రదర్శనలు చేస్తూ విలేఖరులతో మాట్లాడుతూ తమదైన పద్ధతుల్లో గ్యానేష్ కుమార్ కు వ్యతిరేకంగా, రంకా, సౌరవ్ ల అరెస్టులను నిరసిస్తూ నినాదాలు ఇస్తున్నారు. “దేశంలో ఇప్పటికే అనేక సమస్యల్లో ఉండగా, మమ్మల్ని జెండాలు ప్రదర్శించకుండా పోలీసులు ఆపుతున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో బలగాలను చూసి నేను భయభ్రాంతుడినయ్యాను. ఒక ప్రజాస్వామిక యాక్షన్ ను ఆపేందుకు ఇన్ని బలగాలను మోహరించాలా? అందుకే నేను ఇక్కడికి వచ్చాను” అని ఒక ప్రదర్శకుడు అన్నాడని ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రిక తెలిపింది.

మణిపూర్ నుంచి వచ్చిన ఒక మహిళ మాట్లాడుతూ “గత మూడు నాలుగేళ్ల నుండి మణిపూర్ లో యుద్ధం లాంటి పరిస్ధితి నెలకొని ఉంది. కానీ ప్రధాన మంత్రి ఎన్నడూ దాని గురించి మాట్లాడలేదు. ఆయన విదేశాలు చుట్టి వస్తున్నాడు. మాది చాలా చిన్న రాష్ట్రం. ఆయన ఎందుకు మా గురించి ఒక ముక్కా మాట్లాడడు? అది అడిగే అవకాశం కోసం నేనిక్కడికి వచ్చాను” అని 22 యేళ్ళ మణిపురి యువతి తెలిపింది.

ప్రదర్శన కోసం కనీసం 2,000 మందికి పైగా యువకులు హాజరయ్యారని ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. కానీ వారి సంఖ్య అంతకంటే ఎక్కువగా జమ కూడారని ప్రదర్శన ఆర్గనైజర్లు చెప్పారు. కొన్ని చోట్ల పోలీసులు కార్యకర్తలు తెచ్చిన జాతీయ జెండాలను చింపేశారని ఆరోపించారు. నేమ్ ప్లేట్ లేకుండా అనేక మంది పోలీసులు తమపై దాడి చేయటం వలన వారి పేర్లను గుర్తించలేకపోయామని వారు చెప్పారు.

స్పందించండి